తండ్రీకొడుకులు

అంతమాత్రాన చెడ్డ కొడుకులు లేకుండా పోలేదు. వారి గురించీ సాహిత్యం వివరించింది. కాశీఖండంలో శ్రీనాథుడు చిత్రించిన గుణనిధి కథ లోకప్రసిద్ధమైనది. వాడివల్ల వంశప్రతిష్ఠ నాశనమైంది. తల్లీ తండ్రీ క్షోభపడ్డారు. తెనాలి రామకృష్ణుడు పరిచయం చేసిన నిగమశర్మా సర్వభ్రష్టుడే! 'ఉఫ్ మని అగ్నిహోత్రాన్ని ఊదడం అలవడలేదుగాని, నిగమశర్మ నిరంతరం విరహాగ్ని తాపంతో నిట్టూర్పులు విడుస్తూనే ఉండేవాడు' అని తన సహజశైలిలో రామకృష్ణుడు చమత్కరించాడు. చరిత్రలోకి వెళితే- కన్నవారికి అన్నంపెట్టని కసాయి పుత్రులూ, కారాగారం పాలుచేసి కక్ష సాధించిన ప్రబుద్ధులూ మనకు ఎందరో కనపడతారు. నరాలమీద వ్రణాలుగా తోస్తారు. నవనందులను నవనాడుల్లోని క్రిములుగా పోలుస్తూ ముద్రారాక్షసంలో పేర్కొన్నది ఇలాంటివారి గురించే! దుర్మార్గులుగా పుట్టినవారికన్నా పెంపకంలో చేటువల్ల చెడిపోయినవారే సమాజంలో అధికం. గుణనిధి చెడిపోవడానికి అతని తల్లే కారణం. అతి గారాబం చేసి వాణ్ని చెడగొట్టింది. యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి 'స్నానం సంధ్యా ఏమైనా ఉన్నాయా' అని నిలదీసేవాడు. వెంటనే తల్లి అడ్డంపడి 'స్నానమాడెను... వార్చెను సంధ్య... అగ్నిహోత్ర మొనరించెను' అంటూ కొడుకును వెనకేసుకొస్తూ పచ్చి అబద్ధాలు ఆడేది. తల్లులే కాదు, కొందరు తండ్రులదీ అదే వరస. దారితప్పి గాలితిరుగుళ్ళు మరిగిన కొడుకులను పుత్రప్రేమకొద్దీ దండించి దారిలో పెట్టకుండా వదిలేసేవారు. ఇలాంటివారి స్వభావాన్ని చెబుతూ ధర్మజుడు నారదుడితో '...పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్' అన్నాడు.
ధర్మరాజు ఏ ఉద్దేశంతో చెప్పినా, ఇవాళ జరుగుతున్నది మాత్రం అచ్చంగా ఇదే! ఎలాంటి తప్పులు చేసినా పుత్రరత్నాలను గుడ్డిగా సమర్థించడం జనానికి అలవాటయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పెద్దలు విపరీతంగా సంపాదించి పోగులు పెడితే- సంతానం విచ్చలవిడిగా జీవించడం ఇటీవలి ఒక విషాద పరిణామం. తల్లిదండ్రుల నియంత్రణలోంచి జారిపోయిన సంతానం సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇటీవల అమ్మాయిలపై యాసిడ్ దాడికి తెగించిన కొడుకు విషయంలో అతని తల్లి- 'సమాజానికి చీడపురుగులా తయారైన వీణ్ని ఉరితీయించండి' అని కోరింది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో గ్రహించడానికి ఈ సంఘటన ఒక బలమైన ఉదాహరణ. మండువేసవిలో సూర్యుడి తీక్షణ తాపాన్ని గొడుగు లేకున్నా మనం సహించగలం. మరి అదే సూర్యుడి నుంచి తాపాన్ని గ్రహించి మిటమిటలాడిపోయే ఇసుకమీద చెప్పులు లేకుండా నడవలేం. అలాగే ప్రభువులు, అధికారుల పేరు చెప్పి రెచ్చిపోయే అనుచరగణాన్ని, బంధువర్గాన్ని తట్టుకోవడం చాలా కష్టం. సమాజం మారుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హింసాప్రవృత్తి, అవినీతి మితిమీరుతున్నాయి. సంతానం విషయంలో తల్లిదండ్రులు మరింత జాగరూకత వహించవలసిన సమయమిది. వేసవి సమీపిస్తోంది. వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి వేసవి తాపం మరీ తీవ్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. దానికితోడు ఎన్నికల రుతువూ మొదలవుతోంది. వేసవికీ, ఎన్నికలకీ ఈసారి ప్రత్యేక అవినాభావ సంబంధం గోచరిస్తోంది. 'సన్‌స్ట్రోక్' ప్రభావం రెండింటా ప్రబలంగా ఉండేట్టుంది. సూర్యుడి కొడుకు శనీశ్వరుడు. శనిపీడ సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సూర్యుడికే పుత్రపీడ తప్పలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రకంగానూ 'సన్‌స్ట్రోక్'కు ఈ దఫా ప్రాధాన్యం పెరిగేలా ఉంది. నాయకులూ బహుపరాక్!
(ఈనాడు, సంపాదకీయం, ౧౫:౦౨:౨౦౦౯)
___________________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home