ఏది స్వర్గం, ఏది నరకం?
ఆ అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులు, భావుకులకు విశ్వసాహిత్యంలో కొదవే లేదు. కాళిదాసునుంచి మిల్టన్‌దాకా, కృష్ణశాస్త్రినుంచి కవి తిలక్‌వరకూ దివిసీమ అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డు పెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచాన్ని గురించే! 'అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరించిన తీరుకు మునిముచ్చులకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడునే గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? 'దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి వూరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల సాము గరిడీలట పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు! ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంతా సాధారణమైన సాధనేనా?! కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్పవృక్ష చ్ఛాయల్లో పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల వెచ్చని ఒడి... అమర గానం... అమృతపానం... అవో... ఏ మర్త్యప్రాణిని ఝల్లుమనిపించవు?! ఏడు వూర్ధ్వ లోకాలనే కాదు... ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'ఆ నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?! కాలదండం పాలబడకుండా కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి మార్గం. 'దైవమూ-దయ్యమూ, పాపమూ-పుణ్యమూ, స్వర్గమూ-నరకమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమాలిన వారలగుచు గదుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.

(సంపాదకీయం, ఈనాడు, ౨౨:౦౫:౨౦౧౧)
_____________________________
Labels: Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home