అచ్చమైన నుడికి అతడే గొడుగు
గిడుగు జయంతి సందర్భంగా...
- అక్కిరాజు రమాపతిరావు
సమాజానికి, దేశానికి, జాతికి, సాహిత్యానికి గొప్ప మేలు చేసినప్పుడే ఒక వ్యక్తిని మహాత్ముడని, మహనీయుడని, మహాపురుషుడని ప్రజలు భావిస్తారు. అంతకు పూర్వం లేని కొత్త వికాసాన్ని, పరిణామాన్ని, సమాజహితాన్ని ఆ వ్యక్తి సాధించినప్పుడు ఆ జాతి జనులకు ఆయన చిరస్మరణీయుడంటాము. ఆధునిక తెలుగు భాషా సాహిత్య చరిత్రలో గిడుగు రామమూర్తి అటువంటివారిలో ప్రముఖులు.
ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి అని తెలుగువారికి ప్రబోధించిన గిడుగు... భాషా శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేశారు. తెలుగును ఆధునికీకరించడానికి బీజావాపం చేసి పంట పొలాన్ని తయారుచేశారు. ఆయన వ్యాకరణాన్ని కాదనలేదు. సంప్రదాయ సాహిత్యాన్నీ వద్దనలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చనీ చెప్పలేదు. భావ ప్రకటనలో భాషాశైలిలో తప్పులంటూ ఏమీ ఉండవు, ఉంటే మాత్రం ఏం? అనీ అనలేదు. భాష ఎదుగుదలను కాంక్షించాడు. ఆ విషయమే పండిత పామరులందరూ అర్థం చేసుకునేట్లు చెప్పాడు. ఇంటగాని, బయటగాని, ఉపన్యాసాల్లో రచయితల రచనల్లో కాని ఒక భావ ప్రకటన కోసం ఉపయోగించే పదాన్ని అది వ్యాకరణం ద్వారా సమర్థించలేమనో, నిఘంటువులో లేదనో, మాండలికమనో, గ్రామ్యమనో అనకూడదని మాత్రమే ఆయన కట్టడి చేశారు. కవి ప్రయోగం ద్వారా ఆ పదం తాలూకు ఔచిత్యమో, అనౌచిత్యమో చర్చించవచ్చు, నిర్ణయించవచ్చు. కానీ సాధుత్వమో, అసాధుత్వమో నిర్ధరించే హక్కు ఏ పండితుడికీ, ఏ విమర్శకుడికీ లేదనీ, ఉండకూడదనీ ఆయన వాద సారాంశం. డెబ్భై ఏళ్ళ కిందట ఆయన ఏమని చెప్పారో చూడండి: ''విద్యా విధానము మారవలెను. ప్రజలకు సులభముగా తెలిసేటట్టు మాతృభాషలో సమస్త శాస్త్రములు బోధించవలెను. నాజూకుగా సరసంగా సభ్యంగా ఎదుటివారి మనస్సు ఆకర్షించేట్టు మాటలాడడము, ఉపన్యసించడమూ నేర్పవలెను. ప్రజా ప్రభుత్వము బాగా ఉండవలెనంటే వక్తృత్వము బాగా వృద్ధి పొందవలెను''
వక్తృత్వం అంటే దాన్ని మాతృభాషలో కాక ఏ భాషలో వృద్ధి చేయగలుగుతారు? వ్యక్తృత్వానికి అన్య భాషల వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రజాసామాన్యంలో అది సాధ్యమా? ప్రజల సాముదాయక చర్చల వల్ల, అభిప్రాయ వినిమయం వల్ల ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని, ప్రపంచమంతటా వర్తించే సంప్రదాయం ఇదేనని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ కూడా అన్నారు. అసలైన ప్రజాస్వామికపు విశాల దృక్పథం ఏమంటే ప్రజల అభిప్రాయం, చర్చలు, వాదోపవాద పరిగణనం, పరిపాలనలో ప్రజల మాట ప్రాధాన్యంగా ఉండాలనీ అయన చెప్పారు. గిడుగువారు చెప్పిందీ అదే. ''గ్రీసు దేశంలో ప్రాచీన కాలంలో వాగ్మిగా ఉండటమే గొప్ప విద్యగా ఎంచుకునేవారు. నోటి మాటకే జయము. నాటక రచన కూడా ఆ దేశంలో వృద్ధి పొంది ప్రజలను విజ్ఞానవంతులనుగా చేయడానికి తోడ్పడింది. మనదేశంలో కూడా వ్రాత (లిపి) లేనికాలంలోనూ, తరువాత అచ్చు పుస్తకాలు రాని కాలంలోనూ నోటి మాట ద్వారానూ ఉపాధ్యాయుల ఉపన్యాసాల వల్లనూ విజ్ఞానం వ్యాప్తమయ్యేది. భావం స్పష్టంగా తెలియవలెనంటే భాష సుపరిచితముగా ఉగ్గుపాలతో అలవడ్డ మాతృభాష అయి ఉండాలి'' అన్నారు గిడుగువారు. ఏదైనా విషయ చర్చకుగాని, విషయ గ్రహణానికికాని, అభిప్రాయ ప్రతిపాదనకుకాని, ప్రజల ఆమోదం పొందడానికి కాని మాతృభాష ద్వారా సాధ్యపడినట్లు వలస పరిపాలన భాషామాధ్యమం ద్వారా సాధ్యమవుతుందా!
ఏ జాతి వికాసమైనా ఏ భాష అభివృద్ధి అయినా ఆ కాలపు విజ్ఞానవ్యాప్తిపైనే ఆధారపడి ఉంటుందనీ జనసామాన్యంలో విద్యనూ, విజ్ఞానాన్నీ వ్యాపింపజేయాలంటే వాఞ్మయం మించిన సాధనం లేదనీ గిడుగువారు పదేపదే ప్రబోధించారు. ప్రజలందరూ గ్రాంథిక భాషా పండితులు కాలేరు. వాడుక భాష వారికి నేర్పితే చాలును అని ఆర్తి చెందారు. 'ఆంధ్రులను విద్యావంతులను చేయడానికి నా మతము అంగీకరించేట్లయితే ఒక మాసము రోజులలో సాధ్యమవుతుంది. ముందుగా వ్యావహారిక భాషలో మీ కరపత్రాలన్నిటిని అచ్చొత్తించండి. ఆ తరువాత తెలుగు అక్షరాలూ గుణితమూ ప్రతివారికీ నేర్పడానికి గ్రామానికొక ప్రచారకుణ్ణి ఏర్పాటు చేయండి. అక్షరాలూ గుణింతమూ మామూలు తెలివితేటలుగలవాడు నేర్చుకోవడానికి వారము పదిరోజుల కన్న ఎక్కువ పట్టదు. ఎప్పుడైతే అక్షరాలూ గుణింతమూ వచ్చాయో ఆ క్షణము నుంచీ మీ కరపత్రాలు మొదలుగునవి చదువుకోగలుగుతారు. ఇంతకన్న దేశములో విద్య వ్యాపింప జేయడానికి సులభమార్గము లేదు. మీరీ పనికి పూనుకొనవలెను. ఈ విధముగా బాల్కను రాష్ట్రాలలో యుద్ధము అయిపోయిన తర్వాత చేసినారు. నేను ఆ విషయమంతా చదివినాను. బాల్కను రాష్ట్రాలలో ఆరు మాసాలలో విద్యాశూన్యత అంతాతొలగిపోయింది' అని 1935లోనే గృహలక్ష్మీ కంఠాభరణమనే వ్యాస సంకలనం పీఠికలో గిడుగువారు ప్రబోధించారు. ఆయన రచనలు, ఆయన విశ్లేషణలు పట్టభద్ర స్థాయి విద్యాబోధనలో, స్నాతకోత్తర స్థాయిలో మన విశ్వవిద్యాలయాలు పాఠ్యగ్రంథాలుగా చేయకపోవడం విచారకరం.
గిడుగువారి వ్యక్తిత్వం, ఉదార హృదయం, ఉదాత్త సంస్కారం చాలా గొప్పవి. గాంధీజీ అస్పృశ్యత నివారణానికి 25 ఏళ్ల ముందే సవరల్లో అస్పృశ్యులని భావించే పానోలను గిడుగువారు తమ ఇంట్లోకి రానిచ్చి ఆదరించారు. సవరల కోసం సొంత సొమ్ము వెచ్చించి, ఉపాధ్యాయులకు తానే జీతాలిచ్చి ఆయన పాఠశాలలు నిర్వహించారు. వాళ్లకోసం నిఘంటువులు, వాచక పుస్తకాలు, వాళ్ల పాటలు, ఆటలు తెలియజేసే పుస్తకాలు ప్రకటించాడు.అటువంటి మహానుభావులు, మార్గదర్శకులు, మహర్షులు ఏరీ ఇప్పుడు!
(eenadu, 29:08:2007)
చూడండి:
గిడుగు పిడుగు
-------------------------------------------------
Labels: Personality, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home