ఆనందోబ్రహ్మ

ఓ కవి రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. మనసంతా దిగులుగా ఉంది. ఏవేవో ఆలోచనలతో బరువెక్కింది. అంతలో ఒక చిన్ని పాపడు ఆయన దృష్టిని ఆకర్షించాడు. 'బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి...' అనుకున్నాడు. తనవైపు చిట్టిచేతులు ఊపుతూ, బోసినవ్వులు చిందిస్తూ, కేరింతలు కొడుతున్న ఆ పసివాడు అంత నిశ్చింతగా హాయిగా ఎలా ఉన్నాడన్న

ఆలోచన మొదలైంది. ఎంతోసేపు మథనపడ్డాక, 'సతత ఆనంద స్వరూపుడగుట చేసి...' అని తీర్మానించాడు. కాసేపటికి మరో గొప్ప సత్యం ఆయనకు బోధపడింది. పిల్లవాడి ఆనందానికి కారణం వెతికే క్రమంలో- అప్పటివరకు ఆవరించిన దిగులు, విచారం తనలోంచి తొలగిపోయాయని కవి గుర్తించాడు. మనసు తేలిక పడినట్లు, ఒంటరితనం దూరమైనట్లు ఆయనకు అర్థమైంది. సంచీలోంచి డైరీ తీసి ఒక వాక్యం రాసుకున్నాడు. 'ఆనందం ఒక అంటువ్యాధి' అని. తెలుగులో ప్రసిద్ధుడైన ఒక రచయిత సుమారు అయిదొందల పేజీల తన గ్రంథాన్ని 'జీవితం- ప్రకృతి మనకిచ్చిన బహుమతి. సంతృప్తి- మనం ప్రకృతికి ఇచ్చే బహుమతి' అంటూ ముగించారు. వంతెనలకు బదులు గోడలు కట్టుకోవడమే మన అసంతృప్తులకు కారణం అన్నారాయన. ఈ రెండు ఉదాహరణలను శ్రద్ధగా పరిశీలిస్తే- జీవితాల్లోంచి పారిపోతున్న ఆనందపు శాశ్వత చిరునామా మనకు లభ్యమవుతుంది. ఆనందం దొరికినప్పుడు ఈ ప్రపంచమంతా అద్భుతంగా తోస్తుంది. దుఃఖంనుంచి విముక్తి లభిస్తుంది. నిజానికి ఆనందమనేది ఈవేళ ఆడంబరం కానేకాదు- అది ఒక అవసరం! భయంనుంచి, దుఃఖం నుంచి, ఒంటరితనంనుంచి త్వరగా బయటపడటానికి మనిషికి కావలసిన ఇంధనం అది. ఉత్తేజానికి ఉత్ప్రేరకమది. జీవితం అనేది మనిషికి లభించిన కానుక. ఆనందం మనిషి సాధించవలసిన వేడుక!
స్వభావరీత్యా కవి తన డైరీలో తమాషాకి 'ఆనందం ఒక అంటువ్యాధి' అని రాసుకున్నాడుగాని, అందులో అసత్యం ఎంతమాత్రమూ లేదు. అది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు ప్రొఫెసర్ నికొలస్ క్రిస్టకస్. హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన పరిశోధక బృందానికి నాయకుడాయన. 21-70ఏళ్ళ వయసులోని సుమారు అయిదువేలమందిని ముప్ఫయ్యేళ్ళ పాటు సుదీర్ఘంగా పరిశీలించి- ఆ బృందం వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 'ఆనందం ఒక అంటువ్యాధిలాంటిదే. ఆత్మీయులతో పంచుకొనేకొద్దీ చిరు తరంగంలా అది మరింతగా ఎగసిపడుతూనే ఉంటుంది. ఆనందాన్ని ఒంటరిగా ఆస్వాదించడం సాధ్యంకాదు. అది వ్యక్తిగతమైన అనుభూతి ఎంతమాత్రమూ కాదు. ఒక వ్యక్తి ఆనందంలోని మజా- తాను అభిమానించే వ్యక్తుల ఆనందంతో ముడివడి ఉంది' అని ఆ బృందం నిర్ధారించినట్లు లండన్లోని బ్రిటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

అందమైన పరిసరాల మధ్య ఆత్మీయుల అనురాగంతో తడిసి ముద్దయినప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా! దాని పేరే మరి ఆనందం- అని ఆ బృందం సభ్యులు అంటున్నారు. ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు మిత్రులు, సన్నిహితులు, బంధువుల అభినందనలతో ఆ విజేత ఉత్సాహం రెట్టింపవుతుంది. అంటే గెలుపులోని మజాను ఒంటరిగా ఆస్వాదించడం కాదు, తన ఆనందాన్ని పదిమందితో పంచుకోవడం ద్వారా మరింతగా పెంచుకోవచ్చు- అని వారంటున్నారు. అందుకే మనిషి పదిమందితో తన ఆనందాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాడట. అంతేకాదు- ఆనందాన్ని కనుగొన్న మనిషికి సత్ప్రవర్తన, సాయంచేసే గుణం అలవడతాయి. తద్వారా ఇతరుల్లో పరివర్తనకు ఆ వ్యక్తి కారణమవుతాడని ఆ బృందం విశ్లేషించింది. పిల్లవాడు ఏదో ఖరీదైన వస్తువు పగలగొట్టాడని కోపంగా చెయ్యెత్తుతాం. ఆ పసివాడు ఆనందంగా నవ్వుతూ మనకేసి చూసినప్పుడు అంత కోపమూ వెంటనే కరిగిపోయి మనం మంచివాళ్ళుగా మిగిలిపోమూ! అదీ... ఆనందం ప్రభావం!
(ఈనాడు, సంపాదకీయం, 14:12:2009)
________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home