My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, March 05, 2014

1359- కాలమర్మం!

 
 
 'ఒక్కనాటి ప్రపంచము ఒక్కనాటి వలెకాదు/ ఒక్క నిమిషము వలెనొకటి గాదు-' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలవివేచన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు 'సూర్యుణ్ని ఉషాకన్యానాథుడి'గా ప్రస్తుతించాయి (రుగ్వే. 7 మం. 75 రుక్కు). బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్ధాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని. 'ద్వంద్వాన్ని సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత, తత్వవేత్త హక్స్‌లీ. మన శంకర భగవత్పాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నదీ ఇదే రహస్యం. 'అతీతాది వ్యవహార హేతుః' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు. కాలచింతనే మహా వింతైనది. భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధిస్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'ప్రారంభ సంపత్తికాధారం బెయ్యది?' అని సందేహపడితే... 'ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం?' అని ఆరుద్ర 'త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. 'మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని/ వూపిరి పోసుకున్న క్షణాన/ నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో' అనే మథన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తిరుగాడే నాటినుంచే వెంటాడుతోంది. కాలం- పదార్థం నాలుగో పరిమాణమన్న సాపేక్ష సిద్ధాంతం అర్థం కానంతకాలం కంటిముందు కాలంచేసే గారడి అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నలవరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం' మొదలు 'కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి దెప్పించడం' దాకా 'కాలమహత్తత్త్వంబు నిట్టిదనుచు వర్ణనము' చేయటం వశం కాదన్న బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ. కాలమర్మం అవగాహన కావాలంటే 'స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం' బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని, రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే. 'ఒక తరి సంతోషము, వే/రొక తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము' కూర్చే తలతిక్క కాలానిదని తూలనాడేదీ అందుకే. మనిషి కంఠశోషేగాని కాలానికేమన్నా కనికరం ఉంటుందా? 'కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ... ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా!' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా 'సౌందర్యస్పర్ధ'లో సుందరాంగుల అంగవిన్యాసమా? కాలం ఒక క్షణం వెనక్కన్నా చూడదు. ఏం సాధించాలనో ఈ నిబద్ధత?దువ్వూరివారు 'వనకుమారి'లో అన్నట్లు 'కష్టజీవి కన్నీటి కాల్వకైన గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు' కాలం. బోసిపాపల్ని నవ్వించడం, పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం... 'చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్ధులను దీర్ఘనిద్రకై దీవించడం'- కాలం ధర్మం.
అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం. నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. 'దైవరూపంబు కాలంబు దానికెపుడు/ లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి 'కల్యాణరాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ ...వృద్ధు కంట లేడిరీతి' పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పడానికి. 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌, ఐన్‌స్టీన్‌, లైబ్నిజ్‌. కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్‌.జి.వెల్స్‌ వూహ. అది వాస్తవమైతే ఎంత బాగుణ్ను! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. 'ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే' అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ' దృశ్యాన్ని కమనీయంగా పునర్వీక్షణ చేసి పులకించిపోవచ్చు. వూహకు అవధులు లేకపోవచ్చు. కాని దాన్ని భావించే బుద్ధికున్నాయిగా హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే? 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా../ అభివృద్ధీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి' అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా?' ఎక్కడ బయలుదేరిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో... ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్సరాలు. నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, గడవాల్సిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... బుద్ధిమంతులందరూ చేసే పనులు. చేయాల్సిన పనులు. కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!
(05:01:2014)
____________________________

Labels: , , ,

0 Comments:

Post a Comment

<< Home