'కల'వరమాయె మదిలో...

కలలో సాక్షాత్కరించినవి ఇలలో సాకారమవుతాయా, లేదా అన్న సంగతి అటుంచితే- అందమైన కలల ప్రపంచంలో విహరించినంతకాలం మనిషి ఆస్వాదించే ఆనందానుభూతులు అనిర్వచనీయమైనవే. కాసేపైనా- దైనందిన జీవితంలోని కష్టాల్ని మరచిపోవడానికి, కన్నీళ్లను దిగమింగుకోవడానికి, దైన్యాన్ని పారదోలడానికి, ధైర్యాన్ని నింపుకోవడానికి మనిషికి ఆలంబన కలలే. 'మజిలీ మజిలీకి అలసిపోతున్నాం/మలుపు మలుపుకీ రాలిపోతున్నాం/ఆశల వెచ్చని పాన్పుమీద/స్వప్నాల పుష్పాలు జల్లుకొని/ఆదమరచి కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రీ!' అంటూ భగవంతుడికి విన్నవించుకున్న కవి తిలక్- కల ఎప్పుడూ మనిషికి బలం అన్నాడు. ఇతరత్రా ఏమోకానీ, మనసులు ఇచ్చిపుచ్చుకున్నవారి ప్రేమల విషయంలో మాత్రం కలలు బలవర్ధకమే. ప్రణయజీవులు సౌందర్యద్వీపాల్ని సందర్శించేదీ, ఆశలమాలికలు అల్లుకునేదీ, తమ ప్రేమసౌధాలను నగిషీలతో అలంకరించేదీ- స్వప్నలోక సంచారంలోనే! మెలకువ తెచ్చుకుంటే, ఆ రసాస్వాదనకు ఎక్కడ ఆటంకం కలుగుతుందోనన్న భయంతో వారు 'తెలివి రానీయకే, కల కరిగిపోతాది' అని పలవరించడమూ కద్దు. కలలోకొచ్చిన చినవాణ్నే వలచి, వలపించుకుని తమ నిజజీవిత కథానాయకులుగా చేసుకున్న కథానాయికలూ మన కావ్యాల్లో కనిపిస్తారు. ద్వారకానగరిలో ఉన్న అనిరుద్ధుడు శోణపురం యువరాణి ఉషాసుందరి కలలోకి వచ్చాడు. అలా వచ్చినవాడు మిన్నకుండా ఏవో చిలిపి పనులు చేశాడంటూ... 'ఆవలనేమేమొ చేసె నయ్యాగడంబు నెట్లు చెప్పుదు సిగ్గు నోరెత్తనీదు' అని చెలికత్తె చిత్రరేఖ వద్ద వాపోయింది ఉష. తన యోగవిద్యాబలంతో చిత్రరేఖ ద్వారకలో ఉన్న అనిరుద్ధుణ్ని ఉష శయ్యాగృహానికి చేర్చడం, వారిరువురూ పరిణయమాడటం- అబ్బయామాత్యుని 'అనిరుద్ధ చరిత్రము' ఇతివృత్తం. అనిరుద్ధుడి తండ్రి ప్రద్యుమ్నుడి వివాహానికి నాంది పలికిందీ కలే! ప్రభావతికి పార్వతీదేవి కలలో ప్రత్యక్షమై, ఓ చిత్తరువును చూపించి 'ఇతండు నీ వల్లభుండు/ప్రద్యుమ్నుడనియెడి ప్రభుకుమారుడు' అని వరనిర్ణయం చేసిందట.
మనిషిలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలు, బయటకు చెప్పుకోలేని భావనలు, అణచిపెట్టుకున్న కోరికలు కలల రూపుదాలుస్తాయన్నది శాస్త్రజ్ఞుల విశ్లేషణ. ఆహ్లాదం పంచే కల మనుషుల్ని ఉల్లాసోత్సాహ భరితుల్ని చేసినట్లే, ఆందోళన రేకెత్తించే పీడకల వారిని కలవరపరుస్తుంది. మనిషికి వచ్చే పీడకలలకు కారణం- వారిలో చెలరేగే భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు, భయాందోళనలేనని షికాగోలోని ఓ సంస్థ రెండువేలమందిపై నిర్వహించిన ఓ సర్వేలో తేల్చింది. ప్రతి పదిమందిలో ఒకర్ని భయోత్పాతంతో కూడిన కలలు వెంటాడుతున్నాయని, ప్రతి ఇరవైమందిలో ఒకరు పక్షం రోజులకు ఓసారి నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారనీ ఆ అధ్యయనంలో వెల్లడైంది. పీడకలలు మహాఅయితే నిద్రలో చటుక్కున లేచేలా చేస్తాయి, అంతే. కానీ, పరీక్షలు విద్యార్థులకు కంటిమీద అసలు కునుకే లేకుండా చేస్తుంటాయి. పరీక్షల భయమే ఎక్కువమందిని పీడిస్తున్నట్లూ షికాగో సంస్థ సర్వేలో వెలుగులోకి వచ్చింది. 'డిగ్రీలు లేని పాండిత్యం వన్నెకు రాని' ఈ రోజుల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం ముఖ్యమే. అలాగని, నిద్రాహారాలు మానేసిమరీ పుస్తకాలతో కుస్తీ పడితేనే వాటిలో నెగ్గుతామని భావించడమూ సరికాదు. మిగతా రోజుల్లోకంటే, పరీక్షల సమయంలో ఒక గంట అదనంగా నిద్రపోతే- విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల విజయంపై నిద్రలేమి ప్రభావం చూపుతుందంటూ, రోజూకన్నా పరీక్షలప్పుడు ఓ గంట ఎక్కువగా నిద్రించడంవల్ల వారిలో అలసట మాయమై, నూతనోత్సాహం వస్తుందని భరోసా ఇస్తున్నారు. కలల్లోనూ వెంటపడి తరుముతూ, భయపెడుతున్న పరీక్షలకు- ఓ గంట అదనపు నిద్రతో దీటైన జవాబు ఇవ్వాల్సింది విద్యార్థులే!
(ఈనాడు, సంపాదకీయం, ౨౮:౦౩:౨౦౧౦)
___________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home