My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, June 03, 2008

పలుకు తేనెల తల్లీ


నిఘంటువుతో నిగారింపు
డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి
(రచయిత విజయనగరంలోని మహారాజ బోధనాభ్యసన కళాశాలలో యు.జి.సి. పరిశోధకులు)
___________________________________________________
లిపి, నాగరక వ్యవహారం, సాహిత్యం ఉన్న ప్రతి భాషకు నిఘంటువు అవసరం. ఈ స్థితిలో ఉన్న ప్రపంచ భాషలన్నింటికి నిఘంటువులున్నాయి. నిఘంటువు అనేది ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు, ఏదో ఒకవిధంగా రాసి పడేసే పుస్తకం కాదు. మారుతున్న కాలంలో ఎదురయ్యే అవసరాలన్నింటిని తీర్చడానికి ఎప్పటికప్పుడు ఎలా అవసరమైతే అలా, ఎవరికి వీలైతే వారు సమర్థతతో, విజ్ఞతతో నిఘంటు నిర్మాణం చేస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో పుట్టి బాగా వ్యాప్తిలోకి వచ్చిన కొత్త పదాలను పదబంధాలను, భావనలను, వాడుకలను జత చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంగ్లిషు, నిఘంటువుల సరికొత్త ప్రచురణలు వెలువడుతూ ఉండటం మనకు తెలుసు. ఒక్క ఇంగ్లిషు అనే కాదు, ఏ భాషలోని నిఘంటువులైనా సమకాలీన భాషా సమాజపు అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని ధరించవలసి ఉంది.

కాలం ఆధునికతలోంచి ఉత్తరాధునికతలోకి ప్రవహిస్తోంది. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దినదినానికి కొత్త ముఖాన్ని మార్చుకుంటోంది. కొత్త శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఏ భాషలో ఉంటే అది సంపన్న భాష అవుతోంది. కొత్త నీటికి చేపలు ఎగబాకినట్లు విద్యార్థులు, విద్వాంసులు ఆ భాషను నేర్చుకోవడానికి ఎగబడుతున్నారు. మామూలు జనమంతా ఆ భాషనే వేదంగా భావించి మిథ్యా ప్రతిష్ఠ కోసం వెంపర్లాడుతున్నారు. ఈ స్థితి మారాలంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మన భాషలో అందరకూ అందుబాటులోకి రావాలంటే ఆ శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకు సరికొత్త నిఘంటు నిర్మాణం అవసరం.

సంస్కృతంలోలాగే తెలుగులో కూడా పూర్వం పద్య నిఘంటువులుండేవి. వాటికి కాలదోషం పట్టి మూలనపడ్డాయి. కొంచెం అటూఇటూగా తెలుగులో ఆధునిక నిఘంటు నిర్మాణం ఆరంభమై రెండు శతాబ్దాలు కావస్తోంది. ఎన్నిరకాల ఆధునిక నిఘంటువులున్నాయో దాదాపుగా అన్నిరకాల నిఘంటువులూ తెలుగులో వచ్చాయి. తొలిదశలో తెలుగు నిఘంటు నిర్మాణానికి పూనుకొన్న పాశ్చాత్యులు నిఘంటువుల్లో సాహిత్య భాషతోపాటు సామాన్య ప్రజల వాడుక భాషకు కూడా స్థానం కల్పించారు. ఆ స్ఫూర్తి ఆనాటి నుంచి కొనసాగి ఉంటే, మన పండితులు అప్పటి నుంచి సాహిత్య భాషతోపాటు సామాన్య జనుల వాడుక భాషకు కూడా ప్రామాణ్యాన్ని కల్పించి నిఘంటువులకెక్కించి ఉంటే తెలుగు భాషలోని పదజాలం సురక్షితమై ఉండేది. మన పండితులు కావ్య ప్రయోగంలోని దేశ్య భాషను మాత్రమే నిఘంటువులకు ఎక్కించారు. ఆ కారణంగా మన భాషకెంతో నష్టం కలిగింది. అచ్చ తెనుగు నిఘంటువులు కృతక భాషకు ప్రామాణ్యాన్ని కల్పించాయి. సంప్రదాయ పండితులు కూర్చిన, సమకూరుస్తున్న నిఘంటువులు అసమగ్రమైనవని భావించి తెలుగు అకాడమీ వంటి సంస్థలు- కొన్ని దశాబ్దాల కిందటి నుంచి 'మాండలిక పదకోశాలు', 'వృత్తి పదకోశాలు' వంటి ప్రయోజనకరమైన కొత్త నిఘంటువులు నిర్మించడానికి పూనుకున్నాయి. ఆశయశుద్ధి ఉన్నంతగా ఆచరణ శుద్ధి లేని కారణంగా ఈ ప్రయత్నం ఇంకా పూర్తిగా ఫలవంతం కాలేదు. ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకొకటుంది. తెలుగువారికి ఇతర భాషా నిఘంటువులను ఉపయోగించడం తెలుసుకానీ తెలుగులో కొన్ని నిఘంటువులున్నాయని, వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉందని వారు ఎన్నడూ అనుకోరు.

ప్రతిమాటకు ఒక చరిత్ర ఉంటుంది. ఆమాట పుట్టుపూర్వోత్తరాలు, స్వరూప స్వభావాలు, అర్థ పరిణామ దశలు, పతనం- ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే నిఘంటువు ఉండాలి. ఆధునిక నిఘంటు నిర్మాణంలో- పరిణత బుద్ధులైన విద్వాంసులు మాత్రమేకాక విద్యార్థులు, పల్లెలలో అడవులలో కొండలలో నివసించే ప్రజలు కూడా మాటా-మాటా కలిపి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమకాలీనంగా తామరతంపరగా వృద్ధి పొందుతున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ప్రధానంగా రెండు రకాలుగా ఉంది. వీళ్లు- వాళ్లు అనే తేడా లేకుండా దైనందిన వ్యవహారంలో ప్రజలకందరకు తప్పనిసరిగా అవసరమయే విజ్ఞానం ఒకటి. కళ, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక, వాణిజ్యాది రంగాలలో ప్రత్యేక శ్రద్ధతో నిష్ణాతులు కాగోరే వారికి ఉపయోగపడే విజ్ఞానం మరొకటి. అంటే, ఒకటి సర్వసామాన్యమైన విజ్ఞానం. రెండవది ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే విజ్ఞానం. ఈ రెండు రంగాలలోను ఇప్పుడు పెనుమార్పులు సంభవిస్తున్నాయి. వీటికి సంబంధించిన భావనలు, పరిభాషలు, సంజ్ఞలు కొత్తగా రూపొందించుకొనేటప్పుడు ఇందులో కొంత భాగమైనా అందరికీ అందుబాటులో ఉండే భాషలో ఉండాలి. అందరికీ ఉపయోగపడే నిఘంటవును తయారుచేసినపుడు పండితుడు తన అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, సామాన్య విద్యార్హతగల వారి అవగాహన స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిభాష తత్సమ పదమా, దేశ్యపదమా అనే కాక సరళంగా, సుభోదకంగా ఉందా, లేదా అని ఆలోచించాలి. నూతన పరిభాషా కల్పనలో ఇంకొక అతివాదం కూడా ఉంది. ఆంగ్ల పరిభాషను యథాతథంగా ఉపయోగించడమే సరియైనదని, ప్రతి పదాన్ని తెలుగులోకి మార్చుకోవడం చాదస్తమని ఆ అతివాదులంటారు. ఏ సంజ్ఞలను, పరిభాషలను, మూలభాష నుంచి యథాతథంగా గ్రహించాలి? ఏవి అనువదించుకోవాలి? వేటికి కొత్తపదాలు సృష్టించుకోవాలి? అనే విచక్షణతో నిఘంటు నిర్మాణం చేయాలి కానీ ''తాఁబట్టిన కుందేటికి మూడే కాళ్లు'' అనే పిడివాదం ఇక్కడ పొసగదు. ఒక పండితుణ్ణి 'ఫ్త్లె ఓవర్‌' అన్న మాటను తెలుగులోకి మార్చమంటే, ''గగనపథం'' అంటాడు. అదే ఒక గ్రామీణుడ్ని అడిగితే ''పైదారి'' అంటాడు. ఇందులో ఏది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందో నిఘంటుకారుడు నిర్ణయించుకోవాలి. నిఘంటు నిర్మాణానికి ఒక పండిత వ్యవస్థతో పాటు ఒక గ్రామీణ వ్యవస్థ కూడా అవసరం. గ్రామీణుల నుంచి సేకరించిన పదజాలాన్ని క్రమబద్ధం చేసి పండితులు నిఘంటు నిర్మాణం చేయాలి. ఇది ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. ప్రయోజనం లక్ష్యంగా సాగే యజ్ఞం. అధునాతనమైన ఒక నిఘంటువు అవసరాన్ని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తులు ఎవరికివారుగా నడుం కడుతున్న సమయమిది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సి.ఎస్‌.టి.టి. (కమీషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నలాజికల్‌ టెర్మినాలజీ) అన్న సంస్థ ఇప్పటికే వివిధ శాస్త్రాలకు సంబంధించి కొన్ని లక్షల పరిభాషలను సృష్టించింది. ఏ విషయానికైనా జాతీయస్థాయిలో ఒకే పరిభాష వాడుకలోకి రావాలనే లక్ష్యంతో ఈ సంస్థ కృషి చేస్తోంది. నిఘంటువులపై హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక జాతీయ సదస్సును నిర్వహించింది. ఆధునిక అవసరాలను తీర్చే సమగ్రం, అధునాతనం అయిన తెలుగు నిఘంటు నిర్మాణం కోసం వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యుల నుంచి పరిశోధన పత్రాలను సేకరించి ప్రకటించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భాషాభివృద్ధి పీఠం వారు ఒక జాతీయ సదస్సును నిర్వహించి, దేశంలోని విద్వాంసులను ఆహ్వానించి వివిధ విషయాలకు సంబంధించిన నిఘంటు నిర్మాణంలో ఎన్నో అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ఓ ముఖ్య విషయాన్ని గమనించాలి. జాతీయస్థాయిలో ఒకరు, ప్రాంతీయస్థాయిలో ఒకరు ఒకే అంశానికి రెండు పరిభాషలను కల్పించడం వల్ల వ్యవహారంలో క్లేశం ఏర్పడుతుంది. ఆ క్లేశాన్ని నివారించడానికి నిఘంటు నిర్మాతల మధ్య ఒక అవగాహన, ఒక సమన్వయ ధోరణి ఉండాలి.

అధునాతన అవసరాలను తీర్చేందుకు కొత్త నిఘంటువును తయారుచేయాలనుకొనే వారు సోదర భాషల పట్ల దృష్టి మళ్లించాలి. తమిళులు ఆధునిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఏ భాషలో ఏ కొత్త పరిభాష వచ్చినా వెనువెంటనే దానికొక తమిళ పదాన్ని సృష్టిస్తారు. ఎక్కువ సందర్భాలలో అది అనువాదం కాక కొత్తగా సృష్టించిన పదమై ఉంటుంది. కాఫీ, టీ వంటి పదాలకు కూడా తమిళ పదాన్ని సృష్టించడం అతివాదమని, ఆ చాదస్తాన్ని మనం తలకు రుద్దుకోకూడదని కొందరు భావిస్తున్నారు. అందువల్ల మనం వెనుకపడతామని వారి విశ్వాసం. కానీ అది సరికాదు. చైనాలో రోదసీ విజ్ఞానానికి అధినేతగా పనిచేస్తున్న ఆచార్యురుడికి ఇంగ్లిషు రానేరాదని, ఆ విజ్ఞానాన్నంతటినీ అతడు మాతృభాష నుంచే అధ్యయనం చేశారని ఒక ఆచార్యుడు చెప్పగా విన్నాను. ఆ దృష్టితో చూసినప్పుడు సాధ్యమైనంత వరకు మనం తెలుగులో కొత్త పరిభాషలను కల్పించుకోవడమే మంచిదని విజ్ఞులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైతే మనం తమిళులను మార్గదర్శకులుగా గ్రహించాలి. తెలుగులో మనం కొన్ని పరిభాషలను సృష్టించుకోవడం సాధ్యం కాకపోయినట్లయితే వాటిని మనం మన సోదరభాషలైన తమిళ, కన్నడ, మళయాళల భాషల నుంచి అరువు తెచ్చుకోవడానికి వెనుకాడకూడదు. అవి మన భాషా కుటుంబానికి చెందినవి, క్రమంగా ఆ పరిభాషలు మనభాషలో కలిసిపోయి ఒక సహజ సౌందర్యాన్నీ, సామరస్యాన్నీ సాధిస్తాయి. అధునాతన నిఘంటువు- విద్యా, వైజ్ఞానికాది ఇతర రంగాల వారి కంటే పత్రికల వారికి, దృశ్యమాధ్యమానికి ఎంతో అవసరం. అందుచేత అధునాతన నిఘంటు నిర్మాణానికి వారు సంఘటిత కృషి చేయాలి. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేపట్టిన కార్యక్రమాలు నత్తనడక నడుస్తాయని, అవి పూర్తి కావడానికి ''ఏండ్లును పూండ్లును పట్టు''నని మన అనుభవంలో ఉన్న విషయం. కాబట్టి అధునాతన అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో కర్తవ్యనిష్ఠ, బాధ్యత, క్రమశిక్షణ, అంగబలం, అర్థబలం - అన్నింటికీ మించి విచక్షణ జ్ఞానంగల ప్రభుత్వేతర సంస్థలు అకుంఠిత కృషి జరపవలసి ఉంది. తెలుగు భాషా సాహిత్యాలకు గౌరవాదరాలు తగ్గి అవి క్షీణదశలో ఉన్న ప్రస్తుత స్థితిలో మన తెలుగు భాషను ఇతర భాషా సమాజాలతో సమాన గౌరవంకలదానిగా చేయడానికి ఈ నిఘంటు నిర్మాణం ఎంతో అవసరం.
(ఈనాడు,07:04:2008)
---------------------------------------------------

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home