ఆనందో బ్రహ్మ

బాల్యంనుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశా మానవజీవిత మహాప్రస్థానాన మనుగడ దిశలో ఓ మజిలీ. ప్రవాహంలోకి మళ్లిపోయిన నీళ్లు వెనుదిరిగి రాని విధంగానే- జీవన స్రవంతిలో దొర్లిపోయిన దినాలూ మరల మరలి రావు. వాటి తాలూకు జ్ఞాపకాలు మాత్రం- ఏరు విడిచిపెట్టి ఎక్కడికీ పోని కెరటాల్లా- మనిషి స్మృతిపథాన్ని ఎన్నటికీ వదిలివెళ్లవు. యౌవనంలో పొగరుగా, గర్వంగా, నిర్లక్ష్యంగా, దర్పంగా గడిపిన 'ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా/ ఆనందంలాంటి విచారం కలుగుతుంది' అన్న కవి తిలక్ పలుకులు గుర్తుకొచ్చి, హృదయం బరువెక్కుతుంది. కాలయవనిక వెనక్కి అలా కనిపించకుండా వెళ్లిపోయిన 'ప్రతి ఒక్క నిమిషం ఒక్కొక్క ఒమర్‌ఖయ్యాం/ రుబాయత్ పద్యాలవంటి రోజులవి, ఏవి ప్రియతమ్/చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని?' అన్న జవాబు దొరకని ప్రశ్న ములుకై తొలిచినప్పుడల్లా గుండెలు చెమ్మగిల్లుతాయి. గడచిన దినాల తలపోతలో ఆస్వాదించే విషాదమాధుర్యం మనిషి మనసున గిలీ రేకెత్తిస్తుంది, చక్కలిగిలీ పెడుతుంది. పరువపు ప్రాయాన- పసితనంలోని అల్లరులు, అమాయకపు ముచ్చట్లు; ముదిమి వయసులో- యౌవనపు రోజులనాటి సరదాలు, చిలిపి మురిపాలు ఎద తలుపులు తట్టినప్పుడు ఎన్ని గిలిగింతలో, ఎన్ని పులకింతలో! సందిట మంచినీళ్ల కడవను పెట్టుకుని, మరో చేతిలో కరివేపాకు రెమ్మల్ని పట్టుకుని వస్తున్న తన భార్యను కాసేపు ఆగమన్నారు తాతగారు. అలాగే నిలబడిన ఆ పండు ముత్తయిదువలో భేష్, ఆడతనం ఇంకా ఉందని మెచ్చుకున్నారు. నడుంమీద వయ్యారంగా చేయిపెట్టి 'చిన్నప్పుడు మా ఆవిడ అలవోకగా త్రిభంగిగా నిలిచేది. మీ అమ్మమ్మ అయిన తరవాత కడవ రొండిన పెట్టుకుంటేగాని ఆ భంగిమ రావడం లేదు'- అని మనవడితో చెబుతూ మురిసిపోయారు ఆ వయసులోనూ! 'నేను మడి' అంటూ పెద్దావిడ బిడియపడటంలో తెలుగు ఒదుగునీ; 'మనం ఒక్కుమ్మడి, రా పిల్లా' అంటూ వాత్సల్యపూరితంగా ఆ పెద్దాయన ఆమెను చేరబిలవడంలో తెలుగు చమక్కునీ- తన అక్షరాల్లో మన కళ్లకు కట్టారు మల్లాది రామకృష్ణశాస్త్రి 'మధ్యాక్కర' కథలో!
మనసుతోనే తప్ప వయసుతో నిమిత్తం లేనిది ఆనందానుభూతి. రెక్కలు విప్పుకొన్న విహంగమై మనసు విహరిస్తుంటే- పదహారేళ్ల ప్రాయమప్పుడే కాదు- పదులు అయిదూ, ఆరు దాటినవేళలోనూ వయసు బరువు ఏమాత్రం బరువు అనిపించదు. మనిషి యాభయ్యోపడిలో పడటం- జీవితభానుడు నడిమింటి ఒడిలోకి చేరుకున్నాడనడానికి, జీవననౌక మరోమలుపు తిరిగి 'అవతలిగట్టు' వైపు మళ్లుతోందనడానికి ఓ సంకేతం. వ్యాధులు, బాధలపట్ల భీతి ఆ వయసులో మనిషి మనుగడను దుఃఖభాజనం చేస్తుందన్నది చాలామంది అభిప్రాయం. అది అపోహేనని, మనిషి జీవితం యాభై ఏళ్ల వయసు వచ్చిన తరవాతినుంచే ఆనందమయంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 'అయిదు పదుల వయసు దాటినవారిలో కోపావేశాలు, మానసిక ఆందోళనలు, అప్పటివరకు వెన్నాడుతున్న ఒత్తిళ్లు క్రమేణా తగ్గిపోతాయి. వాటి స్థానే ఆనందోత్సాహాలు వారిలో పెల్లుబుకుతాయి. రోగాలు, రొష్ఠుల బారిన పడతామేమోనన్న భయసందేహాలను, ప్రతికూల భావనలను దరిచేరనీయకుండా- ఆ వయసులోనివారు సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తుంటారు' అని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో తేలింది. వ్యాధులు, మృత్యువు వెన్నాడే ప్రమాదం ఎక్కువగా ఉన్నా- యాభైలలోనే మనిషి బాధల్నీ కష్టాల్నీ మరచిపోవడానికి, సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తుంటాడన్నది వారి పరిశోధనల సారాంశం. 'ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా/ వీట లేడని చెప్పించు, వీలు కాదని పంపించు' అంటూ- వయసు పైబడుతున్నా, వృద్ధాప్యాన్ని మనసు ఛాయలకైనా రానీయకుండా ఉన్నన్నినాళ్లూ, మనిషి జీవితాన ఆనందపు తిరునాళ్లే!
(ఈనాడు, సంపాదకీయం, ౦౬:౦౬:౨౦౧౦)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home