గాడ్సే తండ్రి...
- ప్రమోదూత
''అవును... ముమ్మాటికీ ఇది ఆత్మహత్యే. గాంధీజీ ప్రజలందరూ చూస్తుండగానే కావాలని మా అబ్బాయి గాడ్సే దగ్గర తుపాకీ లాక్కుని ఢామ్మని పేల్చుకున్నాడు. మీరు ఆ సంఘటనని సరిగ్గా చూడండి... గాంధీజీ పాయింట్ బ్లాంక్ రేంజిలో పిస్తోల్ని గుండెలకు గురిపెట్టుకుని, జనం ఎవరూ చూడకుండా, వేలాది ప్రజలమధ్య తనని తాను ఢామ్మని పేల్చేసుకున్నాడు.
కావాలంటే ఆ తుపాకీ పేలిన సవుండు చూడండి. ఢామ్మని వచ్చింది. అదే వేరెవరో చంపి ఉంటే... దూరం నుంచి కాల్చినప్పుడు... ఢాంఁఁఁఁఁఁ ఁఁఁ ఁఁఁ అంటూ రీ సవుండు వస్తుంది. అలా రాకుండా తుపాకీ ఢామ్మని పేలింది. అంటే గాంధీజీని వేరెవరో చంపలేదు. ఆయన్ని ఆయనే కాల్చేసుకున్నాడు. కావాలంటే పోలీసుల్ని అడగండి. ఎగస్పార్టీవాళ్ళని కాదు... ఎక్స్‌పర్టుల్ని అడగండి. దగ్గర్నుంచి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకోవటం వల్లే గాంధీజీ చనిపోయాడు.
నేను చెబుతున్నానని కాదు... తుపాకీని మనకి మనమే గురిపెట్టుకుని ఢామ్మని పేల్చుకుంటే ఎలా చస్తామో నాకన్నా బాగా తెలిసినవాళ్ళు లేరు. ఇది మా అబ్బాయికి మాత్రమే తెలిసిన విద్య అని మీరనుకోవటం తప్పు. మా గాడ్సేకీ తుపాకీ ఉంది. గాంధీగారికి ప్రాణం అంటే లెక్కలేదు. కాబట్టే చనిపోయారు. తుపాకీతో ఎలా పేలిస్తే ఎలా చస్తారో బాగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా... వినండి: బాగా దగ్గర్నుంచి ఢామ్మని పేలిస్తే... మనిషి ఒకలా చనిపోతాడు. మనిషికే తుపాకి గొట్టం ఆనించి ఢామ్మని పేలిస్తే ఇంకోలా చనిపోతాడు. ఇవన్నీ మీకు తెలియదు... తెలిసినవాణ్ణి, అనుభవజ్ఞుణ్ణి చెబుతున్నా... గాంధీగారిది ఆత్మహత్యే. గాంధీగారు బాగా దగ్గర్నుంచి చనిపోయారు కాబట్టి, ఇది వేరేవాళ్ళు కాల్చింది కాదు.
నిజాలు మీకు నిలకడమీద తెలుస్తాయి. మా గాడ్సే ఎలాంటివాడో నాకన్నా బాగా తెలిసినవాళ్ళు ఎవరుంటారు చెప్పండి... వాడి దగ్గర పిస్తోలుండవచ్చు... అందులో గుళ్ళుండవచ్చు... అవి ట్రిగర్ నొక్కితే ఢామ్మనవచ్చు... అలా పేల్చటం మావాడికి వచ్చినంత బాగా ఇంకెవరికీ వచ్చి ఉండకపోవచ్చు... అంతమాత్రాన మావాడే తుపాకీ ట్రిగ్గరు నొక్కి గాంధీగారిని చంపేశాడంటే... బతికున్న నేను నమ్మను, చచ్చినా మీరూ నమ్మొద్దు. వాస్తవాలను నిపుణులు చెప్పగలుగుతారు... నేను మాత్రం నిపుణుణ్ణి కాకపోవటంవల్ల ఏమయినా చెప్పగలను.
విలువలకు కట్టుబడినవాణ్ణి కాబట్టి మా వాడు ఎవర్నీ చంపలేదని చెప్పగలుగుతున్నాను. అదే విలువలు లేని వాణ్ణయివుంటే... మా గాడ్సేయే ఈ హత్య చేశాడని కచ్చితంగా చెప్పివుండేవాణ్ణి. మా గాడ్సేకున్న విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. వాడు నా కొడుకు. కాబట్టి విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. వాడి వాదన నా వాదనను బలపరుస్తోంది. ఏ కన్న తండ్రికైనా ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది? ఒక వ్యక్తి చనిపోవటం ఎంత దారుణమో... మరో వ్యక్తి అతడిని చంపాడనటం అంతకన్నా దారుణం. గుర్తుంచుకోండి.
అలాగని, చనిపోయిన గాంధీజీ పట్ల, ఆయన కుటుంబ సభ్యులపట్ల నాకు సానుభూతి లేదా? మా గాడ్సేకు లేదా? సానుభూతి ఉన్న వ్యక్తి ఎలా చంపుతాడు? గాంధీ ఆత్మహత్యను చూడలేకే మా గాడ్సే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏ పాపం తెలియని నువ్వు ఇంకా స్పృహలో ఉండటమేమిటని నేనే కేకలు వేయగానే... మా గాడ్సేకు స్పృహ తప్పింది. నేనొక మాట అనగానే స్పృహ తప్పించుకున్న అంతటి సున్నిత హృదయుడు గాంధీగార్ని హత్య చేశాడంటే... నేను నమ్మటం లేదు. నేను నమ్మని ఏ విషయాన్నీ వాడూ నమ్మడు. అంతటి విలువలున్న బంధం మాది...''
* * *
టక్... టక్... టక్...
ఏదో చప్పుడు. కళ్ళు తెరిస్తే, వాకిట్లో గూర్ఖా ఊదుతున్న విజిల్ చప్పుడు...
గాంధీ జయంతి దగ్గర పడుతుండటంతో... గాడ్సే ఎందుకు గాంధీగార్ని చంపాడని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా...
దిక్కుమాలిన 2007లో, ఆంధ్రప్రదేశ్‌లో బతుకుతున్నందున... ఏకంగా 'గాడ్సే తండ్రి' నా కలలోకి వచ్చి, వాళ్ళబ్బాయి తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.
గాడ్సే తండ్రేమిటి... కలలోకి రావటమేమిటి... వాళ్ళబ్బాయి తరఫున వకాల్తా పుచ్చుకోవటమేమిటి... ఇది కలా? నిజమా?
(Eenadu, 12:09:2007)
----------------------
నేరాలు వ్యవస్థీకృతం!
రాజకీయ మదాంధ శక్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో రాష్ట్రంలో వికృత భూ మాఫియాస్వామ్యం ఒళ్లు విరుచుకుంటోంది. పదవీ పీఠ పరివేష్ఠితుల పుత్రరత్నాలు యథేచ్ఛగా భూములు, గనులపై పెత్తనం చలాయించడమే- మున్ముందు నాయకత్వ హోదాకు ప్రాథమిక అర్హతగా పరిగణించే నయా 'సంస్కృతి' వేళ్లు తన్నుకుంటోంది. పీసీసీ పీఠాధిపతి తనయుడి ఇంట్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో ఒకానొక భూవ్యాపారి మృతి- సెటిల్‌మెంట్ల పేరిట దారుణాలకు ప్రబల ఉదాహరణ. రియల్ వ్యాపారాల దందాలో కేశవరావు కొడుకు కాకుండా ఇంకెవరున్నారన్న దిగ్విజయ్‌సింగ్ ప్రశ్న- సమస్య విస్తృతిని తక్కువచేసి చూపించాలన్న ఆరాటానికి అద్దంపట్టేదే. ఎంచి చూడబోతే, మంచమంతా కంతలే! కాంగ్రెస్ జమానాలో వారసుల వ్యాపార సామ్రాజ్యాలు ఇంతలంతలవుతున్నాయి. ఏ జిల్లా చూసినా యువనేతల ఖిల్లాగా వర్ధిల్లుతోంది. సర్కారీ భూములు, వివాదాస్పద పరగణాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం, అందినకాడికి దండుకోవడంలో 'కొత్త'తరం రాటుతేలుతోంది. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- ఛోటా మోటా రాజకీయ నేతల సంబంధీకులు, అధికార గణాలు, గూండా తండాలు మూకుమ్మడి భూకైంకర్య మహాయజ్ఞం సాగిస్తుంటే- యావత్ రాష్ట్రం దిమ్మెరబోతోంది. వాటాలు తెగని సందర్భాల్లో తలలు తెగిపడుతున్న తీరు బీహారర్‌ను తలపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలకపక్ష నేతల బంధుమిత్ర పరివార గణంతోపాటు- కబ్జాలు, సెటిల్‌మెంట్ల ఉరవడిలో పోలీస్ అధికారుల పేర్లూ మార్మోగుతున్నాయి. భూ లావాదేవీలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాల తయారీలో ముంబాయి తరవాత రెండోస్థానం హైదరాబాద్‌దేనని రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందే మొత్తుకుంటోంది. భూబకాసురులకు గొడుగు పడుతున్న ఏలికల హయాములో చట్టబద్ధ పాలన అర్థ తాత్పర్యాలే చెల్లాచెదురైపోతున్నాయి!
రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల కట్టడికి పటిష్ఠ చట్టం ఆవశ్యకతను ప్రస్తావిస్తూ గతంలో హోంమంత్రిగా దేవేందర్‌గౌడ్ నిష్ఠుర సత్యమొకటి వెళ్లగక్కారు. తమ ప్రాంతాలకు తామే సర్వం సహాధికారులమని, తమ కనుసన్నల్లోనే ఏ పనైనా జరగాలని ఫ్యాక్షన్ లీడర్లు తలపోస్తున్నారనీ ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారనీ కుండ బద్దలుకొట్టారు. నేడా విశృంఖలత్వం రాష్ట్రవ్యాప్తంగా వెర్రితలలు వేస్తోంది. నాయకులు, అధికారులు, వారి అనుయాయుల అసురగణాలు చట్టాల్ని చట్టుబండలు చేయడమే రోజువారీ కార్యక్రమంగా పెట్టుకుని చెలరేగిపోతున్నాయి. ఈ తరహా పాతక ధోరణుల్ని పాతరేయడానికి ఉద్దేశించిన 'కోకా' చట్టాన్ని వై.ఎస్.సర్కారే అటకెక్కించింది. కంచే చేను మేసిన రీతిగా పాలకపక్ష పెద్దలే అసాంఘిక శక్తులుగా అప్రతిష్ఠ మూట కట్టుకుంటూ కంటకస్వామ్యాన్ని నిర్లజ్జగా ఆవిష్కరిస్తున్నారు. ఓ వంక ప్రభుత్వ విభాగాలు అస్మదీయులకు అనుకూలంగా భూముల రేట్లకు రెక్కలు తొడుగుతుంటాయి. రహస్య సమాచారాన్ని ముందే దొరకబుచ్చుకుంటున్న వాళ్లు ఎక్కడెక్కడి భూముల్నీ గుప్పిట పట్టేందుకు, కుదరని చోట్ల సెటిల్‌మెంట్ల రూపేణా వాటాలు రాబట్టేందుకు ఉరకలెత్తుతుంటారు. రక్కసి మూక పాదతాడన ప్రకంపనలే భూమాఫియా సామ్రాజ్య విస్తరణ ఢంకానాదాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి. బలవంతంగా డబ్బులు గుంజే దాష్టీకాలకు, ఫోన్లలో బెదిరింపులకు, భూఆక్రమణ నేరాలకు ఉచ్చు బిగించేందుకే ఒకప్పుడు 'కోకా' చట్టం తెచ్చారు. ఇప్పుడది కాల గర్భంలో కలిసిపోవడమే అలుసుగా ఎక్కడికక్కడ భూభోక్తలు పుట్టుకొస్తున్నారు. సెటిల్‌మెంట్ల బాగోతాలు అడ్డూఆపూ లేకుండా సాగిపోతున్నాయి. హైదరాబాద్ జంట బాంబుపేలుళ్ల నేపథ్యంలో- 'కోకా' పునరుద్ధరణ అవకాశాలపై సందడి చేసిన ప్రభుత్వమింకా మీనమేషాలు లెక్కించడం ఏలికల మాటలకు చేతలకు మధ్య అగాధాన్నే ఎండగడుతోంది.
రాజకీయ భూ అరాచకాల మహాజాడ్యం ఇప్పుడు రాజధాని నగరానికే పరిమితం కాలేదు. విశాఖ వంటిచోట్లా భూసేకరణ ముసుగులో నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాయాజాలం అసంఖ్యాక రైతుకుటుంబాల్ని నిలువునా ముంచేస్తోంది. దగాకోరు స్వామ్యాన్ని కళ్లకు కడుతోంది. మొసలి కన్నీరు కారుస్తున్న నేతల చిత్తశుద్ధి ఏపాటి అన్నదే పౌర సమాజాన్ని నేడు తొలిచేస్తున్న ప్రశ్న. విచ్చలవిడి భూకుంభకోణాల్ని అక్రమ వసూళ్లను బలవంతపు ఆక్రమణల్ని అరికట్టేందుకు ఏ ప్రజాప్రభుత్వమైనా- పటుతర నిబంధనలతో ప్రత్యేక చట్టానికి కోరలు తొడగాల్సిన తరుణమిది. వ్యవస్థీకృత నేరాల అదుపుకోసం దేశంలో తొలిసారిగా 'మోకా' ప్రయోగించింది మహారాష్ట్ర. ఆ శాసన నిబంధనల దన్నుతోనే దావూద్ ఇబ్రహీం ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబాయిలో ఆ ముఠా కొంతయినా బలహీనపడిందంటే, కారణం ఆ చట్టమే. అందులోని కఠిన నిబంధనల స్ఫూర్తితోనే రాష్ట్రంలో 'కోకా' రూపుదాల్చింది. 2004 నవంబర్లో కాలపరిమితి ముగిసిన ఆ చట్టం కొనసాగాల్సిందేనని రాష్ట్ర పోలీసు విభాగం కేంద్ర హోంశాఖను అభ్యర్థించినా ఒరిగింది పూజ్యం. శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించినట్లు శాంతిభద్రతల అదనపు డీజీపీ 19 నెలల క్రితమే ప్రకటించారు. ముఖ్యనేతలు సుముఖం కానంతవరకు అలాంటి ప్రకటనలన్నీ ఉత్తచేతులతో మూరలే. సెటిల్‌మెంట్ల కబ్జాసుర సంతతికి రాజకీయ ఛత్రచ్ఛాయలో ఆసరాకు ఢోకా లేనన్నాళ్లు రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల అదుపు దింపుడుకళ్లం ఆశే!
(Eenadu,,13:09:2007)
--------------------------------------------------------------
Labels: satire
1 Comments:
చాలా బాగా రాసినారు సార్, గాడ్సే విషయం మెదలు నేను నిజమేనా అని అనుకున్నాను(హిందీ సినిమా ప్రభావం వలన)! అలా మీరు రాసినారు. నిజం గా గాడ్సే తండ్రి నా కొడుకు చేసిన దానిలో (గాంధీజీని చంపటం) తప్పులేదు అని అన్నాడు. ఇంకా మన రాజకీయం మరియు భూమాఫియాస్వామ్యం విషయంలో అ పీసీసీ పీఠాధిపతి తనయుడు మరియు చనిపోయిన భూవ్యాపారి ఒక్కప్పుడు జిగిరి దోస్తులు అంట! దుష్టులకు దూరం గా ఉండమని ఊరికే అనలేదు మరి.
-మరమరాలు
3:27 am
Post a Comment
<< Home