My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, March 05, 2014

1357- అన్నప్రసాదం!

కుబేరుడికైనా కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు 'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం. మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది. 'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు, దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్‌' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు! ఉపకారబుద్ధికి ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే. పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు. ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి, 'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు, 'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది. స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం!
'వృథా చేయబోకు, జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో' అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది? భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013)

___________________ 

Labels: , , , ,

Thursday, June 21, 2007

మరో ప్రపంచం

''ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, జనియించినాడనీ స్వర్గ ఖండమున'' అన్నారు రాయప్రోలు. భూలోకంలోను అందులో భారతదేశంలోను పుట్టడమే మహద్భాగ్యం అని ఆయన ఉద్దేశం. అనేక పరిశోధనల అనంతరం శాస్త్రజ్ఞులు సూర్యుని ఆధారంగా అనేక గోళాలు, గ్రహాలు తిరుగుతున్నాయని అందులో భూగోళం ఒకటనీ కనిపెట్టారు. ''గెలీలియో గొప్పేమిటి? తెగ పరిశోధనలు చేసి భూమి గుండ్రంగా తిరుగుతోందని కనిపెట్టాడు. ఆ విషయం తెలుసుకోవటానికి అన్ని పరిశోధనలు ఎందుకు? రెండు పెగ్గులేసుకుంటే చాలదా?'' అని ఓ మందుబాబు దబాయించాడు. అటువంటి దబాయింపుల సంగతెలా ఉన్నా- శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు కొనసాగిస్తూ ఎన్నో కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నారు. మానవుడు చంద్రమండలాన్ని శోధించి వచ్చాడు. రోదసిలోకి అడుగుపెట్టాడు. ఇతర గ్రహాల్లో ఏముందో ఎవరున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో నిత్యం అన్వేషణలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా ఓ మానవుణ్ని హిమాలయ పర్వతాలపై చూసినప్పుడు, ''ఎక్కడివాడొ యక్షతనయేందు జయంతు వసంత కంతులం జక్కదనంబునం గెలువజాలెడువాడు'' అంటూ వరూధిని ఆశ్చర్యపోతుంది. ''సురగరుడోరగ నర ఖేచర కిన్నర సిద్ధ సాధ్యచారణ విద్యాధర గంధర్వ కుమారుల నిరతము గనుగొనమె'' అంటూ తాను చూసే సకల లోకాల అందగాళ్ళనీ జ్ఞప్తికి తెచ్చుకొని, ''పోలనేర్తురె వీనిన్‌'' అనుకుంటూ సురగరుడ ఖేచర కిన్నర గంధర్వుల కంటే మానవుడైన ప్రవరాఖ్యుడే అందగాడనే నిర్ణయానికొస్తుంది.

పాతాళలోకంలో ఉండే నాగరాజ కన్యక ఉలూచి అనే అందగత్తె కూడా గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అర్జునుణ్ని చూసి అలాగే ఆశ్చర్యపోయి, మంత్రబలంతో పాతాళంలోని తన నాగలోకానికి తీసుకొని వెళుతుంది. అక్కడ తన కోరికను అర్జునుడికి తెలియజేయగా అతను ఆశ్చర్యపోయి, ''ఫణిజాతివీ, వేను మనుజజాతి నన్యజాతి ప్రవర్తించుటర్హమగునె'' అంటాడు. ప్రేమకు జాతి మత లోక భేదాలేవీ అడ్డురావని ఉలూచి తన వాదనా పటిమతో రుజువు చేసి అర్జునుణ్ని పెళ్ళాడటం 'విజయవిలాస' కావ్యంలోని ఒక మధురాధ్యాయం. ఇతర లోకాలపై మానవుని విజయయాత్ర పురాణ కాలంనుంచీ కొనసాగుతూనే ఉంది. ఒక గ్రహంలో లేదా ఒక లోకంలో ఉండేవారు అన్య ప్రాంతీయుల అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడటం సహజమే. నిత్యం కలుగులోనే ఉంటూ అదే లోకమని భావించే ఓ ఎండ్రకాయ, ''నరలోకంబెటువంటిది, సురలోకంబెట్టిది నీవు చూచితె?'' అని తల్లినడుగుతుంది. అంతటితో ఊరుకోకుండా, ''మనమందిరముల సాటివి యౌనొ విరచితగతి నింతకంటె విస్తీర్ణములో, అందుండెడి వారికి మన చందమొ రూపములు వేరె చందమొ నాకా చందము వివరింపుము'' అంటూ వెంటపడుతుంది. మన శాస్త్రజ్ఞులూ చంద్రునిలో ఏముంది, అంగారక గ్రహంలో ప్రాణి సంతతి ఉందా లేదా అనే విషయాల గురించి నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. గ్రహాంతర జీవుల గురించీ, ఎగిరే పళ్లాల గురించీ నిత్యం ఆశ్చర్య పరిచే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.

భూమిని మించిన మరో మహాభూమి ఉందని శాస్త్రజ్ఞులు ఇటీవల కనుగొన్నారు. భూమికంటె అయిదురెట్లు బరువైనదిగా భావిస్తున్న ఆ మహాగ్రహం సౌర వ్యవస్థకు 20 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఎర్రని నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందంటున్నారు. గ్లీసే 581 అనే ఆ నక్షత్రం చుట్టూ పరిభ్రమించే ఆ గ్రహం చాలావరకు భూమండలాన్ని పోలి ఉందంటున్నారు. జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన 11మంది అంతరిక్ష శాస్త్రజ్ఞులు మైఖేల్‌ మేయర్‌ అనే శాస్త్రజ్ఞుని ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో ఈ మహాభూమి వెలుగులోకి వచ్చింది. ఈ గ్రహం గ్లీసే 581 నక్షత్రానికి దగ్గరగానే ఉన్నప్పటికీ ఆ నక్షత్ర కాంతి సూర్యుడంత ప్రకాశవంతమైనది కాకపోవటాన అక్కడి ఉష్ణోగ్రత అంత తీవ్రంగా లేదు. అక్కడి సగటు ఉష్ణోగ్రత 0 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వందలకు పైగా గ్రహాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నప్పటికీ ఈ గ్రహమే మిగతా అన్నిటికంటె భూమికి దగ్గర పోలికలతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు కనుగొన్న ఇతర గ్రహాలకన్నా ఈ గ్రహమే చిన్నది. ఈ గ్రహంపై ఉన్న ఉష్ణోగ్రత కారణంగా ద్రవరూపంలో నీరు, ప్రాణికోటి ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున ఈ గ్రహానికి చేరగలగటం దాదాపు అసాధ్యం. ఈ కొత్త గ్రహానికి 581సి అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహాన్ని గురించి ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాలనీ, నిర్వహిస్తామనీ జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటున్నారు. వీరి పరిశోధనలు ఫలవంతమైతే మరో భూమికి చెందిన మరిన్ని వింతలూ విశేషాలూ బయటపడగలవని ఆశించవచ్చు!
(Eenadu,06:05:2007)
____________________________________

Labels: