శాంతసిద్ధి
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
'శాంతము లేక సౌఖ్యము లేదు' అన్నాడు గానరాజు త్యాగరాజు.
'తన కోపమె తనశత్రువు, తన శాంతమె తనకు రక్ష' అన్నాడు శతక కారుడు.
ఇంతకూ శాంతమంటే ఏమిటి?
కోపం మీద కోపంగా ఉండటం, అంటే కోపంతో విరోధమే శాంతం. స్వభావ రీత్యా కోపిష్టులైనవారు ఆ కోపం మీదనే కోపిగా ఉండటం మేలు.
ఆత్మానమేవ నాశయత్య నాత్మవతాం కోపః (చాణుక్య నీతి)
తనను తాను అదుపులో ఉంచుకొనలేనివారి కోపం వారినే నశింపజేస్తుంది. కోపాన్ని అగ్నితో పోలుస్తుంటారు ఆలంకారికులు.
కోపాగ్ని దగ్ధ జ్ఞానానాం - కోపం అనే అగ్నిలో విచక్షణ అనే జ్ఞానం దగ్ధమైపోతుంది. దాని పర్యవసానాలు పరమ భయంకరంగా ఉంటాయి. కాలయవనుడు గుహలో సమాధివశుడై ఉన్న మునికి కోపం కలిగించి దగ్ధుడైనాడు. సగర కుమారుల కథ కూడ అలాంటిదే. మహా తపస్సంపన్నులు సైతం కేవలం కోపంవల్ల అనేక విధాలుగా కష్టనష్టాలు అనుభవించారు. అంబరీష - దుర్వాసులు, వసిష్ఠ-విశ్వామిత్రుల కథలు ఇందుకు ఉదాహరణలు.
శాంతంవల్ల సకల సంపదలూ, కీర్తీ లభిస్తాయి.
అదెలాగో ఒక కథ ద్వారా తెలుసుకుందాం.
మధురానగరంలో మాధవవర్మ అనే క్షత్రియుడు ఉండేవాడు. అతని పూర్వీకులు సేనాపతులుగా రాజుగారి కొలువులో పనిచేశారు. శత్రువుల దాడిలో రాజవంశం అంతరించింది. మాధవవర్మ తండ్రి సైతం యుద్ధంలో మరణించాడు. శత్రుపాలన పాలబడి మధురానగరం అరాచకంలో మగ్గిపోయింది. గౌరవంగా బతకటమే దుర్లభమైపోయింది. కానికాలం వచ్చినప్పుడు కానలకు చేరినట్లు మాధవవర్మ సమీపంలోని భిల్లారణ్యానికి వెళ్లాడు. అక్కడున్న భిల్లులు గొప్పయోధులు. గతించిన రాజుకు మిత్రులు. మాధవవర్మను భిల్లరాజు ఆప్యాయంగా ఆహ్వానించి ఆశ్రమమివ్వడమేగాక, సకల యుద్ధవిద్యల్లోను తర్ఫీదు ఇప్పించాడు.
భిల్లరాజు కుమార్తె మాధవవర్మ పట్ల ఆకర్షితురాలైంది. తండ్రికి తన మనోభీష్టాన్ని తెలియజేసింది. అప్పటికే ఆమె పట్ల అనురక్తుడై ఉన్న ఒక భిల్లయోధుడు అసూయతో, కోపంతో మాధవవర్మను మట్టుబెట్టటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి, ఎందుకలా చేశావని ఆ యువకుణ్ని అడిగాడు మాధవవర్మ. విషయం వివరించాడు భిల్లుడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భిల్లరాజు, ఆయన కుమార్తె అంతా విన్నారు. అతిథిని చంపబోయిన భిల్ల యువకుడికి మరణశిక్ష విధిస్తాడు భిల్లరాజు. కానీ, మాధవవర్మ భిల్లరాజును సమాధానపరచి, శిక్ష రద్దు చేయించి అతని కుమార్తె వివాహం సైతం భిల్ల యువకునితో జరిపింపజేస్తాడు. అపకారి పట్ల కోపం వహించక, శాంతచిత్తుడై మాధవవర్మ ప్రవర్తించిన తీరు అతని గౌరవాన్ని ఇనుమడింపజేసింది. భిల్లరాజు అల్లుడు మాధవవర్మకు ప్రాణమిత్రుడైనాడు. తదుపరి కాలంలో అతని నేతృత్వంలో భిల్లసైన్యం మెరుపుదాడి జరిపి, మధురానగరాన్ని జయించింది. సహజంగానే మాధవవర్మను భిల్లులు ఆ నగరానికి పాలకునిగా నియమించారు. అతడు గొప్ప పాలకునిగా కీర్తి గడించాడు. ఆ విధంగా మాధవవర్మ శాంతగుణం చేత, శత్రువును మిత్రునిగా మార్చుకుని రాజ్యసంపదను, కీర్తిని ఆర్జించాడు.
వర్తమాన ప్రపంచంలో సైతం, శాంతగుణం వల్ల ఎన్నో ఉపద్రవాల నివారణ సాధ్యపడుతుంది.
శ్రీరాముణ్ని శాంతగుణశీలుడంటారు.
శాంతం వల్ల విచక్షణ మనగలుగుతుంది.
విచక్షణ వల్ల అకృత్యాలను నిరోధించగలం.
అకృత్యాలు చేయకపోవటం వల్ల పాపరహితులై ఉండటం సాధ్యపడుతుంది.
పాపరాహిత్యం వల్ల పరిశుద్ధ ఆత్మలుగా, పరమాత్మ అనుగ్రహానికి అర్హత పొందగలుతుతాం.
అదే శాంత సిద్ధి.
(Eenadu, 29:06:2007)
_________________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home