పురుషులందు భారత పురుషులు వేరయా...
పుణ్యంకొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలని సామెత. దాంపత్య జీవితం సజావుగా సాగిపోవటమన్నది భార్యాభర్తలిద్దరి పైనా ఆధారపడి ఉంటుంది. ఆదరణ చూపే భర్తా అనుకూలవతియైన భార్యా దొరికినప్పుడు ఆ సంసారం ఏటివాలులో చల్లగా సాగిపోయే పడవ ప్రయాణంలా హాయిగా గడిచిపోతుంది. దంపతుల్లో ఒకరు ఏటికి ఇంకొకరు కోటికి లాగుతుంటే ఆ కాపురంలో చిటపటల రాగాలే హోరెత్తిపోతుంటాయి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయమై ఉంటాయంటారు. నిశ్చయపరచటం ఎక్కడ జరిగినా వివాహాలు జరిగేదీ జంటలు కాపురాలు వెలగబెట్టాల్సిందీ భూమిమీదే కదా! కాబట్టే ఎన్నో మంచిచెడ్డలు విచారించాకనే పెద్దవారు పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుస్తారు. ''అల్లవూరీవారు పిల్లనడిగేరు, పిల్లవానికి రూపురేఖలున్నాయి, ఏటేట పండేటి భూములున్నాయి, పిల్లదానికి మంచి యీడుజోడేను, కన్నెనిస్తామని కబురంపుదాము'' అని మధ్యవర్తులెంత ఊదరగొట్టినా ఆ వైనాలన్నీ కళ్ళారాచూసి సంతృప్తిచెందాకనే సంబంధాలు ఖాయపరుచుకుంటారు. ''బుద్ధిమతే కన్యాం ప్రయచ్ఛేత్'' అని ఆర్యోక్తి. బుద్ధిమంతుడైన వరునికే కన్యనివ్వాలి అని దాని అర్థం. విద్య, ఆరోగ్యం, మంచి నడవడిక కలిగినవారే యోగ్యులైన వరులని అటువంటివారికే అమ్మాయినిచ్చి వివాహం చేయాలని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆశిస్తారు. ''అంత తొందరపడతావేం? అబ్బాయి ఎలాంటివాడో ఏమిటో అన్నీ తెలుసుకోకుండానే పెళ్ళి చేసేద్దాం అంటే ఎలా?'' అన్నాడు అమ్మాయి తండ్రి. ''అవన్నీ తెలుసుకొనే మా నాన్న నన్ను మీకిచ్చి కట్టబెట్టాడా ఏమిటి? ఇప్పుడు మనం అవన్నీ చూడటానికి'' అంటూ ధుమధుమలాడింది భార్యామణి! వివాహం అనేది ఏడు జన్మల బంధం అంటారు. అందుకే మూడుముళ్ళు వేసే ముందు అబ్బాయిలు, మూడుముళ్ళకు తలవంచే ముందు అమ్మాయిలు చక్కగా ఆలోచించి కాని నిర్ణయాలు తీసుకోకూడదు.
''వివాహం అనేది బోనులాంటిది. బయట ఉన్నవారు లోపలకు వెళ్ళాలని ఉబలాటపడుతుంటారు. లోపల ఉన్నవారు ఎలా బయటపడటమా అని మధనపడుతుంటారు...'' అని పెళ్ళిని నిర్వచించాడో పెద్దమనిషి. బహుశా ఆయనకు సరైన భాగస్వామి లభించి ఉండకపోవచ్చు. వెనకటి రోజుల్లో ఏటవతల సంబంధాలు వద్దనుకొనేవారు. దగ్గర ఊళ్ళలోనే సంబంధాలు కుదుర్చుకొనేవారు. వారి మంచి చెడ్డలు వీరికీ వీరి గుణగణాలు వారికీ తెలిసి ఉండటంతోపాటు- రాకపోకలు సులభమై అచ్చట్లు ముచ్చట్లు చక్కగా తీరతాయని భావించేవారు. మారిన కాలంలో ఊళ్ళమధ్యే కాదు దేశాల మధ్యే దూరాలు చెరిగిపోతున్నాయి. అడవిలోని చెట్టుకాయ ఊరిలోని ఉప్పురాయి కలిసినట్లు ఏ దేశంలోని అమ్మాయో మరో దేశంలోని అబ్బాయిని పెళ్ళాడి ''నీకు నాకు జోడు కుదిరెను కదరా చల్ మోహన రంగా'' అనటం పరిపాటైపోయింది. ఒక లోకంలోనివారు మరో లోకంవారిని ప్రేమించి పెళ్ళాడిన ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. పాతాళలోకానికి చెందిన ఉలూచి అనే నాగకన్య గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అర్జునుని సోయగం చూసి మోహవివశ అవుతుంది. ''ఔరా సొగసిటుకదా ఉండవలె...'' ననుకొని మచ్చుజల్లి అర్జునుణ్ని పాతాళ లోకంలోని తన మందిరానికి తీసుకుపోతుంది. తన మనసు తెలిపి పెళ్ళి చేసుకొమ్మంటుంది. ''ఇదెక్కడి వింత. మన లోకాలు వేరు, జాతులు వేరు, మన మధ్య వివాహం ఎలా సంభవం?'' అన్న అర్జునునితో- ''ఏమనబోయెదం దగుల యెంచక నీవిటులాడ, దొల్లి శ్రీరామ కుమారుడైన కుశరాజు వరింపడె మా కుముద్వతిన్, గోమల చారుమూర్తి పురుకుత్సుడు నర్మద పెండ్లియాడడే'' అని చెప్పి, ''వారికి లేని అభ్యంతరం మనకొచ్చిందా...'' అంటూ లా పాయింట్లు లాగుతుంది. చివరకు ఉలూచి అర్జునుల వివాహం జరిగి వారికి ఇలావంతుడు అనే కుమారుడు కలగటం మనోహరమైన విజయవిలాస కావ్యంగా రూపుదిద్దుకొంది.
భర్తలందు భారతీయ భర్తలు వేరయా- అంటోంది మేరియా ఆర్బతోవా. భారతీయ భర్తలకు మరే దేశంవారూ సరిరారు అంటున్న ఈ రష్యన్ వనిత స్వదేశంలోని రమణులకు భారతీయ యువకుల్నే వరులుగా ఎన్నుకొని పెళ్ళి చేసుకొని సుఖపడాల్సిందిగా సలహా ఇస్తోంది. ఈ స్త్రీవాద రచయిత్రి మనదేశాన్ని సందర్శించి, ఇక్కడి ప్రజల మనస్తత్వాన్ని జీవన విధానాలను అధ్యయనం చేసి రచించిన 'ఎ టేస్ట్ ఆఫ్ ఇండియా' పుస్తకం రష్యాలో బ్రహ్మాండంగా అమ్ముడుపోతోంది. భారత్‌లోని మగవారు సున్నిత మనస్కులనీ కుటుంబం పట్ల ఆపేక్షగా ఉంటూ బాధ్యతతో మెలగుతారంటున్న మేరియా, సుమిత్ దత్తాగుప్తా అనే భారతీయుణ్నే పెళ్ళి చేసుకొంది. ''మనస్తత్వాలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు వంటి అనేక విషయాల్లో రష్యన్లకు, భారతీయులకు దగ్గర పోలికలున్నాయి. రష్యన్ యువతులు భారత్‌కు చెందిన మగవారితో చక్కగా కలిసిపోగలరు. వారి మధ్య వివాహబంధం దృఢంగా ఉంటుంది'' అంటోంది మేరియా. రష్యాలో ఇప్పుడు వరుల కొరత ఎక్కువగా ఉంది. అక్కడ అవివాహిత యువతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిణామం అనేక సామాజిక సమస్యలకు దారి తీస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక అక్కడి యువతలో పాశ్చాత్య నాగరికతపై మోజు పెరిగింది. కొంతమంది రష్యన్ యువతులు అమెరికా యూరప్ దేశాలకు చెందినవారిని పెళ్ళి చేసుకుంటున్నారు. ఆ పెళ్ళిళ్ళు ఆట్టే కాలం నిలవటం లేదు. పాశ్చాత్య దేశాల మగవారిలో పురుషాధిక్య భావం ఎక్కువ, సంయమనం తక్కువ ఉండటంవల్ల వారితో రష్యన్ యువతులు ఎక్కువకాలం కలిసి మనలేకపోతున్నారని మేరియా భావన. సంస్కృతీ, సంప్రదాయాలకు కుటుంబ విలువలకు ఎక్కువ విలువనిచ్చే భారతీయ పురుషులే సరియైన జోడీ కాగలరన్నది ఆమె స్వానుభవం. అందుకే, ఇంకా పెళ్ళికాని రష్యన్ అమ్మాయిలను- భారత్ పురుషునితో శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు- అని దీవిస్తోంది!
(Editorial, EEnadu,26:11:2006)
--------------------------------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home