My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, August 30, 2009

విషాద గీతిక

'కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల'
అన్నారు జాలాది. ఆ రెండింటికీ నడుమ మనిషి జీవితంలో ఏవేవో మలుపులు, ఎత్తులూ-పల్లాలు, సన్మానాలూ-అవమానాలు, గౌరవాలూ-తిరస్కారాలు. ఒక్క గాయం జీవితపర్యంతం బాధిస్తుంది. ఒక్క ప్రశ్న ఆమరణాంతం వేధిస్తుంది. ఒక్క అవమానం గుండెను చిరకాలం దొలుస్తుంది. సుఖమయ జీవితాలన్నీ ఒకే కోవకు చెందినవి. దుఃఖపూరితమైన బతుకుల్లోనే లెక్కలేనన్ని వైవిధ్యాలు. మార్లిన్‌ మన్రో నుంచి మైకేల్‌ జాక్సన్‌ వరకు; మీనాకుమారి మొదలు సావిత్రి, చిత్తూరు నాగయ్యల వరకు ఒక్కో జీవితం ఒక్కోరకం విషాద కావ్యం! వెండితెరకు-గుండె పొరకు మధ్య కాలం నిర్మించిన కళాత్మక పూల వంతెనలు వారంతా! కళలతో కరచాలనం చేస్తూ, నిజజీవిత సాగరమథనంలో అమృతాన్ని సాధించి కలకాలం అభిమానులకు పంచారు. హాలాహలాన్ని తమ గుండెల్లో దాచిపెట్టి క్రమంగా దహించుకుపోయారు. ఒక దశలో వారంతా 'పెదవి మెదిపితే పండుగ/పదం కదిపితే వేడుక/కళ్లు కలిస్తే కానుక'- అన్నంత వైభవంగా వెలిగినవారే. ఇప్పటికీ కోట్ల గుండెల్లో పదిలంగా కొలువుతీరినవారే. పైపైన చూస్తే వారి జీవితాలకు లోటేమిటనిపిస్తుంది. సమీక్ష చేస్తే మిగిలిందేమిటన్న నిట్టూర్పు ధ్వనిస్తుంది. వారిని గురించి తల్చుకున్నప్పుడల్లా ఏదో వెలితి, ఎందుకో తెలియని దుఃఖం, అభిమానుల గుండె చూరుల్లోంచి బొట్టుబొట్టుగా రాలే విషాదం! మానవ జీవితానికి విషాదమే శాశ్వత చిరునామా కాబోలుననిపించి భయం వేస్తుంది.

సిడ్నీ షెల్డన్‌ చిత్రించిన ఒక యువతి జీవితాన్ని తిరస్కార భయం చిందరవందర చేసింది. విషాదమయం చేసింది. ఆమె గొప్ప పారిశ్రామికవేత్త కూతురు. ఇంటినిండా సిరిసంపదలు. అందుబాటులో ఎన్నో భోగభాగ్యాలు. మనిషి మాత్రం కురూపి. ఆమె అక్కలిద్దరూ చక్కని అందగత్తెలు. దాంతో, ఆమెకు ఇంటా బయటా తిరస్కారాలు, అవమానాలు. ఆఖరికి తల్లీతండ్రీ సైతం చిన్నచూపు చూసేసరికి, చులకన చేసేసరికి తట్టుకోలేకపోతుంది. సమాజంపై కసి పెంచుకుంటుంది. ఆ దశలో ఒక అపరిచితుడితో శృంగారంలో పాల్గొంటుంది. అవసరం తీరాక అతడామెను బాగా పొగిడాడు. దాంతో- తన అస్తిత్వానికి ఓ ప్రత్యేక గుర్తింపు లభించిందన్న భావం తలెత్తుతుంది. అటువంటి గుర్తింపు కోసమే తపిస్తున్న తన దాహం మగాళ్లను సంతోషపరచడం ద్వారా తీరుతుందని ఆమె గ్రహిస్తుంది. దానికోసం ఆ గొప్పింటి పిల్ల కనిపించిన ప్రతి మగాడి వెంటా పడుతుంది. గుర్తింపు దాహం తీర్చుకుంటుంది. భారతంలో కర్ణుడి పాత్ర మరోరకం. 'సమాజం నన్ను అంగీకరించడం లేదు' అన్న అసహనంతో, అభద్రతాభావంతో సతమతమయ్యే స్థితిలో అతడికి దుర్యోధనుడి అండ దొరికింది. అంతవరకు నిరాశ నిస్సహాయతల నివురుమాటున దాగిన కసి భగ్గున ప్రజ్వరిల్లింది. తప్పని తెలిసీ పరేచ్ఛా ప్రారబ్ధానికి లోనై కానిపనులకు సైతం తల ఊపేలా చేసింది. క్రమంగా 'భారతం కర్ణుడి తల' అనిపించే స్థాయికి కర్ణుడు ఎదిగిపోయాడు. ఓటమి తప్పదని ఎరిగీ కడదాకా కౌరవ పక్షానే నిల్చి కసిలోనే కడతేరిపోయాడు. పారిశ్రామిక వేత్త కూతురు విషయంలో తల్లిదండ్రులూ సమాజమూ ఆమెను ఆదరణగా చూసి ఉంటే ఆమె జీవితం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం తప్పిపోయేది. కర్ణుడు కుంతి ఒడిలో పెరిగి సమాజంలో గౌరవానికి నోచుకుని ఉంటే కురుక్షేత్ర సంగ్రామం అసలు జరిగేది కాదేమో!

మైకేల్‌ జాక్సన్‌ జీవితాన్ని ఈ కోణంలోంచే పరామర్శ చేయవలసి ఉంది. సంపాదించిన లక్షలూ కోట్లూ అతనికి ఆనందాన్నివ్వలేదు. అంతులేని భోగభాగ్యాలు సుఖాన్ని పంచలేదు. విశ్వవ్యాప్తంగా కంటతడి పెడుతున్న కోట్లాదిమంది అభిమానుల ఆరాధన అతణ్ణి ఒంటరితనాన్నుంచి రక్షించలేదు. ఈ లోకంలో మైకేల్‌ ఏకాకిగా జీవించాడు. 'తిరస్కారభయం మూర్తీభవించిన వ్యక్తిత్వం' అనిపించాడు. చేజిక్కిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన ధనరాశులు, గెల్చుకున్న హృదయాలు- ఇవేవీ అతడు కోల్పోయినదానికి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. తనలోని శూన్యతను పూడ్చలేకపోయాయి. అతడు పోగొట్టుకున్నది-అమూల్యమైన తన బాల్యాన్ని! అత్యంత విలాసవంతంగా నిర్మించిన తన రాజప్రాసాదంలో మైకేల్‌ లెక్కలేనన్ని జీవరాశులను, జంతువులను, పక్షులను ప్రేమగా పెంచి పోషించాడు. నిత్యం వాటి సావాసంలో తన బాల్యాన్ని తడుముకున్నాడు. ప్రపంచానికి బాగా పరిచయమైన మైకేల్‌ ప్రచండ స్వభావం, ప్రతిభా పెనువిస్ఫోటనం, మహోద్వేగ తీవ్రపదవిన్యాసం... ఆ ఉప్పెన అంతటికీ మూలం- కసి, విషాదం! అన్నింటికన్నా దారుణం-అతని తండ్రే దీనంతటికీ కారణం! 'మొద్దుమొహం, బండ ముక్కు' అంటూ పదేపదే అతని తండ్రి పిలిచిన పిలుపులు, చేసిన అవమానాలు ఆ పసిగుండెలో విషబీజాలను నాటాయి. కసినీ ద్వేషాన్నీ పెంచి పెద్ద చేశాయి. మనశ్శాంతిని దూరం చేశాయి. తనలోకి తాను ముడుచుకుపోయేలా చేశాయి. అతడు రూపురేఖలను మార్చుకునేందుకు లెక్కలేనన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడాన్ని, చివరి దశలో మతం మార్చుకోవడాన్ని మనం ఈ కోణంలోనుంచే అర్థం చేసుకోవాలి. గంధర్వ లోకాల్లోంచి ఒంటరిగా వచ్చాడు. ఈ లోకానికి ఎంతో ఇచ్చాడు. ఏకాకిగా జీవించాడు. నిర్భాగ్యుడిగా తనువు చాలించాడు. మరణించిననాటికి ఆ కోటీశ్వరుడి కడుపులో గుప్పెడు మాత్రలే తప్ప పట్టెడు మెతుకులు లేవు! ఏమనాలి ఆ జీవితాన్ని? అతని పాట అమృతం, జీవితం హాలాహలం. అతని పంచనామాలోనుంచి వినవచ్చే సందేశం ప్రధానమైనది, ముఖ్యంగా తల్లిదండ్రులకు!
(ఈనాడు, సంపాదకీయం, ౧౨:౦౭:౨౦౦౯)
___________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home