2147~ పాటే వెన్నెల... పదమే ఊయల...
‘అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా..’ అంటూ ‘మనుషులు మట్టిబొమ్మలు’లో బిడ్డల కోసం పరితపించే ప్రతి కన్నతల్లి ఆర్తిని అక్షరాల్లో ఆవిష్కరించారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..’ అంటూ అమ్మ అనే మాటకు సరికొత్త భాష్యం చెప్పారు ‘ప్రేమించు’ చిత్రంతో. తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దుచేశారంటే ఉలికులికి పడతాడు..’ అంటూ చిన్ని కన్నయ్యలను అమ్మతో జోకొట్టించేశారు ‘జీవనజ్యోతి’లో.
అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్రమంలో నాన్నను తక్కువ చేయలేదాయన. బిడ్డలను పూలతోటలో నడిపించేందుకు తాను ముళ్లబాటలో నడిచేందుకు సిద్ధమయ్యే తండ్రిని ‘ఓ నాన్నా నీ మనసే వెన్న.. అమృతం కన్న అది ఎంతో మిన్న..’ అని ‘ధర్మదాత’లో కీర్తించారు. ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.
ఇలాంటి కన్నప్రేమ గీతాలే కాదు.. కన్నె ప్రణయగీతాల్లోనూ తన చమక్కు చూపించారు సినారె.
‘వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. ‘పూజాఫలం’లో ‘పగలే వెన్నెల జగమే వూయల..’ అంటూ వూహాలోకంలో పరవశింపజేశారు. ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. ‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’ లో కళ్లకుకట్టారు. ‘నువ్వలా ముందుంటే నిన్నలా చూస్తుంటే..’ అని ‘గూఢచారి 116’ పాడుకున్నా, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా, ‘అమ్మమాట’లో ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు..’ అని కన్నెపిల్ల వాపోయినా, ‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.
మెరిసే ముత్యాలు...: సినారె పాటల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సూక్తులు, జీవిత సత్యాలూ ఉన్నాయి. ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో. ‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘మంచి మిత్రులు’లోని ‘ఎన్నాళ్లొ వేచిన ఉదయం..’ పాటలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని ధైర్యమిస్తాడు.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
‘రైతు కటుంబం’లో ‘ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము..’ అంటూ మట్టితో రైతు అనుబంధాన్ని ఆవిష్కరించారు.
Labels: Quotes/ Telugu, songs, Telugu language, Telugu literature, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home