మద్రాసు... ఆ పేరు మర్మమేమి?
('మద్రాస్ దినోత్సవ' సందర్భంగా)
మద్రాసు అన్న పేరు పుట్టుకపై ప్రధానంగా నాలుగు వాదనలున్నాయి. ఇవేవీ నిర్దిష్టం కావు. 17వ శతాబ్దం చివరిలోనే ఆంగ్లేయులు మద్రాస్, లేదా మద్రాజ్ అని రాయడం ప్రారంభించారు. అది ఎలా వచ్చిందన్నదానికే ఆధారాలు లేవు. ప్రధాన వాదనలివి...
వాదన 1:
ఈస్ట్ ఇండియా వ్యాపారి ఫ్రాన్సిస్ డే ఫ్యాక్టరీ నిర్మాణం తలపెట్టిన జనసంచారంలేని ప్రాంతం ఆనుకుని ఓ జాలరి కుప్పం ఉండేది. దాని నేత మదిరాసన్. ఫ్రాన్సిస్ డే కొనుగోలుచేసిన మైదానంలోని కొంత భాగంలో ఇతని అరటి తోట కూడా ఉండేదట. మరి...అరటి తోట అతను ఇవ్వాలి గదా! 'బాబు! మా ఫ్యాక్టరీకి మీ పేరే పెడతాం' అని కుంఫిణీవాళ్లు ఒప్పించారట. అలా...మద్రాసు అన్న పేరు వచ్చిందని ఓ వాదన.
వాదన 2:
'కానేకాదు. మదిరాసన్ అన్న పేరు జాలరిది కాదు. ఓ క్రైస్తవ మిషనరీది. ఆయన జాలరికుప్పంలో చర్చ్ నడుపుతుండేవాడు. ఆ పేరు మీదు గానే మద్రాసు వచ్చింది' అన్నది మరొక వాదన.
వాదన 3:
మద్రాసు ఆవిర్భావానికి సుమారు 40 ఏళ్ల కిందటే ఇక్కడ శాంథోంను పోర్చుగీసులు ఏర్పాటుచేశారు. వాళ్లకు సంబంధించిన సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకటిపై 'మదరాసే' అనే వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఆయన ఇక్కడ లా పలుకుబడి ఉన్నవాడని, దాతని తెలుస్తోంది. ఆయన పేరుమీదుగానే మద్రాసు వచ్చిందా? అన్నది మరో సందేహం.
వాదన 4 :
ఇస్లాం మతస్థుల శిక్షణ కేంద్రాలు 'మద్రాసాల' వల్ల ఈ పేరు వచ్చిందా? అన్న అనుమానమూ కొందరు వ్యక్తంచేస్తుంటారు. అయితే...ఇక్కడ ఆంగ్లేయులు అడుగుపెట్టేసరికి ఇస్లాం మతం అంత ప్రాబల్యంలో లేదు. కాబట్టి ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.
అమెరికాలో 'మద్రాసు'
నిజం...ఉత్తర అమెరికాలో 'మద్రాసు' అనే పట్టణం ఉంది. మరి అదెలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంటుందిగానీ...ఆ పేరు వెనుక కూడా మన మద్రాసు హస్తమే ఉంది. చెన్నై నుంచి ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అమెరికాకు వస్త్రాలు ఎగుమతి చేస్తుండేవారు. వాటిపై...'మద్రాసు' అనే ముద్ర ఉంటుంది. అమెరికాలోని ఆ చిన్న పట్టణానికి ఈ సరకులు వెళ్లేవి. మద్రాసు ముద్ర ఉన్న సరకులు వెళ్లే ప్రాంతం కాబట్టి...దానికీ 'మెడ్రాస్' అన్న పేరు స్థిరపడిపోయింది.
చెన్నపట్టణం అచ్చతెలుగు!
కుంఫణీ ఏజెంటు ఫ్రాన్సిస్ డేకి ఈ భూభాగాన్ని అప్పగించడంలో అయ్యప్ప నాయకుడు, వేంకటాద్రి నాయకుడు కీలకపాత్ర పోషించారు. వీళ్లు విజయనగర రాజుల కింద వందవాసి, పూందమల్లి ప్రాంతంలో పాలకులు. ఈ అయ్యప్ప నాయకుడి తండ్రిపేరు చెన్నప్ప. ఈయన కాళహస్తిప్రాంతం పాలకుడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు ఈ ప్రాంతాన్ని అడగ్గానే అయ్యప్ప నాయకుడు దీనికి తమ తండ్రి పేరు పెట్టాలని షరతు విధించాడు. అంతేకాదు...నాడు విజయనగర రాజు శ్రీరంగరాయలు కూడా ఈ ప్రాంతానికి తన పేరు ఉండాలని ముచ్చటపడ్డాడు. ఆయన తన ఒప్పంద పత్రంలో ఏకంగా 'శ్రీరంగరాయపట్టణం' అనే రాసిచ్చేశాడు. ఈ రెండింటికీ 'సరే'నన్న ...ఆంగ్లేయులు అధికారికంగా మాత్రం ఎక్కడా ఆ పేర్లు వాడలేదు!
'మన సోదర భాష'
అయితే ఆంగ్లేయుల ఫ్యాక్టరీకి పక్కనే ఏర్పడ్డ తెలుగు టవున్ (బ్లాక్ టవున్)కు ఈ 'చెన్నపట్టణం' అన్న పేరు వాడుకలోకి వచ్చేసింది. తెలుగువారందరూ చెన్నపురి అనడం ప్రారంభించారు. 'చెన్న' అచ్చతెలుగు పదం. బాగు, అందమైనది అన్నది దీనర్థం. 1996లో నగరానికి మద్రాసు అనే ఆంగ్ల పేరు ఉండకూడదని భావించిన డీఎంకే ప్రభుత్వం అధికారికంగా 'చెన్నై' అని పేరుమార్చింది. 'మరి ఇది తెలుగు పేరు కదా?' అని ప్రశ్నించిన వారికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది...'తెలుగువారు మన సోదరులు. అది మన సోదర భాష. ఆది నుంచి చెన్నపురిగానే పిలుస్తున్నాం. ఆ పేరు ఉండటంలో తప్పులేదు.'
(Eenadu,న్యూస్‌టుడే, చెన్నై 22:08:2007)
ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక తమిళనాడు. బ్రిటిషు వారి ఆగమనం మొదలు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గీతికలో కొన్ని చరణాల సింహావలోకనం ఇది.
తెల్లదొరలు భారతదేశాన్ని కొల్లగొట్టినా వారి స్వార్థం కొంతవరకు మేలు చేసింది. ముఖ్యంగా చెన్నై అభివృద్ధిలో ఆంగ్లేయిల కృషి అసమానమైంది. దక్షిణాదిలో తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకోవడానికి ఆంగ్లేయిలు తొలుత మచిలీపట్టణాన్ని ఎంచుకున్నారు. అక్కడ తుఫాను తాకిడికి వారి వ్యాపార కేంద్రాలు నాశనమయ్యాయి. దీంతో కోరమాండల్ తీర ప్రాంతంలోని మెరీనా తీరాన్ని వెతుక్కుంటూ ఆంగ్లేయిలు ఇక్కడికి వచ్చారు.. అనంతరం దీన్నే స్థావరంగా మార్చుకుని తమ కార్యకలాపాలు సాగించారు. అలా ఈ ప్రాంతం ఆంగ్లేయిల చేతుల్లో ఓ నగరంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నపురి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఎన్నో ఉత్తాన్నపతనాలు చవి చూసింది. అందులో కొన్ని మధుర ఘట్టాలు...
స్వాతంత్య్రానికి ముందు
1639 ... మద్రాసు ఆవిర్భావం.. ఆంగ్లేయిలు మద్రాసు పట్టణాన్ని అయ్యప్ప నాయకర్ నుంచి కొనుగోలు చేశారు.
1640 ... 25 మంది యూరోపియన్లతో కలసి ఫ్రాన్సిస్ డే పట్టణానికి రాక. సెయింట్ జార్జి ఫోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన
1668 ... ట్రిప్లికేన్ నగరంలో విలీనం
1679 ... సెయింట్ మేరీస్ చర్చి నిర్మాణం పూర్తి
1688 ... మద్రాసు నగర పాలక సంస్థ ప్రారంభం
1693 ... ఎగ్మూరు, పురసైవాక్కం, తొండియారుపేట నగరంలో విలీనం.
1711 ... మొదటి ముద్రణాలయం ఏర్పాటు
1746 ... ఫ్రెంచి వారు మద్రాసు నగరాన్ని ఆంగ్లేయిలకు తిరిగి అప్పగింత.
1759 ... ఫ్రెంచి పాలన అంతం
1767 ... హైదర్‌అలీ దండయాత్ర
1768 ... ఆర్కాటు నవాబు చేపాక్ ప్యాలెస్‌ను నిర్మించారు.
1777 ... వీరప్పిళ్త్లె మొదటి కొత్వాల్‌గా నియామకం
1784 ... మొదటి వార్తా పత్రిక 'మద్రాస్ కొరియర్' ప్రారంభం
1785 ... మొదటి తపాలా కార్యాలయం ప్రారంభం
1795 ... ట్రిప్లికేన్ పెద్ద మసీదు నిర్మాణం
1831 ... మొదటి వాణిజ్య బ్యాంకు 'మద్రాసు బ్యాంకు' ఏర్పాటు
1831 ... మొదటిసారి నగరంలో జనాభా లెక్కల సేకరణ.. 39,785 మంది
1835 ... మొదటి మెడికల్ కళాశాల ఏర్పాటు (మద్రాసు క్రిస్టియన్ కాలేజీ)
1842 ... మొదటి లైట్ హౌస్ ఏర్పాటు
1856 ... మొదటి రైలుమార్గం నిర్మాణం 'రాయపురం నుంచి ఆర్కాటు మధ్య'
1857 .. మద్రాసు యూనివర్సిటీ ఏర్పాటు
1868 .. మొదటిసారి రక్షిత నీటి సరఫరా ఏర్పాటు
1873 .. మొదటి సారిగా నగరంలో జనన ధృవీకరణ
1882 ... మొదటి సారిగా టెలిఫోన్ ఏర్పాటు
1885 ... మొదటి సారి మెరీనా బీచ్ రోడ్డు నిర్మాణం
1886 ... కన్నెమెరా పబ్లిక్ గ్రంథాలయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం
1889 ... మద్రాసు హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
1894 ... మొదటి సారి నగరంలో కారు నడిపారు. ప్యారీ అండ్ కంపెనీ డైరెక్టర్ ఏజే బోగ్ తొలిసారి నగరంలోని రోడ్లపై కారు నడిపారు.
1895 ... దేశంలో తొలిసారిగా విద్యుత్తు ట్రామ్ రైలు నగరంలో నడిపారు.
1899 ... తొలి తమిళ వార్తా పత్రిక 'స్వదేశమిత్రన్' ప్రారంభం
1905 ... పోర్టు ట్రస్టు ఏర్పాటు
1917 .. మొదటిసారి నగరంలో విమానం ఎగిరింది.. 'సింప్సన్ అండ్ కంపెనీ ప్రయోగం చేసింది'
1925 ... మొదటి సారిగా రోడ్లపై బస్సులు నడిచాయి
1930 ... మొదటి సారిగా రిప్పన్ బిల్డింగ్ నుంచి రేడియో ప్రసారాలు
1934 ... మద్రాసు మొదటి మేయర్‌గా రాజా సర్ ముత్తయ్య చెట్టియార్ నియామకం
1942 ... రెండో ప్రపంచ యుద్ధం.. మద్రాసు నగరంపై దాడులు
1943 ... జపాన్ యుద్ధ విమానం నగరంపై బాంబులు జారవిడిచి మాయమైంది.
స్వాతంత్య్రం తరువాత
1947 ... సెయింట్ జార్జి కోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు
1952 ... నెహ్రూ స్టేడియం నిర్మాణం
1956 ... గాంధీ మంటపం నిర్మాణం
1959 ... గిండీ చిల్డ్రన్స్ పార్కు ప్రారంభం
1969 ... ప్రపంచ తమిళ సమాఖ్య సమావేశం
1971 ... స్నేక్ పార్కు ఏర్పాటు
1972 ... మద్రాసు నగరాభివృద్ధి సంస్థ ఏర్పాటు
1974 ... టెలివిజన్ ప్రసారాల కేంద్రం ఏర్పాటు
1976 ... కొత్త లైట్ హౌస్ నిర్మాణం
1983 ... జూని వండలూరుకు తరలింపు
1988 ... మద్రాసు నగరాన్ని పది జోన్లుగా విభజన
1996 ... మద్రాసు నగరాన్ని చెన్నైగా పేరు మార్చారు.
2000 ... జులై 4 టైడల్ పార్కు ప్రారంభం
2002 ... నవంబరు 18 కోయంబేడులో చెన్నై బస్టాండు ప్రారంభం. రూ.103 కోట్ల వ్యయంతో నిర్మాణం.
2004 ... డిసెంబరు 26, సునామీ ఉత్పాతం..
2006 ... ఆగస్టు నెలలో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
(Enaadu,న్యూస్‌టుడే, చెన్నై07:08:2007)
_____________________________________________________________
Labels: Chennai, Telugu/ culture
2 Comments:
ప్రభుత్వం అంత బాగా అన్నదంటే సంతోషంగా ఉంది.
9:27 pm
ఈ రెండో ప్రపంచ యుద్ద విశేషాలు ఇంకా తెలియ పరుస్తారా?
ప్రసాద్
http://blog.charasala.com
2:43 am
Post a Comment
<< Home