ఏ కులమూ నీదంటే...
కుల, మత ప్రాంతీయ విభేదాలు, కొండొకచో విద్వేషాలు మనకు కొత్తేమీ కాదు. భిన్న జాతులతో, విభిన్న భాషలతో, వివిధ సంస్కృతులతో అలరారే సువిశాల భారతదేశంలో ఆ మాత్రం అరమరికలు ఉండటం సహజమే. ఒక మహాపురుషుణ్నో, మహాకవినో, మహావిద్వాంసుణ్నో- తమ కులంవాడని, తమ మతం వాడని, తమ ప్రాంతం వాడని గర్విస్తుండటమూ అలాంటిదే. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి దారిలో నడవడం మెచ్చుకోవచ్చు. వారి పట్ల ఆరాధన అభిమానం ఒక్కోసారి విపరీత పోకడలకు దారితీస్తాయి. గ్రీకు మహాకవి హోమర్ మరణించాక ఆయన తమవాడంటే, తమవాడని ఏడు నగరాలు కీచులాడుకున్నాయి. చండీదాసు విషయంలో బెంగాలీ, ఒరియా, మైథిలీ భాషల ప్రజలు వాదులాడుకున్నారు. గీతగోవిందకర్త జయదేవుడు బెంగాలీవాడా, ఒరిస్సావాడా అనే చర్చ ఇంకా సందిగ్ధంగానే మిగిలింది. ఆంధ్రదేశంలో కొన్నేళ్ల క్రితం నన్నయ్య విషయమై తణుకు ప్రాంత అభిమానులూ, రాజమహేంద్రవరం ప్రజలూ వాదనలకు దిగారు. తాజాగా తెలుగుల పుణ్యపేటి పోతన కవీంద్రుడి పేరు తరచుగా పత్రికలకు ఎక్కుతోంది. ఆయన తమవాడేనని రెండు ప్రాంతాలవారు వాదోపవాదాలకు దిగారు. ''పోతనకాలము మాత్రము మిక్కిలి వివాదాస్పదమైనది'' అని పేర్కొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి శ్రీమహాభాగవతం పీఠిక- వివిధ వ్యక్తుల పరిశోధనలను వినిపిస్తూ ''... కనుక పోతన పూర్వుల జన్మస్థలము బమ్మెర అనియు, భాగవత రచనము జరిగినది 'ఓరుగల్లు'లోననియు నిశ్చయముగ తేలిపోయినది'' అని ప్రకటించింది. ఇలాంటి కృషి 'కవికాలాదులు' పేరిట పాఠ్యపుస్తకాల్లో నమోదుకే గాని, నిజానికి మహాకవులు ఎవరూ ఒక ప్రాంతానికీ ఒక కాలానికీ పరిమితమైనవారు కారు.
తన జనన లక్షణాలను రంగరించి, తన రక్తంలో రూపు కట్టిన ప్రతిరూపాన్ని తల్లి ఈ లోకానికి అందించినట్లుగా పోతన వంటి మహాకవులు తమ అనుభవాలనో, దర్శనాలనో అక్షరరూపంలోకి తెస్తారు. అలా తమవైన అనుభూతులు అక్షరరూపం పొందే క్రమంలో వారికి ఒకానొక అపురూపమైన ధ్యానస్థితి అరుదుగానైనా తటస్థిస్తూ ఉంటుంది. గాఢమైన నిశ్శబ్దం, నిశ్చలస్థితి మనసును ఆవరించినట్లు తెలుస్తుంది. పావనమైన ఆ స్థితిలో కవి దేశ కాలాదులకు అతీతమైన భావనామయ జగత్తులో విహరిస్తూ 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి'.. అంటూ ఒకానొక తన్మయస్థితిలో పలవరిస్తూ ఆ చిత్త పరిపాకంలో తన ఉనికిని సైతం విస్మరిస్తాడు. ''తన అహంకార ప్రవృత్తిని దాని ఆదిమ దశకు తిరోగమింపజేయడం వల్ల కవిత్వం జనిస్తుంది'' అని ఎర్నెస్ట్ క్రిస్ చేసిన ప్రకటన ఆ క్రమానికి వ్యాఖ్యానమే! యోగవిద్యలో ఆ స్థితిని 'సమాపత్తి' అంటారు. నిశ్చలంగా ఉన్న కోనేటి జలాల్లో నీలాకాశం ప్రతిఫలించినట్లు- నిర్మలమైన కవి హృదయంలో సత్యం సాక్షాత్కరిస్తుంది. దాంతో తాను ప్రయోగిస్తున్న పదాల ద్వారా పాఠకుడికి ఏ రకమైన తన్మయస్థితిని ఇవ్వాలని కవి సంకల్పించాడో దాన్ని తాను ముందుగానే పొందగలుగుతాడు. ఆయా శబ్దార్థాలతో కవికి ఏర్పడిన సంబంధాలు, సంగదోషాలు తొలగిపోయి వాక్కుకు సంబంధించిన స్వచ్ఛమైన స్వరూపంతో, ఆ వెలుగుతో తాదాత్మ్యం ఏర్పడుతుంది. ఆ స్థితిని భారతీయ రుషులు సాధించారు కనుకనే, వారి వాక్కులతో వారికి ఏర్పడిన సమాపత్తి దృష్ట్యా 'రుషి వాక్కు' అనే సంప్రదాయం వెలుగులోకి వచ్చింది. వాక్కును దర్శించిన రుషి పలుకులు రుషి వాక్కులయ్యాయి. రుషి కాని వాడిది కావ్యమే కాదన్న ప్రతిపత్తితో 'నానృషిః కురుతే కావ్యమ్' అన్న ఆర్యోక్తి ఏర్పడింది. వాక్కులతో సమాపత్తి సాధించడమూ ఒక యోగ విధానమే అని నిశ్చయించి ''సిద్ధః కవీనాం కవితైవ యోగః'' అంటూ కవిత్వాన్ని ఉపాసన స్థాయికి తెచ్చారు. కవి అన్న పదానికి 'పరమేశ్వరుడు' అనే మహోన్నతమైన అర్థమేర్పడింది. ఇదీ భారతీయ వాఞ్మయానికి చెందిన ఆధ్యాత్మిక చరిత్ర. 'కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమాది విధానంబులు చేతకానితనమైతిని...' అని కవిసమ్రాట్టు ప్రకటించడంలోని ఆంతర్యం- దాన్ని తపస్సుగా నమ్మడమే!
రుషిత్వ స్థాయిలో కవితారూప తపస్సుకు ఫలంగా లభించినవే భారతదేశ మహాకావ్యాలు. అవన్నీ విశ్వశ్రేయాన్ని కాంక్షించాయే తప్ప- తన ఇల్లు, తన కోడి, తన కుంపటి వంటి ఇరుకు ఆలోచనలకు వాటిలో చోటు లేదు. ఈ లోకం అంతా సుఖపడాలి, సమస్త ప్రజానీకం సుఖపడాలన్న విశాల భావాలకు ఆ కావ్యాలు నెలవులయ్యాయి. ఈ గాలులన్నీ మధుమయం కావాలి. ఈ జలాలన్నీ తేనెసోనలు కావాలి. 'మధువాతారుతాయతే మధుక్షరన్తి సిన్థవః...' అని గానంచేసిన వైదిక రుషుల గీతాల్లోనిది సర్వ మానవ కల్యాణ కాంక్ష. అది ఒక ప్రాంతానికి పరిమితమైనదీ, ఒక కులానికి ఉద్దేశించినదీ కాదు. 'లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలి వెలుగు...'ను దర్శించి తన్మయంగా పలవరించిన పోతన్నను ఎక్కడివాడవని ప్రశ్నిస్తే వేలు పైకి చూపించి 'అక్కడి' వాడినని చెబుతాడు. 'రుషి మూలం, స్త్రీ మూలం, నదీ మూలం విచారణకు తగవు- అన్న మాట వినలేదా?' అని అడుగుతాడు. గజేంద్రమోక్షం పద్యాలు, రుక్మిణీ కల్యాణం ఘట్టాలు హృదయస్థమైన మన తాతయ్యలనీ, బామ్మలనీ కదిపితే కంఠోపాఠంగా వాటిని వల్లిస్తారే గాని- పోతన్న ఎక్కడివాడో, ఏ కులంవాడో వారికి తెలియదు. వారికి తెలిసినది భాగవతం ఒక్కటే! దాన్ని అందించి తమ పుట్టుకను పునీతం చేసిన మహాకవిగా పోతనకు జేజేలు పలుకుతారు. తమ గుండెల్లో ఆయనను స్థిరంగా నిలుపుకొని ఆరాధిస్తూ, భాగవతాన్ని సేవిస్తూ ఉంటారు. సరిగ్గా ఆలోచిస్తే మనం చెయ్యవలసిందీ అదేనని అనిపిస్తుంది. 'ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది' అన్న పాటకు సరైన అర్థం అప్పుడే మనకు బోధపడుతుంది!
(Editorial, Eenadu, 30:12:2007)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home