సరికొత్త ప్రేమగురువు
భారతీయ సంప్రదాయంలో దాంపత్యం ఒక పుణ్యక్రతువు. సంతానాన్ని పొందడంద్వారా ప్రజాతంతువు విచ్ఛిన్నం కాకుండా రక్షించడం దంపతీధర్మం. దానికోసం పురుషుడు తన బ్రహ్మచర్యాన్ని త్యాగం చేస్తాడు. తండ్రి గోత్రంతోపాటు, తన కన్యాసౌభాగ్యాన్ని స్త్రీ త్యాగం చేస్తుంది. ఉభయుల త్యాగభాగధేయమై- దాంపత్యం సిద్ధిస్తుంది. భార్య గర్భవతి కావడంతో పాణిగ్రహణ వ్రతం ఫలిస్తుంది. పాలకడలి మథనం కారణంగా- అమృతం ఆవిర్భవించినట్లే, దంపతుల మిథునం కారణంగా శిశూదయమై, స్త్రీకి స్తన్యం సముద్భవిస్తుంది. అమ్మాయి అమ్మగా మారే ఈ క్రమ పరిణామంలో ఆమెలో ఒకానొక వినూత్న చైతన్యం మోసులెత్తుతుంది. లోకోత్తర మాధుర్యం- ఆమెకు అనుభూతం అవుతుంది. ఆ ఆస్వాదనే ఆమెకు 'అమ్మదనాన్ని' ప్రసాదిస్తుంది. ఈ లోకంలో అమ్మదనంకన్నా గొప్పది ఏమీలేదు. 'స్త్రీకి గౌరవవాచకం ఇల్లాలైతే, ఇల్లాలికి గౌరవవాచకం తల్లి' అనడంలో రహస్యం ఇదే! స్త్రీ పురుషుల మధ్య సృష్టి సహజమైన ఈ దాంపత్య ధర్మాన్ని 'ప్రాజాపత్యయజ్ఞం'గా వేదం వర్ణించింది. 'దాంపత్యం సత్సంతానం కోసమే' అని స్పష్టంచేసింది. సంతానావశ్యకతను భారతంలో పాండురాజు కుంతీదేవికి వివరించాడు. జరత్కారువు కథా దాన్నే నిరూపించింది. పురాణాల్లో చాలాచోట్ల ఇది ప్రస్తావనకు వచ్చింది. పెళ్ళి కాగానే 'సంతాన ప్రాప్తిరస్తు', 'పుత్రపౌత్రాభివృద్ధిరస్తు' అని దంపతులను దీవించడాన్ని పెద్దలు ఒక సంప్రదాయంగా అలవరచారు.
దాంపత్య జీవన మాధుర్యానికి శృంగారం అద్భుతమైన ఆలంబన. శృంగారానికి కామం ప్రధాన ప్రేరణ. కామాన్ని భగవద్విభూతిగా వర్ణించింది గీత. సృష్టిలో కామానికి అధిదేవత మన్మథుడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు అంతటివాడు సరస్వతిని చేపట్టడంలో మదనుడి ప్రమేయం ఉందని మత్స్య పురాణం వివరించింది. పార్వతీపరమేశ్వరులకు వివాహం జరగాలని దేవతలు సంకల్పించి, సహాయం అర్థించింది- మన్మథుణ్నే! శకుంతలా దుష్యంతుల వివాహానికి కారణమైనవాడు మన్మథుడు. సుగాత్రీ శాలీనుల కాపురం నిలబెట్టినవాడు మన్మథుడు. ప్రవరాఖ్యుడు తిరస్కరిస్తే వరూధిని ఎంతగా మదనతాపానికి గురైందో పెద్దన రమణీయంగా వర్ణించాడు. చివరికి మాయాప్రవరుడు కంటపడేసరికి ఒక్కసారిగా అతణ్ని చేరి- ...పంచశరు బారికి చిక్కితి... నీకు దక్కితిన్... దయతో ఏలుకొమ్మని కన్నీళ్ళతో ప్రార్థించింది. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు బాణాలు కలవాడు కనుక మన్మథుణ్ని పంచశరుడు అంటారు. ఆ అయిదింటిలో ఏది తగిలినా మనసులో తక్షణం వలపు పుట్టుకొస్తుంది. మన్మథుడి ప్రభావానికి లోనైన స్త్రీపురుషుల దేహభాష మారిపోతుంది. కూకుండ నీదురా... కూసింత సేపు... అన్నట్లుగా సతమతమైపోతుంది. శరీరంలోకి యౌవనం ప్రవేశించినంత రహస్యంగా, నిశ్శబ్దంగా వలపు మనసులోకి ప్రసరిస్తుంది. అందువల్లే మన్మథుడు ఈ లోకానికి వలపుగురువు.
పెళ్ళిచూపుల్లో ఒకరినొకరు చూసుకోగానే, ఒక మధురక్షణంలో మనసులో ఏమూలో 'నా జీవిత భాగస్వామి' అని నిర్ధారించే- ఒకానొక పరమ నాజూకు స్పందన కలగడం తీపి అనుభవం. జీవిత పర్యంతం తలచుకున్నప్పుడల్లా శరీరంపై పులకలు రేపే మంచి జ్ఞాపకం. మన్మథుడి ప్రమేయంతో- పరస్పర ఆకర్షణకు లోనైన యువతీయువకులు తమలో ఏదో వింత రసాయన చర్య ప్రారంభమైందని గ్రహించే లోపున, అది వలపుగా పర్యవసించి, అర్థంకాని తహతహ పుట్టించడం- మధురాతిమధురమైన అనుభూతి. అలా అత్యంత సహజంగా, ప్రకృతిసిద్ధంగా- పురుషుణ్ని చూడగానే స్త్రీ పమిట సవరించుకున్నంత అలవోకగా జనించవలసిన వలపును 'సిజేరియన్' ద్వారా పుట్టించాలనుకోవడం పెద్దవింత. ఏ వేకువజామునో నిశ్శబ్దంగా సుతారంగా విచ్చుకునే కోమలమైన గులాబిరేకులను చేత్తో మొరటుగా వికసింపజేసే కార్యక్రమానికి- సింగపూర్ ప్రభుత్వం సమకట్టింది. సృష్టికార్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. మన్మథుణ్ని తోసిరాజని, తానే 'ప్రేమగురువు'గా అవతరించింది. వెనకటికి ఒక వ్యవసాయ అధికారిని ప్రశ్నలు జవాబులు శీర్షికకు పిలిచారు. 'నా మొగుడు నన్నేలుకోవాలంటే ఏం చెయ్యాల'న్న ప్రశ్నకు- వలపు రెండు పాళ్ళు, వయాగ్రా రెండు పాళ్ళు బాగా కలియబెట్టి, భర్త మనసులోకి పిచికారీ చెయ్యమన్నాడాయన. సింగపూర్ ప్రభుత్వం ఆ తీరుగానే వ్యవహరిస్తోంది. అరటిగెలలను కావవేసి బలవంతంగా ముగ్గబెట్టినట్లు- సంతానం కనమని బలవంతం చేస్తోంది. మన్మథ ప్రభావం బాగా క్షీణించిందో ఏమోగాని, ఆ దేశంలో యువత పెళ్ళిళ్ళ జోలికి పోవడం లేదు. జనాభా వృద్ధి గణనీయంగా పడిపోయి, పిల్లల్ని కన్నవారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించే స్థితి ఏర్పడింది. పాఠ్యాంశాల్లోకి వలపుగీతాలు, కామ ప్రవచనాలు చొరబడ్డాయి. శివధనుర్భంగంవేళ రాముడి చూపునకు తాళలేక సీత కనురెప్పలు వాల్చింది- అన్నారు విశ్వనాథ. 'అలావద్దు' అంటున్నారు సింగపూర్ ఉపాధ్యాయులు. ''అయిదు సెకండ్ల పాటు మగవాడు మీకళ్ళలోకి సూటిగా చూశాడంటే- మీ పట్ల ఆకర్షణ కలిగిందని అర్థం. మీరు కూడా రెప్పవాల్చకుండా చూడండి. దాన్ని ఒక అవకాశంగా అర్థం చేసుకోండి''- అవీ ఇప్పుడక్కడి పాఠాలు. హతోస్మి!
(ఈనాడు, సంపాదకీయం, 30:03:2008)
______________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home