వందేళ్ల అడుగుజాడ!
గురజాడ అప్పారావుగారి 'దేశమును ప్రేమించుమన్నా' దేశభక్తి గేయానికి వందేళ్ల పండగ! వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిగా ఆ గేయాన్ని ఆలపించాల్సిన సమయం వచ్చింది.
వందేళ్ల క్రితం మన తాతో ముత్తాతో ఓ విత్తునాటుంటే, ఇప్పటికది వూడలమర్రంత విస్తరించి ఉంటుంది. అది వేపచెట్టయితే... ఎంతమందిని నిద్రపుచ్చిందో. అది పూలచెట్టయితే... ఎన్ని దండలు కట్టిందో. అది పండ్లచెట్టయితే... ఎన్ని నోళ్లలో అమృతం పోసిందో. అది అక్షరాల చెట్టయితే మాత్రం, ఆ విత్తునాటిన తాతగారు కచ్చితంగా గురజాడవారై ఉంటారు. 'ముత్యాల సరాల్లోంచి' సర్రున జారొచ్చిన ఆ ముత్తెమంత విత్తు...వెులకై, వెుక్కై, చెట్త్టె, మహావృక్షమైంది. ఎన్నో మెదళ్లలో ఆలోచనలు నింపింది. ప్రపంచ మానవుల జాతీయ గీతంగా శ్రీశ్రీ మన్ననలందుకున్న గురజాడవారి 'దేశభక్తి' గేయానికి ఇది శతాబ్ది సంవత్సరం. ఆయన 1910లో రాశారీ గేయాన్ని. ఈ ప్రకారం చూస్తే, 2009 ప్రారంభం నుంచే వందేళ్ల పండగ వెుదలుకావాలి. ప్రభుత్వమూ స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజలందరూ పూనుకొని 'దేశభక్తిగేయం' శతవార్షికోత్సవానికి ఏర్పాట్లు చేయాలి.
గేయమును ప్రేమించుమన్నా...
వందేమాతరం వందనాలు అందుకుంటున్నప్పుడు, జనగణమన గణగణమని మారువోగుతున్నప్పుడు... గురజాడవారి దేశభక్తిగేయం మాత్రం పాతపుస్తకాల మధ్య పాట్లుపడటమెందుకని ప్రశ్నిస్తున్నారు కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ప్రతినిధులు. ''భారతదేశంలో చాలా జాతీయగీతాలొచ్చాయి. వాటిలో దేనికీ అప్పారావుగారి గీతంలోని భావగాంభీర్యం లేదు. బంకించంద్రుని 'వందేమాతరం' కానీ రవీంద్రుని 'జనగణమన' కానీ, ఇక్బాల్ 'హిందుస్థాన్ హమారా' కానీ 'దేశమును ప్రేమించుమన్నా...' గీతానికి ఏమాత్రం సరితూగవు'' అంటారు మద్దుకూరి చంద్రశేఖరరావు తన 'చంద్రం వ్యాసావళి'లో. వందేమాతర గీతం మీద చాలా విమర్శలొచ్చాయి. అందులో 'విగ్రహారాధన' కనబడుతోందని మహ్మద్ ఆలీ జిన్నా లాంటివారు నిరసించారు. జనగణమన మీదా ఏవో అభ్యంతరాలొచ్చాయి. కానీ 'దేశభక్తి' గేయం మాత్రం విమర్శలకు అందనంత గొప్ప స్థాయిలో ఉందని గురజాడ అభిమానుల అభిప్రాయం. 'పెద్ద కొండలు, నదులు, వృక్షాలు...ఇవా ప్రజలకు ధైర్యసాహసాలూ ఉత్తేజం కలిగించేవి? అన్ని కాలాల్లోనూ ఇవన్నీ స్థిరంగా ఉండేవే. ఒక్కో యుగంలో ఒక్కో జాతి ప్రజలు ఆయా ప్రదేశాల్లో ఉంటారు. వారిలో మహానుభావులు, వారి గుణగణాలు, జాతి జీవితం... ఇవే వర్ణనీయమైనవి, ప్రజల్లో చైతన్యం కలిగించేవి' అని సాక్షాత్తు గురజాడవారే బంకించంద్రుని గీతాన్ని ఆక్షేపించారని ఓ ప్రచారం. ఒక్క గురజాడవారి రచన తప్ప, ఏ దేశభక్తి గేయమూ 'ఆచరణకు' ప్రాధాన్యం ఇవ్వలేదు. మహాకవి స్వాతంత్య్ర పోరాటంలోనే కాదు, స్వతంత్రం వచ్చాకా ఎలా మెలగాలన్నది చెప్పారు. 'జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి' అనడంలో స్వావలంబన ఆవశ్యకత ధ్వనిస్తోంది. 'సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచిన నాడే సామాజిక అభ్యుదయమనీ, లేకపోతే ఎంత ప్రకృతి సంపద ఉన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం నెరవేరదని మహాకవి హెచ్చరించారు. ఇది ఆయన గేయంలోని అంతర్జాతీయ స్వభావం' అంటారు స్వాతంత్య్ర సమరయోధులు పరకాల పట్టాభిరామారావు.
మతం గురించి గురజాడ చెప్పిన మాటలూ వర్తమాన సమాజానికి వర్తించేవే.
'అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి'
... ఎంత గొప్ప మాట. అన్నట్టు...
'మందగించక ముందు అడుగేయి వెనకపడితే వెనకేనోయి' అన్న హెచ్చరికనూ మరచిపోకూడదు.
శ్రీశ్రీ అయితే, 'దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మానవుల జాతీయ గీతం. రామాయణ, భారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికే ఉందంటే కొందరు ఆశ్చర్యం పొందుతారేవో! కాలం గడుస్తున్నకొద్దీ బలం సంతరించుకునే కొద్దిపాటి మహాకావ్యాలలో ఒకటిగా దీన్ని గుర్తించక తప్పదు. ఒక తెలుగు కవి ప్రపంచానికి ఇచ్చిన కానుక ఇది. మానవుని ఆధ్యాత్మిక యాత్రలో భగవద్గీతకు గల ప్రత్యేక స్థానం ఉంది, గురజాడ దేశభక్తి గీతానికి' అంటూ మనసారా కీర్తించారు.
అడుగుజాడ గురజాడదని చెప్పుకోవడం కాదు.
నిజంగానే ఒక్కటై అడుగులేయాల్సిన సమయం వచ్చింది. రండి... కలిసి పాడుకుందాం!
దేశభక్తి గేయం
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయి
గట్టిమేల్ తలపెట్టవోయి!
పాడి పంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి
తిండి కలిగితె కండకలదోయి
కండగలవాడేను మనిషోయి!
యీసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయి!
పూనుస్పర్ధలు విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయి
కత్తివైరం కాల్చవోయి!
దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయి!
స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి!
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి!
మతం వేరైతేను యేవోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి
దేశమనియెుడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయి!
ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయి
పలుకులను విని దేశమం దభి
మానములు వెులకెత్తవలె నోయి!
-గురజాడ అప్పారావు (1910)
(ఈనాడు,౦౮:౦౨:౨౦౦౯)
_______________________
0 Comments:
Post a Comment
<< Home