సాధించకే మనసా...
'ఎంత నేర్చిన, ఎంత జూచిన, ఎంత వారలైన కాంతదాసులే'నన్నాడు త్యాగరాజస్వామి. బ్రహ్మవాక్కులా నాదబ్రహ్మవాక్కూ తిరుగులేనిది. అందుకు దృష్టాంతాలు బోలెడు. సాక్షాత్తు దేవుళ్లూ తమ దేవేరుల్ని ఆ స్థాయిలో అందలాలెక్కించి గౌరవించినవారే. సుర గంగను శివయ్య తలమీద ధరించాడు. సిరితల్లి శ్రీమహాలక్ష్మిని విష్ణువు తన వక్షస్థలంలో దాచుకున్నాడు. సంగీత సాహిత్య సమలంకృతమూర్తి సరస్వతిని బ్రహ్మ రసనాగ్రంపై నిలుపుకొన్నాడు. తమ దారలు ముగురమ్మలను అలా తమ తనువుల్లో పొదువుకున్న ఆ అయ్యలపై వేమన- 'స్త్రీ నెత్తిన రుద్రునకు/ స్త్రీ నోటను బ్రహ్మకెపుడు/ సిరి గుల్కంగా స్త్రీ నెరిరొమ్మున హరికిని' అంటూ చెణుకు విసిరాడు. బహుశా దాన్ని అందిపుచ్చుకునే కాబోలు ఓ కవి- 'మొగలాయి దర్బారులో వలెనే, మా దేవతల స్వర్గంలోనూ శిరస్దదార్, ఉరస్దదార్, ముఖస్దదార్‌లు ఉన్నా'రని చమత్కరించాడు. భగవంతుణ్ని చేరుకోవడానికి పెద్దలు చూపిన నవవిధ భక్తిమార్గాల్లో సఖ్యం, దాసత్వం కూడా ఉన్నాయి. అనురక్తితో భామకు చేరువ కావడానికీ ఆ రెండు దారులు అనుసరణీయాలే. పరమేశ్వరుడంతటివాడికే వాటిని ఆశ్రయించక తప్పలేదు. తాను కొత్తగా పెళ్లాడిన గంగను జటాజూటంలో దాచుకుని, అత్తారింటినుంచి కైలాసానికి తిరిగి వచ్చిన ఆయనను భార్య పార్వతీదేవి గుమ్మంలోనే నిలువరించి పరిపరి విధాల నిలదీసింది. 'ఇడుముల బెట్టు జనులెందరైనా గలరు/ అలరు సఖ్యత జూడనొందజాలరుగా' అంటూ... పరులు చెప్పే చాడీలు నమ్మవద్దని శివయ్య ఎంత వేడుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి- 'పదివేల నేరములు భామరో నావల్ల- పదివేల దండములు భామరో నీకు' అని శివుడు ప్రాధేయపడ్డాకే శివాని శాంతించింది. దాసుని తప్పులు దండముతో సరి అన్న సామెతను నిజం చేస్తూ, ఆయనను లోనికి రానిచ్చింది. ఆ తరవాత, తన వంతుగా అలిగిన గంగ శంకరుని నిష్ఠురాలాడి పుట్టింటి దారిపట్టింది. పోతూపోతూ పార్వతితో- 'నీలకంఠుడు, నీవు నిఖిల సంతోషమున/ కేళీవినోదముల ఓలలాడండి/ ఇంతపని కలిగిన ఇంతి నీ వద్దకు రాను/ వస్తే ఒట్టు పూనుకుంటాను' అని పంతగించి మరీ పుట్టింటికి వెళ్లడం- జానపదుల శివానందలహరిలో ఓ రసమయ వీచిక!
'కాచి వడపోశాం, కొంగున కట్టేసుకున్నామని మనం అనుకోవడమేకానీ, ఈ మగవాళ్లు ఎంతకైనా తగుదు'రని ఆడవాళ్లు రూఢి పరచుకునేలానే ఉంటాయి ఒక్కోసారి మగవారి చేతలు! అటువంటి సందర్భాల్లో ఇంటావిడ అలనాటి రాధ మాదిరో, అపర సత్యభామ వలెనో ఇంటాయనను సాధించడంలో అబ్బురమేముంటుంది? 'నిన్ను ప్రేమించి సహనమ్ము నేర్చినాను/ అలిగి నన్నేమి సాధించగలవు నీవు?' అని అతగాడు అన్నా, అవి మెరమెచ్చు మాటలుగానే మిగిలిపోతాయి తప్ప మురిపించవు, మరిపించవు. తనపై కినిసిన రాధికను ప్రసన్నం చేసుకోవడానికి కృష్ణుడు ఎన్నిపాట్లు పడ్డాడని! కోపం మాని తనతో మళ్ళీ చెలిమి చేయమని అర్థించాడు. మనవి వినమని వేడుకున్నాడు. మొగమెత్తి చూడవె అని ప్రార్థించాడు. తన ప్రేమను గుర్తించమంటూ చేతులు జోడించాడు. 'నిలువ దరంబుగాదు, కరుణింపవె నన్నిక భామినీమణీ!' అని ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. అంత చేసినా ఆ నల్లనయ్యను రాధిక తొలుత కరుణించిందా, లేదు. అసలు నిన్ను 'ఎవ్వరు పిల్చిరిచ్చటికి? ఎందుకు వచ్చితివి?... నే నెవ్వతె, నీవెవండవు? ఇక ఎవ్వరికెవ్వరు? దేనికేది' అంటూ గోపాలుణ్ని దులిపి పారేసింది! తన మందిరానికి వచ్చినట్లు 'మీ జవ్వని విన్న రవ్వలిడు' అని రుసరుసలాడుతూ, ఆ ఇళాదేవి ఇంటికే పొమ్మని ఆయనను గసిరింది. ఇక- కృష్ణయ్యపై 'సత్యా'గ్రహం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆయన అనునయ వాక్యాలు కేవలం మొగమెచ్చు మాటలే పొమ్మంది సాత్రాజితి. ప్రణయకలహాల వేళల్లోనే ప్రియవిభుణ్ని అంత పరుషోక్తులతో ఆ కథానాయికలు సాధించడం- ఎంతకైనా తగుదురనిపించేలా వ్యవహరించే నేటి కాలపు జతగాళ్లకు కనువిప్పు కావాలి.
భర్త తోడిదే తన లోకమని భార్య పరవశించడం సహజం. తనవాడనుకున్న మనిషి తనను చులకన చేయడం హృదయశల్యమై ఆమెను బాధిస్తుంది. ఏ విషయంలోనూ తన మాట చెలికాడు వినిపించుకోకపోవడం ఆమె మనసును గాయపరుస్తుంది. అతడు తనను ఏమాత్రం పట్టించుకోకపోతే ఆమె వేదన ఇంక వర్ణనాతీతమే. సమాజంలో అటువంటి భర్తలూ లేకపోలేదు. అలా తనను విస్మరిస్తూ, తనమాట పెడచెవిన పెడుతున్న భర్తను దారికి తెచ్చుకోవడానికి భార్య నడుం బిగించక తప్పదన్నది మారియా గార్సియా-కాబ్ ఉవాచ! అందుకు దిక్సూచిగా- 'మీ భర్తను వేధించడానికి నూటొక్క మార్గాలు (101 వేస్ టు టార్చర్ యువర్ హజ్బెండ్)' పేరిట ఏకంగా ఓ పుస్తకం రాసిందామె. మాట వినని భర్తకు సంక్లిష్టభరితమైన నృత్యాలు చేసేలా శిక్షణ ఇప్పించడం, ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువుల జాబితా ఇచ్చి వాటిని తెచ్చి తీరాలని కోరడం- ఆమె పేర్కొన్న చిట్కాల్లో కొన్ని. 'తన మాటను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే భర్త చేత భార్య ఈ పనులు మాత్రం ఎలా చేయించగలుగుతుంది చెప్మా!' అన్నది ధర్మసందేహం. 'భర్తను వేధించడానికి నూటిపైఒక్క చిట్కాయేం ఖర్మ, మాకు రెండొందలపైన మరో రెండు కిటుకులు తెలుసు'నంటూ కొంగుబిగించి మరీ ధీమాగా చాటగల ధీరవనితలూ ఉండవచ్చు. అయినా, భర్తను దారికి తెచ్చుకోవడానికి గుప్పెడు మనసు, పిడికెడు మమత చాలవూ? 'నీవు లేవనునట్టి కాలమే నాకు లేదు/ నా దారినుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు/ నీవు లేనిచోటున నాకు చోటులేదు, సుఖము లేదు, లేదు ఉనికి' అన్న తిలక్ అనువాద కవిత దారిదీపమై- జీవితపథాన పరస్పర అనురాగంతో జీవనయాత్ర సాగిపోతే ఏ దంపతుల మధ్యనైనా పొరపొచ్చాలూ రావు, వేధింపుల ప్రసక్తీ ఉండదు!
(ఈనాడు, సంపాదకీయం, ౦౯:౦౨:౨౦౧౦)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home