My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, June 20, 2010

కని పెంచే విధాతలు

జన్మప్రదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపందిద్ది, ప్రాణం పోసి, చలనాన్ని కల్పించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఇక్కడి పిల్లలు! బిడ్డలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. పసితనాన 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట... చిరుతప్రాయానేకాదు, జీవనపర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరో వేదమే. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీరకొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనట్లుగా లేడిపిల్లలా చెంగున వచ్చి వాలేందుకు గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! ఇతరుల పిల్లలకంటే తమ కలల పంటలే జనమెచ్చు బిడ్డలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకసహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింటి మురిపెం. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్య, అమ్మ పరవశించడం తెలుగు లోగిళ్ల ముచ్చట. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించలేకపోవచ్చుకానీ, వాటి కాంతుల్ని ధిక్కరించేలా మిలమిలమెరిసే మల్లెపువ్వుల్లాగా వారిని చూసుకుంటారు. బిడ్డలకు వారు పట్టుపరుపుల్ని అమర్చలేకపోతే మాత్రమేం, వాటి మెత్తదనం దిగదుడుపనిపించే తమ రెక్కల్నే వారికి పక్కలుగా పరుస్తారు. పసికూనలుగా తమ చిన్నారులు బుడిబుడి అడుగులు వేసే వేళ, వారికి ఆసరాగా తమ చేతుల్నే అందించేటప్పుడు అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందమే. చేతికి అందివచ్చేదాకా, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా తమ భుజాల్నే దండెలుగా కూర్చేదీ అమ్మానాన్నలు కాక ఇంకెవ్వరీలోకంలో?

పొత్తిళ్లనాడే కాదు, ఎంత ఈడు వచ్చినా తమ సంతానం కన్నవారి కళ్లకు పసివాళ్లే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్‌ కడువృద్ధులు/ ఆకటన్‌ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.

అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృష్టి!
(ఈనాడు, సంపాదకీయం, ౧౬:౦౫:౨౦౧౦)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home