1193- జన విజయం
ఒకేలా కనిపించే ఒకటేననిపించే రెండు మాటలు... ఒకటి, ఒక్కటి. వీటిని అనడం, వినడం, రాయడం కాస్త అటూఇటుగా ఒకలానే ఉన్నా అర్థ పరమార్థాల రీత్యా 'విడివడి- కలివిడి'కి ఉన్నంత అతి పెద్ద తేడా గమనించగలం. 'నేను'లో ధ్వనించేది ఏకాకితనమైతే, కరుణశ్రీ కవిగళంలా 'వ్యష్టిలోన సమష్టి భావమ్ము నించి/ సృష్టినెల్ల విశిష్ట దృష్టికి లగించి' నినదించేది 'మనం' అనే ఏకత్వ భావనే. ఏ మనిషైనా 'నాకు నేనే, నీకు నీవే' అనుకోవడంలో తాండవించేది స్వార్థబుద్ధి; 'నువ్వు, నేను- మనం' అనుకోవడంలో పరిమళించేది మంచి గంధంలాంటి మానవత్వం. మానవ జీవనానికి మాన్యత, సార్థకతల్ని ప్రసాదించేది- ఉపకారం! సహాయం, సహకారం, మేలు... పేర్లు ఏవైనా అంతరార్థం హిత కల్పన. చిలకమర్తి పలికినట్టు 'తన దేహము తన గేహము/ తన కాలము తన ధనంబు తన విద్య జగ/ జ్జనములకై వినియోగించిన నరుడే నరుడు'. ఉపకారులు యశశ్శరీరులని ఆ కవి, ఉపకారమే హితకరమని అటుతరవాత వేమన కవీ చాటిచెప్పిందీ అదే. పొరుగువాడికి సాయపడాలన్న తపనంటూ ఉండాలే కానీ... అవసర సమయంలో ఓ సూచన చేసినా, సలహా ఇచ్చినా, సమాచారమందించినా, ధైర్యం కలిగించినా, చేతనైనంత వూతం కల్పించినా- అది మనిషితనం. అదే తరతరాల మన భారతీయతకు ఆదర్శ రూపం. 'ఒకరికి చేసిన ఉపకారాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోకు, ఒకరినుంచి పొందిన ఉపకారాన్ని ఎన్నడూ మరిచిపోకు' అన్న ఎమర్సన్ మాటల వెనక దాగుందీ- ధన్యత, కృతజ్ఞతలనే పేరున్న ఆ వారసత్వ సత్ఫలాలే.
మనుషులకు తృప్తి, సంతుష్టి ఇచ్చేవేమిటి? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం- పరోపకారం. నరసింహ శతకకారుడు చెప్పినట్లు- 'ధరణి వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు/ దారసుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు'. అంతేకాక 'బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమమేమి పనికిరాదు/ ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు'. ఇక్కడ ఉన్నవాటిలో ఏ ఒక్కటీ వెంటరాని స్థితి తెలిసీ, మనుజులకు ఎందుకింత స్వార్ధచింతన? సమున్నత హితానుభూతి, సున్నిత సానుభూతి ఒడలెల్లా నిండితే- మంచును మించే చక్కని స్పర్శా, మమతను పెంచే చల్లని పరామర్శా... వారివే కదా! ఎదుటి మనిషి స్థితిగతులకు స్పందించే హృదయమే సౌహార్దం చూపుతుంది. మరే ప్రయోజనాన్నీ ఆశించకుండా జనహితాన్ని సాధించితీరుతుంది. సిరివెన్నెల కంటపడినట్టు అదే- 'ప్రతీ మదినీ లేపే ప్రభాతరాగం/ పదేపదే చూపే ప్రధానమార్గం/ ఏదీ సొంతం కాదను సందేశం/ పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం'. స్వచ్ఛమైన సేవాహృదయానికి ఏ తారతమ్యాలూ ఉండవు. భర్తృహరి పలికినట్టు- ఉత్తములు తమ పనులు వదులుకుని అయినా సాటివారికి ఉపయోగపడతారు. నాగరికతలో, సాగే చరితలో వారే సారథులు, ఆదర్శపరులు. మనసు మార్గం చూపితే, మమత దీపంగా మారితే లోకానికి అదే శుభమూ విజయమూ.
గత మాసం, 'మనమంతా ఒక లోకం, పదిమందీ మనమేకం' అన్నట్టు ఒక్క తాటిమీద కలిసికట్టుగా నిలిచి గెలిచింది ఓరుగల్లు ప్రజ. రాష్ట్రంలోని గుంటూరు, తిరుపతి, ఖమ్మంతో పాటు ఆ నగరంలోనూ ముగిసిన జేఈఈఈ(ఉమ్మడి ప్రవేశ పరీక్ష) జనం చేయూతకు జేజేలనేలా వెలుగులీనింది. కాజీపేట, హన్మకొండ కలుపుకొని త్రినగరిగా పేరొందిన ఓరుగల్లుకు తొలినుంచీ జాతీయస్థాయిలో సమున్నత వారసత్వ సంపదగా ఖ్యాతి ఉంది. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఇతర శ్రేయోభిలాషుల వెంటవచ్చి అక్కడ పరీక్ష రాసి వెళ్లిన విద్యార్థినీ విద్యార్థులందర్నీ కలిపిచూస్తే ఆ సంఖ్య రమారమి ఓ లక్ష. వారిని అతిథులుగా సమాదరించడంలో స్థానికులు కనబరచిన సహృదయతే- మానవతకు శ్రీరామరక్ష.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాలనుంచీ చేరుకున్న ఎందరెందరినో అతిథులుగా స్వాగతించారు వరంగల్ నగరవాసులు. 'మండుటెండల్లో పన్నీటిధార' కురిపించిన స్వచ్ఛంద సేవాక్రతువుగా అది ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగనిది. దూరాభారాలు, వ్యయ ప్రయాసల్ని చవిచూపించిన నిరుటి బాధాకర అనుభవాలు ఈసారి మచ్చుకైనా కానరాలేదు. 'ఉపకారమే వూపిరి' అని చాటిచెప్పేలా 'ప్రతి ఒక్కరికోసం అందరూ' వెన్నంటి ఉన్న చరిత్రాత్మక సహాయ పరంపరే... అదంతా. వచ్చినవారంతా తిరిగి ఇళ్లకు మళ్లేవరకూ ఆసాంతమూ విలక్షణ ఆతిథ్యమే! మునుపటిలా పరీక్షార్థులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా ఇప్పుడే మేలుకొని మున్ముందుకు సాగాలన్న 'ఈనాడు' సాదర పిలుపును మనసారా అందిపుచ్చుకొన్నారా పౌరులు. బంధువుల్లా ఆహ్వానించి, భోజనాదికాలతో సమాదరించి, పరీక్షా కేంద్రాలదాకా రవాణా సదుపాయాలూ కల్పించి, అటుతరవాత ఎవరిళ్లకు వాళ్లను 'శుభమస్తు, విజయోస్తు' అంటూ సాగనంపిన ఆ వైనం స్ఫూర్తిమంతం, నిరుపమానం. వ్యక్తులే కాదు- సంఘాలు, సంస్థలు, శాఖలు, అధికార, అనధికార, స్వచ్ఛంద విభాగాలన్నీ అడుగడుగునా వూతమివ్వడం ఒక సరికొత్త ఒరవడి. వచ్చిందెవరో తెలియకున్నా, వారిని మునుపెన్నడూ చూడకున్నా, సొంతమనుషుల్లా చూసుకున్న మనో విశాలత అబ్బురపరచింది. జాతి, మత, ప్రాంత, కుల, వర్గ, భాషా భేదాలకు అతీతంగా ఎవరికివారే ఎక్కడికక్కడే అందించిన ఆ తోడ్పాటు... మూర్తీభవించిన మంచి మనిషితనం. స్పందించిన అక్కడి ప్రతీ హృదికీ మనసాభివందనం.
(ఈనాడు ,సంపాదకీయం ,14:04:2013)
__________________________________
Labels: Amazing, Education, Events, Life/telugu, Self development/Telugu, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home