లాస్ ఏంజెలిస్ జయ హో..! జయ హో..! అల్లా రఖా రెహమాన్ జయ హో.. రసూల్ పూకుట్టి జయ హో.. గుల్జార్ జయ హో.. భారత కీర్తిని జగజ్జేయం చేసిన మీ అందరికీ- వంద కోట్ల గొంతుకలు పలుకుతున్నాయ్... జయ హో.. జేజేలహో.. త్రివర్ణ పతాక చేస్తోంది అభినందనల శాల్యూట్!
అద్భుతం.. ఆశ్చర్యం.. విశ్వ మానవాళి 'ఔరా' అని ముక్కున వేలేసుకున్న మహోన్నత ఘట్టం. సినీ వినీలాకాశంలో భారత తారలు తళుకులీనిన సుందర దృశ్యం. మాటల్లో వర్ణించలేని మహానుభూతి. భారతీయులు సాధించారు... అవును నిజంగా సాధించారు. ఇన్నాళ్లూ పాశ్చాత్యుల పేటెంట్‌లా మారిన అకాడెమీ అవార్డు(ఆస్కార్)ల్ని సాధించి భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు.
భారత సంగీత స్రష్ఠ ఎ.ఆర్.రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డుల్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ముంబయి మురికివాడ బతుకు కనకపు సింహాసనాన్ని అధిరోహించిన కథాంశంతో రూపొందిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఈ చిత్రం మొత్తం 8 అవార్డుల్ని గెలుచుకుంది.
81వ అకాడెమీ అవార్డుల కార్యక్రమం సోమవారం లాస్ ఏంజెలిస్‌లోని కోడక్ థియేటర్లో కన్నుల పండువగా జరిగింది. సినీ దిగ్గజాల సాక్షిగా.. భారత సంగీత స్వరఝరి ఎ.ఆర్.రెహమాన్ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ గేయం కేటగిరీల్లో అవార్డుల్ని అందుకుంటున్నప్పుడు చప్పట్లతో హాలు మార్మోగింది. ఉత్తమ సాంగ్ 'జయ హో'కు పాట రచయిత గుల్జార్(ఈయన అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేదు)తో కలిసి రెహమాన్ అవార్డును అందుకున్నారు. తద్వారా ఇలా రెండు అవార్డుల్ని అందుకున్న తొలి భారతీయుడిగా 43 ఏళ్ల రెహమాన్ చరిత్ర సృష్టించారు. (గతంలో ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో బాను అథాయా(గాంధీ సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్-1983), సత్యజిత్ రే(లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్-1992) లున్నారు.) కేరళలోని కొల్లం జిల్లాలో జన్మించిన సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి తన సౌండ్ మిక్సింగ్ అద్భుతం ద్వారా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు రెహమాన్ ఉద్వేగంగా ప్రకటించారు. ఆ సమయంలో ఆయన తల్లి ఎదురుగా సీట్లో కూర్చుని ఉన్నారు.
భారత దౌత్యవేత్త వికాస్ స్వరూప్ రచించిన 'క్యూ అండ్ ఏ' నవల ఆధారంగా అతి తక్కువ బడ్జెట్(కోటిన్నర డాలర్లు)లో... బ్రిటన్‌కు చెందిన డానీ బోయెల్ దర్శకత్వంలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఫైనాన్సర్ 'వార్నర్ ఇండిపెండెంట్ పిక్చర్స్' ఒకదశలో మధ్యలోనే వైదొలిగితే.. ఫాక్స్ సెర్చ్‌లైట్ పిక్చర్స్ చివరికి దీన్ని పూర్తిచేసి, గత నవంబరులో విడుదల చేసింది. కొన్ని నెలలుగా వరసుగా వివిధ అంతర్జాతీయ అవార్డుల్ని గెలుచుకుంటూ వస్తున్న ఈ చిత్రం అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుని రికార్డు సృష్టించింది. మొత్తం 10 కేటగిరిల్లో ఈ చిత్రం ఆస్కార్‌కు బ్రిటన్ తరఫున నామినేట్ అయితే... ఎనిమిదింటిలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ అని స్టీవెన్ స్పీల్‌బర్గ్ ప్రకటించిన మరుక్షణం- సినిమాలో పనిచేసిన బృందమంతా వేదికపైకి వెళ్లింది. సినిమాలో నటించిన బాలనటులకు ఇదో నవలోకంలా అనింపించింది, కనిపించింది. నీలిరంగు గౌను రంగు ధరించిన ఫ్రిదా పింటో అందరికీ ఆకర్షణగా నిలిచింది. రెహమాన్ వేదికపై నుంచి జయ హో, 'ఒ సయా' గీతాల్ని ఆలపించినపుడు డ్యాన్సర్లు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. 'బాలీవుడ్ నృత్యం ఇక హాలీవుడ్‌లో దుమ్ము రేపుతుంది. బాలీవుడ్ నుంచి నేను కొన్ని నృత్య పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది' అని గతంలో ఉత్తమ సహాయనటి అవార్డును అందుకున్న ఆమీ ఆడమ్స్ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.
గ్రహణం మొర్రితో బాధపడుతూ పోరాటం సాగించే ఉత్తరప్రదేశ్ బాలిక కథాంశంగా నిర్మించిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- 'స్మైల్ పింకీ' కూడా అకాడెమీ అవార్డుకు ఎంపికయింది. మెగాన్ మైలాన్ దర్శకత్వంలో, ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, వారణాసిల్లో ఈ సినిమాను నిర్మించారు. 'నీ జీవితగాథను చెప్పినందుకు కృతజ్ఞతలు' అంటూ ఎనిమిదేళ్ల పింకికి ఈ సందర్భంగా మైలాన్ ధన్యవాదాలు తెలిపింది. పింకీకి సర్జరీ చేసిన డాక్టర్ సుబోధ్ కె.సింగ్, ఆ బాలికకు సహకరించిన స్వచ్ఛంద సంస్థ స్మైల్ ట్రైన్‌కు కూడా మైలాన్ కృతజ్ఞతలు చెప్పింది. స్లమ్‌డాగ్ చిత్రంకన్నా ఎక్కువగా 13 కేటగిరీల్లో నామినేటైన, బ్రాడ్‌పిట్ నటించిన చిత్రం 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' కేవలం మూడు ఆస్కార్ అవార్డుల్ని మాత్రం గెలుచుకుంది. 'ద రీడర్' సినిమాలో నాజీ జైలు గార్డు పాత్ర పోషించిన కేట్ విన్‌స్లెట్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. గతంలో ఈమె 5 సార్లు ఆస్కార్‌కు నామినేటైనా... అవార్డు దక్కడం ఇదే మొదటిసారి. 'మిల్క్' సినిమాలో స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పాత్ర పోషించిన షాన్‌పెన్ ఉత్తమ నటుడి అవార్డు(ఇది ఈయనకు రెండో ఆస్కార్) అందుకున్నారు. 'ది డార్క్ నైట్' సినిమాలో జోకర్‌గా అద్భుత నటనను పండించిన హీత్ లెడ్జర్‌కు మరణానంతరం(మోతాదుకు మించి మందుల్ని వాడినందుకు గత ఏడాది ఈయన చనిపోయారు) ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. విక్కీ క్రిస్టినా బార్సెలోనా సినిమాలో పాత్రకుగాను పెనెలోప్ క్రూజ్‌కు ఉత్తమ సహాయనటి అవార్డు దక్కింది
______________________________________
సంగీత సాహసికుడు!
ఏ ఆర్ రెహ్మాన్... టైటిల్స్‌లో పేరు కనిపించగానే థియేటర్స్‌లో చప్పట్లు మారుమోగడం... వాల్‌పోస్టర్‌లలో అతని పేరు చూడగానే ఈ సినిమా చూడొచ్చేమో అని యువ ప్రేక్షకులు నిర్ణయానికి రావడం రెహ్మాన్‌తోనే మొదలని చెప్పాలి.
అంత వరకు గొప్ప సంగీతదర్శకులు సినిమాలను ఏలినా... ఈ క్రేజ్ లేదు. దానికి కారణమేమిటి? 'బ్రేక్ ద రూల్స్'... బాయ్స్ చిత్రంలో వినిపించే పాట ఇది. రెహ్మాన్ సంగీత దర్శకుడిగా అడుగడుగునా ఇదే సూత్రం నిక్కచ్చిగా పాటించాడు. వ్యాపారాత్మక భారతీయ సినిమాల్లో తనదైన ప్రయోగాలకే పెద్ద పీట వేయగలిగాడు. వాటి ఫలితమే నేటి ఆస్కార్ పురస్కారాలు. భారతీయ చిత్రసీమలో రెహ్మాన్ సృష్టించింది అక్షరాలా విప్లవం.
గరిటెడు చాలు... రెహ్మాన్‌కు ముందంతా ఎవరెన్ని ఎక్కువ చిత్రాలు చేస్తే వాళ్లే ఉత్తమ సంగీత దర్శకులు. రెహ్మాన్ ఆ పద్ధతి తుడిచిపెట్టాడు. అతితక్కువ చిత్రాలైనా ఆ ఒకటి రెండు చిత్రాల పాటలే ఏడాదిమొత్తం ప్రేక్షకుల నోట నానేలా చేశాడు. అతని విలువ తెలియక 'అంత మెల్లగా చేస్తే కష్టం' అన్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు.
ఎందుకీ ఆలస్యం... పరిపూర్ణత కోసం తపనే రెహ్మాన్ ప్రధాన ప్లస్‌పాయింట్. పలు బాణీలు తనలో తానే స్వరపరచుకుని... వాటికి సంగీతాలు రూపుదిద్ది చూస్తాడు. తనే చాలావాటిని వడపోస్తాడు. 'ఓ పట్టుపురుగులా తనలో తాను మథనం చెంది... పాటలను 70 శాతం పూర్తిచేసి ఉత్తమమైనవాటినే నిర్మాత దర్శకులకు వినిపిస్తాడు. అందువల్లే పాటలు ఆలస్యమవుతాయి. మొదట్లో అది మనవాళ్లకి అర్థం కాలేదు' అని విశ్లేషిస్తారు గేయరచయిత వైరముత్తు.
పాటల రూపు మార్చాడు... 'అతని సంగీతం ఓ ఫ్యూజన్. కర్ణాటిక్, హిందూస్థానీ, పాశ్చాత్యం, జాజ్ వీటన్నింటినీ సింథసైజర్‌లో కలపడమే అతను చేసేది'... రెహ్మాన్‌కుసంగీతానికి అందరూ ఇచ్చే నిర్వచనం ఇది. ఆ సూత్రమేదో తెలిసినవాళ్లుఅంత స్థాయిలో చేయరెందుకో?! నిజానికి రెహ్మాన్ సంగీతం ఏ సూత్రాలకూ లొంగదు. గాత్రం వెనుక వినిపించే వాయిద్య విన్యాసం, అల్లరల్లరి శబ్దాలు(నిశ్శబ్దాలు కూడా), సాహిత్యం... ఇవన్నీ ఏది ఎక్కడ వినిపిస్తే శ్రోత మనస్సు ఊగిపోతుందో అక్కడ సరిగ్గా అమర్చడం రెహ్మాన్ పద్ధతి. ఆ అమర్చడంలో సూత్రాలేమిటని అడిగితే బహుశా రెహ్మానూ చెప్పలేకపోవచ్చు.
పాట తీరు మార్చాడు... మొదట వాయిద్య సంగీతం(బీజీఎం), పల్లవి, చరణం, మళ్లీ పల్లవి...రెహ్మాన్ రాకకు ముందు సినీగేయం ఈ చట్రంలోనే తిరిగేది. వీటికి అయిదు నిమిషాలు కాలపరిమితీ అనుకునేవారు. రెహ్మాన్ ర్యాప్, జాజ్ పద్ధతులను వాడుకుంటూ ఈ సూత్రాలు తిరగరాశాడు. పాటల కోసమే తనదైన 'స్క్రీన్ ప్లే' రాయడం మొదలుపెట్టాడు. ప్రేమికుడు చిత్రంలోని 'టేకిట్ ఈజీ ఊర్వశి', దిల్ సే 'ఛయ్య... ఛయ్య' ఇందుకు చక్కటి ఉదాహరణలు. చిత్రాల్లో బిట్ సాంగ్స్, థీం మ్యూజిక్‌లు పెరగడం కూడా రెహ్మాన్ రాకతర్వాతే. చిన్నవైనా... పెద్దవైనా రెహ్మాన్ మాధుర్యం తిరుగులేనిది.
సరికొత్త వాయిద్యాలు... అంతవరకు ఉపయోగిస్తున్న వాయిద్యాలు, వాటిని ఉపయోగించే విధానాలనురెహ్మాన్ ఉద్దేశపూర్వకంగానే వద్దనుకున్నాడు. దిల్‌రుబా, శాక్సాఫోన్, వీణ, మురళీ, ఎలిక్ట్రిక్ గిటార్ వంటి వాయిద్యాలను చాలా కొత్త తీరులో ఉపయోగించాడు. ప్రేమికుడు చిత్రంలో 'ఊర్వశి... ఊర్వశి' పాటకే వద్దాం. అంతవరకు శోకగీతాలకే ఉపయోగించే దిల్‌రుబాతో ఉత్సాహం పరవళ్లు తొక్కించి ఉంటాడు. అది అతని పద్ధతి. 'శాక్సాఫోన్'తో ఎటువంటి విన్యాసాలు చేయవచ్చో 'డ్యూయెట్' పాటలు విని చూడాలి. 'బొంబాయి' చిత్రం థీం మ్యూజిక్ మరో ఉదాహరణ.
రాగాల లోతు... కర్ణాటక సంగీతంలో ప్రతి రాగం ఓ సముద్రంలాంటిది. ఆ రాగాలను పైపైనా స్పృశించి... వాటి ఛాయలతో బాణీలు వినిపించడమే మన సినీ సంగీత దర్శకులు చేసేది. రాగాల లోతులు ఎక్కువగా తడిమితే శ్రోతలకు నచ్చదేమోనన్న భయం వారిది. అయితే రెహ్మాన్ రాగాల లోతైన ఛాయల్ని ప్రేక్షకులకు చూపెడతాడు. వాటిని అంతే గొప్పగా గాయకుల చేత పాడిస్తాడు. ఇంద్ర, పద్మవ్యూహం, తాళ్ వంటి చిత్రాల్లో ఈ పద్ధతి బాగా కనిపిస్తుంది. మొదట్లో పాట చాలా స్లోగా ఉందే అన్న అభిప్రాయం వచ్చినా.. తర్వాత అవి శ్రోతల్ని ఎంతగానో వెంటాడుతాయి. వేధిస్తాయి.
ఎవరూ చేయని సాహసమది... తొలిచిత్రం సంగీతానికే సరికొత్త ఒరవడి దిద్దిన ఘనత రెహ్మాన్ ఒక్కడిదే. ఉదాహరణకు తమిళంలో 1970ల వరకు ఎమ్మెస్ విశ్వనాథన్‌ను ఓ మహావృక్షంగా భావించేవారు. ఆయన తర్వాత రంగంలోకి వచ్చిన ఇళయరాజా వచ్చీరావడంతోనే సరికొత్త పోకడలకు పోలేదు. కొంతకాలం ఎమ్మెస్వీ వేసిన బాటలోనే నడిచారు. ఆ తర్వాతే... హార్మనీ, కౌంటర్‌పాయింట్, ఫ్యూజన్ పద్ధతులతో తనదైన శైలి నిరూపించుకున్నారు. కానీ... రెహ్మాన్ 'రోజా' పాటలు, నేపథ్య సంగీతానికి ఏమాత్రం పాత పద్ధతులు అనసరించలేదు. బహుశా ఆ సాహసమే రెహ్మాన్ తొలిచిత్రానికి జాతీయ అవార్డు వచ్చేలా చేసిందేమో! నేటి పురస్కారాలకూ ఆ ప్రయోగాభిలాషే మూలకారణమని చెప్పాలి. _________________________________
రెహమానియా
రెహమాన్ అంటే యువతకు ఎందుకంత క్రేజ్? ఒకటి ఆయన సంగీతం. రెండు నేపథ్యం. మూడు వ్యక్తిత్వం. ఈ మూడూ ఆయన్ని భారతీయుడు అభిమానించే పరిపూర్ణ వ్యక్తిగా నిలిపాయి.
నేటి యువత రెహమాన్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ పెరిగింది. 'చిన్నిచిన్ని ఆశ' విన్నప్పుడు ఇంత శ్రావ్యమైన సంగీతం ఇంతవరకు ఎందుకు రాలేదని ఆశ్చర్యపోయింది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, జానపదాన్ని, పాశ్చాత్య ధోరణులను మేళివించి ఆయన ప్రవేశపెట్టిన బాణీలకు పట్టంకట్టింది. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల నాడు 'మా తుజే సలాం...' దేశభక్తి శంఖారావానికి రోమాంచితమైంది. వారి ఫేవరెట్స్ జాబితాలో రెహమాన్ సంగీతం తప్పనిసరి ఎంట్రీ అయ్యింది.
రెహమాన్ సంగీతాన్ని ప్రేమతో, గౌరవంతో వింటాం. ఆయన పేరు జనాన్ని థియేటర్లకు నడిపిస్తుంది. కొందరికి దేవుడితో సమానం. రెండు దశాబ్దాల జైత్రయాత్రలో ఆయన వినయ విధేయతల్లో ఎలాంటి మార్పూలేదు. ఆధ్యాత్మికతే ఆయన బలం, ఆయన సంగీతానికి చోదక శక్తి. 43 ఏళ్ల ప్రాయంలోనూ 25 ఏళ్ల తేజస్సును ఆయనలో నింపిందదే.
జీవనభృతిగా సంగీతం రెహమాన్ చెన్నైలోని తమిళ హిందూ సంగీత కుటుంబంలో 1966 జనవరి 6న జన్మించారు. అసలుపేరు ఎ.ఎస్.దిలీప్ కుమార్. తండ్రి ఆర్.కె.శేఖర్ మళయాళ చిత్రాల్లో సంగీత దర్శకులకు సహాయకుడు. దిలీప్‌కు తొమ్మిదేళ్ల వయస్సులో తండ్రి మరణించారు. అంతకుముందు మూడేళ్లుగా ఆయన మంచంలో ఉన్నారు. ఉన్నదంతా రోగానికి ఖర్చయిపోయింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయితో కూడిన కుటుంబాన్ని ఈదడం తల్లి కస్తూరికి పెద్దసవాలే అయ్యింది. కొన్నాళ్లు ఇంట్లోని సంగీత పరికరాలను అద్దెకిచ్చి నెట్టుకొచ్చారు. దిలీప్ నాలుగేళ్లకే పియానో వాయించడం మొదలెట్టాడు. అయితే, సైన్స్ మీద అమితాసక్తి. సంగీతాన్ని వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచనేలేదు. అయినా కుటుంబ అవసరాలు, తల్లి ప్రోద్బలం ఆయన్ను సంగీతం వైపు నడిపించాయి. క్రమంగా చదువుకు దూరమయ్యారు. 11వ తరగతిలో ఎప్పుడు మానేశాడో ఆయనకే గుర్తులేదు.
చిరుప్రాయంలోనే ఇళయరాజాతో తొలి రోజుల్లో చిన్ననాటి మిత్రులు శివమణి, జాన్ ఆంటొనీ, జోజో, రాజాలతో కలిసి 'రూట్స్' అనే బ్యాండ్‌లో చేరారు. కీబోర్డు ప్లేయర్‌గా, స్వర నిర్దేశకుడిగా పనిచేశారు. చెన్నైలో నెమిసెన్ ఎవెన్యూ పేరుతో రాక్ బృందాన్ని తయారు చేశారు. అందులో ఆయన వాయించని సాధనం లేదు. తల్లి కోరికపై సంగీత శిక్షణకు వెళ్లారు. 11 ఏళ్ల వయస్సులో రమేశ్‌నాయుడు దగ్గర కీబోర్డుప్లేయర్‌గా చేరారు. ఏడాదిన్నరపాటు ఇళయరాజా బృందంలో, తర్వాత సుదీర్ఘకాలం రాజ్-కోటిల దగ్గర పనిచేశారు. ఎం.ఎస్.విశ్వనాథన్‌కూ శిష్యరికం చేశారు. జాకీర్ హుస్సేన్, కన్నకుడి వైద్యనాథన్, ఎల్.శంకర్ లాంటి మహామహులకు ప్రపంచ యాత్రల్లో సహకారం అందించారు. తొలుత బండ పని అనిపించినా అందులోనే ఇష్టాన్ని వెతుకున్నారు. లండన్ ట్రినిటీ సంగీత కళాశాల నుంచి ఉపకార వేతనం, పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో పట్టా అందుకున్నారు. 'మద్రాస్ మొజార్ట్'గా, 'ఇసయ్ పుయల్'(సంగీత కోకిల)గా మన్ననలు పొందారు.
మత విశ్వాసం... కుటుంబం దిలీప్ తండ్రి మంచంలో ఉన్నపుడు సూఫీ మత గురువు కరీంబాబా ఆయనకు వైద్యం చేసేవారు. అప్పుటి నుంచే దిలీప్ కుటుంబంపై ఇస్లాం ప్రభావం పడింది. దశాబ్దకాలంలో క్రమంగా అది బలపడింది. కుటుంబం సంక్షోభంలో పడినపుడల్లా కరీం బాబా ప్రార్థనలు వారికి శాంతిని చేకూర్చాయి. ఎప్పటికైనా సంగీత ప్రపంచాన్ని ఏలతావని ఆయన చెప్పిన మాటలపై గురి కుదిరింది. సంగీత సాధనలో ఏర్పడిన తిరుగుబాటు మనస్తత్వం పాత జీవితం నుంచి పూర్తి మార్పు కోరింది. ఫలితంగానే 1989లో కుటుంబం ఇస్లాంలోకి మారింది. దిలీప్ అల్లారఖా రెహమాన్ అయ్యారు. ఇంట్లో అందరి పేర్లూ మారిపోయాయి. రెహమాన్‌కు సంగీతం పట్ల అమిత ప్రేమ. దేవుడి పట్ల అపార విశ్వాసం. సంగీతం, మతం విషయంలో అత్యంత నిష్ఠగా ఉంటారు. నిరాడంబర జీవనశైలి. 1995లో సైరో బానోను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఖదీజా(13), రెహిమా(10), ఒక కుమారుడు అమాన్(6). తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో హీరోగా నటించిన రఘు/రహమాన్ ఆయన తోడల్లుడు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ ఆయన మేనల్లుడు.
రోజాతో మలుపు:
సంగీత దర్శకుల దగ్గర పనిచేస్తున్నపుడే మంచి ఆదాయంతో టీవీ ప్రకటనలకు నేపథ్య సంగీతం అందించే అవకాశం లభించింది. దాంతో 1987 తర్వాత దాదాపుగా సినీ పరిశ్రమను వదిలేశారు. రాజీవ్ మీనన్‌తో కలిసి లియోకాఫీ, బాంబే డయింగ్, టైటన్ ప్రకటనలతో జాతీయ గుర్తింపు సాధించారు. తన సొంత ఇంటి పెరట్లోనే రికార్డింగ్ థియేటర్ 'పంచతాన్ రికార్డ్ ఇన్' ఏర్పాటుచేశారు. ఇప్పుడు అది దేశంలోకెల్లా అత్యాధునిక రికార్డింగ్ స్టూడియోగా ఎదిగింది. టీవీ ప్రకటనలతో పాటు ఆసక్తి కొద్దీ డాక్యుమెంటరీలకు నేపథ్య సంగీతం అందించే వారు. 'దళపతి' సినిమా తీస్తుండగా దర్శకుడు మణిరత్నానికి, సంగీత దర్శకుడు ఇళయరాజాకు మధ్య విభేదాలు వచ్చాయి. మణిరత్నం కొత్తనీరు కోసం చూస్తున్నారు. 1991లో ఒక కార్యక్రమంలో ఆయనకు రెహమాన్ పరిచయమయ్యారు. రెహమాన్ ఆయన్ను రికార్డింగ్ థియేటర్‌కు తీసుకొచ్చి తన దగ్గరున్న... 'చిన్ని చిన్ని ఆశ', 'వినరా వినరా...' ట్యూన్లు వినిపించారు. మణిరత్నానికి అవి బాగా నచ్చాయి. అప్పుడు అనుకున్న సినిమా ప్రారంభం కాలేదు. తర్వాత 'రోజా' సినిమా అనుకోగానే 24 ఏళ్ల రెహమాన్‌కు అవకాశం ఇచ్చారు. రూ.25 వేలు పారితోషికం. నిజానికి అప్పటికది రెహమాన్‌కు కేవలం మూడు రోజుల పనికి లభించే ఆదాయం. తొలిచిత్రం రోజాతోనే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది. తొలి సినిమాతో అవార్డు అదో రికార్డు. తర్వాత 1997, 2002, 2003ల్లో జాతీయ అవార్డు సాధించారు. నాలుగు సార్లు సంగీతంలో జాతీయ అవార్డు ఎవరూ సాధించలేదు. నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 11 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ ఆయన సొంతం అయ్యాయి. 2003 వరకు ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రాల సీడీలు పదికోట్లు, క్యాసెట్లు 20 కోట్లు అమ్ముడు పోయాయి. ఇదో ప్రపంచ రికార్డు.
బాలీవుడ్ ధ్రువతార తెలుగు సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ రెహమాన్‌ను రంగీలాతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ సంగీత పరిశ్రమ రూపురేఖల్నే ఆయన మార్చేశారు. బాలీవుడ్‌లో రెహమాన్‌కు ముందు, రెహమాన్ తర్వాత అని చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. ఎస్.డి.బర్మన్, శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కల్యాణ్‌జీ ఆనంద్‌జీ, నౌషాద్, ఓపీ నయ్యర్ వంటి మహామహుల తర్వాత బాలీవుడ్ శూన్యత ఆవహించింది. దాన్ని పూరించేందుకు వచ్చిన సంగీత దర్శకులందర్నీ దాటేసి రెహమాన్ ముందు నిలబడ్డారు. ధ్రువతార అయ్యారు. 'దిల్‌సే' సినిమా తర్వాత బాలీవుడ్‌లో హీరో, దర్శకుడితో సమానంగా చిత్రానికి ప్రధాన బలంగా సంగీత దర్శకుణ్ణి గుర్తించడం మొదలెట్టారు. రెహమాన్ బలం మెలొడీ, సాంకేతిక పరిజ్ఞానం. స్వర్ణకారుడు మెత్తని ఉలితో ఆభరణాలు చెక్కినట్లు రెహమాన్ చేతిలో సంగీతం ప్రాణం పోసుకుంటుంది. రాత్రిళ్లు మాత్రమే ఆయన సంగీత యజ్ఞం సాగుతుంది. ఆయన నేపథ్యం, స్నేహాలు, జానపద రీతులు, భారత, పాశ్చాత్య సంప్రదాయ సంగీతాలు, సూఫీ మతవిశ్వాసాలు సంగీతంలో మమేకం అయ్యాయి. ఫలితంగా అజరామరమైన కొత్తకొత్త ట్యూన్లు వచ్చాయి.
రెహమాన్ బ్రాండ్ రెహమాన్ ఇప్పుడు బ్రాండ్ అయ్యారు. ఆయన పేరు కాసులు కురిపిస్తున్న నేపథ్యంలో దాన్ని మంచి పనులకు ఉపయోగించాలని ఆయన నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థల తరఫున కేన్సర్ బాధితుల నిధుల సేకరణకు కచేరీలు చేశారు. 2004లో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయ వ్యాధి చైతన్య ప్రచారానికి ప్రపంచ అంబాసిడర్ అయ్యారు. కొత్తగా ఆయన ఆకలి, పేదరికం రూపుమాపే లక్ష్యంతో ఎ.ఆర్.రెహమాన్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
రెహమాన్ తను సంపాదించిన ప్రతి పైసా సంగీత సామ్రాజ్యం విస్తరణకే ఉపయోగిస్తారు. 2005లో తన స్టూడియోకు అనుబంధంగా కోడంబాకంలో ఏవీఎం స్టూడియోను స్థాపించారు. ఆసియాలోకెల్లా అత్యాధునిక పరికరాలు ఇందులో ఉన్నాయి. 2006లో సంగీత విద్యార్థుల శిక్షణ కోసం కె.ఎం.మ్యూజిక్ సంస్థను స్థాపించారు. పలు హాలీవుడ్, ఇంగ్లండ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
"ప్రతి అవార్డు తర్వాతా నేను చెప్పే ఓ తమిళ మాటను ఇక్కడా చెబుతున్నా... ఎల్లా పుగలం ఇరైవనుకే (ఈ పేరు ప్రఖ్యాతులు దేవుడి దయ). నా జీవితంలో నాకు ప్రేమ, ద్వేషం అనే రెండు మార్గాలు ఎదురయ్యాయి. అందులో నేను ప్రేమనే ఎంచుకున్నా! అందుకే మీ ఎదుట నిలబడగలిగాను" - రెహమాన్
|
0 Comments:
Post a Comment
<< Home