భ్రాతృ విదియ
...పర్వదినాల్లో 'యమ ద్వితీయ' ఎంతో ప్రముఖమైనది. కార్తీక శుద్ధ విదియనాడీ పర్వం వస్తుంది. దీన్ని 'భ్రాతృవిదియ'గా కూడా పేర్కొంటారు. కార్తీక శుక్ల విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం నివారణ జరుగుతాయంటారు. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది నేటి మహత్తర సందేశం...
ఒకనాడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. ప్రతి అంశానికీ ప్రాతిపదిక ఆర్థిక శక్తే అవుతోంది.
ఇవాళ కుటుంబంలోని సభ్యులు- కనీసం పండగరోజునైనా కలిసి భోజనం చేయడం యాదృచ్ఛికమో, మహదవకాశమో, అదృష్టమో అయిపోతోంది. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహనా మంచీ- మర్యాదా, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి.
ప్రాచీన సాహిత్యమంతా ఏదో ఒక ధర్మాన్ని ప్రతిపాదించడానికే, ఈ పండగల పేర్లూ- ఆయా పండగల్లో ఆచరించవలసిన ధర్మాలనూ, వ్రతాలను, ఆచరాలను మనకు తెలియజేస్తున్నాయి. పర్వదినాల్లో 'యమ ద్వితీయ' ఎంతో ప్రముఖమైనది. కార్తీక శుద్ధ విదియనాడీ పర్వం వస్తుంది. యమున సోదరుడు యముడు. వీరి సౌభ్రాతృత్వం, సౌహార్దానికి ప్రతీకగా ఈ పర్వదినాన్ని వ్యవహరిస్తారు. కనుకనే 'భ్రాతృవిదియ'గా కూడా దీనిని పేర్కొంటారు.
ఈ పర్వదినాన 'కాంతిద్వితీయ', 'పుష్ప ద్వితీయ' అనే వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి ఉటంకిస్తోంది. 'యమద్వితీయ' ముచ్చటైన మురిపాల పండగ. అనుబంధాల పండగ. తోబుట్టువుల ఆప్యాయతలను ప్రతిబింబించే పండగ. ఈనాడు యమపూజ, చిత్రగుప్త పూజ చేస్తారు. 'భగినీ గృహే భోజనం పరమ కర్తవ్యం'గా యీ పర్వదినం జరుపుకొంటారు. కార్తీక శుక్ల విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం నివారణ జరుగుతాయంటారు.
యముడి చెల్లెలు యమునానది. యమున తన అన్న యముడిని భోజనానికి తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. యముడికి చాలా రోజులవరకు వీలుపడలేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ఉసురును హస్తగతం చేసుకునేందుకు యముడు వెళ్లాడు పాశాలతో. మార్కండేయుడు మహాశివుణ్ని శరణు వేడుకున్నాడు. శివుడు త్రిశూలం తీసుకుని యముడి వెంట పడ్డాడు. యముడు పరుగెత్తి- పరుగెత్తి యమున ఇంటికి చేరి తలదాచుకున్నాడు. అన్నగారిన్నాళ్లకు వచ్చాడని సంతోషంతో మర్యాదచేసి, రుచికరమైన పిండివంటలతో చక్కని వంటకాలు సిద్ధంచేసి తృప్తికరంగా భోజనం పెట్టింది. భోజనం చేస్తున్నవాళ్లను సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోయాడు.
ఆ విధంగా ఓ వైపు మార్కండేయ సంరక్షణం జరిగింది. మరోవైపు అన్నగారికి మనస్ఫూర్తిగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరింది. సోదరి చేతి వంట తినడానికి ఉపక్రమించడం వల్ల యముడికి అపమృత్యు దోషఫలమూ అంటలేదు.
శివుడి ఆగ్రహానికి గురికాకుండా తలదాచుకునే అవకాశమిచ్చిన చెల్లెల్ని మనసారా లోలోపల అభినందిస్తూ, ఆమె అతిథి మర్యాదలకు పొంగిపోయిన యముడు ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె 'ఈనాడు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలి చేతివంట తిని తృప్తిపడే అన్నకు నరకలోకప్రాప్తీ, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా అన్నను కోరుకుంది. యముడెంతో ఆనందభరితుడై 'ప్రతి ఏటా నేను కార్తీక శుద్ధ విదియనాడు నీ ఇంటికి వచ్చి, నీ చేతివంట తింటాను. నీవు కోరిన విధంగా ఈ రోజున ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా నీకూ వరం ఇస్తున్నాను. అంతేకాదు, సోదరుణ్ని తనఇంటికి ఆహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెలు (స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని'గానే ఉంటుంది' అన్నాడు యముడు. సాభిమానమైన వీడ్కోలు చెల్లెలినుంచి పొంది వెళ్ళిపోయాడు.
యమునకు యముడికి గల ఈ సౌహార్దదినమే 'యమద్వితీయ' అనే పేరుతో అద్వితీయ పర్వదినంగా ప్రఖ్యాతి పొందింది. సోదరి చేతి వంటతో చేసే భోజనం కనుక ఇది భగినీ హస్త భోజనంగా వ్యవహారంలోకి వచ్చింది. సోదరులు తోబుట్టువుల ఇళ్లలోభోజనం చేసినప్పుడు వారికి చీర, పసుపు కుంకమ, పువ్వులు, ఇతర కానుకలు ఇచ్చే సంప్రదాయమూ ఉంది. కర్మిష్ఠులు, తత్వజ్ఞులు, ముముక్షువులు ఈ రోజున నవోదిత చంద్రార్ఘ్యదానం తప్పక చేస్తారు. కార్తీకశుద్ధ పాడ్యమి (నిన్నటి రోజున) 'బలి' పూజలందుకున్నాడు. విదియనాడు పాతాళానికి వెళ్లిపోతాడు. ఈ రోజున బలికి వీడ్కోలు పూజలతోపాటు దానాలు మక్కువతో ఎంతో ఎక్కువగా చేస్తారు. ఈ రోజున చేసే దానాలకు అనంతమైన పుణ్యఫలం సంప్రాప్తమవుతుందంటారు. భవిష్య పురాణం వంటివి భగినీ హస్త భోజన పర్వదిన ప్రాముఖ్యాన్ని విశేషంగా విశ్లేషించాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది నేటి మహత్తర సందేశం. ఈ యమద్వితీయనాడైనా ఈ సత్సంప్రదాయానికీ, సుసంస్కారానికీ పునరంకితులమయ్యేందుకు సంసిద్ధులమవుదామా!
(Eenadu, 11:11:2007)
____________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home