My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 13, 2008

వలపు...గెలుపు

'మనిషి పూర్తిగా దాచిపెట్టలేని విషయాలు రెండు... ఒకటి తాగానన్న నిజం, రెండోది వలపులో కూరుకున్న విషయం' అన్నాడొక ఆంగ్ల రచయిత. ఆ రెండింటి కారణంగా దేహభాషలో వచ్చే మార్పులు ఆ మనిషిని దొరికిపోయేలా చేస్తాయి. వలపనేది మనసులోకి చొరబడగానే శరీరంలో మొదలయ్యే రసాయనిక చర్యలు ఇన్నీ అన్నీ కావు. నిన్నటిదాకా చాలా మామూలుగా కనబడిన ప్రపంచం సరికొత్తగా దర్శనమిస్తుంది. ఉన్నట్టుండి కవిత్వం పుట్టుకురావడం, దేహానికి రెక్కలొచ్చినట్లుండటం, తాను ఈ ప్రపంచాన్ని జయించినట్లనిపించడం... ఒకటేమిటి- నలుపు, తెలుపు జీవితపు బొమ్మ ఒక్కసారిగా సప్తవర్ణశోభిత ఇంద్రచాపంగా మారిపోతుంది. 'ఆమె రాకతో నా జీవితానికొక అర్థం తోచింది' వంటి గంభీర ప్రకటనలు వెలువడతాయి. 'రాసోరింటికైన రంగుదెచ్చేపిల్ల... నా సొమ్ము నా గుండె నమిలిమింగిన పిల్ల... ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌' అనిపిస్తుంది. లోకులకు ఆ తీరు ఒకోసారి మరీ విడ్డూరంగా తోచి 'తా వలచింది రంభ, తా మునిగింది గంగ... ఎవరి వెర్రి వారికానందం' అనుకుంటారు. వలపు చాలా సందర్భాల్లో ఒకవైపునుంచే సతాయిస్తుంది. రెండోవైపు పాకడానికి సమయం తీసుకుంటుంది. ఈలోగా ఆగలేక నాయకుడు 'వెలిగించవే చిన్ని వలపు దీపం... ఎందుకే నామీద ఇంతకోపం...' అంటూ ప్రాధేయపడతాడు. వలపు తొందరచేసేసరికి ప్రవరుని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే వరూధిని 'ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లుపొంగార, పై అంచుల్‌ మోవగ కౌగలించి...' అధరం ఆనించబోయింది. ఆమె జోరుకు కంగారుపడిన ప్రవరుడు 'హా... శ్రీహరీ' అంటూ పారిపోయాడు. తమలపాకుల షాపులో కూర్చున్న తరుణిని చూడగానే శ్రీనాథుడి మనసు ఇదైపోయింది. నీకిదేం ధర్మమయ్యా అని నలుగురూ నిలదీస్తే- శంకరుడంతటివాడు లింగరూపంలో ఆమె వక్షంపై స్థిరపడగాలేంది- 'తొలకరి మించుతీవగతి దోప దుకాణముమీదనున్న ఆ అలికులవేణితో తమలపాకుల బేరములాడబోయి నే వలచుటకేమి?' అని దబాయించాడు.

ఈ చిలిపి సరదాలకేంగాని, నిజమైన వలపులోని ఉదాత్తత ఎదుటి మనిషిని తప్పక ఆకర్షిస్తుంది. 'నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆన!' అని రుక్మిణి ఒట్టేసి, నాన(సిగ్గు) విడిచి సందేశం పంపింది. దానికి కృష్ణుడు ముగ్ధుడై వెంటనే 'వచ్చెద విదర్భ భూమికి... చొచ్చెద భీష్మకుని పురము... సురుచిర లీలన్‌ తెచ్చెద బాలన్‌ వ్రేల్మిడి...'అని ప్రకటించాడు. 'కన్నియమీద నా వలపు గాఢము' అని కూడా స్పష్టంచేశాడు. ఆ జంటను లోకమూ హర్షించింది. 'తగునీ చక్రి విదర్భరాజ సుతకున్‌, తథ్యంబు! వైదర్భియుం తగునీ చక్రికి! ఇంత మంచిదగునే దాంపత్యము! ఈ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నేర్పరికదా!' అని ప్రజలు ప్రశంసించారు. అలాగే, సీతారాముల వలపులోని ఉదాత్తతను పెద్దలు నీలీరాగంగా అభివర్ణించారు. 'ఇది వలపొ, జన్మజన్మాల అదుము సౌహృదమ్మొ... లోని ఆత్మల పిల్పు దాచుకున్న పుణ్యమో' అని సంభ్రమానికి లోనయ్యారు బాలగంగాధర తిలక్‌. కులీనత కారణంగా వలపునకు ఉదాత్తత, హుందాతనం జతపడతాయి. 'నేను సజ్జనుడను, నా మనసు ఆర్యము' అన్నాడు దుష్యంతుడు. అది కులీనత లక్షణం. 'యోగ్యురాలు కాని ఒక కన్యపై నా మనసు లగ్నం కావడం అసంభవం! ఈ శకుంతలపై నాకు గాఢమైన అనురాగం ఏర్పడుతోందీ అంటే- ఈమె తప్పక నేను చేపట్టదగ్గ కన్య అయితీరాలి!' అన్నాడు. అలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు 'అంతఃకరణ ప్రవృత్తయః ప్రమాణమ్‌' అనికూడా దుష్యంతుడు స్పష్టంచేశాడు. అంతఃకరణ అంత స్వచ్ఛంగా ఉండటమనేది కులీనతకు తిరుగులేని గుర్తు. అది కులంతో రాదు, గుణంతో వస్తుంది. సంస్కారంతో పెరుగుతుంది. వ్యక్తిత్వంగా స్థిరపడుతుంది. ప్రవర్తనగా వ్యక్తమవుతుంది. అలాంటివారి వలపు చాలా హుందాగా ఉంటుంది. గౌరవానికి నోచుకుంటుంది.

మగువల మనసు గెలుచుకునే మార్గం అదే అంటున్నారు- 'బిల్డింగ్‌ ఏ బెటర్‌ బ్లాక్‌' రచయిత శామ్‌ డి బ్రిటో. 'అమ్మాయిలను ఆకర్షించడమెలా' అనే అంశంపై బ్రిటో రాసిన ఈ తాజా గ్రంథం ఆస్ట్రేలియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. 'జల్సారాయుళ్లుగా మారడమెలా అన్నదికాదు- మగవారు ఆత్మగౌరవాన్ని పెంచుకోవడమెలా, మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడం ఎలాగనేదే నేను ప్రధానంగా చర్చించాను. ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే విషయాలపై చిన్నతనంలో అమ్మ నేర్పించిన సంగతులు ఎన్నడూ మర్చిపోవద్దు. హుందాగా నడుచుకోండి, గౌరవంగా బతకండి, ఉదాత్తతను అలవరచుకోండి. వాటివల్లనే మగువలు మగవారిపట్ల ఆకర్షితులవుతారు. మంచి జీవితమే మంచి ప్రేమను ఇస్తుంది- అని బ్రిటో బల్లగుద్ది వాదిస్తున్నారు. శారీరక దుర్గంధం, చేతిగోళ్లు పెరగడం వంటి విషయాలపై దృష్టిపెడుతూనే... మగవారు తమ వ్యక్తిగత ప్రవర్తనలో ఉదాత్తతను పెంపొందించుకోవాలని, ముఖ్యంగా జీవితంపట్ల పూర్తి ఆసక్తిని చూపించాలని ఆయన యువతకు సలహా ఇస్తున్నారు. మనిషి అలవాట్లలోంచి అతని వ్యక్తిత్వం తొంగి చూస్తుంది- అని ప్రముఖ మనో వికాస నిపుణుడు స్టీఫెన్‌ కొవె చెప్పిన మాటలు మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మంచి వ్యక్తిత్వం గలవారికి వలపులో విజయం లభిస్తుందని బ్రిటో ప్రతిపాదన. సంగీతం వినడానికి చెవి కావాలి. సువాసన గ్రహించడానికి ముక్కు కావాలి. మాధుర్యం రుచి తెలియడానికి నాలుక కావాలి. సౌందర్యాన్ని దర్శించడానికి కన్ను కావాలి... ఇంతవరకే మనం అనుకునేవాళ్లం. వలపు గెలుచుకునేందుకు మంచి వ్యక్తిత్వం అవసరం అనే మరో వాక్యం దానికి జతచేసుకోవాలని బ్రిటో గుర్తు చేస్తున్నారు!
(ఈనాడు, సంపాదకీయం, 07:09:2008)
_______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home