ఉత్తమ సందేశం
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా
ఎవరి హృదయంలో బాధాగ్ని రగిలినా, ఆర్పగలిగే తపన, ఉదార సానుభూతి ఉత్తమ ప్రవర్తనకు నిదర్శనాలని ఉద్గ్రంథాలెన్నో ఘోషిస్తున్నాయి. ఆర్తులను చేరదీసే ఆత్మీయత ఒంటినిండా మనం నింపుకోలేకపోవడం ఆ పరాత్పరుని దృష్టిలో తీరని లోపం. పొరుగువారి ఆకలిని అర్థం చేసుకోగల మనో పరిపక్వత మనకవసరం. పేదలు, బలహీనులు, కదలలేని వృద్ధులు, రోగులు- వీళ్ల సేవ చేయడంలోనే దేవుని మహోన్నత సేవ ఉందని గ్రహించిననాడే నిజమైన దైవభక్తులం కాగలం. అంతరంగాల్ని కలిపేది ఆరాధన. మనిషి మనిషి మధ్య మైత్రిని విరబూసేలా చేసేది భక్తి. నిరంతరం సద్గుణాలవైపు మనసును మరల్చగలిగితే- నవజీవన మాధుర్యం.
ఆ జగదీశ్వరుడు తనను ఆరాధించేవాళ్లకంటే, స్తుతించేవాళ్లకంటే విపత్తుల్లో ఉన్నవారిని చేరదీసి కన్నీరు తుడిచేవాళ్లను అధికంగా ఇష్టపడతాడన్నది అక్షర సత్యమని విజ్ఞుల అభిప్రాయం. సాటి మానవుల్ని ప్రేమించాలని, మంచిని మంచివాళ్ల ప్రేమను పొందాలని నిరతం మనం కోరుకోవాలి. మనం ఎంత పవిత్ర జీవితం గడిపినా, ఎంత నిష్ఠాగరిమను పాటించినా ఒక పేదవాడి మనసుకు బాధ కలిగిస్తే మనం చేసిందంతా నిష్ప్రయోజనమే.
అదొక ఎడారి. చీకటి దట్టంగా అలముకొంది. దాదాపు అంతా నిర్మానుష్యం. హఠాత్తుగా తుపాను చెలరేగింది. ఎముకలగూడులా ఉన్న డెబ్భై ఐదేళ్ల వృద్ధుడొకడు తుపానులో చిక్కుకొన్నాడు. బాగా అలసి ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకొంటూ సహాయం కోసం అలమటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒకే ఒక చిన్న ఇల్లు కనిపించింది. తలదాచుకోవడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించాడా వృద్ధుడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమాని భోజనానికి లేవబోతున్నాడు. ఆకలిగొన్న అతిథి ఇంటికి రావడం గమనించాడు. అతిథిని ఆదరించాలని అన్ని మతాలూ చెబుతాయి. ఆ గృహస్థుడు తన మతవిధానాల్ని సునిశితంగా అధ్యయనం చేశాడు. 'బాగా ఆకలిగొని ఉన్నావు. దేవుడు ప్రసాదించిన ఈ భోజనాన్ని నాతో కలిసి భుజించి ఆకలి తీర్చుకొందువుగాని రా సోదరా!' అన్నాడాయన అతిథితో. ఆప్యాయత అనురాగం కలగలిసిన చల్లని మాటవిని వృద్ధునికి ప్రాణం లేచివచ్చింది. గృహస్థు దస్తరుఖాన్ (భోంచేయడానికి ముస్లిములు పరచుకొనే వస్త్రం) పరిచాడు. భోజనం వడ్డించాడు. ఇరువురూ భోజనానికి కూర్చున్నారు. వృద్ధుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. 'ఆగు' అని కోపోద్రిక్తుడై ఇంటి యజమాని హుంకరించాడు. 'ఈ ఆహారం ఎలా లభించిందనుకొన్నావు? దేవుని దయవల్ల. ఆ దేవునికి మొదట కృతజ్ఞత తెలుపుకోవాలని నీకు తెలీదా? బిస్మిల్లా (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో) అని దేవుని స్మరించుకోవాలి'- గృహస్థుని మండిపాటుకు వృద్ధుడు భయంతో కంపించి వినయంగా 'అయ్యా! అదంతా నాకు తెలీదు. బిస్మిల్లా అనే మాటే ఇంతవరకూ నేను వినలేదు అన్నాడు. అయితే నువ్వు దేవుణ్ని విశ్వసించేవాడివి కావు. మత విధులకు దూరంగా ఉన్నవాడివి. ఇక్కడ భోంచేసే అర్హత నీకు లేదు. వెళ్లిపో. నా ఇంటి నుంచి వెళ్లిపో' అని ఉరిమాడు గృహస్థు. వృద్ధుని ఆశ కుప్పకూలింది. భోజనంవైపు ఆశగా చూస్తూ బయటికెళ్లాడు. అంతా గాఢాంధకారం. పెను తుపాను. ఎటు వెళ్లిపోయాడో! ఏమైపోయాడో... ఇంటి యజమాని శాంతించి, తనకు ఆహారం సమకూర్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకొన్నాడు. కడుపునిండా తిన్నాడు. హాయిగా నిద్రించాడు. అర్ధరాత్రి సమయం. ఎవరో నిద్ర లేపినట్లు మేల్కొన్నాడు. దివ్యకాంతి పుంజం గోచరించింది- 'ఆకలితో నీ ఇంటికి వచ్చిన పండుటాకును కాస్తంతైనా కరుణచూపక వెళ్లగొట్టావు. అతని అంతర్వేదనల భీతిని గ్రహించలేని, నీ ఆలోచనా విధానం నాకెంతమాత్రం నచ్చలేదు. ధర్మం విలపించేలా ప్రవర్తించావు'- దేవదూత ద్వారా దేవుని మాటలు వినిపించాయి.
'ప్రభూ! అతడు నిన్ను విశ్వసించేవాడు కాడు. అతనికెలా ఆహారం పెట్టగలను?'- అన్నాడు ఇంటి యజమాని.
'ఏదీ నీది కాదు. సర్వమూ నాదే. నీ ఆధిపత్యం అనవసరం. డెబ్భైఐదేళ్లుగా నేను వృద్ధుణ్ని పోషిస్తున్నాను. ఒక్కపూట అన్నం పెట్టలేకపోయావు నువ్వు. హృదయమాలిన్యం తొలగించలేని నీ మతానుష్ఠానమెందుకు? ప్రార్థనలెందుకు?- దైవ వాక్కులు మళ్లీ దేవదూత వినిపించాడు.
ఇంటి యజమాని స్తంభించిపోయాడు. తేరుకొని తప్పు గ్రహించాడు. పశ్చాత్తాపంతో వలవలా విలపించాడు.
ఈ కథ కల్పితమా, వాస్తవమా? ప్రశ్నలు ప్రధానం కాదు. దుఃఖభూయిష్ఠమైన వదనాల వెనుక ఎంత విషాదం పొంచి ఉందో గమనించగలవాడే నిజమైన భక్తుడు. కష్టాల్లో సాటి మనిషికి సహాయం అందించని నరునికి దైవత్వం దూరంగా ఉంటుంది- అనే ఉత్కృష్టమైన సందేశం లోకం గమనించగలుగుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౧:౦౬:౨౦౧౦)
____________________________
Labels: Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home