రిజిస్టర్డు పురోహితులు

''మీకు పెళ్ళయిందనటానికి సాక్ష్యం ఏమిటి? రుజువులేమన్నా ఉన్నాయా?''- అని జడ్జీగారు అడిగితే- ''లేకేమండి. మా ఆవిడ అప్పడాలకర్రే సాక్షి, నా బుర్రమీది బుడిపెలే రుజువు''- అన్నాట్ట ఓ చండీదాసు కోర్టులో తల తడుముకుంటూ. ఏ వివాహమైనా జరిగిందనటానికి ముఖ్యమైన సాక్షి ఆ పెళ్ళిని జరిపించిన పురోహితుడే. వధూవరులు ఇష్టపడి చేసుకొనే గాంధర్వ వివాహాల్లో పురోహితుల ప్రసక్తి ఉండదు. కణ్వాశ్రమంలో శకుంతల ముగ్ధసౌందర్యాన్ని చూసి వరించిన దుష్యంతుడు ఆమెను గాంధర్వ విధిని వేలికి ఉంగరం తొడిగి వివాహం చేసుకుంటాడు. తరవాత ఆ విషయమే మరిచిపోతాడు. కొంతకాలానికి శకుంతలే తన దగ్గరకు వస్తే తను పెళ్ళిచేసుకున్నట్లు రుజువు చూపెట్టమంటాడు. అతనిచ్చిన ఉంగరం పోగొట్టుకున్న శకుంతల తెల్లబోతుంది. వివాహాలు జరిపించటమే కాదు, వివాహాలకు శుభముహూర్తాలను నిర్ణయించటం కూడా శాస్త్రాలు క్షుణ్ణంగా పఠించిన పురోహితులే చేస్తారు. అర్జునుడు ఉలూచిని ఏ పురోహితుని ప్రమేయం లేకుండానే పెళ్ళాడతాడు. అటువంటి మినహాయింపులు ఎక్కడో కొన్ని ఉంటాయి. శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్ళిపుస్తకం పుటలు భర్తీచేసుకోవాలంటే పురోహితుల తోడ్పాటు తప్పనిసరిగా ఉండాల్సిందే. హిందూ వివాహాల్లో పురోహితుల పాత్రే ప్రధానమైంది. మంగళవాద్యాల నేపథ్యంలో పురోహితులవారు ''మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం''- అని వరునితో అనిపించి మాంగల్యధారణ చేయిస్తే కాని వివాహం పూర్తికాదు. వరపూజతో ప్రారంభించి కన్యాదానం, మంగళసూత్రధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, పాణిగ్రహణం, సప్తపది- వగైరా వివాహంలోని వివిధ ఘట్టాలు పురోహితుల మంత్రోచ్చారణల ఆధారంగానే జరుగుతుంటాయి. రుగ్వేదంలోని 'వివాహసూక్తం' ఆధారంగా పురోహితులు వివాహాలు జరిపిస్తూ ఉంటారు.
ఇతర మతస్థులలోలాగ హిందూ పురోహితులు తాము జరిపించే వివాహాల వివరాలను ఒక పుస్తకంలో నమోదుచేసి ఉంచుకోరు. ఇందువల్ల పురోహితులు జరిపించిన వివాహాలను రుజువు చేసుకోటానికి కొన్ని సందర్భాల్లో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆ బెడదను నివారించటానికి రాష్ట్ర ప్రభుత్వం పౌరోహిత్యాన్ని వృత్తిగా నిర్వహించే వారి వివరాలను రిజిస్టరు చేయాలని సంకల్పించింది. ఈ రిజిస్టర్డు పురోహితులు తాము జరిపే వివాహాల వివరాలన్నిటినీ ఓ పుస్తకంలో నమోదుచేసి ఉంచుతారు. అంతేకాక వివాహం పూర్తయిన తరవాత తామే ఓ సర్టిఫికెట్‌ను వధూవరులకు అందచేస్తారు. ఆ సర్టిఫికెట్‌కు న్యాయపరమైన భద్రత ఉంటుంది. పురోహితులను రిజిస్టరు చేసి వారికొక గుర్తింపు ఇవ్వాలనే ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి తన ఆమోదాన్ని తెలిపారనీ త్వరలోనే ఇందుకు సంబంధించిన చట్టానికి రూపకల్పన జరుగుతుందనీ సమాచారం. వివాహాలన్నిటినీ తప్పనిసరిగా రిజిస్టరు చేసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆ చట్టం సవ్యంగా అమలుకావటంలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చి రిజిస్టర్డు పురోహితులు అవతరించి, తాము జరిపించే వివాహాలకు వారిచ్చే సర్టిఫికెట్లకు న్యాయపరమైన భద్రత ఉన్నట్లయితే పురోహితుల బాధ్యతేకాక వారి హోదా కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి వల్ల వివాహాలను రుజువు చేసుకోవటంలో ప్రస్తుతం ఎదురౌతున్న ఎన్నో ఇబ్బందులూ తొలగిపోతాయి!
(Eenadu, 28:10:2007)
_______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home