తల్లిదండ్రులూ బహుపరాక్!
గొప్ప మేధావిగా పేరుగడించిన ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షాకు ఒక విందు సమావేశంలో అందమైన సినీనటి తారసపడింది. నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి 'మనం పెళ్లిచేసుకుంటే మన పిల్లలకు మీ తెలివితేటలు, నా అందం రెండూ వస్తాయి. అందమూ, తెలివీ ఒక్కచోట చేరడం అద్భుతం కదా!' అని ప్రతిపాదించింది. షా చిన్ననవ్వు నవ్వాడు. 'మీరు చెప్పింది బాగానే ఉంది... ఆ పుట్టే పిల్లలకు మీ తెలివితేటలూ, నా అందమూ వస్తే- వారి గతి ఏమిటి?' అన్నాడు! తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏమేమి సంక్రమిస్తాయో నిర్ధారణగా చెప్పలేం. ఆడపిల్లకు తండ్రి పోలికలు, పిల్లవాడికి తల్లి పోలికలు వస్తే మంచిదంటారు. ప్రతి గొప్పవాడూ తన తల్లి గుణాలు చాలావరకు కలిగి ఉంటాడంటారు. స్త్రీ, పురుషుడు పెళ్లిచేసుకుని భార్యభర్తలవుతారు. పిల్లల్నికని తల్లిదండ్రులవుతారు. భార్యాభర్తలయ్యేది, తల్లిదండ్రులయ్యేది- ఆ ఇద్దరేగాని, భూమికల్లో మాత్రం చాలా తేడాఉంది. బాధ్యతల్లోనూ ఎంతో అంతరముంది. తల్లిదండ్రులు చెడిపోయినా, విడిపోయినా సంతానమే నష్టపోతుంది. వారి తప్పులు పిల్లలను వెంటాడతాయి, వేధిస్తాయి. పిల్లలు చిన్నవయసు వాళ్లయితే అదింకా ప్రమాదం. మనిషి స్వభావంపై బాల్యం ప్రభావం అధికమని శాస్త్రం నిరూపించింది. సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యేవారిలో ఎందరో బాల్యంలో తల్లిదండ్రుల ఆదరణకు దూరమైనవారే అనేది చేదు నిజం! అమ్మలాలన, నాన్న ఆదరణ లభించిన పిల్లలు అదృష్టవంతులు. తల్లిదండ్రులను అనుకరించడంతోనే పిల్లల ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది. పూజగదిలో రోజూ దీపంపెట్టే అమ్మను ఆడపిల్ల అనుకరిస్తుంది. సిగరెట్లు కాకుండా, అగరొత్తులు వెలిగించే తండ్రిని కొడుకు అనుకరిస్తాడు. పిల్లలు బాగుపడాలని కోరుకునే తల్లిదండ్రులు ముందు తాము బాగుపడాలి. పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.
'మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్షదేవతామ్'- తల్లీతండ్రీ ప్రత్యక్ష దైవాలని మన సాహిత్యం బోధించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ- అని నూరిపోసింది. తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలో చెప్పినంత గట్టిగా, ఎక్కువగా పిల్లలను ఎంతబాగా చూసుకోవాలో చెప్పలేదు. సమాజమూ 'పిల్లల్ని కనడం ఎలా' అనే అంశంపై చేసినన్ని ప్రయోగాలు, పరిశోధనలు 'పెంచడం ఎలా' అనే విషయంపై చేసినట్లు కనపడదు. పెంకును తానే పగలగొట్టుకుని కోడిపిల్ల బయటకు తొంగిచూస్తుంది. టెంకను చీల్చుకుని మామిడి విత్తు స్వయంగా మెడ బయటకు పెడుతుంది. తల్లిని తీవ్రహింసకు గురిచేసిగాని, బిడ్డ బయటపడదు. 'అమ్మ' అనిపించుకోవాలని స్త్రీ దానంతటినీ పంటిబిగువున భరిస్తుంది. అందుకనే ఈ లోకం తల్లికి అత్యున్నత స్థానాన్ని కల్పించింది. 'పదిమంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యులకన్నా ఒక తండ్రి, వెయ్యిమంది తండ్రులకన్నా గౌరవనీయురాలైన ఒక తల్లి ఎంతోగొప్పది' అనడం అమ్మదనానికి అపూర్వసత్కారం! పురుషుడికన్నా స్త్రీ ఎక్కువకాలం జీవించడానికి 'అమ్మ'కావడమే ముఖ్యకారణమని సైన్సు భావిస్తోంది. గర్భం ధరించినప్పుడు- బిడ్డకు సంబంధించిన శక్తిమంతమైన మూలకణాలు(స్టెమ్‌సెల్స్) తల్లి ఎముక మూలగల్లోకి చేరుతున్నాయి. పిండం ఎదిగేటప్పుడు రక్తం చర్మం కండరాలు మెదడు... రూపొందేది ఈ మూలకణాల్లోంచే! వ్యాధులు బాధించినప్పుడల్లా ఈ మూలకణాలు తల్లికి రక్షణ కల్పిస్తూ, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బిడ్డకు సంబంధించిన ఈ సహజ రక్షణవ్యవస్థ- ప్రసవం తరవాత తల్లి మూలగల్లోనే స్థిరపడిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఏభైఏళ్ల తరవాత సైతం ఆ మూలకణాలు చురుగ్గా ఉండటాన్ని లండన్‌లోని హామర్‌స్మిత్, ఇంపీరియల్ కళాశాలల పరిశోధక బృందం గమనించింది. ఇది బిడ్డవల్ల తల్లికి చేకూరే గొప్పమేలు.
మన పెద్దలు కొడుకువల్లే పురుషుడికి పున్నామ నరకం తప్పుతుందన్నారు. అపుత్రస్య గతిర్నాస్తి- పిల్లలు లేకపోతే ఉత్తమ గతుల్లేవన్నారు. పితృరుణం తీరాలంటే పుత్రులు కలగాలని భారతంలో జరత్కారుడి కథ వివరిస్తుంది. పురుషుడే తన భార్యగర్భంలోంచి పుత్రుడిగా జన్మిస్తున్నాడు కనుక తనకంటే వేరుకాడు, నా అన్యః అనే భావనలోంచే 'నాన్న' అనే పదం పుట్టిందని పెద్దల మాట. పిల్లల కోసమే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులకోసమే పిల్లలూ! పిల్లల్ని సుఖంగా పెంచాలని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని పిల్లలూ ఆలోచించాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకున్నంత బాగా పెద్దలు అర్థం చేసుకోవడం లేదని అమెరికాలోని 'చిల్డ్రన్స్ సొసైటీ' పరిశోధకులు భావిస్తున్నారు. 1176 మందితో వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం- తల్లిదండ్రుల్లో 'ఆదర్శమూర్తులు'(రోల్‌మోడల్స్) క్రమంగా తగ్గిపోతున్నారు. వారిలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. పిల్లలు గొప్పవారయ్యేందుకు కావలసిన స్ఫూర్తినీ ఉత్తేజాన్నీ తల్లిదండ్రులు తమ పిల్లల్లో రగిలించలేకపోతున్నారు. వారి వ్యక్తిగత బలహీనతలు, పరస్పరం ఆధిక్యతా ప్రదర్శనలు, నిరంతరం కీచులాటలు, చివికిపోతున్న బాంధవ్యాలు, చీలిపోతున్న బంధాలు, కూలిపోతున్న కాపురాలు, పతనమవుతున్న విలువలు, పరిహసిస్తున్న కుటుంబ వ్యవస్థలు... పిల్లల్ని కలవరపెడుతున్నాయి. కఠోపనిషత్తులో వాజస్రవసుని చేష్టలను నిరసించిన అతని కొడుకు నచికేతుని మాదిరిగా- పిల్లలు తమ తల్లిదండ్రుల దుశ్చర్యలను, దిగజారుడుతనాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశోధక బృందం నాయకుడు బాబ్ రీటిమియర్- పిల్లలు మెచ్చేట్టుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలని అభిప్రాయపడుతున్నారు. అమృతత్వాన్ని సిద్ధింపజేసే 'నచికేతాగ్ని విద్య' సాధించిన నచికేతుని మాదిరిగా- లోకంలో సుఖసంతోషాలతో కూడిన చక్కని కుటుంబ వ్యవస్థను ఆ పిల్లలు సాధించగలరని ఆశిద్దాం!
(ఈనాడు,సంపాదకీయం,06:06:2008)
_______________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home