రెండో పురుషార్థం
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను. నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప. అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!'' అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని విడిచిపెట్టరాదనీ, అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.
నీతి నిజాయతీలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బు, ఆస్తులు కూడబెట్టినవారి గతి అథోగతి కావడం మనం సమాజంలో చూస్తున్నాం.
అర్థానామార్జనే దుఃఖం ఆర్జితానాంచరక్షణే
నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనమ్
డబ్బు కూడబెట్టడంలో దుఃఖం, కూడబెట్టింది రక్షించుకోవడంలో దుఃఖం, అది పోయినా, ఖర్చయినా దుఃఖమే. ఇలా ఇన్ని రకాల దుఃఖాలకు కారణమైన ధనంమీద మనిషికి వ్యామోహం ఎందుకో? డబ్బును దానం చెయ్యాలి, అనుభవించాలి, ఇతరుల కోసం వినియోగించాలి. లేకపోతే నాశనం అయిపోతుంది. నిలబడదు. నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో రెండో పురుషార్థమైన 'అర్థం' ప్రత్యక్షంగా కనిపించేది, లౌకికమైనది. రాయబార సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన పద్యం 'అర్థం' పరమార్థాన్ని చక్కగా వివరిస్తుంది.
ఉన్నదానితో సంతృప్తి చెందక, అన్యుల ధనంకోసం అవినీతి, అక్రమ మార్గాలు అనుసరించి, దారుణ మారణహోమాలకు పాల్పడుతూ, పోరాటాలకు, కుటిల యత్నాలకు తలపడితే అటువంటివారి వంశం నిలబడదు. ధర్మమార్గంలో సంపాదించిన అర్థమే శ్రేయస్సును, శుభాన్ని కలిగిస్తుంది. అక్రమార్జన వలన అనర్థమే మిగులుతుందని శ్రీకృష్ణ భగవానుడు అర్థం గురించి వివరించిన 'పరమార్థం' సర్వకాల, సర్వావస్థలకు ఆమోదయోగ్యం, అనుసరణీయం.
(Eenadu,25:08:2007)
--------------------------------------------------------
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home