ప్రాణదీపం
సకల చరాచర సృష్టిలో మహోత్కృష్ట ప్రాణి మనిషే. 'శౌర్యంబునకు పాదు/ స్వర్గంబునకు త్రోవ/ యెల్ల సుఖంబులకిది పట్టుగొమ్మ/ హెచ్చయిన వీరులకిది పుట్టినిల్లు' అంటూ పెద్దలు వర్ణించిన యుద్ధభూమికి- మనిషి కర్మక్షేత్రమైన జీవిత రణరంగం ఏమాత్రం తీసిపోదు. జీవన పోరాటానికి మనిషి నిత్యం సన్నద్ధంగా ఉండక తప్పదు. వీరకంకణం కట్టుకుని, విజయ సాధనకు మహాసంకల్పం చెప్పుకొనకా తప్పదు. ఆ సంగ్రామంలో క్షతగాత్రుడైనాసరే, 'నొప్పిలేని నిమిషమేది... జననమైన, మరణమైన/ జీవితాన అడుగు అడుగునా/ నీరసించి నిలిచిపోతె నిముసమైన నీదికాదు/ బ్రతుకు అంటే నిత్యఘర్షణ' అన్న కవి వాక్కే యుద్ధారావంగా ముందుకు సాగిపోవడానికి మనిషి దీక్ష వహించాల్సిందే.కొనడం! చుట్టూ ముసురుకున్న చీకట్లను చూసి మొహం చిట్లించుకోవడం కాదు, అంతటా పరచుకోబోయే ప్రభాతాన్ని స్మరిస్తూ పరవశించడం! 'ఉదయం కానే కాదనుకోవడం నిరాశ/ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ' అన్నాడు ప్రజాకవి కాళోజీ. సుఖాల్నే కాదు, దుఃఖాన్నీ; వెలుతురునే కాదు, చీకట్లనూ సరిసమానంగా ఆస్వాదించగల స్థితప్రజ్ఞత కలిగి ఉండటమే మనిషితనం. అదే- మనుగడకు దారి చూపే ఆశాదీపం.
మిట్టపల్లాల్లేని జీవన రస్తాలుండవు. ఆ దారులపై కాలు మోపిన పథికుడు- వూరించే శిఖరాల్నీ అధిరోహించాల్సిందే. ఉస్సురనిపించే లోయల్నీ అధిగమించాల్సిందే. 'పూలను కళ్లకద్దుకుని, ముళ్లను వద్దనబోకు నీవు' అన్నాడు కవితా శరధి దాశరథి. జీవితం పూలతేరుగా సాగిపోవాలని ఆకాంక్షించడం మానవ స్వభావం. ఆ పూల మాటున ముళ్లు కూడా ఉంటాయన్న జీవన సత్యాన్నీ మనిషి ఎరుకపరచుకోవాలి. కష్టసుఖాలూ వెలుగునీడలూ జీవిత రథచక్రాలు. వాటి నిరంతర చలనంలో- కలతలూ కలలు, ఖేద ప్రమోదాలు, చీకటి వెలుగులు ఒకదాని వెంట మరొకటి మనిషిని పలకరిస్తూనే ఉంటాయి. అవి- చేదు గురుతుల్నీ మిగిలిస్తుంటాయి. వాటి వెన్నంటే తీపి అనుభవాలనూ పంచుతుంటాయి. 'జరిగెడి ప్రతి చెడు చాటుననేదియో మంచి పొంచియుండునెంచి చూడ/ ఉరుములన్ని వాన కురియుటకే కదా' అన్న ఆత్రేయ సూక్తికి మకుటం పెడుతుంటాయి. జీవనపోరాటంలో ఎల్లవేళలా గెలుపు సాధ్యం కాకపోవచ్చు. అయినా, మనిషి కుంగిపోకూడదు. జీవితసంగ్రామంలో మనిషి అలసిపోవచ్చు. కానీ, ఓటమిని అంగీకరించకూడదు. తుదికంటా పోరాడాలి. ఆత్మస్త్థెర్యంతో ఓటమిని ఓడించి, గెలుపును గెలుచుకోవాలి సగర్వంగా! 'మానవుడా, నీకొసగిన మహిత ధనము జీవితమ్ము/ అస్తిత్వములో సౌఖ్యము సుస్థిరము చేయవలెను' అని ఏనాడో ఉద్బోధించాడు హరీన్ చట్టో. అందుకు కావలసిందల్లా మనిషి- మొక్కవోని ధైర్యంతో, మేరువంత దృఢచిత్తంతో ముందుకు దూసుకుపోతూ మనుగడ సాగించడమే.
జీవితమున్నది జీవించడానికే తప్ప అర్ధాంతరంగా అంతం చేసుకోవడానికి కాదు. కడగండ్లు, కన్నీళ్లు, అడ్డంకులు, అగ్నిపరీక్షలు ఎన్ని దండెత్తినా, 'సుమధుర మధురమైన బ్రతుకిది కల్పమ్ములేని వలయు'నన్నంతగా ప్రేమించాల్సిన జీవితాన్ని- మధ్యలోనే బలవంతంగా తుంచివేస్తున్న ధ్వంస దృశ్యాలు సమాజంలో తరచూ ప్రత్యక్షమవుతుండటం విషాదం. భావిభారతానికి ఆధారశిలగా అలరారవలసిన యువతరంలో అనేకులు క్షణికావేశానికో, తాత్కాలిక నైరాశ్యానికో లోనై తమ నూరేళ్ల నిండుజీవితాన్ని చేతులారా చిదిమి వేసుకుంటున్న సందర్భాలెన్నో! తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య... చదువు భారమనిపిస్తే తనువు చాలించడం... మార్కులు సరిగ్గా రాకపోతే మృత్యువు ఒడిని ఆశ్రయించడం... ప్రేమ విఫలమైతే ప్రాణత్యాగానికి ఒడిగట్టడం! దర్జాగా, ధీమాగా, సంతోషంగా, ఆనందంగా అనుభవించాల్సిన శత వసంతాల కాలాన్ని చేతులారా మధ్యలోనే తుంచేసుకోవడంద్వారా సాధించేదేమిటి? కన్నవారికి గుండెకోతను మిగల్చడం తప్ప! జీవితం మనిషికి లభించిన అమూల్యమైన వరం. ఏ మనిషైనా జీవించేది ఒక్కసారే. మరణం రెండుసార్లు రాదు. ఎప్పటికైనా 'చావు తప్పదు. కనుకనే జీవితమ్ము తీయనిది/ లేకున్న మోయగలమె?' అన్నాడు మనసు కవి. తీయనైన ఆ జీవితాన్ని తుదిదాకా మోయాలే తప్ప మధ్యలోనే బలవంతంగా ఆఖరి మజిలీకి మళ్లించకూడదెవరూ! ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారమార్గం కానేకాదు. కాలం విసిరే సవాళ్లనుంచి, చుట్టుముట్టే సమస్యలనుంచి పారిపోవడం కాదు- వాటిని ధిక్కరించి రొమ్ము విరుచుకుని నిలబడాలి. కూలిపోకూడదు. ఆరుద్ర అన్నట్లు- 'సమకాలిక జీవన విభావరిలో/ తమస్సులు ఘనీభవించాయనుకోవడం తప్పు/ అతి సన్నని వెలుగురేక లేదనుకోవడం తప్పు/ ఇది అనంతం సౌఖ్యవంతం అనడం ఒప్పు/ ఈ నిరాశలోంచి ఆశ జనించడం ఒప్పు.' మనిషి జీవితకావ్యంలో భరతవాక్యం మృత్యువేనన్నది నిజమే. అయితే, బలవన్మరణాలతో ఆ కావ్యం విషాదాంతం కాకూడదు. పసితనాన 'శతాయుష్షు', 'చిరంజీవ' అంటూ అమ్మ, నాన్న ప్రేమానురాగాలతో నోరారా ఆలపించిన ఆశీర్వచన వేదనాదాన్ని- ఏ బిడ్డా ఆత్మహత్యతో వమ్ము చేయకూడదు!
(ఈనాడు, సంపాదకీయం, ౨౨:౦౮:౨౦౧౦)
________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home