మేరా భారత్ మహాన్!
-ఎవరి జన్మభూమి వారికి ప్రియమైనదిగా అనిపించినా, ఏ దేశం ప్రత్యేకత దానిదే అయినా- భారతదేశం సంగతి వేరు. ఈ దేశం భోగభూమి కాదు, కర్మభూమి. అనాదిగా చరిత్రలో, గాథల్లో కర్మభూమిగా పేరుపొంది మన్ననలందుకొంది. భారతావని నాలుగు వేదాలకూ పుట్టినిల్లు. గౌతమబుద్ధుని బోధనలతో, ఆదిశంకరుల ఉపదేశాలతో, వేదఘోషలతో పులకించిన పుణ్యసీమ. ఈ దేశంలో జన్మించటమే మహద్భాగ్యం అని కవులు కీర్తిగానాలు చేశారు. ''ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనియించినాడవీ స్వర్గఖండమున-'' అన్న కవి, ''లేదురా ఇటువంటి భూదేవి యెందు...'' అనీ అన్నారు. తమ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదని ఎందరో భావిస్తుంటారు. ఈ విషయంలో అమెరికన్లు, బ్రిటిష్‌వారు అగ్రస్థానంలో ఉంటారు. ఓ క్లబ్బులో ఓ అమెరికన్ పెద్దమనిషీ, ఇంగ్లిషాయనా మాట్లాడుకుంటున్నారు. అమెరికా పెద్దమనిషి తన దేశం ఎంత గొప్పదో వివరిస్తూ గొంతు చించుకొని అనర్గళంగా ఉపన్యసించాడు. ఇంగ్లిషాయనమాత్రం ఒక్క మాటా మాట్లాడకుండా మూతి బిగించుకొని కూర్చున్నాడు. ''అదేమిటండీ ఆ అమెరికా బాబు తన దేశ గొప్పతనం గురించి అంతగా చెబుతుంటే మీరేమి మాట్లాడరేం? మీరూ మీ దేశం ఎంత గొప్పదో నాలుగు ముక్కలు చెప్పవచ్చుకదా?'' అన్నాడు వారితోపాటే ఉన్న మూడో వ్యక్తి. ''వేరే చెప్పటం ఎందుకు? ఆ విషయం ప్రపంచమంతటికీ ముందే తెలుసు'' అన్నాడు ఇంగ్లిషాయన గంభీరంగా.
దేశాభిమానమే కాదు ప్రాంతీయాభిమానమూ సహజంగా ఉండేదే. ''మనం కృష్ణాతీరం వాళ్ళం. పేరు గొప్పే కాదు, ఎక్కడికి వెళ్ళినా పెద్దపీట వేయించుకుంటాం...'' అంటుంది రాజమ్మ అనే ఆమె మల్లాదివారి 'కృష్ణాతీరం' నవలలో. ''ఏటి ఒడ్డున పుట్టిన వాళ్ళెవరైనా అలానే అంటారు. అటు పెన్నలో వాళ్ళు, ఇటు గోదావరిలో వాళ్ళూను. అక్కడ నన్నయ, ఇక్కడ తిక్కన పుట్టుకొచ్చారు'' అని ఎదురు చెప్పినవారికి- ''ఆఁ... భారతమూ పుట్టుకొచ్చింది... మూడూళ్ళు తిరిగితేకాని ముడిపడలేదు. కృష్ణ ఒడ్డున కూర్చొని సంకల్పం చెప్పుకొని, ఒంటిచేతిమీద భాగవతం రాశాడు ఆ పేదబ్రాహ్మడు. అన్నీ నదులే కాని ఇదిరా నాయనా తేడా'' అంటుంది రాజమ్మ. తమ ప్రాంతం పట్ల గల అభిమానం ప్రతివారిచేతా ఇలానే వాదనలు చేయిస్తుంటుంది. పుట్టిన దేశంపై అభిమానం, భక్తీ అవశ్యం ఉండవలసినవే. పాశ్చాత్య నాగరికతా ప్రభావంలో పడి తమ దేశం కంటే ఇతర దేశాల్లో పరిస్థితులే బాగున్నాయని భ్రమించేవారు కొందరుంటారు. చదివింది అయిదో ఫారమే అయినా పైచదువులకు ఇంగ్లాండు వెళ్ళటమే భేషయిన పని అనుకున్న మొక్కపాటివారి పార్వతీశం బారిష్టర్ చదువు కోసం పడిన తిప్పలు తెలుగువారిని కడుపుబ్బా నవ్వించాయి. ఎంతయినా ఉన్న ఊరు, కన్నతల్లి, పుట్టినదేశాలకు సాటి వచ్చేవి మరొకటి ఉండవు.
దేశభక్తిలో, దేశం పట్ల మమకారంలో భారతీయులే అగ్రగణ్యులు. ఈ విషయం ఢిల్లీకి చెందిన ఏసీ నీల్సన్ కంపెనీ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది. మళ్ళీ జన్మంటూ ఉంటే భారతీయులుగానే పుట్టాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం- అన్నది ప్రతి పదిమంది భారత పౌరుల్లో తొమ్మండుగురు వెలిబుచ్చిన అభిప్రాయం. సర్వేలో పాల్గొన్నవారిలో 89 శాతం తిరిగి భారతదేశంలో జన్మించాలన్నదే తమ ప్రగాఢవాంఛ అని చెప్పారు. తాము భారతీయులమని చెప్పుకోవటానికి గర్వపడతామనీ వారన్నారు. భారతీయులుగానే తిరిగి జన్మించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న నిర్వాహకుల ప్రశ్నకు వారు దీటుగానే జవాబు ఇచ్చారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టని కోటగా భారతదేశం విల్లసిల్లుతోందని, విదేశీ సంస్కృతుల వెల్లువ దేశాన్ని ఎంతగా ముంచెత్తుతున్నా భారతీయత చెక్కు చెదరకుండా నిలిచి ఉంటోందని, ఆ కారణంగానే వచ్చే జన్మలోను తాము భారతీయులుగానే ఉండాలని కోరుకుంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో సగంమంది చెప్పారు. దేశంలో ఎన్నో భాషలున్నా, విభిన్న సంస్కృతులు, ప్రాంతాలు ఎన్ని ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో పరిఢవిల్లుతోందని, భారతీయుల పరస్పర మమతానుబంధాలను ఆ భావమే కాపాడుతోందని, ఆ కారణంగానే తాము భారతీయులుగా ఉండటానికే ఇష్టపడతామనీ వారన్నారు. భారత్‌లో కుటుంబ వ్యవస్థ విశిష్టమైనదని, గొప్పదనీ ప్రపంచంలోని ఏ దేశంలోను ఇంతటి ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ లేదనడంపై భిన్నాభిప్రాయాలకు తావెక్కడిది? ఇక్కడి రాజకీయ వ్యవస్థ ఘోరంగా తయారైందని విమర్శించినవారి సంఖ్య గణనీయంగానే ఉంది. పేదరిక నిర్మూలనపై మరింత శ్రద్ధ వహించాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, విద్యారంగంపై అధిక శ్రద్ధ వహించి నిరక్షరాస్యత కనపడకుండా చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది భారతదేశంలోని జీవనమే సుఖజీవనం అని నమ్ముతూ వచ్చే జన్మలోను భారతదేశంలోనే పుట్టాలన్నది తమ కోరిక అని చెప్పారు. అందుకే అన్నారు- జననీ జన్మభూమీ స్వర్గాదపి గరీయసీ అని!
(Eenadu,25:08:2007)
---------------------------------------------
Labels: India, India/Telugu
0 Comments:
Post a Comment
<< Home