ఖరీదైన సలహాలు
అందమైన భవంతి ముందు ఒక శ్రీమంతరావు చేతిలో ఖరీదైన విదేశీ సిగరెట్ పెట్టెతో దర్జాగా నిలబడి ఉన్నాడు. నిర్లక్ష్యంగా చూస్తూ, విలాసంగా పొగ వదులుతూ ఉండగా దారినపోయే ఒక దానయ్య చూశాడు. దానయ్యగారికి సలహాలివ్వాలన్న సరదా బాగా ఎక్కువ. పోతూపోతూ ఉన్నవాడు ఆగి, శ్రీమంతరావు దగ్గరికి వచ్చి, కళ్లలోకి గంభీరంగా చూస్తూ 'మీకో మంచి సలహా ఇద్దామనుకుంటున్నాను' అన్నాడు. శ్రీమంతరావు అనుమానంగా చూస్తూనే తల వూపాడు. దానయ్య ఒక్కసారిగా విజృంభించాడు. ధూమపానం ఎంత చెడ్డదో, దానివల్ల ఎన్నిరకాల నష్టాలున్నాయో గుక్కతిప్పుకోకుండా వివరించాడు. 'ముఖ్యంగా ఎంత ధనం నష్టపోతారో లెక్కిస్తే మీ గుండె గుభేల్‌మంటుంది. ఇన్నేళ్లుగా మీరు ఈ రకంగా తగలేసిన డబ్బుకనక ఆదాచేసి ఉంటే, ఆ కనబడే అందమైన మేడ, ఇదిగో ఈ చక్కని కారు మీ సొంతమై ఉండేవి తెలుసా?' అని ఉద్రేకంగా ప్రశ్నించాడు. 'నేనూ మీలాగే రోజుకు రెండు పెట్టెలు వూదేసేవాణ్ని. మానేసి ఇలా బాగుపడ్డాను. ఆ అనుభవంతోనే చెబుతున్నాను. ఈ గొప్ప సలహాను మీరు పాటించి, వెంటనే బాగుపడతారని నేను ఆశిస్తాను' అని ఒకానొక ఆధ్యాత్మిక సంతృప్తితో ఆయాసపడుతూ ఆగాడు. శ్రీమంతరావు ఒక్కక్షణం దానయ్యకేసి చూశాడు. 'ఆశించండి. తప్పేంలేదు. ఇప్పుడు నేను కూడా మీకో సలహా ఇస్తున్నాను. ఇలా పనిగట్టుకుని అడక్కపోయినా వచ్చి సలహాలు ఇవ్వడం మీరిక మానేయండి. మీరు చెబుతున్న భవంతికి నేనే యజమానిని. ఈ కారు కూడా నాదే. అయినా సిగరెట్లు మానేసి మీరు కూడబెట్టినది ఏమంత లేదనుకుంటాను. ఉంటే, దానితో ఏ వ్యాపారమో చేసుకుంటూ, పని చూసుకుంటూ ఉండేవారు. కనబడిన ప్రతివాడికీ ఇలా ఉచిత సలహాలిస్తూ ఖాళీగా తిరిగేవారు కాదు. వెళ్ళిరండి, నాకు పని ఉంది' అన్నాడు.
అడక్కుండా ఇచ్చే సలహాలు అప్పుడప్పుడూ ఇలా బెడిసికొడతాయి. ఎదుటివాడికి సలహా నిజంగా అవసరమా కాదా అనిగాని, వింటాడా లేదా అనిగాని ఆలోచించకుండా లేనిపోని పెద్దరికం నెత్తిమీద వేసుకోవడం ఎందరికొ అలవాటు. గట్టిగా చెప్పాలంటే వ్యసనం. 'అయితే ఒక పనిచెయ్యి' అనిగాని, 'ఎందుకు చెబుతున్నానో విను' అనిగాని మనతో ఎవరేనా అన్నారంటే- ఆ వెంటనే వారొక సలహా ఇవ్వబోతున్నారని, వినడానికి మనం సిద్ధంగా ఉండాలనీ అర్థం. అలాఅని, పూర్తిగా మన బుద్ధితోనే, మన తెలివితేటలతోనే జీవితం వెళ్ళిపోతుందా అంటే, కుదరదు. ఎంత మేధావికైనా ఒక్కో సందర్భంలో సలహాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. మైకిస్తే జనాన్ని చితక్కొట్టేసే ప్రతివక్తా మేకిస్తే గోడకు కొట్టగలడా అన్నది అనుమానం. వేలు చితికే సందర్భాలుంటాయి. అలాంటి సందర్భాల్లో పెద్దల సలహాలు ఎంతో మేలు చేస్తాయి. గురుబుద్ధిర్విశేషతః అనేది అందుకే. ఆ మాటనే 'పెద్దల మాట చద్దిమూట'గా అనువదించాడొక బుద్ధిమంతుడు. అనుభవజ్ఞులైన పెద్దలు, గురువుల సలహాలు వినకపోవడంవల్ల మనిషి దెబ్బతినే సందర్భాలుంటాయి. రాయబారానికై వచ్చిన కృష్ణుడి సలహాలుగాని, ఆ సమయంలో భీష్ముడి సలహాలుగాని ధృతరాష్ట్రుడు పట్టించుకోలేదు. అడపాదడపా విదురుడు, వ్యాసుడు చెప్పిన సలహాలూ పెడచెవిన పెట్టాడు. అందుకే ఆయన చెడిపోయాడు. పోయేకాలం సమీపిస్తే మంచి సలహాలు కూడా వినబుద్ధి కావంటారు. పోగాలం దాపురించినవాడు అరుంధతిని, మిత్రవాక్యాన్ని, దీపనిర్వాణ గంధాన్ని కనడు, వినడు, మూర్కొనడు- అని సుభాషితం. ఇక్కడ మిత్రవాక్యమంటే మంచి సలహా అనే అర్థం. మిత్రవాక్యం విని బాగుపడ్డవారిలో ధర్మరాజు అగ్రగణ్యుడు. ద్రోణవధ విషయంలో, సైంధవ సంహారంలో కృష్ణుడి సలహాలు అమోఘంగా రాణించాయి. నిజానికి శ్రీకృష్ణుడు పాండవులకు జీవితకాలపు సలహాదారు.
ఆ తరహా సలహాదారులతో సంప్రతింపులు ఇప్పటికీ లాభసాటి బేరమే అంటున్నారు- నేటి పారిశ్రామికవేత్తలు! ఆత్మబుద్ధిః సుఖంచైవ- సొంత ఆలోచన మంచిదే అని చెప్పిన పెద్దలే, గురువుల సలహాలు అంతకన్నా విశేషమైనవి అన్నారన్నది మనం గుర్తుచేసుకోవాలి. సంక్లిష్టభరితంగా మారిన ఈ ఆధునిక జీవనసరళిలో కుదురుగా కూర్చుని స్థిమితంగా ఆలోచించే తీరిక ఎవరికి మాత్రం ఉంది? ఈ నేపథ్యంలో నిపుణుల సలహాలు పోటీరంగంలో నిలిచిన ప్రతి పరిశ్రమకీ అవసరమవుతున్నాయి. ఆ అవసరాల్లోంచి పుట్టిందే 'కన్సల్టెన్సీ' వ్యవస్థ. కన్సల్టెన్సీల సలహాలు నిశితమైనవేకాదు, ఖరీదైనవి కూడా. రెండేళ్ళుగా వాణిజ్యపరమైన అంశాల్లో తానుపొందిన సలహాలకు పారిశ్రామికవేత్త రతన్‌టాటా అక్షరాలా రూ.532కోట్లు చెల్లించారంటే- మంచి కన్సల్టెన్సీలకు గిరాకీ ఏ స్థాయిలో ఉందో వూహించుకోవచ్చు. ఈ వ్యవస్థ చాలా ఖరీదైనది కనుక 'ఉచిత' సలహాలకు తావులేదు. దారినపోయే దానయ్యల బెడద లేదు. ఆచితూచి సలహాలిస్తారు కాబట్టి ఆశ్రయించిన వారంతా ధర్మజుడిలా లబ్ధిపొందే అవకాశాలున్నాయి. దుష్టచతుష్టయం సలహాలు విని దుర్యోధనుడు చెడిపోయినట్లుగా, గిరీశం సలహాలు పాటించి వెంకటేశం భ్రష్టుపట్టినట్లుగా- తెలివితక్కువ కన్సల్టెన్సీ సలహాలతో దెబ్బతినకుండా ఉండాలంటే మాత్రం స్వామిరామతీర్థ సలహా పాటించాలి. 'రథంపై నిలిచి అర్జునుడిలా పరాక్రమంతో పోరాడు. కాని పగ్గాలు మాత్రం కృష్ణుడి చేతిలోనే ఉండేలా చూసుకో' అన్నారాయన. సలహాదారును ఎంచుకునేటప్పుడే ముందు చూపుతో వ్యవహరించాలి. లేదా దెబ్బతిన్నాక అయినా జాగ్రత్తపడాలి!
(ఈనాడు, సంపాదకీయం, 13:04:2008)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home