కుసుమ విలాసం...
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే... మదనములకు... అనిఅడిగాడు పోతన. మందార కుసుమ మకరందం రుచి మరిగిన తేనెటీగకు ఉమ్మెత్త జోలికి పోయే పనేముందని దాని అర్థం. ఆ సంగతి బాగా తెలిస్తేపూవు పూవు మీద వాలు పోతు తేనెటీగ వంటిమగవారి మాటలను నమ్మవచ్చునా' అని తనమామను అందరితో కలిపి సందేహించవలసినఅగత్యం ఆ చిన్నదానికి ఏర్పడి ఉండేది కాదు. '... పుప్పొడి కోసం తుమ్మెదలు, పూదేనె కోసం తేనెటీగలు పూలమీద వాలతాయి. శరీర నిర్మాణంలో తేడాలున్నా, వృత్తిరీత్యా ఆ రెండూ ఒకే బాపతు అంటారు కవులు. అందుకే మధుకరం, మధుపం, మధుసూదనం, భ్రమరం, భృంగం, సారంగం, తేటి, సరఘ... వంటి పదాలను కవులు ఉభయత్రా వాడేస్తూ వచ్చారు. స్త్రీల అందమైన కనురెప్పలను తుమ్మెదలతో పోల్చి విస్తారంగావర్ణించారు. సృష్టిలో కందిరీగలున్నాయి... తూనీగలు, తేనెటీగలు ఉన్నాయి తప్ప తుమ్మెదలనేవి లేనేలేవని చాలామందిఅభిప్రాయం. కావ్య మీమాంస కర్త రాజశేఖరుడు చకోరాలను సైతం కవిసమయాల్లోకి జమకట్టాడు. పూలమీద వాలుతూతేనె సేకరించడాన్ని 'సరఘావృత్తి' అంటారు. ఆ చిన్నది నిరసించిందిగాని, పువ్వులకు మాత్రం ఆ చర్య చాలాఇష్టమైనదని రుజువైంది. ఏళ్ల తరబడి దాచిపెట్టుకున్న తన అమూల్య శీలసంపదను, యౌవనసిరిని వరుడికి ఇష్టంగా దోచిపెట్టే నవ వధువులా పువ్వులు సైతం ఆ చోరీని ఇష్టపడతాయి. అంతేకాదు- తమంత తాముగాప్రోత్సహిస్తాయనీ వృక్షశాస్త్రం చెబుతోంది. చిన్నబోయిన దీపం వికసించేందుకై వత్తిని ఎగసందోసినట్లుగా- నిస్తేజంగా ఉండే తేనెటీగలను పువ్వులు కావాలని రెచ్చగొడతాయి. ఆ తరహా కృషిని 'ఉద్దీపన విభావ'మని రసశాస్త్రాలు వర్ణించాయి. విశేష వర్ణాలు, విభిన్న పరిమళాలు ఉద్దీపన కళలో కుసుమాలకు తోడ్పడే సాధనాలు.
ఆ సాధనాల రీత్యా పువ్వుల ఆకర్షణలో అంతరాలు ఏర్పడ్డాయి. కొన్ని పువ్వులు చక్కని రంగులతో ఆకర్షిస్తాయి. మరికొన్ని మధుర పరిమళాలతో ఆకట్టుకుంటాయి. అందులో మళ్లీ సన్నజాజులు, సంపెంగల సువాసన సున్నితంగా ఉంటుంది. 'స్త్రీ ప్రకృతి' అనిపిస్తుంది. మొగలి పొత్తుల పరిమళం గాఢంగా ఉంటుంది. 'పురుష ప్రకృతి'లా తోస్తుంది. ఇదే తేడా రంగుల్లోనూ కనపడుతుంది. 'సావాసం సంపెంగతోను, పొత్తు మొగలిపొత్తుతోను...' అనే సామెత ఆ తేడాల్లోంచే పుట్టింది. సంక్రాంతి రోజుల్లో గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూపడుచు పిల్లలు పాడుకునే 'సుబ్బీ సుబ్బమ్మా... శుభములీయవే.. తామర పూవంటి తమ్ముణ్నీయవే... చేమంతి పూవంటి చెల్లెల్నీయవే... పాటలో చివరి పంక్తి చాలా ముఖ్యం. 'మొగిలీ పువ్వంటీ మొగుణ్నీయవే... అందులో అసలైన అభ్యర్థన. దీనిలో గొప్ప చమత్కారం ఉంది. మొగలి పొత్తులు దేవతార్చనకు పనికిరావు. నా మొగుడు నాకే సొంతం కావాలి, శీలవంతుడు కావాలన్న కన్యల ఆకాంక్షకు కవిత్వరూపమే మొగలి పూలతో పోలిక! సంపెంగ విషయానికి వస్తే- ఏ పూవుకూ లేని ప్రత్యేకత దానిది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు! నానా సూన వితాన వాసనలను ఆనందించు సారంగము ఏలా నన్ను ఒల్లదు... అంటూ సంపెంగలు వాపోయిన వసుచరిత్రలోని పద్యం- నందితిమ్మన ఇంటిపేరును మార్చేసింది. పూచిన సంపెంగ పొలుపు మధుకరములకు దక్కకుండా పోయినట్లు- ప్రవరుడి నైష్ఠికత కారణంగా అతని మకరాంక శశాంక మనోజ్ఞ సౌందర్యం వారకాంతలకు వాడకంలోకి రాకుండా పోయిందన్నాడు- అల్లసాని పెద్దన. పద్మినీ జాతి స్త్రీ పరిష్వంగంలో గుబాళించే ప్రత్యేక సౌరభం మొగలిపొత్తులదే... అంటూ దాని స్థాయిని, కులీనతనూ చాలా ఎత్తులో ఉంచాడు మాఘుడు. దాని రాజసం ఎరిగి కృష్ణదేవరాయలు మొగలిపొత్తును నెత్తిన పెట్టుకున్నాడు. సంపెంగలు, మొగలిపూలు ఆ రకంగా స్త్రీ పురుష శీలాలకు ప్రతీకలు. సహవాసం చేస్తే సంపెంగలాంటి స్త్రీతో సాగించాలి, పొత్తు కలుపుకొంటే మొగలిపూవులాంటి పురుషుడితోనేనన్నది ఆ సామెతలోని అంతరార్థం.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి... సమాశ్రయించు భృంగాలకు విందుచేసెదము కమ్మని తేనెలు... మిముబోంట్లనేత్రాలకు హాయి గూర్తుము... అంటూ కరుణశ్రీ కవితా కుసుమం తమ పాత్రను వివరించింది. పువ్వుల పాత్రఅంతవరకేనని మనిషి అనుకుంటాడు. వాటి సౌందర్యం తన అనుభవంలోనిదేనని, పరిమళాలన్నీ తన ఆస్వాదనకులోబడినవేనని విర్రవీగుతాడు. మానవ నేత్రానికి గోచరించని పుష్పసౌందర్యం ఇంకా ఎంతో ఉందని శాస్త్రజ్ఞులు కొత్తగా కనుగొన్నారు. తేనెటీగలకు మాత్రమే గోచరించే ఎన్నో సౌందర్య విశేషాలను చర్మచక్షువులు, నాసికలుపసిగట్టలేవని వారు విస్పష్టంగా ప్రకటించారు. పైకి తెల్లగా కనిపించే సీడీని ఎండలో ఉంచితే వివిధ వర్ణశోభితమైతళుకులీనినట్లుగా- తేనెటీగలను ఆకర్షించేందుకు పూరేకులు విభిన్న రాగరంజిత వర్ణాలను వెదజల్లుతాయట. అతినీలలోహిత కాంతులతో ప్రకాశిస్తాయి కాబట్టి అవి మనిషి కంటికి కనబడవు. తేనెటీగలకు మాత్రమే గోచరిస్తాయి. ప్రొఫెసర్ బెవర్లీ గ్లోవర్ నేతృత్వంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయన బృందం నిర్వహించినపరిశోధనల్లో ఇలాంటివెన్నో విశేషాలు వెలుగు చూశాయి. ఆహార పంటల నుంచి ఉద్యాన ఉత్పత్తి మొక్కల దాకా దాదాపు అన్నింటా పరాగ, పరపరాగ సంపర్కాలకు కుసుమాలే వేదికలు. వాటిపై వాలి మకరందాన్ని సేకరించేక్రమంలో మధూలిక(పుప్పొడి)ని తరలించడంలోనూ తేనెటీగలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి ఆ తేనెటీగలను స్వాగతిస్తూ ఆకర్షణీయమైన రంగుల ద్వారా పూలు అనుకూల సంకేతాలు ప్రకటిస్తాయంటున్నారు డాక్టర్ గ్లోవర్. సృష్టిలో లేనివాటిని సైతం పుట్టించి కవితా వస్తువులుగా సమకూర్చుకున్నామని గర్వపడే మన కవులు- ఉన్నవాటిని సైతం దర్శించడం తమవల్ల కావడంలేదని తెలిస్తే ఏమంటారో మరి! రవి గాంచనివి, కవి గాంచనివీ కూడా తేనెటీగల కళ్లపడటం సృష్టి విశేషం!
(ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౧:౨౦౦౯)
___________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home