సాహిత్యం
సహృదయైుక వేద్యం
నన్నయ నాటి నుంచి నేటివరకు ఉన్న పద్యరత్నాలను ఏర్చి కూర్చిన సమాహారమిది. ఈ తరహాలో 'ప్రాచిన పద్యమంజరి' ఇత్యాదులు సాహితీలోకంలో సుప్రసిద్ధాలే. ఇది వాటికంటే భిన్నం. ఈ సంకలనంలో ఒక క్రమాన్ని పాటించకపోయినా ఒక సమన్వయ సూత్రంతో సంపుటీకరణ సాగింది. కవిత్రయ పద్యవిన్యాసం, శతక సాహితీ సౌరభం, పోతన కవితా సుధా మాధుర్యం, ఆంధ్ర పంచకావ్య కవితా వైభవం ఆపై చమత్కార పద్యమంజరి, ఇంకా ఇతిహాస, పురాణ, ప్రబంధాది కవితా ప్రక్రియల లాక్షణికత... ఈ సంవిధానంతోనే చక్కని క్రమపరిణామ రామణీయకత్వాన్ని సంతరించుకుంది. ప్రబంధ సాహిత్యానికి బీజావాపనం చేసిన కుమారసంభవ కర్త నన్నెచోడ కవిని గ్రంథకర్త విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వేయి సంవత్సరాల పైబడ్డ పద్యం నవరసాలకు ఆకరమనీ మరో వెయ్యేళ్ళయినా తెలుగు ప్రజల రసనాగ్రాలపై నర్తిస్తుందనీ ఈ కృతికర్త విశ్వాసం. పద్యం మీద అభిమానమే కాదు అభినివేశం ఉందనడానికి వాటి వైశిష్ట్యాన్ని విశ్లేషించడమే నిదర్శనం.
పద్యం- రసనైవేద్యం;
రచన: దోరవేటి
పేజీలు: 140; వెల: రూ.80/-
ప్రతులకు: విశాలాంధ్ర ప్రధాన శాఖలు.
- చారి
-------------------------------------------------------
వడగట్టిన కథలు
యడ్లపాటి వేంకట సుబ్బారావు స్మారక పోటీకి వచ్చిన కథలలో నుంచి 76 కథలను 'రచన' పత్రికలో ప్రచురించారు. అందులో ఇరవై ఆరింటిని 'కథావాహిని-2007' పేరుతో సంకలనంగా వెలువరించారు. రెండుసార్లు వడపోతకు నిల్చినవి మంచిస్థాయికి చెందినవి కావడం సహజం. తాగేనీళ్ళకు సైతం తప్పని పేదలతిప్పలు, పనికి ఆహారపథకం తీరు, సాయం కోరితే ఎదురైన పోలీసు జులుం, ఆడామగా మధ్య స్నేహంలోని వెలుగు, వెర్రితలలు వేస్తున్న క్రికెట్ వ్యావోహం... వెుదలైన ఇతివృత్తాల చుట్టూ అల్లిన కథలివి. రచయితలందరూ చేయితిరిగిన కథకులే. కథాశిల్పం బాగా తెలిసినవారే. బాధామయ జీవులపై రాసిన కథలలో గాఢత, క్లుప్తత, నైశిత్యం ఆకట్టుకుంటాయి. కాగా సంపన్నవర్గాలూ ఎగువ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం ఉన్న కథలలో పాఠకులకు కొత్తకోణాన్నో సమస్యల లోతునో సాహసంతో చూపిన సందర్భాలు తక్కువగా ఉండటానికి బహుశా పోటీ దృష్ట్యా గీసుకున్న పరిధి ఒక కారణం కావచ్చు.
కథావాహిని-2007;
సంచాలకుడు: 'రచన' శాయి
పేజీలు: 254; వెల: రూ.130/-
ప్రతులకు: వాహిని బుక్‌ట్రస్ట్
1-9-286/3, విద్యానగర్, హైదరాబాద్-44.
- జి.రా.
-------------------------------------------------------
'కాలమ్' చెల్లనిది
సామాజిక సమస్యల్ని తక్కువ నిడివిలో, తేలిక పదాల్లో, సరదాగా అందించిన ఫీచర్ల సమాహారమే ఈ పుస్తకం. ప్రతి కాలమ్ చిన్నచిన్న పదాల్లో ఆలుమగల మధ్య అల్లరిగా సాగే సంభాషణతో వెుదలవుతుంది. అది చదివి నవ్వుకుంటుండగానే 'మమతానుబంధాలే కదా మనుగడ మీద ప్రేమను పెంచుతాయి' వంటి వాక్యాలు హలో చెప్పి ఆకట్టుకుంటాయి. ఆఖరు పేరాగ్రాఫ్‌లో అనుకోని మలుపు. భార్యాభర్తల సంభాషణ అనూహ్యంగా సమాజం, రాజకీయాలు, అవినీతి, అత్యాచారం వైపు మరలుతుంది. సమస్యలు తెరమీదికొస్తాయి. వాటిపై చకచకా చెణుకులు పడతాయి. ఇక్కడ రచయిత కనబరిచే అన్వయశక్తి, చేసే వ్యాఖ్యానం ఆసక్తికరంగా ఉంటుంది. చదివింపజేస్తుంది. ఓ దిన పత్రికలో వారం వారం వచ్చినవే అయినా ఈ పుస్తకం 'కాలమ్' చెల్లనిది.
కనకమహాలక్ష్మి సింహాచలం
రచన: కెవియస్ వర్మ (ఫీచర్స్)
పేజీలు: 118; వెల: రూ.40/-
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని శాఖలు.
- భద్రగాయత్రి
------------------------------------------------
(Eenadu, 09:09:2007)
------------------------------------------------
కొత్తతరం కోసం
తెలుగులో వెుదటి వరసలో నిలిచే హాస్యనవల 'బారిష్టర్ పార్వతీశం'. కథానాయకుడు పార్వతీశం ఇంగ్లండుకు ప్రయాణమవుతూ పళ్ళు తోముకోవటానికి కచ్చిక పొడీ, నాలుక గీసుకోవటానికి తాటాకు ముక్కలూ మర్చిపోకుండా తీసుకువెళ్ళే 'ముందుచూపు'న్న వ్యక్తి. సృష్టించిన రచయిత పేరును మించిపోయి ప్రాచుర్యం పొందిన సజీవ పాత్ర. హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ 'మన మంచి పుస్తకాలు' సిరీస్‌లో భాగంగా ఈ నవలను సంక్షిప్త రూపంలో అందించటం మంచి ప్రయత్నం. దీనివల్ల కొత్తతరం పాఠకులకు సారం తెలుస్తుంది; కొందరికైనా మూల రచనలను చదవాలనే ఆసక్తి ఏర్పడుతుంది.
బారిష్టర్ పార్వతీశం
రచన: వెుక్కపాటి నరసింహశాస్త్రి
తిరిగి చెప్పిన కథనం: సహవాసి
పేజీలు: 88; వెల: రూ.40/-
ప్రతులకు: హైదరాబాద్ బుక్‌ట్రస్ట్
ప్లాట్ నం: 85, గుడిమల్కాపూర్
హైదరాబాద్-67.
- సీహెచ్.వేణు
---------------------------------------------
మాటల పేటి
బాలగంగాధరరావు కలం నుంచి జాలువారిన ఆణిముత్యం 'మాటతీరు'. మనం నిత్యంవాడే వందలాది మాటల వెనకగల చరిత్రనూ అవి లోక వ్యవహారంలో స్థిరపడిన విధానాన్నీ చదువుతుంటే అబ్బురం అన్పిస్తుంది. ప్రతిమాటకూ వెనక ఇంత పురాణం ఉందా అని ముక్కున వేలేసుకుంటాం. ఆంగ్లపదం 'టవల్' క్రమంగా మన తెలుగు 'తువ్వాలు'గా మారిందంటే ఔరా అనుకుంటాం. సంస్కృతపదం 'యువన్' నుంచి 'జవాను' మాట వచ్చిందంటే నివ్వెర పోతాం. ఇలా ఒకటేంటి? కొడుకు, కోడలు, కూలి-నాలి, ఏండ్లు-పూండ్లు వంటి రెండొందల పైచిలుకు సాధారణ పదాల వెనకగల అసాధారణ విషయాల్ని విప్పిచెప్పారు రచయిత. భాషాజిజ్ఞాసువులకి ఇదెంతో ఉపయుక్తం అనడంలో సందేహం లేదు.
మాటతీరు;
రచన: యార్లగడ్డ బాలగంగాధరరావు
పేజీలు: 176; వెల: రూ.80/-
ప్రతులకు: జయంతి, విశాలాంధ్ర,
నవోదయ, నవయుగ పుస్తకకేంద్రాలు.
- చంద్రప్రతాప్
------------------------------------
(Eenadu, 26:08:2007)
-------------------------------------
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home