సాహితీ తపస్వి 'పులికంటి' మృతి
తిరుపతి(క్రీడలు), నవంబరు 19 (న్యూస్‌టుడే):
చిత్తూరు నుంచి చికాగో దాకా సాహిత్య రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టిన సాహితీ పిపాసి అతడు.. ఐదు దశాబ్దాలుగా మాండలిక పరిభాషలో జనజీవనాన్ని కళ్లకు కట్టినట్టు తన రచనల్లో ప్రతిబింబించి, కవితకు కొత్త ఒరవడిని నేర్పిన మేధావి.. కలాన్ని గళంలో ధ్వనించి అందెలు మోగించిన గాయకుడు.. సీమ జీవితాల శిథిల ఘోషను తన సాహిత్యంలో ఏర్చి కూర్చిన భావుకుడు.. 'నిండుగా, కండగా, కవితల కలకండ' అంటూ నారాయణరెడ్డి, 'ప్రణయార్థ మెరిగిన భావకుడతడంటూ' శంకరంబాడి పొగిడినా.. 'రాయలసీమ చిన్నోడు'గా అందరి గుండెల్లో నిలిచిన సాహితీ తపస్వి పులికంటి కృష్ణారెడ్డి. ఆయన కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
జీవిత విశేషాలు:
చిత్తూరు జిల్లా జక్కదొన గ్రామంలో గోవిందరెడ్డి, పాపమ్మకు 1931 జులై, 30న పులికంటి జన్మించారు. డిగ్రీ కాకుండానే రైల్వేలో బుకింగ్ క్లర్క్‌గా, ఏఎస్‌ఎంగా పనిచేశారు. అనంతరం తన ఆశయాలకు ఉద్యోగం అడ్డని భావించి రాజీనామా చేసి తిరుపతిలో కాఫీ పొడి వ్యాపారం ప్రారంభించారు. అదే సమయంలో సొంతంగా 'కామధేను' పక్ష పత్రికకు శ్రీకారం చుట్టి విలేఖరి కూడా అయ్యారు. ఇవేవీ సంతృప్తి ఇవ్వకపోవడంతో సాహిత్య రంగంవైపు అడుగులు వేశారు.
తనదైన ముద్ర:
కథకుడిగా, కవిగా పులికంటి అనేక రచనలు చేశారు. రాయలసీమ సాహిత్యంలో 'రాయలసీమ చిన్నోడు'గా ప్రాచుర్యం పొందారు. మాండలిక రచనల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1961లో 'గూడుకోసం గువ్వలు' ఆయన రచించిన మొదటి కథ. ఆ తర్వాత 'అరచేతిలో గీత', 'తీయలేని కలుపు', 'మరపురాని మా ఊరు' తదితర కథలకు తెరతీశారు. 'నాలుగ్గాళ్ల మండపం'లో సామాన్య జనజీవితాన్ని ఆవిష్కరించిన తీరుతో కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. 'పులికంటి కథలు', 'కోటిగాడు స్వతంత్రుడు' కథా సంపుటి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
నిర్వహించిన పదవులు:
ఆకాశవాణి, దూరదర్శన్ సలహా సభ్యుడిగా, ఎస్వీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫెర్‌ఫామింగ్, రాయలసీమ జర్నలిస్ట్ సంఘ సభ్యునిగా వివిధ పదవులు నిర్వహించారు.
కీర్తి కిరీటాలివీ:
ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు అనేక బహుమతులు, రివార్డులు దక్కాయి. చిత్తూరు నాటక అకాడమీ-నటశేఖర్ అవార్డును, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి-ఉత్తమ నటుడు, హైదరాబాద్ యువకళా వాహిని-గోపిచంద్ అవార్డుల్ని ప్రదానం చేశాయి. దీంతో పాటు జానపద కోకిల, ధర్మనిధి పురస్కార్ పొందారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు 2005లో ఎస్వీయూ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించి తన కృతజ్ఞతను చాటుకుంది.
(Eenadu, 20:11:2007)
____________________________________
Labels: Personality, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home