జరా.. యాద్ కరోనా
1947 ఆగస్టు 15... అర్ధరాత్రి దాటాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. అనేక పట్టణాల్లో జనం పార్కులకు వెళ్లారు.
1962లో భారత్-చైనా యుద్ధం జరిగింది.
మళ్లీ జనం తండోపతండాలుగా పార్కులకు వెళ్లారు.
స్వాతంత్యానికి, యుద్ధానికి, జనానికి, పార్కులకు ఏమిటి సంబంధం?
గ్రామ్‌ఫోన్:
ఓహో మేఘమాలా అందాల మేఘమాలా... అంటూ రాగాలు ఆలపించి ఆలపించి 'రికార్డు' అరిగిపోయింది. ఆగిపోయింది. చల్లగా వచ్చి మెల్లగా వెళ్లిపోయింది. నాటి సంగీత ఝరిని టేప్ రికార్డర్ మింగేసింది. ఆ టేప్‌రికార్డర్‌నూ ఐపాడ్‌లు, కంప్యూటర్లు మింగేస్తున్నాయి.
బెల్‌బాటమ్ ప్యాంట:
అటూ ఇటూ ఓ అరమీటరు ఊడ్చేస్తుంది. కాళ్లకు చక్కగా గాలి వీస్తుంది. పాతతరం హీరోల అభిమాన వస్త్ర విశేషం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మాత్రమే బతికుంది. పాత ఫ్యాషన్‌న్లను కొత్తగా తవ్వుతున్నా... బెల్ బాటమ్ మాత్రం బయటపడటం లేదు.
వీసీపీ, వీసీఆర్:
4వీసీపీలు, వంద వీడియో క్యాసెట్లు! అద్దెకు ఇచ్చుకుంటే డబ్బులే డబ్బులు. పండగొచ్చినా పబ్బమొచ్చినా వీసీపీతో సినిమా విందు. ప్లేయర్లు పోయాయి... వీడియో క్యాసెట్లు పోయాయి. సీడీలు, డీవీడీలు వచ్చాయి.
పేజర్:
తొలి సంక్షిప్త సందేశ ప్రసార సాధనం. చప్పున వచ్చింది. చప్పుడు కాకుండా పోయింది. ఎస్‌ఎంఎస్‌తోపాటు మాట్లాడుకునే సదుపాయాన్నీ సెల్‌ఫోన్ కల్పించింది. ఫలితం... పేజర్ పరార్!
ఇంకుపెన్ను:
కలం యోధుడికి పాళీ కిరీటం. ఇంకు ఇంధనం పోస్తే పేజీలకొద్దీ ప్రయాణం. రాతకు 'రంగు'... జేబుకు హంగు. విదిలిస్తే ఓ వింత డిజైన్. ఇప్పుడు కదిలిస్తే... కన్నీటి 'ఫౌంటెన్'. ఇంకా ఇంకు పెన్ను వాడేవారికి ఇదే 'కలం సలామ్'.
ట్రంక్ కాల్:
మనకు, మనం మాట్లాడాలనుకునే వారికీ మధ్య 'మాటల దళారీ'. తగిలితే అదృష్టం. తగలకపోతే మన ప్రారబ్ధం. ఈ ట్రంక్ 'కాలం' చెల్లింది. ఫోన్ మీటలు పలికే ఎస్టీడీ పదనిసలు... ఏ దూర తీరానికైనా మాటల గలగలలు.
స్టీమ్ ఇంజిన్:
గాలి పాడే పాటకు.. ధడక్, ధడక్‌తో దరువు! నడకలో బరువు! ఇప్పుడు... బండి నిజం. పొగ అబద్ధం. రైలు నిజం. 'చిక్ బుక్' గతం. వేగం సంగతి పక్కనపెడితే... ఆవిరి ఇంజిన్ అందం ముందు డీజిల్ ఇంజిన్ దిగదుడుపే.
హిప్పీ కటింగ్:
చెవులు వినిపిస్తాయి. కానీ... పైకి కనిపించవు. ముంగురుల మాటున ఒద్దికగా దాగిపోతాయి. రింగు రింగులుగా వెంట్రుకలు... కాలర్‌ను కప్పేస్తాయి. యువకులను హిప్పీలను చేసిన ఈ కటింగ్‌కు ఇప్పుడు కట్!
కోతి కొమ్మచ్చి:
చెట్టెక్కి ఒకటే సందడి. అది కోతులది కాదు. పిల్లలది. పక్కవాడికి కాలు విరిగినా... తాను చేయి విరగ్గొట్టుకున్నా మళ్లీ కోతిలా కొమ్మ ఎక్కాల్సిందే. కొమ్మచ్చి ఆడాల్సిందే. ఇప్పుడు చెట్టూ లేదు. కొమ్మాలేదు. టీవీలు, వీడియో గేమ్‌ల ఘోషలో పల్లె ఆటలు పరార్!
పైసా టు పావలా:
అణా, అర్ధణా, బేడ, పైసా! కాలం చెల్లిన నాణేలు. కాలం ఉన్నా చెల్లని నాణేలు.... పావలాలు! కనిపిస్తే కాస్త చెప్పండి. వీటికోసం నాణేల సేకర్తలు చాలామంది వెతుకుతున్నారు. యాచకులకు ఇచ్చి చూసేరు... వెంటనే వెనక్కి తిప్పి..కొడతారు.
ఎర్రటోపీ:
టోపీ ఎరుపు.లాఠీ ఎరుపు. ఠాణా ఎరుపు. నెత్తుటి వర్ణంపై ఎందుకీ వలపు! ఎర్రటోపీ... పోలీసుల చేతి సంచుల్లో, సైకిల్ క్యారియర్‌కు మాత్రమే పరిమితమయ్యేది. దానిని పెట్టుకోవాలంటే ఎందుకో ఓ నామోషీ! ఇప్పుడొచ్చిన కొత్త టోపీ హుందాగా తలకెక్కింది. ఠాణా రంగూ మారింది
.ాజ్‌దూత్:
మనం రాజు. మన బైకు 'రాజదూత'. దడదడలాడిస్తూ దారి వెంబడి వడివడిగా పరుగులు. రాజులు, రాజ్యాలూ పోయాయి. రాజ్‌దూత్‌లూ పోయాయి. ఇప్పుడు ఫోర్ స్ట్రోక్ బైక్‌లదే రాజ్యం.
మట్టి పలక:
రోజుకో పలక ఫట్. 'అమ్మా... పలక పగిలింది' అంటూ ఏడుపు. కొత్త పలక కొనిచ్చేదాకా కొనసాగింపు. ఇప్పుడు... ఆ మట్టి పలక పోయింది. అది పగిలినప్పుడు వినిపించే ఏడుపులూ పోయాయి. ప్లాస్టిక్ కాలం... ప్లాస్టిక్ పలకలు.
మరచెంబు:
మన వెంట నడిచి వచ్చిన ఒయాసిస్సు. దాహం తీర్చేందుకు 'మొబైల్ గంగమ్మ' ఇచ్చిన ఆశీస్సు. 'శంకరాభరణం' సినిమాలో హీరో హీరోయిన్లను కలిపింది. ఆపై తానే చరిత్రలో కలిసిపోయింది. ప్లాస్టిక్ సీసాలు, వాటర్ ప్యాకెట్లు వచ్చి మరచెంబు పేజీని పరపరా చించేశాయి.
కిర్రుచెప్పులు:
చేతిలో కర్ర... కాళ్లకు కిర్రుకిర్రుమంటూ చెప్పులు! అర్ధరాత్రి అపరాత్రి పొలానికి వెళ్తుంటే... కిర్రు చెప్పుల చప్పుళ్లకు పురుగూ పుట్రా ఉంటే పక్కకు తప్పుకునేవి. రైతుకు అదో భరోసా! ఇప్పుడు కొత్తకొత్త చెప్పులొచ్చాయి. కిర్రు... తుర్రో తుర్రు.
చెకుముకిరాయి:
ఇవే నిప్పురాళ్లు. వాటిమధ్య దూది పెట్టి... రాజేస్తే మంట వస్తుంది. రాళ్లను ఒకదానితో ఒకటి కొట్టికొట్టి విసుగొచ్చినా తప్పదు. అగ్గిపెట్టె వచ్చింది. రాళ్లతో తిప్పలు తప్పాయి.
తలపాగా:
ఒక్కసారి ముత్తాతగారి ఫొటో చూడండి! తలపాగా ఉండే ఉంటుంది. అది సంప్రదాయం. వేడి ప్రాంతమైన మనకు సూర్యుడి నుంచి అది రక్షణ కవచం. హుందాకు ఓ చిహ్నం. తలపాగాలు పోయి టోపీలు వచ్చేశాయి.
బాయిలర్:
ఇదో పొడవాటి రాగి పాత్ర. మధ్యలో చిన్నగొట్టం. ఆ గొట్టంలో బొగ్గుల నిప్పులు. సలసలకాగుతూ చుట్టూ ఉన్న నీళ్లు. టీ హోటళ్ల వద్దా ఈ బాయిలర్. ఇప్పుడు ఇది ఆవిరైపోయింది. దీని స్థానాన్ని హీటర్లు, గీజర్లు ఆక్రమించాయి.
పందిరి మంచం:
'చూడు నాయనా! ఇది తరతరాలుగా వాడుతున్న పందిరి మంచం...' అంటూ బామ్మగారు మనవడి శోభనం రోజు దాని చరిత్ర విప్పుతుంటారు. ఎత్త్తెన మంచం చుట్టూ అందాల పందిరి. శృంగార వేళ ఆ పందిరికి పూలు పూస్తాయి. దోమలు వస్తే తెరలు వేలాడతాయి. పందిరి మంచానిది గత వైభవం. డబుల్‌కాట్‌తో దాని నడ్డి విరిగింది.
గుండ్రాయి:
కుంకుడుకాయలు కొట్టాలంటే గుండ్రాయి. బాదంకాయ పగలగొట్టాలంటే గుండ్రాయి. చింతపండు దంచాలంటే గుండ్రాయి. మరి ఇప్పుడో... చేత్తో దంచాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా ఏ లారీ పిస్టన్‌లనో పట్టుకుంటున్నారు. ఇంకా గుండ్రాయి వాడే వారికి జోహారు.
భోషాణం:
నగలు, వరహాలు, విలువైన వస్త్రాలు... ఇంట్లో ఇలాంటివన్నీ దాచుకునే 'లాకర్' భోషాణం. చందమామ, బాలమిత్ర కథల్లో ఈ పదం తరచూ కనిపిస్తుంది. బీరువాలు, బ్యాంకు లాకర్ల రాకతో భోషాణం అటకెక్కింది.
పొడుంకాయ:
కాయంటే కాయ కాదు... ఎప్పటికీ పండుకాదు. ఇది నశ్యం దాచుకునే చిన్న డబ్బా. నశ్యం వాడేవాళ్లే తగ్గిపోయారు. ఇక పొడుంకాయకు చోటెక్కడిది.
పన్నీరుబుడ్డ్డి:
ప్రతి వేడుకల్లో ఇదో సరదా! చేతులు అడ్డుపెట్టుకుని తప్పుకుని పోతున్నా... బుడ్డిలో పన్నీరు చిలకక మానదు. వచ్చీ పోయేవారికి సువాసన అంటించక మానదు. ఇప్పుడు పెళ్లిళ్ల ముందు గిర్రున తిరుగుతూ... వాసన నీళ్లను వెదజల్లే యంత్రాలు వచ్చాయి. పన్నీరుబుడ్డీలోని అప్యాయత... యాంత్రికతతో హాంఫట్.
ఉట్టి:
చిన్ని కృష్ణుడి అల్లరి దీని చుట్టూనే తిరిగింది. పిల్లి శాపాలకు అతీతంగా నిలిచింది. పాలు, పెరుగు, వెన్నకు రక్షణ కల్పించింది. పల్లెల్లో అక్కడక్కడా మాత్రమే ఇది కనిపిస్తోంది. మిగిలిన చోట్ల ఇదే స్వర్గానికి ఎగిరిపోయింది.
కావిడి:
కలిమిలేములు, కష్టసుఖాలు, కావడి కుండలు! ఇదో కవిత్వం, వేదాంతం. అవన్నీ వదిలేస్తే... రెండు కుండలతో ఒకేసారి సులభంగా నీళ్లు తెచ్చుకునేందుకు కావిడే ఆధారం. కుండలు పగిలాయి. కావిడి విరిగింది.
వాణిశ్రీ కొప్పు:
అభినేత్రి వాణిశ్రీ పేరిట ఏర్పడిన ఫ్యాషన్. నాటి మహిళలు అనుసరించిన, వారిని అలరించిన శిరోజ కిరీటం. కొప్పు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప! జుట్టు లేకున్నా... రెడీమేడ్‌గా కొప్పులు సిద్ధం. ఇప్పుడు వాణిశ్రీ కొప్పు పోయింది. ఆమె పేరిటే ప్రాచుర్యం పొందిన 'ఫుల్ హ్యాండ్స్' రవికలూ ఫ్యాషన్ తెరపై కనుమరుగయ్యాయి.
తాటాకుబద్ద:
టంగు క్లీనరు దండగ... తాటాకుబద్ద ఉండగా! తరతరాలుగా పల్లెసీమల్లో తాటాకుబద్దే సహజమైన నాలుకబద్ద. వేప పుల్లే ఆరోగ్యకరమైన టూత్‌బ్రష్. మరే పేస్టూ అక్కర్లేదు. మరి ఇప్పుడో... ప్లాస్టిక్ టంగ్ క్లీనర్లు, బ్రష్షులు, పేస్టులు పల్లెపల్లెకూ చొచ్చుకుపోయాయి. తాటాకుబద్ద బద్దలయింది. వేపపుల్ల విరిగిపోయింది.
టూరింగ్ టాకీస్:
నెలకో వారానికో ఒక సినిమా! ఊర్లో ఒక చోట తెరపెట్టి... చిన్న ప్రొజెక్టర్‌తో చిత్ర ప్రదర్శన. అది చూసేందుకు ఊరిజనం తపన. లవకుశలో సీత కష్టాలు చూసి కన్నీళ్లు... గుండమ్మ కథలో గుండమ్మ ఇక్కట్లు చూసి నవ్వులు... అన్నీ తెరవెనక్కి వెళ్లిపోయాయి. టీవీలు వచ్చాయి. రవాణా సౌకర్యం పెరగడంతో పక్కనే ఉన్న టౌనుకెళ్లి సినిమా చూడటం సాధారణమైంది.
(Eenadu, 15:08:2007)
Labels: Telugu/ culture
1 Comments:
చాలా విశయాలను మళ్ళీ గుర్తుకు తెచ్చారు.
--ప్రసాద్
http://blog.charasala.com
10:36 pm
Post a Comment
<< Home