2131~ కరెన్సీ ముద్రణ
ప్రశ్న: రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్న బంగారాన్ని బట్టి కరెన్సీ ముద్రణ ఉంటుందా? అసలు డబ్బుల ముద్రణ ఎలా ఉంటుంది?
జవాబు: పురాతన కాలంలో వస్తుమార్పిడి పద్ధతి ద్వారా వినియోగ వస్తువుల వినిమయం ఉండేది. కానీ కాలక్రమేణా వినియోగ వస్తువుల వైవిధ్యం పెరగడం వల్ల ఒకేచోట అన్ని వస్తువులు లభ్యం కాకపోవడం వల్ల వస్తువుకు, వస్తువుకు మధ్య వారధిలాగా కరెన్సీ, నాణేలు రంగంలోకి వచ్చాయి. ఆయాదేశపు అగ్రస్థాయి ఆర్థిక నియంత్రిత వ్యవస్థ ఆయాదేశాల్లో చలామణీ అయ్యే కరెన్సీ మోతాదును నిర్ధారిస్తుంది. మన దేశంలో ఆ అధికారం చాలామటుకు రిజర్వు బ్యాంకుకు ఉంది. నాణేల ముద్రణ వరకు పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ధారిస్తుంది.
మన దేశంలో 1, 2 ,5, 10, 20, 50, 100, 500, 1000 రూపాయల కరెన్సీ టెండర్లు ఉండగా గత సంవత్సరం నవంబరు 8వ తేదీ నుంచి 500, 1000 రూపాయల కరెన్సీకి తెరపడింది. వాటి స్థానే కొత్త 500, 2000 రూపాయల కరెన్సీ వచ్చింది.
కరెన్సీ నోట్లను దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్, మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటక రాష్ట్రంలో మైసూరు, పశ్చిమ్ బంగలోని సాల్బొని నగరాల్లో కట్టుదిట్టంగా ముద్రిస్తారు. వీటికి రిజర్వు బ్యాంకు గవర్నరు వకాల్తా పుచ్చుకుంటారు.
నాణేల ముద్రణ ముంబయి, నోయిడా, కోల్‌కతా, హైదరాబాదుల్లో జరుగుతోంది.
రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్న బంగారు నిల్వలతో పాటు దేశంలో పెరుగుతున్న జాతీయ స్థూల ఉత్పత్తి, వస్తువుల వైవిధ్యం, జనాభా పెరుగుదల, పాత కరెన్సీ వాడకంలో నలిగిపోయి పనికిరాకుండా పోయే తీరు మీద, ఆయా నోట్ల డిమాండు మీద ఆధారపడి వివిధ విలువలు గల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు.
- ప్రొ॥ ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, ఎడిటర్, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక(తెలంగాణ)
Labels: Economics, Knowledge, Technology
0 Comments:
Post a Comment
<< Home