My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, June 07, 2008

ప్రేమే జీవనాధారం

'నేనెందుకు ఇంకా బతికున్నాను?' అనే శీర్షికతో సుదీర్ఘ కవిత రాసి పత్రికకు పంపించాడొక వర్ధమాన కవి. వెంటనే సంపాదకుల నుంచి ఒక ఉత్తరం వచ్చింది. 'మీరు స్వయంగా తీసుకురాకుండా, దీన్ని పోస్టులో పంపించి జాగ్రత్తపడ్డారు కాబట్టి' అని ఆ లేఖ సారాంశం.

మరీ ఆ కవిగారిలా కాకపోయినా, మనలో చాలామందికి 'ఎందుకు బతకాలి?' అనే ప్రశ్న జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. మహాత్మాగాంధీని సైతం అలాంటి భావన వెంటాడింది. 'నాలో హాస్యచతురతకు చెందిన కుతూహలం లేకుంటే, ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ని!' అన్నారాయన. అర్ధాంతరంగా తనువు చాలించాలనే ఆలోచన మనిషికి ఎందుకు కలుగుతుంది? బాధలు, కష్టాలు, దుఃఖాలు, అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలు, వ్యసనాలు... ఇలా ఎన్నో కారణాలు. అవి మనిషిని తీవ్రంగా పీడించవచ్చు. ఆ సమయంలో ప్రేమ అనేది ఒక్కటీ మనిషికి ఆలంబనగా నిలిస్తే- మనిషి ఆ పెను నిరాశలోంచి తేలిగ్గా బయటపడతాడు. కనుక ఆత్మహత్మకు ప్రధాన కారణం- ప్రేమ రాహిత్యమని చెప్పుకోవాలి. ప్రపంచంలోని ఏ రంగానికి చెందిన గొప్ప విజేత నేపథ్యాన్ని పరిశీలించినా ఒక వాస్తవం బయటపడుతుంది. తల్లిదండ్రుల నుంచి, బంధుమిత్రులనుంచి, జీవిత భాగస్వాముల నుంచి, కన్నబిడ్డల నుంచి వారికి ప్రేమ లభిస్తూ ఉండి ఉంటుంది. కనీసం తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి విజేత కాలేడు. ఆల్‌ఫ్రెడ్‌ నోబుల్‌, ఆయన స్నేహితురాలు బెర్తా ఒకరినొకరు పెళ్లి చేసుకోలేకపోయారు. అయినా ఆమె ప్రేమ నోబుల్‌కు గొప్ప ప్రేరణగా నిలిచింది. డైనమైట్‌ కనుగొనడంలో, లోకకల్యాణానికి వినియోగపడేలా దాన్ని రూపకల్పన చేయడంలో బెర్తా ప్రేమ ఆయన కృషికి జీవధాతువుగా మారింది. డైనమైట్‌ కనుగొనడంవల్ల లభించిన అపార సంపదతో ప్రతిష్ఠాత్మక నోబుల్‌ బహుమతిని వ్యవస్థీకరించడంలో సైతం ఆమె ప్రేమ స్ఫూర్తినిచ్చింది.

చేదు, వగరు, తీపి, పులుపు, కారం... అన్నీ కలిస్తేనే జీవితం. జీవితమంటేనే శిశిరం నుంచి వసంతానికి ప్రయాణం. ఇది ఒక చక్రభ్రమణం. దీనిలో శిశిరం శాశ్వతం అనుకోవడం నిరాశ. వసంతం శాశ్వతం కావాలనడం దురాశ. రెండింటికీ నడుమ గల ఆశను మనిషి ఆశ్రయించాలి. ''...ఆశవలయు... కూడదత్యాశ మాత్రమే...'' అన్నారు నార్ల. నూరేళ్లూ పూర్తిగా సుఖంగా గడిచినవాడు ఎవడూ లేడు. నూరేళ్లూ కేవలం దుఃఖంలోనే మునిగీ ఉండడు. కాకపోతే కష్టసుఖాల చక్రభ్రమణంలో జీవితమనే ఇరుసుకు ప్రేమ అనేది కందెనగా లభిస్తే- ఆ మనిషి అదృష్టవంతుడవుతాడు. ప్రేమనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఇవ్వలేనివాడికి అడిగే హక్కు ఉండదు. కనుక మనిషి స్వతహాగా ప్రేమించగల స్వభావం అలవరచుకోవాలి. అప్పుడు ప్రేమ తనను వరిస్తుంది. '...సముద్రాలు దాటాడట 'కాళ్లు' తడవకుండా... జీవితాన్ని దాటలేడు 'కళ్లు' తడవకుండా...' అని, మనిషి దుస్థితికి వాపోయాడు ఒక నవీన కవి. సంక్లిష్ట భరితంగా మారిపోతున్న ఆధునిక జీవనసరళిలో మనిషి తరచూ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. పదిమందిలోనే ఉంటూ- ఒంటరిగా మిగిలిపోవడమే ఈనాటి మనిషి దుస్థితికి కారణం. అనుబంధాలు, ఆత్మీయతలు ఎండిపోతున్నాయి. మనసును శూన్యత ఆవరిస్తోంది. 'తడి' ఆవిరవుతున్నది. ఇలాంటి స్థితిలో మనిషి తిరిగి తనలో ప్రేమను కనుగొని తీరాలి. ఆశను పెంచుకోవాలి. 'ప్రే'లో ప్రార్థన దాగిఉంది, 'మ'లో మమకారం ఉంది అన్నాడొక ఆధునిక కవి. ప్రేమ మనిషిని బతికిస్తుంది, నిలబెడుతుంది. 'కెరటం నాకు ఆదర్శం... లేచి పడినందుకు కాదు- పడినా... లేచినందుకు...' అన్న కవి వాక్కును మనిషి ఆలంబనగా తీసుకోవాలి. ఓదార్పు పొందాలి.

రకరకాల కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో అలాంటి అభాగ్యుల సంఖ్య దేశంలోకెల్లా అధికంగా ఉండటం- సామాజిక శాస్త్రజ్ఞులను కలవరపరుస్తోంది. 2006 సంవత్సరంలోని మొత్తం సంఘటనల్లో- 38.6శాతం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోనే నమోదయ్యాయి. విరివిగా ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చిన నగరాల జాబితాలో చెన్నై అగ్రస్థానంలో ఉంది. ప్రేమలో అపజయం, చదువులో వెనకబడటం, పెద్దవారి అంచనాలకు తగినట్లు రాణించలేకపోవడం, ఆత్మన్యూనతభావంతో కుంగిపోవడం, తల్లిదండ్రులు విడిపోవడం, ఎడబాటువల్ల ఒంటరి జీవితం, తీవ్రమైన ఒత్తిళ్లు, ఇంట్లో నిత్యం ఘర్షణలు.. వంటి కారణాలు ఆత్మహత్యలకు నేపథ్యంగా నిలుస్తున్నాయి. బతికియున్నచో సుఖములు బడయవచ్చు... జీవన్‌ భద్రాణి పశ్యతి... అని మన పెద్దలు నూరిపోసిన ఓదార్పుహితవచనాలు, తాయెత్తులుగా అనిపించే ధైర్యోక్తులు వారిని చేరనేలేదన్నమాట. తల్లిదండ్రులు క్రికెట్‌ ఆడొద్దన్నారన్న కోపంతో కేరళలోని కొచ్చిలో ఎనిమిదేళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషికీ మనిషికీ మధ్య ఉండవలసిన మమతానురాగాలు, బాంధవ్యాలు, స్నేహాలు ఎంతటి కనీసస్థాయికి పడిపోయాయో అటువంటి దుస్సంఘటనలు వివరిస్తున్నాయి. 'జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే చిక్కులే- మెదడుకు బలాన్నిచ్చే టానిక్కులు' అన్నాడు పి.జి.ఓడ్‌హౌస్‌. కష్టాలే మనిషిని మరింత బలోపేతుణ్ని చేస్తాయి. నిరాశచెందే సందర్భాల్లో మనిషి తప్పక గుర్తుచేసుకోవలసిన మరో మంచిమాట చెప్పాడొక ఆంగ్ల రచయిత. 'మనిషి జీవితంలో సర్వస్వాన్నీ కోల్పోయినా, ఒక్కటి మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది- అది భవిష్యత్తు' అన్నాడాయన. అవును- మనిషి బతకాలి, బతికించాలి. తనలో ప్రేమను ఇతరులకు పంచాలి. ఆటుపోట్లు ఎదురైతేనే బతుకు మరింత చేవ తేలుతుంది. సమస్యలను ఎదుర్కొని గెలిస్తేనే దాని సత్తా బోధపడుతుంది. ప్రేమను కనుగొనడం జీవితానికి ధన్యత కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రేమ ఒక్కటే మనిషికి దిక్కు. బయటనుంచి లోపలనుంచి ప్రేమ లభిస్తేనే మనిషి జన్మ సార్థకమవుతుంది!
(ఈనాడు, సంపాదకీయం, 23:03:2008)
______________________________

Labels:

1 Comments:

Blogger rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

4:26 pm

 

Post a Comment

<< Home