1549- సర్వ ధర్మ పరాయణం (సువర్ణ , రజత , ప్లాటినం సూత్రాలు)
పరాయణం అంటే సర్వోత్తమమైన ఆశ్రయం, గమ్యం అని అర్థం. అయనం అంటే ఆధారం, ఆశ్రయం, నివాసం, ద్వారం అని అర్థాలున్నాయి. పర-అయనం అంటే ఉత్కృష్టమైన గమ్యం, ఆశ్రయం! సర్వ ధర్మాలకు పరాయణమై, సర్వ ధర్మ మార్గాల్లో అత్యుత్తమమైన మార్గం అని చెప్పే ధర్మం ఒకటి ఉంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది మహాభారతం శాంతిపర్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది.
మహా భారత యుద్ధం పూర్తయిన తరవాత, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వసిష్ఠ శిష్యుడు, ధర్మశాస్త్ర విశారదుడు. సర్వ విద్యలకూ ఆయన ఆశ్రయం. రేపు ఉత్తరాయణం రాగానే ప్రాణత్యాగం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ధర్మరాజు బంధుమిత్ర పరివార సమేతంగా తాతగారి దగ్గరకు వెళ్ళి సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ధర్మచర్చలు చేస్తాడు. ఈ చర్చల సారాంశంగా భీష్ముడు ధర్మరాజుకు ఒక్క ధర్మం బోధిస్తాడు. అది బాగా లోక ప్రసిద్ధమే అయినా తరచుగా మననం చేసుకోదగిన ధర్మం.'ధర్మ సర్వస్వ నైజ స్వరూపం' కరతలామలకంగా ఒక్క మాటలో చెబుతాను, విను' అని భీష్ముడు ఈ అతి ముఖ్యమైన ధర్మాన్ని బోధిస్తాడు. ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు కష్టంగా ఉంటుందో, తాను ఇతరులకు అవి చేయకుండా ఉండటం గొప్ప ధర్మమార్గాల్లో అన్నిటికన్నా విశిష్టమైంది. ఇది సర్వధర్మాల సంగ్రహ రూపం.
ఒక విచిత్రమేమిటంటే ఈ ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన, యూదు, పార్సీ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల మత గ్రంథాలన్నింటిలోనూ ఈ సూత్రం కనిపిస్తుంది. అన్ని మత సంప్రదాయాల్లో దాదాపు ఒకే రూపంలో కనిపించే ఒకే ఒక్క ధర్మసూత్రమూ ఇదే.
'ఏ వ్యవస్థలోనూ ఇతరులను నొప్పించటమనేది న్యాయమూ ధర్మమూ కాజాలదు' అన్నాడు సోక్రటీస్. అది సత్యమే కదా?
'నువ్వు ఇతరులకు ఏం చేశావో, వాళ్లు నీకు అదే చేస్తారు, సిద్ధపడు!' అని హెచ్చరిస్తాడు సెనెకా అనే వేదాంతి.
'నీకు అప్రియంగా నువ్వు భావించేదాన్ని, ఇతరుల మీద రుద్దకు' అంటాడు కన్‌ఫ్యూషియస్ అనే చైనా దేశపు విజ్ఞాని.
'నేను ఎలాంటివాడినో ఇతరులూ సరిగా అలాంటివారే. వాళ్లు ఎలాంటివారో నేనూ సరిగ్గా అలాంటివాడినే' అనే సూత్రం గౌతమ బుద్ధుడి బోధల్లో కనిపిస్తుంది. 'అవతలివాళ్లను నీతో పోల్చుకొని వారూ నీ వంటివారే అని గమనించు. చంపవద్దు, హింసించవద్దు' అంటుంది 'ధమ్మపద' అనే బౌద్ధ మత గ్రంథం.
'ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకొంటావో వాళ్లకు నువ్వూ అదే చెయ్యి' అనేది బైబిల్ బోధించే ముఖ్యమైన ధర్మ సూత్రాల్లో ఒకటి. 'నీతోటివాడిని నీలాగే ప్రేమించు!' అని బోధిస్తుంది పాత నిబంధనల పుస్తకం.
'స్వర్గానికి వెళ్లేందుకు తేలిక మార్గం ఏదైనా తనకు బోధించ'మని ఒక శిష్యుడు మహమ్మద్ ప్రవక్తను అడిగితే, 'ఇతరులు నీకు ఏం చేస్తే బాగుంటుందో, అది నువ్వు ఇతరులకు చెయ్యి, వాళ్లు నీకు చేసేవాటిలో నీకు నచ్చనివి నువ్వు వాళ్లకు చెయ్యకు!' అన్నాడట.
ఇలా అన్నీ మతాల బోధనల్లోనూ కనిపించే ధర్మసూత్రం కనుక దీన్ని 'సువర్ణ సూత్రం'(గోల్డెన్ రూల్) అన్నారు. 'ఇతరులు నీకేది చేస్తే నీకు బాగుంటుందో, అది వాళ్లకు నువ్వు చేయి' అనేది ఈ సూత్రం సకారాత్మక రూపం.
చెయ్యవలసిన విధిని చెబుతున్నది. ఇది సువర్ణ సూత్రం. భారతంలో చెప్పినట్టు, 'ఇతరులు ఏం చేస్తే నీకు అప్రియంగా ఉంటుందో, అది వాళ్లపట్ల నువ్వు చెయ్యకు' అనేది నకారాత్మక రూపం. చేయకూడని పనిని నిషేధరూపంలో చెబుతుంది. దీన్ని 'రజత సూత్రం'(సిల్వర్ రూల్) అనటం కద్దు.
ఈ సువర్ణ సూత్రంతో విభేదించే ప్రముఖులూ ఉన్నారు. జార్జి బెర్నార్డ్ షా ఇలా చమత్కరిస్తాడు- 'ఇతరులు నీకేం చేస్తే నీకు బాగుంటుందో, అది నువ్వు వాళ్లకు చెయ్యటం ఎప్పుడూ వివేకవంతమైన మార్గం కాదు సుమా! నీకు నచ్చింది వాళ్లకు నచ్చాలని ఎక్కడుంది?'
'నిరాశావాదులు, పిడివాదులు తమకున్న విలువలు, నమ్మకాలతో ఈ సూత్రాన్ని పాటించకపోతేనే ఇతరులకు మేలు. అందుకే ఈ సువర్ణ, రజత సూత్రాలకు తోడుగా 'ప్లాటినం సూత్రం' అన్న పేరుతో ఒక కొనసాగింపు ఉంది. 'నీకేది బాగుంటుదో అది ఇతరులకు చేయడం కాదు. వాళ్లకేది బాగుంటుందో చక్కగా ఆలోచించి, అది వాళ్లకు చేయి!'
________________________________
Labels: Life/telugu, Quotes/ Telugu, Religion/telugu, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home