My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, November 11, 2007

తెలుగు సంగతులు

- సేకరణ : ద్వా.నా.శాస్త్రి

తెలుగువారికి సొంతరాష్ట్రం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని భాషకు సంబంధించిన కొన్ని చిరు సంగతులు .....
-----------------------------------------------
''పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్‌'' అని కన్యాశుల్కం నాటకంలో గురజాడ గిరీశంతో అనిపిస్తాడు. పైగా అమృతం తీసుకెళ్ళేటప్పుడు ఒక చుక్క భూమ్మీదపడి అదే పొగాకు చెట్టయిందని కోతలు కోస్తాడు. అలవాటున్నవాడు ఇలాగే సమర్థించుకొంటాడు గదా!
------------------------------------------------
దీపాల పిచ్చయ్యశాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి జంట కవిత్వం రాద్దామనుకొని ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుందో ఆలోచించారు. దీపాల జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ జాషువా, గుఱ్ఱం శాస్త్రి... ఇలా అనేక రకాలుగా చూస్తే సరైన పేరు కుదరలేదు. అందుకని ''మనకి పేరే కుదరలేదు. ఇంక జంట కవిత్వం ఎందుకులే'' అని మానేశారట.
------------------------------------------
బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజలలో చైతన్యం వస్తుందేమోనన్న భయంతో కొన్ని పుస్తకాలను నిషేధించింది. తిరుపతి వేంకటకవులు రాసిన ''శ్రవణానందం'' కావ్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 1913లో నిషేధించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ''మాలపల్లి'' నవలను రెండుసార్లు నిషేధించింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ''ఝంఝ'' విప్లవ కవితా సంకలనాన్ని, వాసిరెడ్డి సీతాదేవి ''మరీచిక'' నవలను నిషేధించింది.
-------------------------------------------
దేవులపల్లి కృష్ణశాస్త్రిని భావకవిగా చూసి తిరోగమనవాది అంటారు. ఇది నిజంకాదు. బ్రహ్మసమాజ కార్యక్రమాల్లో పాల్లొన్నారు. సంఘ సంస్కరణ భావాలను పాదుకొల్పారు. హరిజనులతో కూడి హరిజనాభ్యుదయ గీతాలు పాడుతూ తిరిగారు. 1930లోనే పిఠాపురంలో ''వేశ్యా వివాహ సంస్థ'' స్థాపించి వేశ్యలకి వివాహం చేయించారు. తాత, తండ్రి సంపాదించిన ఆస్తిని ఈ విధంగా వెచ్చించారు. మరి దేవులపల్లి సంఘ సంస్కర్త కాదా?
---------------------------------------------
తెలుగు కవుల్లో గణపవరపు వేంకటకవి ''ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము'' అనే కావ్యం రాశాడు. ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విచిత్రం, ఏదో ఒక అపూర్వరచన కనిపిస్తుంది. 808వ పద్యం- ''సారాగ్య్రసారస సమనేత్ర...''లో 64 రకాల పద్యాలను నిక్షిప్తంచేశాడు. ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి విశేషం లేదంటారు.
---------------------------------------------
స్త్రీల ముఖాన్ని పద్మంతో చంద్రుడితో పోల్చాలి.
కళ్ళని- తామర రేకులతో, చేపలతో పోల్చాలి.
ముక్కును- సంపెంగతో పోల్చాలి.
పెదాలను- దొండపండుతో, చిగురాకుతో పోల్చాలి.
కంఠాన్ని- శంఖంతో పోల్చాలి.
లలాటాన్ని- అర్ధచంద్రా కారంగా వుందనాలి.
జుట్టును-తుమ్మెదలతో పోల్చాలి.
ఇటువంటి వర్ణనలను 'కవి సమయాలు' అంటారు.
---------------------------------------------
గురజాడ కన్యాశుల్కం నాటకం రాయడానికి అంతకుముందు అప్పటి విశాఖ జిల్లాలో జరిపిన సర్వే కారణం. దాని ప్రకారం
కన్యాశుల్క వివాహాలు జరిగినవి- 1034
అయిదేళ్ళ వయసులో జరిగినవి- 99
నాలుగేళ్ళ వయసులో జరిగినవి- 44
మూడేళ్ళ వయసులో జరిగినవి- 36
రెండేళ్ళ వయసులో జరిగినవి- 6
ఏడాది వయసులో జరిగినవి- 3
కన్యాశుల్కంగా చెల్లించిన ధర -350 రూ. నుంచి 400 రూ.లు. ఇదీ 1897 నాటి స్థితి.
----------------------------------------------
కందుకూరి వీరేశలింగం- సహాయోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు
గురజాడ- కలెక్టరాఫీసులో హెడ్‌ గుమస్తా, అసిస్టెంట్‌ లెక్చరర్‌,
దేవులపల్లి కృష్ణశాస్త్రి- కాలేజీ ట్యూటరు. ఆకాశవాణిలో ప్రయోక్త.
గుర్రం జాషువా- ఉపాధ్యాయుడు, ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌.
శ్రీశ్రీ- కాలేజిలో డిమాన్‌స్ట్రేటర్‌, హార్బర్‌లో గుమస్తా,
కుందుర్తి- ఆంగ్లోపాధ్యాయుడు, టుబాకో మార్కెట్‌లో ఉద్యోగి, సమాచార శాఖలో అనువాదకుడు.
--------------------------------------------
కోరాడ రామచంద్రశాస్త్రి 1860లో రాసిన 'మంజరీమధుకరీయము' తెలుగులో మొట్టమొదటి నాటకం. 1875లో వావిలాల వాసుదేవశాస్త్రి రాసిన 'నందక రాజ్యము' మొదటి సాంఘిక నాటకం. ఇంగ్లీషులోని జూలియట్‌ సీజర్‌ను వాసుదేవశాస్త్రి గారే అనువదించారు. ఇది తొలి ఆంగ్లానువాద నాటకం. కొక్కొండ వెంకట రత్నంపంతులు రచించిన 'నరకాసుర విజయ వ్యాయోగము' తొలి సంస్కృతానువాద నాటకం!
------------------------------------------------
తెలుగుభాషలో గల పదాలలో అసలైన పదాలు 20శాతమే! సగానికి పైగా సంస్కృతం, ప్రాకృతం నుంచి వచ్చినవే. పారశీభాషా పదాలు, పోర్చుగీసుభాషా పదాలూ ఎక్కువే. ఇప్పుడు ఆంగ్ల పదాలు ఎక్కువ. విద్యార్థి, పత్రిక, రాజు, పూజ వంటివి సంస్కృత పదాలే! అగ్గి, సింగారం వంటివి ప్రాకృతం నుంచి వచ్చాయి. రోజు, కాగితం, బాకీలు పారశీవి. బత్తాయి, తువాలు, బాల్చీ, అనాస అనేవి పోర్చుగీసు పదాలు.
------------------------------------------------
తెలుగు భాషలో గల సంస్కృత సమములు కాకుండా మిగిలిన ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యపదాలు గలవి అచ్చతెలుగు పదాలు!
అచ్చ తెలుగు పదాలు ఇలా వుంటాయి- కబ్బము (కావ్యం), నెలవేలుపు (చంద్రుడు), పొత్తపు గుడి (గ్రంథాలయం), నెయ్యము (స్నేహం), ఆన (ఆజ్ఞ), నల్ల దేవర (కృష్ణుడు), వేడిక (పార్థన).
----------------------------------------------
కలకత్తాలో పుట్టిన సి.పి. బ్రౌన్‌ కడప జిల్లాలో ఉద్యోగం చేస్తూ మన తెలుగు భాషకి అపూర్వమైన సేవ చేశాడు. మన వేమన పద్యాలను సేకరింపచేసి మొట్టమొదటిగా 1829లో అచ్చువేశాడు. కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. తెలుగు నేర్చుకొన్నాడు. తెలుగు వ్యాకరణం రాశాడు. తెలుగు వారికి నిఘంటు రచనా రీతిని నేర్పాడు. తెలుగు వాచకాలు రాసాడు. లండన్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధించాడు. అందుకే బ్రౌన్‌ తెలుగు సూర్యుడు!
--------------------------------------------
జయంతి రామయ్య పంతులు అనే గొప్ప పండితుడు బి.ఎ. చదువుతున్నప్పుడు బ్రహ్మసమాజ మత ప్రబోధకులైన పండిత శివనాధశాస్త్రి రాజమండ్రి వచ్చారు(1881). ఆయన అనర్గళంగా ఇంగ్లీషులో ఉపన్యాసం ఇస్తే అదే వేగంతో ఆ ఉపన్యాసాన్ని ఇంగ్లీషులోనే రాసి జయంతివారు పత్రికకి పంపటం, మర్నాడు పత్రికలో రావటం... శివనాథశాస్త్రి చూసి ఆశ్చర్యపోవటం జరిగింది.
---------------------------------------------
తెలుగులో మొట్ట మొదటి పత్రిక ఏది? అన్నప్పుడు కొందరు 1831 నాటి 'తెలుగు జర్నల్‌'ను చెప్తారు. దీనికి ఆధారం లేదు. 1835లో బళ్లారి క్రైస్తవ మత ప్రచారకులు ప్రారంభించిన 'సత్యదూత' పత్రికనే తొలి పత్రికగా చాలా మంది నిర్ణయించారు.
---------------------------------------------
జర్మన్‌ దేశీయుడైన బెంజమిన్‌ షుల్జ్‌ 1746లో హాలె నగరంలో మొట్టమొదటి తెలుగు పుస్తకాన్ని అచ్చు వేశాడు. ఆ పుస్తకం పేరు- ''మోక్షానికి కొంచ్చుపొయ్యెదొవ''.
---------------------------------------------
శ్రీనాథుడు శివభక్తుడు. కానీ శివుడి మీద రాసిన కావ్యాలను రాజులకు, మిత్రులకి, అంకితమిచ్చాడు. మానవుల చరిత్ర గల 'పల్నాటి వీరచరిత్ర'ను మాత్రం దేవుడికి అంకితమిచ్చాడు.
----------------------------------------------
పోతన భాగవతంలోని పన్నెండు స్కంధాలలో ఎనిమిదే రాశాడు. మిగిలిన నాలుగూ అతని శిఘ్యలు-బొప్పరాజు గంగవు, ఏర్చూరి సింగయ, వెలిగందల నారయ రాశారు. అంటే ఆంధ్ర మహాభాగవతం రాసింది నలుగురన్నమాట!
---------------------------------------------
తెలుగు కథ 1910లో పుట్టి 1952లోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ''న్యూయార్క్‌ హెరాల్డు ట్రిబ్యూన్‌'' నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో పాలగుమ్మి పద్మరాజు రాసిన 'గాలివాన' కథకి ద్వితీయ బహుమతి లభించింది. ఒక మనిషి ప్రవర్తన బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పే కథ ఇది!
---------------------------------------------
క్రీ.శ. ఒకటో శతాబ్దికి చెందినదిగా భావిస్తున్న అమరావతి బౌద్ధస్థూపంపై నున్న ''నాగబు'' అనేది మొట్టమొదటి తెలుగు పదంగా భావించబడుతోంది. 'నాగబు' అంటే 'నాగము' అని అర్థం.
----------------------------------------------
ఎ.డి.కాంప్‌బెల్‌ అనే ఆంగ్లేయుడు మన తెలుగు నేర్చుకోవటమే కాకుండా
"A Grammar of the Teloogoo Language" నే వ్యాకరణం రాశాడు. ఇది మద్రాస్‌లో కాలేజ్‌ ఆఫ్‌ ఫోర్ట్‌ సెయింట్‌ జార్జిలో గల ముద్రణాలయంలో అచ్చయింది.
----------------------------------------------
శ్రీశైలంలోని శివుని పేరు మల్లికార్జునుడు. మల్లిక, అర్జున పుష్పాలతో పూజింపబడే దేవుడు కాబట్టి మల్లికార్జునుడయ్యాడు. ఇది తెలుసుకోకుండా మల్లిఖార్జున శర్మ, మల్లిఖార్జునుడు... అని వాడుతూంటారు. ఇది సరి కాదు.
-----------------------------------------------
పారశీ భాషలో 'ఉస్తాద్‌' తెలుగులో వస్తాదు అయింది. ఉస్తాద్‌ అంటే ఉపాధ్యాయుడు అని ఆ భాషలో అర్ధం. ఉచితం అంటే తగినది, యుక్తమైనదనే అర్థం. ఖర్చు లేకుండా, 'ఫ్రీ'గా వచ్చేది అనే అర్థం తర్వాత వచ్చింది.
----------------------------------------------
లక్ష్మీ నరసింహ పానుగంటి
సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి
ఎంచేతంటే వాటిలో పేనులాంటి
భవానికాయన ఏనుగంటి
రూపాన్నియ్యడం నేనుగంటి
-శ్రీశ్రీ
-----------------------------------------------
ఏకపత్నీ వత్రము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలు శతము
ఓ కూనలమ్మా!
-ఆరుద్ర
----------------------------------------------
తాళ్ళపాక తిమ్మక్క తొలి కవయిత్రి. రాయగా రాయగా తొలి కావ్యం ''సుభద్రా కల్యాణం'' రాసింది. రాసి, ''పొలతి! నమ్మగరాదు పురుషులనెపుడు/పలురీతి కృష్ణసర్పములైయుండ్రు'' అని మగవారిని నిం దించింది. (కృష్ణసర్పం అంటే నల్లత్రాచు)
----------------------------------------------
'స్త్రీ'కి అరవై పర్యాయ పదాలున్నాయి. నారి, అబల, వనిత, మహిళ, కాంత, లలన, మగువ, ఇంతి, అతివ, నవల, నాతి, వెలది, అంగన, మానిని, సుదతి, పడతి, లలన, తొయ్యలి మొదలైనవి.
-----------------------------------------------
పుట్టపర్తి నారాయణాచార్యులు 12వ ఏటనే 'పెనుగొండ లక్ష్మి' అనే కావ్యం రాశారు. దీనిని మద్రాస్‌ విశ్వవిద్యాలయం 'విద్వాన్‌' పరీక్షకి పాఠ్యభాగంగా నిర్ణయించారు. పుట్టపర్తివారు ఆ పరీక్షకి వెళ్లినప్పుడు తాను రచించిన 'పెనుగొండ లక్ష్మి'నే చదివి పరీక్షలో సమాధానం రాశారు! ఇది విచిత్రం!
-----------------------------------------------
తిక్కవరపు పఠాభి రామిరె
డ్డి 'ఫిడేలు రాగాలు డజను'లో రాసిన పంక్తులివి.
'' మీ వాన్దరు సనాతనా చర్‌యుల్‌
ముఖమ్విరిచి ఇన్‌గ్‌లీష్టానివి
నన్‌నున్జేపట్‌టవద్‌దని
గద్‌ దిన్చి నా కూడ నీవు'
-----------------------------------------------
ప్రశ్నలోనే సమాధానం ఉండేలా రచించే భాషా వైచిత్రిని పరికించండి.
ప్రశ్న- ఎద్దీశున కశ్వంబగు?
సమాధానం- ఎద్దు
ఈశునకశ్వంబగు.
-----------------------------------------------
కొంచెం తేడాతో ఒకే విధంగా కనిపిస్తూ అర్థంలో భేదం ఉండే జంట పదాలను గమనించండి-
అభినందనం - అభివందనం
ఆహుతి - ఆహూతి
(అగ్నిలో వేయుట) (పిలుచుట)
నిదానము - నిధానము
(నెమ్మది) (ఉంచుట నిక్షేపము)
నిరశనము - నిరసనము
(నిరాహారం)(తిరస్కారం)
--------------------------------
(విపుల, నవంబర్,2007)
___________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home