సన్మార్గమే సోపానం
యం.సి.శివశంకరశాస్త్రి
అది ఒక పల్లెటూరు. దేవుడు లేడని వాదించేవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ వూరికి ఏ సాధువు, సన్యాసి వచ్చినా అక్కడి నాస్తికవాదులందరూ ఒక్కటై చుట్టుముట్టి 'దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు' అని వేధించేవారు.
ఒకసారి ఆ వూరికి ఒక యోగి వచ్చి అక్కడి రామాలయంలో మకాం వేశాడు. అల్లరి గుంపంతా కలిసి వెళ్లి యోగిని ముట్టడించింది. ఆ మహాత్ముడు వారడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పి 'నాయనలారా! రెండు రోజులుగా భోజనం చేయలేదు. ఏమైనా తెచ్చి ఇవ్వగలరా?' అని కోరాడు. వారిలో ఒక యువకుడు వెంటనే ఇంటికెళ్ళి ఒక గ్లాసునిండా పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. పాల గ్లాసు చేతపట్టుకొని అక్కడే పడి ఉన్న ఒక పుల్లతో పాలను కలియబెడుతూ పదేపదే పరీక్షగా ఆ పాలలోకి తొంగిచూడటం మొదలుపెట్టాడు. పాలు తాగమన్నాడు తెచ్చి ఇచ్చిన యువకుడు. 'నాయనా! పాలలో వెన్న ఉంటుందని అంటారు. ఆ వెన్న చూద్దామని వెతుకుతున్నాను' అని చెప్పాడు యోగి. 'భలేవాడివే. అలా వెతికితే వెన్న ఎలా కనబడుతుందనుకున్నావు? ప్రతి పాల బొట్టులోనూ వెన్న ఉంది. కానీ అది అలా కనబడదు. దాన్ని వెలికితీసే పద్ధతి వేరే ఉంది. పాలను కాచి, తోడుపెట్టి, చిలికితే తప్ప వెన్న కనబడదు' అన్నాడు.
'మరైతే దేవుడున్నాడా? ఎక్కడున్నాడో చూపెట్టు అంటూ ఇందాక మీరందరూ కలిసి నన్ను సతాయించారే. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన అందరికీ కనబడడు. కొందరే చూడగలరు. దేవుని చూసే ప్రక్రియ వేరే ఉంది' అని చెప్పాడాయన. 'అది ఎలా సాధ్యమో చెప్పండి' అన్నాడు అతను.
'మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. విషయం మళ్ళీ తెలియజేస్తాను. ఇప్పటికిక నన్ను వదిలిపెట్టండి' అని వారిని సమాధానపరచి పంపాడు.
పాలు తెచ్చి ఇచ్చిన యువకుడికి యోగి మాట తీరు బాగా నచ్చింది. ఆయన ద్వారా విషయాలు మరిన్ని తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు.
మరునాడు ఉదయం రామాలయానికి వెళ్ళాడు. యోగిని దర్శించుకొని 'స్వామీ! మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగాలనుకొంటున్నాను. అడగమంటారా?' అన్నాడు. 'అడుగు నాయనా! నాకు తెలిసిందేదో చెబుతాను' అన్నాడాయన. 'దేవుణ్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక నాకు ఎంతో కాలంగా ఉంది. నెరవేరుతుందంటారా?' అని అడిగాడు యువకుడు. 'నేను చెప్పినట్టు చేస్తే తప్పక నెరవేరుతుంది. దేవుని నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. రేపు సూర్యోదయానికి ముందే శుచిగా నువ్వు ఇక్కడికి రా' అని చెప్పాడు.
యోగి చెప్పినట్లు యువకుడు మర్నాడు రామాలయం దగ్గరికెళ్ళాడు. అప్పటికే ఆయన ఒక మూట తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆ యువకుని రమ్మని 'ఇదిగో ఈ మూటను తలపై పెట్టుకొని నాతోపాటు ఆ కనబడే కొండ శిఖరాన్ని చేరుకో. అక్కడ దేవుని ప్రత్యక్షంగా నీకు చూపెడతాను' అన్నాడు.
యువకుడు మూట నెత్తిన పెట్టుకొని కొండ ఎక్కసాగాడు. కొంత ఎత్తుకు వెళ్లేసరికి మూట బరువనిపించింది. యోగికి చెప్పాడు. 'మూట విప్పి అందులోంచి ఒక రాయి తీసి పడేసి మళ్ళీ పయనం సాగించు' అన్నాడు. ఆయన చెప్పినట్లే చేసి ముందుకు నడిచాడు. ఇంకొంత ఎత్తుకు వెళ్ళాక మళ్ళీ మూట బరువనిపించింది. వెనకాలే వస్తున్న యోగికి చెప్పాడు. ఇంకొక రాయి తీసి పడేయమన్నాడు.
ఇలా ఒక్కొక్క రాయి చొప్పున ఆ మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్లూ తీసి పడేశాడు. ఖాళీ చేతులతో కొండ శిఖరం చేరుకున్నాడు. 'మీరు చెప్పినట్టే ఇక్కడికి చేరుకున్నాను. దేవుని ప్రత్యక్షంగా చూపెట్టండి' అన్నాడు యువకుడు. 'నాయనా! మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ శిఖరందాకా మోయలేక ఒక్కొక్కటిగా అన్నీ తీసి పడేసి చివరికి వట్టి చేతులతో ఇక్కడికి చేరుకున్నావు. నేను అందులో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ మామూలు రాళ్ళని అనుకోకు. అరిషడ్వర్గాలుగా పిలిచే ఆరు చెడ్డ గుణాలకు అవి ఉదాహరణలు. వాటిని తీసివేసిన తరవాతే సులభంగా ఈ శిఖరం చేరుకున్నావు- అవునా?' అన్నాడు. 'అవును' అన్నాడు అతడు. 'అలాగే మనిషి ఎదుగుదలకు అన్ని విధాలా అడ్డుగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు చెడ్డ గుణాలను మన నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడు ఏ పని చేసినా సులభతరమవుతుంది. సఫలమవుతుంది' అని పలికాడు యోగి.
'అరిషడ్వర్గాలన్నింటినీ అరికట్టే మార్గమేదో దయచేసి తమరే తెలియజేయండి' అన్నాడీసారి యువకుడు. 'అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. అంతర్ముఖ బుద్ధి సంపాదించి సాధన సంపత్తి సాధిస్తే ఇక అసాధ్యమనేది ఏదీ ఉండదు' అని విడమరచి చెప్పాడు యోగి. ఈ మాటలతో యువకుని మనసు మారిపోయింది. 'స్వామీ! ఇక ఈ క్షణం నుంచి నా నడవడికను మార్చుకుని మంచి మార్గంలో పయనిస్తాను' అని చెప్పాడు. అతణ్ని అభినందించాడు యోగి.
(ఈనాడు, అంతర్యామి, ౦౯:౦౫:౨౦౧౦)
________________________________
Labels: Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home