ఇంటిపేరుతో ఇక్కట్లు
వాటీజ్ ఇన్ ఎ నేమ్ అని షేక్స్‌పియర్ అన్నాడని గిరీశం అంటాడు. షేక్స్‌పియర్ ఆ మాట అన్నాడో లేదో కాని పేరులో ఏముంది అని తీసిపారేయటానికి మాత్రం వీలులేదు. ముందు పేరునుబట్టే అవతలి వ్యక్తిపై మంచో చెడో ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందుకే అబ్బాయో అమ్మాయో పుట్టగానే తల్లిదండ్రులు అందమైన పేరు కోసం అన్వేషణ మొదలుపెడతారు. పూర్వీకుల పేర్లు, దేవుళ్ల దేవతల పేర్లు పెట్టటం సామాన్యంగా జరిగేదే అయినా కాలం మారుతున్నకొద్దీ కొత్తరకం పేర్లు పెట్టాలని తల్లిదండ్రులు సరదాపడటం ఎక్కువైపోయింది. లోగడ మనవారికి బెంగాలీ పేర్లపై మోజు అధికంగా ఉండేది. ఆ కారణంగానే ఎందరో శరత్‌లు, రవీంద్రలు, అజయ్‌బాబులు తెలుగు నేలపై పుట్టుకొచ్చారు. గంగులు గంగూలీ అనీ, నారాయణరావు నరేన్ అనీ తమ పేర్లను మార్చుకోటమూ జరిగింది. శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్ళికూతురు ముస్తాబు చేసి వృద్ధవరుడు లుబ్ధావధాన్లుకిచ్చి పెళ్ళి చేయాలని తీసుకొస్తాడు కరటక శాస్త్రులు 'కన్యాశుల్కం' నాటకంలో. ఇంత జరిగిన తరవాత ''అన్నట్లు నాపేరేమిటండోయ్?'' అని అడుగుతాడు శిష్యుడు. ''కొంపముంచుతావు కాబోలు... సుబ్బి. సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది'' అంటాడు కరటక శాస్త్రులు. కొందరు తమ పేర్లతోకంటే ఇతరులతో కలిసిన చుట్టరికాలే గుర్తుగా చలామణీ అవుతుంటారు. అగస్త్యభ్రాత, హనుమాయమ్మ మొగుడు, రావుగారి అబ్బాయి వంటివారు ఆ కోవలోకి వస్తారు. పేరు తెలియకపోయినా అవతలి వ్యక్తి వాలకాన్నిబట్టి ఊహించి ''ఏమోయ్ హనుమాన్లు బాగున్నావా?'' అని పలకరించాడు ప్రబుద్ధుడు. ''నాపేరు మీకెలా తెలుసండీ!'' అని సదరు హనుమాన్లు ఆశ్చర్యపోతే ''చూస్తే తెలియటంలా...'' అన్నాట్ట ప్రబుద్ధుడు. పేర్లన్న తరవాత ఇటువంటి తబిసీళ్లు చాలా ఉంటాయి.
ఇంటిపేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల వాసన అని సామెత. పేరు ఎంత ముఖ్యమో ఇంటి పేరుకూ అంత ప్రాధాన్యం ఉంది. ఇంటిపేరునే వంశ నామం, కుటుంబ నామం అనీ అంటారు. ఇంటి పేర్లు పెట్టుకోవడం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంది. ఆంధ్రదేశంలో ఇంటిపేర్లు వ్యక్తుల పేర్లకు ముందు ఉంటే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వ్యక్తుల పేర్ల తరవాతే ఇంటిపేరు చోటు చేసుకుంటూ ఉంటుంది. గ్రామ నామాలే ఇంటిపేరుగా చలామణీ అవటం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ఎలా వచ్చినా వ్యక్తులకు వంశనామం కూడా ముఖ్యమే. వెనక వెంకటకవి అనే కవిగారి ఇంటిపేరు 'మచ్చా'. ఆ విషయమే ప్రస్తావిస్తూ ''మచ్చరము లేదు కవితలో మచ్చ లేదు, మచ్చయిన లేదు మెచ్చదగు పుట్టుమచ్చగాక'' అని మొదలుపెట్టి ''మచ్చ వేంకటకవి నామమే మచ్చయయ్యె...'' అని సానుభూతి చూపిస్తాడు మరో కవి. కవిత్వంలో కాని ప్రవర్తనలోకాని ఏ విధమైన మచ్చ లేకపోయినా ఇంటిపేరే మచ్చావారు అయుండటం ఆ కవిగారికి మైనస్ పాయింటు అయింది. ఈయన సంగతి ఎలా ఉన్నా చాలామంది తమ వంశనామాల గురించి గర్వంగా చెబుతూ ఉంటా రు. ఆ కవయిత్రి ఆ కోవకు చెందిందే. మతుకుమల్లివారి వంశానికి చెందిన ఆమె ''మతుకుమల్లి యిల్లు మహి విద్య వెదజల్లు, పరబుధేంద్రులకును బక్కముల్లు, ఎరిగి మెలగిరేని నెలమిచే వాటిల్లు, గానవారి యిల్లు ఘనతజెందె'' అంటూ ఆశువుగా ఓ చక్కని పద్యమే అల్లేసింది.
అసలుకంటె వడ్డీ ముద్దు అని సామెత. అలాగే తమ అసలు పేరుకంటె వంశనామం లేదా ఇంటిపేరు గురించే గొప్పలు చెప్పుకొనే అలవాటు కొంతమందికి ఉంటుంది. ''ఏమనుకుంటున్నావో... మాది పండితులవారి వంశం. మా ఇంటిపేరే వ్యాకరణంవారు...'' వంటి మాటలు అప్పుడప్పుడూ వినపడుతుంటాయి. ఇంటిపేరుకున్న ప్రాముఖ్యం అటువంటిది.
అటువంటి ఇంటిపేరే చైనాలో కొన్ని సమస్యలను సృష్టిస్తోంది. అక్కడ నూరుకోట్లకు పైగా ఉన్న జనాభాలో కేవలం 100 ఇంటిపేర్లే తరచూ వినిపిస్తుంటాయి. ఎంతోమందికి ఒకే ఇంటిపేరు ఉండటంతో నిత్య వ్యవహారంలో కొన్ని చిక్కులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఒక వ్యక్తి తన తండ్రి లేదా తల్లి ఇంటిపేరునే తన ఇంటిపేరుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కొత్త ఇంటిపేరును పెట్టుకొనే వీలులేదు. ఈ నిబంధనవల్ల కొన్ని కోట్లమందికి ఒకే ఇంటిపేరు ఉంటోంది. ఉదాహరణకు దాదాపు పదికోట్లమంది చైనీయులు 'లీ' అనే ఇంటి పేరుతోనే సర్దుకుపోతుండగా దాదాపు తొమ్మిదికోట్లమంది చైనావారి ఇంటిపేరు 'ఝాంగ్' అని ఉంటోంది. కొన్ని లక్షలమంది చెన్, ఝౌ, లిన్ వగైరా ఇంటిపేర్లను కలిగి ఉంటున్నారు. అలాగే చైనాలో ఎక్కువగా వినపడే పేరు వాంగ్‌టూవో. లక్షమందికి పైగా చైనావారికి ఆ పేరే ఉంది. ఈ వివరాలను వెల్లడించిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌వారు ఒకే పేరు లేదా ఒకే ఇంటిపేరు అనేకమందికి ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన చైనా ప్రభుత్వంవారు ఇంటిపేరు పెట్టుకొనే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతవరకు సడలించారు. సవరించిన నిబంధనల ప్రకారం ఝౌ అనే పేరుకల తండ్రికీ ఝు అనే నామధేయం కల తల్లికీ పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఝౌ, ఝు, ఝౌఝు లేదా ఝుఝౌ అనే ఏ ఇంటి పేరన్నా పెట్టుకోవచ్చు. ఇందువల్ల ఒకే ఇంటిపేరు కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్లమందికి ఉండకుండా పరిస్థితులు కొంతవరకు మెరుగుపడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదివాసి తెగలకు చెందినవారు తమకు ఇష్టమైన కొన్ని సంఖ్యలను లేదా కథలలోని పాత్రలకు సంబంధించిన పేర్లను తమకు పేర్లుగా ఇంటిపేర్లుగా పెట్టుకోవచ్చు. ఇందువల్ల ఒకే పేరు లేదా ఒకే ఇంటిపేరు అనేకమందికి ఉండకుండా జాగ్రత్తపడవచ్చని అధికారులు భావిస్తున్నారు. పేరులో ఏముంది ఏ పేరైతే ఏం అని కొంతమంది పెదవి విరుస్తారు కాని పేర్లవల్లా కొన్ని తికమకలు తప్పవని చైనావారి అనుభవంవల్ల తెలుస్తోంది.
(Eenadu, 01:07:2007)
______________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home