My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, January 22, 2009

అంతర్జాలంలో (ఇంటర్నెట్‌) తెలుగు

- నల్లమోతు శ్రీధర్
sridharcera@gmail.com


ఇంటర్నెట్‌ - అంతర్జాలం
యూజర్‌నేమ్‌ - సభ్యనామం
పాస్‌వర్డ్‌ - సంకేతపదం
లాగిన్‌ - లోనికి ప్రవేశించండి
రిజిస్టర్‌- ఖాతాని సృష్టించుకోండి

ఏంటివీ అనుకుంటున్నారా? తేనెలూరే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిన తరుణంలో ఆన్‌లైన్‌లోనూ తెలుగోడు తలెత్తుకుని తిరిగేలా ఆన్‌లైన్‌ పదాలకిచ్చిన అచ్చ తెలుగు పదజాలం. ఇంటర్నెట్‌, కంప్యూటర్ల వినియోగంలో మన భాషను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓ ఉద్యమం ఊపిరి పోసుకుంది. అదే
e-తెలుగు స్వచ్ఛంద సంస్థ. రెండేళ్లుగా అంతర్జాలంలో (ఇంటర్నెట్‌) తెలుగు వ్యాప్తికి కృషి చేస్తూ 2008, ఏప్రిల్‌ 24న అధికారికంగా రూపుదిద్దుకుంది. దేశవిదేశాల్లో 200ల మందికి పైగా సభ్యులు ఈ-తెలుగు వ్యాప్తికి పని చేస్తున్నారు.

అంతా మీ సేవకే...
ఎలాంటి సాఫ్ట్‌వేర్‌లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగానే మెయిల్స్‌, ఛాటింగ్‌, బ్లాగుల్లో తెలుగును టైప్‌ చేయడం, పీసీీ అప్లికేషన్లలోనూ తెలుగును వాడుకలోకి తేవడం... లాంటి విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ సంస్థ అందిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఉద్యోగ సంఘాల సమూహాలకు తెలుగు వాడకంపై శిక్షణనివ్వడం లాంటి కార్యకలాపాల్ని చేపడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, పత్రికా రంగంవారు, లాయర్లు, గృహిణులు... ఇలా ఎన్నో రంగాలకు చెందినవారు కేవలం మాతృభాషపై ఉన్న అభిమానంతో ఈ-తెలుగు అభివృద్ధికి చేయిచేయి కలిపి ముందుకొస్తున్నారు.

మీరూ భుజం కలపాలంటే
తెలుగు భాషపై మమకారంతో సహకారం అందించాలనుకునే వారెవ్వరైనా దీంట్లో భాగస్వాములు కావచ్చు. ఈ-తెలుగు కార్యకలాపాల్ని తెలుసుకోవాలనుకుంటే
http://etelugu.org/help_center చూడవచ్చు. అదనపు సమాచారాన్ని పొందాలనుకుంటే president@etelugu.org మెయిల్‌ అడ్రస్‌కు మెయిల్‌ పంపవచ్చు.

తెలుగులోనే టైప్‌ చేద్దాం!
కేవలం నెట్‌లో మాత్రమే కాకుండా అన్ని అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లలోనూ తెలుగును ఏ విధంగా పొందొచ్చో తెలియజేయడం ఈ-తెలుగు ప్రధాన లక్ష్యం. లేఖిని, బరహ, అక్షరమాల, ఇన్‌స్క్రిప్ట్‌ లాంటి ఉచిత టూల్స్‌ ద్వారా మెయిల్స్‌, ఛాటింగ్‌, బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆన్‌లైన్‌ ఫోరంలు, గ్రూపుల్లో ఫొనెటిక్‌ పద్ధతిలో (
raamaa అని టైప్‌ చేస్తే రామా వచ్చే మాదిరిగా) తెలుగుని టైప్‌ చేయవచ్చు.
* లేఖినిలో టైప్‌ చేయాలంటే
http://lekhini.org వెళ్లి, సైట్‌లో ఏర్పాటు చేసిన టేబుల్‌ ఆధారంగా తెలుగును టైప్‌ చేయవచ్చు. తర్వాత మీ సందేశాన్ని కాపీ చేసి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పేస్ట్‌ చేసుకోవచ్చు.
* బరహ కావాలనుకుంటే
http://baraha.com/download/baraha70.exe డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేయండి. దీంతో డెస్క్‌టాప్‌పై వచ్చిన Baraha Direct అనే లింక్‌పై క్లిక్‌ చేసి రన్‌ చేయండి. అప్పుడు సిస్టం ట్రేలో Kn అని చూపిస్తూ కన్నడ భాష డీఫాల్ట్‌గా సెలెక్ట్‌ అయి ఉంటుంది. రైట్‌ క్లిక్‌ చేసి Language-> Telugu-> Unicode ఎంచుకుని తెలుగులోకి మార్చండి. అంతే... వర్డ్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌, ఫైర్‌ఫాక్స్‌... లాంటి ఏ విండోస్‌ అప్లికేషన్‌లో అయినా ఫొనెటిక్‌ పద్ధతిలో తెలుగులో టైప్‌ చేయవచ్చు. ఆంగ్లం నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఆంగ్లంలోకి మారాలంటే ఫ్11 ఫంక్షన్‌ కీని ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.
* ఇప్పటికే యాపిల్‌, మాడ్యులర్‌... లాంటి టైపింగ్‌ పద్ధతులకు అలవాటైన వారి కోసం ప్రత్యేక సెట్‌అప్‌ ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుంది. దీంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండానే అలవాటైన కీబోర్డ్‌ ఫార్మెట్‌లోనే తెలుగును టక టక టైప్‌ చేసేయొచ్చు. అందుకోసం ముందుగా జిప్‌ ఫార్మట్‌లోని సెట్‌అప్‌ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని అన్‌జిప్‌ చేయండి. వచ్చిన ఫోల్డర్‌లోని
Setup.exe ఫైల్‌పై డబుల్‌ క్లిక్‌ చేసి Install the Keyboard layout ను ఎంచుకోండి. దీంతో యాపిల్‌ లేదా మాడ్యులర్‌ యునీకోడ్‌ లేఅవుట్‌ పూర్తవుతుంది. ఇప్పుడు సిస్టం ట్రేలోని Language Barలో En, Te అని రెండు ఆప్షన్లు వస్తాయి. తెలుగులో టైప్‌ చేయాలనుకుంటే Te ని, ఆంగ్లంలో టైప్‌ చేయాలనుకుంటే En ను టైప్‌ ఎంచుకోవాలి. ప్రతిసారీ ఇలా మౌస్‌తో భాషను మార్చుకోవడం ఇబ్బందనిపిస్తే Shift+Alt కలిపి ప్రెస్‌ చేయడం ద్వారా చేయవచ్చు.
* యాపిల్‌ సెట్‌అప్‌ ఫైల్‌ కోసం
http://veeven.com/files/te_apple.zip, మాడ్యులర్‌ సెట్‌అప్‌ ఫైల్‌ కోసంhttp://veeven.com/files/te_mdir.zip చూడండి.

వికీపీడియాలో మీ వూరు
'పచ్చని పైరుటగాలి... పెద్ద చెరువు... పక్కనే వూరికి కాపలాగా నిలువెత్తు హనుమంతుడు... రాజరికం నాటి కోట...' ఇలా మీ వూరు ప్రత్యేకతను అచ్చ తెలుగులో అంతర్జాలంలో పొందుపరచాలని ఉందా? అయితే వెంటనే 'తెలుగు వికీపీడియా'లోకి దూకండి. ఇందుకోసం
www.te.wikipedia.org సైట్‌లోకి వెళ్ళి 'మీ వూరు ఉందా?' లింక్‌పై క్లిక్‌ చేసి ఆయా జిల్లాల నుంచి వూరును ఎంచుకోండి. చివరగా మీ వూరుతో వచ్చిన విండోలో ఉన్న 'మార్చు'పై క్లిక్‌ చేసి సమాచారాన్ని పొందుపరచవచ్చు. ఇలా ఏ సమాచారాన్నయినా పొందుపరచవచ్చు.

మాతృభాషలోనే బ్లాగ్‌...
మనస్సులోని వూసులకు కమ్మని తెలుగు భాషలోనే అక్షర రూపాన్నిస్తూ అందరితో పంచుకునేలా
Blogger, wordpress, లాంటి తెలుగు బ్లాగ్‌ సర్వీస్‌లు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ మంది ఎంచుకునేది గూగుల్‌వారి బ్లాగర్‌ సర్వీస్‌. ఇప్పటికే మీరు జీమెయిల్‌ ఎకౌంట్‌ ఉన్నట్లయితే www.blogger.com వెళ్లి ఈ-మెయిల్‌ ఐడీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్‌ అవ్వండి. వచ్చిన విండోలోని ((Create Your Blog Now)పై క్లిక్‌ చేసి వచ్చే విండోలో బ్లాగ్‌ టైటిల్‌, బ్లాగ్‌ అడ్రస్‌లను ఇవ్వండి. తర్వాత Continue బటన్‌ను ఎంచుకుని Choose a templete ద్వారా మీ బ్లాగ్‌కు ఒక రూపాన్ని ఏర్పాటు చేయవచ్చు. టెంప్లెట్‌ను ఎంచుకున్న తర్వాత కంటిన్యూపై క్లిక్‌ చేయగానే Your Blog has been Created... Start Blogging వస్తుంది. అంటే మీ బ్లాగ్‌ని రూపొందించే ప్రక్రియ పూర్తయ్యిందన్నమాట. ఇక పోస్టింగ్‌ల ద్వారా మీ మనసులోని బాసల్ని తెలుగు బ్లాగ్‌తో ప్రపంచానికి తెలియజేయవచ్చు.

ప్రస్థానం ఇలా...
'పద్మ' అనే పేరుతో ప్రత్యేక ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ ద్వారా మొట్టమొదటిసారి తెలుగు అంతర్జాలంలో అడుగుపెట్టింది. అమెరికాలోని బోస్టన్‌ నగరంలో ఉంటున్న సమాచార సాంకేతిక నిపుణుడు వెన్నా నాగార్జున ఫొనొటిక్‌ పద్ధతిలో దీన్ని రూపొందించారు. డిసెంబర్‌ 9, 2003న సేచ్ఛా విజ్ఞాన సర్వస్వం 'తెలుగు వికీపీడియా'ని ప్రారంభించారు. మొత్తం 8,105 మంది సభ్యులు దీంట్లో రిజిస్టర్‌ అయ్యి 41,000 వ్యాసాలను పొందుపరిచి భారతీయ భాషల్లోనే తెలుగు వికీపీడియాను అగ్రస్థానంలో నిలిపారు. దీంట్లో 156 మంది సభ్యులు క్రియాశీలంగా పనిచేస్తున్నారు.

మరి తొలి తెలుగు బ్లాగ్‌ ఎప్పుడు మొదలైందో తెలుసా?
2004, మేలో 'కృష్ణదాస కవిరాజు' పేరిట చావా కిరణ్‌ తెలుగు బ్లాగును పరిచయం చేశారు. అప్పటి నుంచి తెలుగువారి ఆకర్షిస్తూ వీటి సంఖ్య సుమారు 1500లకు చేరింది.
____________________________________
సందేహాలకు ఇవీ దారులు!
కంప్యూటర్‌లో తెలుగు అక్షరాలు విడిపోయి కనిపించడం, తెలుగు ఎలా టైప్‌ చేయాలో తెలియకపోవడం లాంటి ప్రాధమిక సాంకేతిక మెళకువలకు ఎ-తెలుగు వెబ్‌సైట్‌లోని హెల్ప్‌సెంటర్‌ పేజీలో చూడొచ్చు. ఈ-తెలుగు కోసం
http://etelugu.org, చాటింగ్‌ ద్వారా పరిష్కారాలకు http://computerera.co.in/chat, తెలుగు వికీపీడియాకిhttp://te.wikipedia.org, తెలుగు బ్లాగ్‌ కోసంhttp://groups.google.com/group/telugublog, బ్లాగుల కూడలికి http://koodali.org లను చూడండి.
______________________________________

(Eenadu, 22:01:2009)
_______________________________________

Labels:

1 Comments:

Blogger Unknown said...

నారాయణరావు గారు, ఈనాడులోని వ్యాసాన్ని మీ సంకలనంలో చేర్చినందుకు ధన్యవాదాలండీ.

3:56 pm

 

Post a Comment

<< Home