ఖర్చుల్లో ఉందిలే భలే బడాయి
'ఖర్చేరా అన్నిటికీ మూలం... ఖర్చులు తగ్గించుకొనుట మానవ ధర్మం...' అని 'సొ'మ్ములు తిరిగిన వాళ్లు జోరీగల్లా పోరు పెట్టినా వినకపోబట్టే, వేతన బాబులు 'అయ్యయ్యో... జేబులు ఖాళీ ఆయెనే...' అని మొత్తుకొంటున్నారు. పే స్లిప్‌లో కనిపించిన జీతం వెంటనే స్లిప్ అయిపోతోందని విచారంతో తల పట్టుకుంటున్నారు. ప్రేమలో పడ్డ వాళ్ల సంగతి సరేసరి. సినిమాలకు, షికార్లకు, షాపింగ్‌లకు తిరిగిన తరువాత తీరిగ్గా కూర్చుని ఖర్చులను పట్టిక వేసుకొని 'నన్ను దోచుకొందువటే ఖర్చుల దొరసానీ' అని పళ్లు కొరికితే ఫలితం ఉండదు. అంతా గత 'ధన' సేతు బంధనం చందమవుతుంది.
ఖర్చుల్ని కనిపెట్టిన వాడిని ఎంత ఖర్చయినా కాల్చి పారేయాలన్నంత కోపం వచ్చినా చేయగలిగిందేమీ లేదు. జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోయె అని దిగులు పడతాం కానీ నిద్రపోతే ఎలాంటి ఖర్చులూ దరిచేరవు... ఒక్క సమయం ఖర్చవుతుంది తప్ప. జీతమ్మున ఆసాంతం ఖర్చులకే సరిపోయె అని లబ్ డబ్బులాడతాం. అయితే, ఖర్చు పెట్టేవాళ్లలో రక రకాలు. సాహిబ్ సంపాదన బీబీ కుట్టు పనికి సరిపోవడం లేదనే పోలిక ఉంది. వెనకటికి తిండి మీద ఎక్కువ ఖర్చు చేసే వాళ్లు. ఇప్పుడు 'బండి'కి ఎంతయినా ఖర్చు చేయడానికి వెనుదీయడం లేదు. దీంతో ఖర్చులు తడిసి 'మోపెడే' కాక, తడిసి ట్యాక్సీలూ, కార్లూ కూడా అవుతున్నాయ్!
ఖర్చులు పెట్టడంలో తెలివితేటలు ప్రదర్శించేవాడే జీవితంలో పైకొస్తాడు. ఇతరులు పెట్టే ఖర్చు స్వీటు, తాము పెట్టే ఖర్చు చేదు అని భావించే వాళ్లూ ఉంటారు. ఖర్చుల్లో లోక కళ్యాణమూ ఇమిడి ఉంది! లంచం తీసుకొనే వాడు 'ఏదో ఖర్చులకు' అని పళ్లికిలిస్తాడు. లంచం ఇచ్చేవాడు ఖర్చులకు ఇస్తున్నాలే అని మనసుకి సర్దిచెప్పుకోలేదనుకోండి, సుఖ నిద్ర పట్టదంతే! మనిషి కన్నుమూస్తే 'ఖర్చయిపోయాడ'నడం సహజమే కదా.
ఖర్చులనేవే లేకపోతే... మనిషి కన్నా మంచి ప్రాణి దొరకదు. అవినీతీ అయిపుండదు. పక్కింటి మీనాక్షమ్మతో పోల్చుకోవడం వల్లనే ఖర్చులు పేలిపోతున్నాయి. ఖర్చులందు పెళ్లి ఖర్చులు వేరయా అని బట్టకట్టిన ఆధునిక వేమనలు అంటున్నారు. ఒకరు తొడ కోసుకుంటే, ఇంకొకరు మెడ కోసుకుంటున్నారు. ఇటువంటి ఖర్చుల బారి నుంచి కాపాడే వాడు భగవంతుడే అని నిట్టూర్చడానికి బదులు ఖర్చులకు కత్తెర వేయడంలో ప్రయత్న లోపం చేయకుండా ఉంటే... అంతా మంచికే.
- ఫన్‌కర్
(Eenadu,20:05:2007)
____________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home