మరో ప్రపంచం
''ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, జనియించినాడనీ స్వర్గ ఖండమున'' అన్నారు రాయప్రోలు. భూలోకంలోను అందులో భారతదేశంలోను పుట్టడమే మహద్భాగ్యం అని ఆయన ఉద్దేశం. అనేక పరిశోధనల అనంతరం శాస్త్రజ్ఞులు సూర్యుని ఆధారంగా అనేక గోళాలు, గ్రహాలు తిరుగుతున్నాయని అందులో భూగోళం ఒకటనీ కనిపెట్టారు. ''గెలీలియో గొప్పేమిటి? తెగ పరిశోధనలు చేసి భూమి గుండ్రంగా తిరుగుతోందని కనిపెట్టాడు. ఆ విషయం తెలుసుకోవటానికి అన్ని పరిశోధనలు ఎందుకు? రెండు పెగ్గులేసుకుంటే చాలదా?'' అని ఓ మందుబాబు దబాయించాడు. అటువంటి దబాయింపుల సంగతెలా ఉన్నా- శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు కొనసాగిస్తూ ఎన్నో కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నారు. మానవుడు చంద్రమండలాన్ని శోధించి వచ్చాడు. రోదసిలోకి అడుగుపెట్టాడు. ఇతర గ్రహాల్లో ఏముందో ఎవరున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో నిత్యం అన్వేషణలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా ఓ మానవుణ్ని హిమాలయ పర్వతాలపై చూసినప్పుడు, ''ఎక్కడివాడొ యక్షతనయేందు జయంతు వసంత కంతులం జక్కదనంబునం గెలువజాలెడువాడు'' అంటూ వరూధిని ఆశ్చర్యపోతుంది. ''సురగరుడోరగ నర ఖేచర కిన్నర సిద్ధ సాధ్యచారణ విద్యాధర గంధర్వ కుమారుల నిరతము గనుగొనమె'' అంటూ తాను చూసే సకల లోకాల అందగాళ్ళనీ జ్ఞప్తికి తెచ్చుకొని, ''పోలనేర్తురె వీనిన్'' అనుకుంటూ సురగరుడ ఖేచర కిన్నర గంధర్వుల కంటే మానవుడైన ప్రవరాఖ్యుడే అందగాడనే నిర్ణయానికొస్తుంది.
పాతాళలోకంలో ఉండే నాగరాజ కన్యక ఉలూచి అనే అందగత్తె కూడా గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అర్జునుణ్ని చూసి అలాగే ఆశ్చర్యపోయి, మంత్రబలంతో పాతాళంలోని తన నాగలోకానికి తీసుకొని వెళుతుంది. అక్కడ తన కోరికను అర్జునుడికి తెలియజేయగా అతను ఆశ్చర్యపోయి, ''ఫణిజాతివీ, వేను మనుజజాతి నన్యజాతి ప్రవర్తించుటర్హమగునె'' అంటాడు. ప్రేమకు జాతి మత లోక భేదాలేవీ అడ్డురావని ఉలూచి తన వాదనా పటిమతో రుజువు చేసి అర్జునుణ్ని పెళ్ళాడటం 'విజయవిలాస' కావ్యంలోని ఒక మధురాధ్యాయం. ఇతర లోకాలపై మానవుని విజయయాత్ర పురాణ కాలంనుంచీ కొనసాగుతూనే ఉంది. ఒక గ్రహంలో లేదా ఒక లోకంలో ఉండేవారు అన్య ప్రాంతీయుల అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడటం సహజమే. నిత్యం కలుగులోనే ఉంటూ అదే లోకమని భావించే ఓ ఎండ్రకాయ, ''నరలోకంబెటువంటిది, సురలోకంబెట్టిది నీవు చూచితె?'' అని తల్లినడుగుతుంది. అంతటితో ఊరుకోకుండా, ''మనమందిరముల సాటివి యౌనొ విరచితగతి నింతకంటె విస్తీర్ణములో, అందుండెడి వారికి మన చందమొ రూపములు వేరె చందమొ నాకా చందము వివరింపుము'' అంటూ వెంటపడుతుంది. మన శాస్త్రజ్ఞులూ చంద్రునిలో ఏముంది, అంగారక గ్రహంలో ప్రాణి సంతతి ఉందా లేదా అనే విషయాల గురించి నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. గ్రహాంతర జీవుల గురించీ, ఎగిరే పళ్లాల గురించీ నిత్యం ఆశ్చర్య పరిచే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.
భూమిని మించిన మరో మహాభూమి ఉందని శాస్త్రజ్ఞులు ఇటీవల కనుగొన్నారు. భూమికంటె అయిదురెట్లు బరువైనదిగా భావిస్తున్న ఆ మహాగ్రహం సౌర వ్యవస్థకు 20 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఎర్రని నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందంటున్నారు. గ్లీసే 581 అనే ఆ నక్షత్రం చుట్టూ పరిభ్రమించే ఆ గ్రహం చాలావరకు భూమండలాన్ని పోలి ఉందంటున్నారు. జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన 11మంది అంతరిక్ష శాస్త్రజ్ఞులు మైఖేల్ మేయర్ అనే శాస్త్రజ్ఞుని ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో ఈ మహాభూమి వెలుగులోకి వచ్చింది. ఈ గ్రహం గ్లీసే 581 నక్షత్రానికి దగ్గరగానే ఉన్నప్పటికీ ఆ నక్షత్ర కాంతి సూర్యుడంత ప్రకాశవంతమైనది కాకపోవటాన అక్కడి ఉష్ణోగ్రత అంత తీవ్రంగా లేదు. అక్కడి సగటు ఉష్ణోగ్రత 0 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వందలకు పైగా గ్రహాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నప్పటికీ ఈ గ్రహమే మిగతా అన్నిటికంటె భూమికి దగ్గర పోలికలతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు కనుగొన్న ఇతర గ్రహాలకన్నా ఈ గ్రహమే చిన్నది. ఈ గ్రహంపై ఉన్న ఉష్ణోగ్రత కారణంగా ద్రవరూపంలో నీరు, ప్రాణికోటి ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున ఈ గ్రహానికి చేరగలగటం దాదాపు అసాధ్యం. ఈ కొత్త గ్రహానికి 581సి అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహాన్ని గురించి ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాలనీ, నిర్వహిస్తామనీ జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటున్నారు. వీరి పరిశోధనలు ఫలవంతమైతే మరో భూమికి చెందిన మరిన్ని వింతలూ విశేషాలూ బయటపడగలవని ఆశించవచ్చు!
(Eenadu,06:05:2007)
____________________________________
Labels: The earth/ Telugu
1 Comments:
థాంక్స్
12:23 am
Post a Comment
<< Home