మాఫీచేసి చూడు
- శంకరనారాయణ
'అప్పిచ్చువాడు' పద్యం రాసిన కవి ఎంత గొప్పవాడు! ప్రజాస్వామ్య మూలతత్వం ఆమూలాగ్రం తెలిసినవాడు!! 'రుణానుబంధ రూపేణా' అనేది ఛాదస్తం కాదని, వేదాంతం అంతకన్నా కాదని 'రుణరంగం'లో 'సొమ్ములు తిరిగిన' మేధావులు (సన్నాయి) నొక్కి వక్కాణించే విషయం! 'ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ' అని పాట పాడినవాడు అమాయకుడు. తాను చేసిన రుణాలను మాఫీ చేయాలని అడిగి ఉంటే అతడి తెలివి తేటలకు తగినంత ఫలితం దక్కేది.
ఎప్పటికయ్యెది ప్రస్తుతమప్పటికా 'మూటలు' ఆడడంలో అధికారపక్షం వారు అందె వేసిన 'చెయ్యి'. ఎన్నికలకు ముందూ వెనకా వారి నటనా వైభవాన్ని బేరీజు వేసి చూస్తే 'మూక' మీద వేలు వేసుకోక తప్పదు. ఎన్నికల ముందు జనాభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నట్టు గద్దె ఎక్కాక ఖజానాభిప్రాయానికి కంకణం కట్టుకున్నట్టు ఎటువంటి ముస్తాబు లేకపోయినా 'హవా'భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలరు. అప్పటి ఇందిరాగాంధీ హయాంలో రుణమేళాల పేరుతో 'రుణభేరి' మోగించినా, ఇప్పటి సోనియాగాంధీ జమానాలో 'మాఫీ వేదాంతం నూరిపోసినా నేపథ్య సంగీతమంతా 'ఓటు వాకా సాగరోరన్నదే'! అంత మాత్రాన పాలకపార్టీ వారికి ఆదా సంగతి తెలియదని అపార్థం చేసుకోకూడదు. రైతులు తాము మద్యం తాగడం మానేసి, అందువల్ల మిగిలే డబ్బుతో విద్యుత్ మీటర్లు బిగించుకోవచ్చునని కొంతకాలం క్రితం ఓ అమాత్యవర్యుడు అన్నాడు. ఇటువంటివన్నీ ఎన్నికలయ్యాక 'అవసరం' తీరాక రాజకీయ వెండి తెరమీద కనిపించిన విశేషాలు. అధినాయకులు అకస్మాత్తుగా మాఫీ మంత్రం అందుకున్నంత మాత్రాన వారు సర్కారు సొమ్ము దుబారా చేస్తున్నారనుకోవడం పొరపాటు. ప్రజాధనాన్ని దానం చేయడంలో కర్ణులని అనకూడదు. ఎప్పుడు డబ్బు ఎవరికోసం ఖర్చు పెట్టాలో వారికి ఎన్నికలతో పెట్టిన విద్య. వారు తలుచుకుంటే విద్యార్థుల ఫీజుల్ని కూడా మాఫీ చేయవచ్చు. కానీ పాలకులు అమాయకులు కాదు. విద్యార్థుల ఫీజుల్ని మాఫీ చేయడానికి ఆ అర్భకులకు ఓట్లు ఎక్కడున్నాయి? 'ప్రజాసేవ అన్నది ఓట్లు ఉన్న వాళ్లకోసమే గానీ ఓట్లు లేనివాళ్ల కోసం కాదు!' అన్నది నాయక పండితాభిప్రాయం.
'ఉచిత' విద్యుత్తుతో సహా ప్రభువులు దేనినీ 'ఉచితం'గా ఇవ్వడం లేదు. వారి జనస్వామ్యమంతా 'ఇచ్చిపుచ్చుకునే' ధోరణితోనే సాగుతోంది! ఎన్నికల ముందు తప్ప మన అధికార పక్ష నేతలకు కారుణ్యం ఉండదా? అని ప్రశ్నించుకోవచ్చు. దానికి తిరుగులేని జవాబు ఉంది. 'ఎంత దయో దోషులపై' అనే విమర్శ నేతల మీద ఉంది. వారి మీద ఎన్ని మాఫీలు చేశారు. కబ్జాలు చేసి భూమాతను 'అడుగు' అడుగునా సేవించుకున్న మహా 'పరుషులకు' ఎన్ని మాఫీలు ప్రసాదించలేదు? చెబితే శానా ఉంది, వింటే ఇంకా ఉంది అనిపించేంత 'వీర' గాథలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో 'పారుతున్న' అవినీతి గలగలల విషయంలో ఎందరి తప్పులు మాఫీ కాలేదు! ఎన్నికల ముందు జనం నాయకులకు దేవతల్లాగా కనిపిస్తారు. తీరా ఆ ముచ్చట తీరాక నాయకులు జనానికి దేవతల్లాగా కనబడతారు. ఎంత ఓటుకు అంత గాలి! దేవుడికి నైవేద్యం పెడతాం. దాన్నేమయినా దేవుడు తింటున్నాడా? అలాగే ప్రజాస్వామ్య దేవతలకు నైవేద్యం పెట్టింది ఎన్నికలయ్యాక దానంతట అదే తిరిగి వస్తుంది! రుణాల మాఫీ చేసిన నాయకులు జనం నుంచి ఏమి కోరుకుంటున్నారన్నదే ప్రశ్న. రుణాల మాఫీ చేసి నాయకులు కోరుకునేది తమ 'దారుణాల మాఫీ'! హరియను రెండక్షరములు పాపాలను హరియించినా, హరియించపోయినా, మాఫీ అను రెండక్షరాలు తమ పాపాలను హరియిస్తాయన్నది మన నాయకుల నమ్మకం. ఎవరి నమ్మకానికి ఎంత అమ్మకం ఉందో రాగల ఎన్నికలకే ఎరుక!
రుణం లేకపోతే మాఫీ చేయలేం. మాఫీ చేయకపోతే ప్రజాసేవలేదు! అందువల్ల ప్రజాస్వామ్యానికి మూలం రుణమే అని ఏ గిరీశం అన్నా కాదనగలమా?
(Eenadu, 19:03:2008)
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home