My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, June 16, 2008

అక్షరాగ్ని గిరిశిఖరం

16:06:2008 శ్రీశ్రీ 25వ వర్ధంతి
- రావూరి ప్రసాద్‌
... శ్రీశ్రీ- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు...

ఒక మేరునగం గురించి ఓ గులకరాయి ఏం పలకగలదు? ఒక అగ్నిపర్వతాన్ని ఓ ధూళికణం ఏమని వర్ణించగలదు? ఒక మహాసముద్రం గురించి ఓ నీటి బిందువు ఏం మాట్లాడగలదు? ఇవాళ శ్రీశ్రీ గురించి కొత్తగా ఎవరు మాత్రం ఏం రాయగలరు?

వెంటనే- 'మరల ఇదేల రామాయణంబన్నచో నా దైన భక్తి నాది గాన' అన్న విశ్వనాథవారి ఉవాచను గుర్తుకు తెచ్చుకుని- 'మాదైన ప్రేమ మాది గాన' అని సగర్వంగా శ్రీశ్రీ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే, రావిశాస్త్రి అన్నట్లు 'శ్రీశ్రీగారు మా మహాకవి. ఆయనంటే మాకు ఎంతో ఇష్టం. ఎంతో గొప్ప. మాకు చాలా గర్వం!'

పాతికేళ్ల క్రితం ఇదే రోజున తన 74వ ఏట కనుమూసిన యువకుడు శ్రీశ్రీని ఇవాళ తలచుకోవడం అందుకే. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఎవరూ ఏమీ మిగిల్చి ఉండక పోవచ్చు. కానీ-

'ఇలా వచ్చావేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?...
ఏది రాసినా ఏం లాభం?
ఇదివరకెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నా కన్నా
బాగానే అని వుండొచ్చు'- అన్న శ్రీశ్రీ కూడా 'వెన్నెల పేరెత్తితేచాలు... వెర్రెత్తి పోతుంది మనస్సు' అంటూ 'శరచ్చంద్రిక' గీతాన్ని వెలయించాడు. అలాగే- శ్రీశ్రీ గురించి ఇంతకుముందు చెప్పినవాళ్లు అందరి కన్నా బాగానే చెప్పి ఉండవచ్చు. అయినా మహాకవి పేరు తలుచుకుంటే చాలు... మన మనస్సులూ వెర్రిత్తిపోతాయి. ఆ రెండు అక్షరాలు హృద్రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి.'స్మరిస్తే పద్యమై, అరిస్తే వాద్యమ'య్యే ఆ శబ్ద విపంచి వినిపించే భాస్వరస్వరాలు హృదయాన్నంతటినీ రసమయం చేస్తాయి. శ్రీశ్రీ అంటే నిప్పులు విరజిమ్మే రెండు అక్షరాగ్ని పర్వతాలు... కాంతులు వెదజల్లే రెండు కవితానల ఖడ్గాలు! నవ్య చేతనార్చి- ఒక శ్రీ... నిత్య జాగృతాగ్ని మరో శ్రీ. వెరసి శ్రీశ్రీ అనే రెండు అక్షరాలు వాగ్దేవి కర్ణాభరణాలై ధగద్ధగాయమానంగా వెలుగులీనే రెండు జ్వాలావలయాలు!!

ఈ సమాజ సమరాంగణంలో- అణగారిన ఆర్తజనుల పక్షాన తన అక్షర అక్షౌహిణులను మోహరించిన సారస్వత మహాసేనాని శ్రీశ్రీ.

అతడు- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు.

''ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది ఏం చేస్తోంది?'' అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం- అన్నాడు ఒకప్పుడు చెలం. అవును. కవిత్వంలో విద్యుత్‌తేజాన్ని వికసింపజేసిన తన అక్షరశక్తినంతటినీ పతితులకోసం, భ్రష్టులకోసం, బాధా సర్పదష్టులకోసం వెచ్చించిన తెలుగు శబ్ద విరించి శ్రీశ్రీ. దగాపడిన తమ్ముల, కూడు లేని భిక్షుల, గూడులేని పక్షుల, దిక్కులేని దీనుల, హీనుల బాధల్ని గాధల్ని కష్టాల్ని కన్నీళ్లను పాటలుగా కట్టి తెలుగు కవిత్వాన్ని 'భూమార్గం పట్టించాడు, భూకంపం పుట్టించాడు.'

అప్పటిదాకా తనను నడిపిస్తూ వచ్చిన కవిత్వాన్ని ఆ తరవాతి నుంచి తాను నడిపిస్తూ వస్తున్నానని అంటూ 'ఈ శతాబ్దం నాది' అని చాటుకున్న అల్పసంతోషి శ్రీశ్రీ. ఆ శతాబ్దమే కాదు, కవిత్వపరంగా రానున్న శతాబ్దాలూ శ్రీశ్రీవే. ఎందుకంటే, 'అర నిమిషం గడిచేసరికల్లా అదే నాకు గత శతాబ్ది' అన్నదీ ఆయనే. తనదిగా ఆయన చెప్పుకొన్న శతాబ్దంలో ఎన్ని అర నిమిషాలు గడచిపోయి ఉంటాయో లెక్క వేసుకొంటే- ఎన్ని శతాబ్దాల పాటు శ్రీశ్రీ అక్షర'సరస్వతి' సంతకం చెక్కు చెదరదో అర్థం చేసుకోవచ్చు.

''శ్రీశ్రీ పేరు తలుచుకుంటే చాలు/ వాగ్దేవి ఆలయప్రాంగణంలో అక్షర మహోత్సవం కళ్లారా చూడవచ్చు/ రానున్న సూర్యోదయాలపై కూడా శ్రీశ్రీ సంతకం చేస్తున్న సన్నివేశం చూడవచ్చు''నంటూ మహాకవికి అజంతా అర్పించిన నివాళి అక్షరసత్యం.

శ్రీశ్రీ నిర్మించిన అక్షర దుర్గం జనం కోసం! అధర్మనిధనానికై అతడు సృష్టించిన అక్షర ఖడ్గం జనం కోసం! 'మనుష్య సంగీతాన్ని మీటుతూ, మానవ సందేశాన్ని చాటుతూ, కష్టజీవికి ఇరువైపులా నిలిచి' అతడు కవిత్వీకరించిన అక్షర సముచ్ఛయం జనంకోసం! 'మాటలచేత మాట్లాడిస్తూ, రక్తం చేత రాగాలాపన చేయిస్తూ' అధోజగత్‌ సహోదరులకు బాసటగా అతడు ఆవాహన చేసి ప్రతిష్ఠించిన ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి పద్యం, ప్రతి పాట జనం కోసమే!

తమ కోసం తెలుగు సాహిత్యానికి కొత్త రూపు కల్పించి, కొత్త చూపునిచ్చి, కొత్త రక్తం ఎక్కించి కొత్త దారుల్లో నడిపించిన శ్రీశ్రీకి తెలుగువాళ్లు ఇవాళ చూపిస్తున్న చోటెక్కడ? జయంతులు, వర్ధంతుల సందర్భంగా సంస్మరణ సభలూ సమావేశాలు నిర్వహించో, శిలావిగ్రహానికి పూలమాలలు వేసో, చేతులు దులిపేసుకోవడమేనా మన మహాకవి పట్ల మనం చూపించే కృతజ్ఞత? మనం అర్పించే నివాళి?

శ్రీశ్రీ మన జాతి కవి. తాను యావదాంధ్ర జాతికీ చెందిన కవినని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొన్నారు కూడా. ఆయన అభిమానుల్ని, కొన్ని సంస్థలను మినహాయిస్తే- 'తనవాడు' అని తెలుగు జాతి సగర్వంగా చెప్పుకోవలసిన శ్రీశ్రీకి ప్రభుత్వపరంగా మన్నన దక్కకపోవడానికి రాజకీయాలే కారణమైతే- అది పాలకుల సంస్కార రాహిత్యం; సాంస్కృతికంగా దివాలాకోరుతనం! అయినా- ప్రజల కవిగా అజరామర కీర్తినార్జించుకున్న ఆయనకు ప్రభుత్వ భుజకీర్తులు అనవసరమే.

వ్యక్తిగా తాను అశాశ్వతమని, తన సాహిత్యం ఎప్పటికీ నిలుస్తుందన్నది- తనలోని వ్యక్తిగత లోపాలను విమర్శించేవారికి ఆయన జవాబు. కవిగా ఆయన మహోన్నతుడు, మరణం లేనివాడు. తెలుగువాడి జీవనాడి! శ్రీశ్రీ ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా తన అక్షరాల రూపేణా చిరంజీవే. రావిశాస్త్రి మాటల్లో చెప్పాలంటే- ''భారత జాతికీ, ప్రపంచ సాహిత్యానికీ ఈతడు తెలుగువారిచ్చిన వెలుగుకానుక. తెలుగు భాష ఉన్నంత కాలం ఈయన ఉంటారు. తెలుగుభాష మాసిపోతే, ఈయన మిగతా భాషల్లో ఉంటారు. ఈ ప్రపంచంలో మానవుల మనుగడ ఉన్నంతకాలం ఈయన ఉంటారు. మానవుడు మరో ప్రపంచాన్నీ, మరి కొన్ని లోకాల్నీ వెతుక్కు వెళ్తే శ్రీశ్రీ గారు వారితోపాటు అక్కడ కూడా ఉంటారు. అవును! శ్రీశ్రీ మహాకవి! మహా మనీషి!''

తాను సృష్టించుకున్న మరో ప్రపంచంలోకి శ్రీశ్రీ మహాభినిష్క్రమణం చేసిన రోజిది.
''...యుగ సంగీతాన్ని

లక్షనక్షత్రాలుగా వెలిగించాడు
శతకోటి జలపాతాలుగా నినదించాడు
'శ్రీశ్రీ చనిపోయాడ'ని అనకండి
ఒక మహాకవి అమరత్వం అతనిది!''- అంటూ కవి శివసాగర్‌ శ్రీశ్రీకి ఘటించిన కవితాంజలి స్మరణీయం.

నిజమే. శ్రీశ్రీ లేడని అనకండి. అతను చనిపోలేదు... కవిత చవిపోలేదు.

శ్రీశ్రీ-
అధునాతన భారతాన
అనల'గీత'కాద్యుడు
ఎన్ని యుగాలైనా
ఎప్పటికీ ఆరాధ్యుడు!
(eenadu,16:06:2008)
____________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home