My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, June 15, 2008

నాగభైరవ కోటేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య నాగభైరవ కోటేశ్వరరావు (76) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడి మధురానగర్‌లోని స్వగృహంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. భార్య చాలాకాలం క్రితమే చనిపోయారు. అనేక కథలు, కవితాసంపుటిలు రాసిన నాగభైరవకు.. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు ఆయన మాటలు కూడా రాశారు. ఇరవై సినిమాలకు పాటలు రాశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ కార్యదర్శి నారాయణ సంతాపం వ్యక్తంచేశారు. మూడు దశాబ్దాలుగా తన వచన కవితలతో యువతరాన్ని ప్రోత్సహించారని, కవిత్వం ద్వారా అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాగభైరవ సిద్ధహస్తుడని వైఎస్‌ పేర్కొన్నారు. ఆయన రచనలు తెలుగుసాహితీ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందాయని, రంగాజమ్మ, కన్నీటిగాధ, గుండ్లకమ్మ చెప్పిన కథలు సామాజిక స్పృహకు నిదర్శనాలని బాబు తెలిపారు. నాగభైరవ ఎందరో యువ సాహిత్యవేత్తలను ప్రగతిశీల సాహిత్యం వైపు నడిపించిన ఉద్యమకారుడని నారాయణ శ్లాఘించారు.

కవన విజయంతో ప్రాచుర్యం: నాగభైరవ వృత్తి రీత్యా అధ్యాపకుడైనా.. కవి, రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా భిన్న భూమికలు పోషించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో 1931 ఆగస్టు 15న జన్మించిన ఆయన.. ప్రాథమిక విద్యాభ్యాసం ఆ జిల్లాలోనే పూర్తి చేశారు. తెలుగు భాషపై మమకారంతో తెలుగు మాధ్యమంలోనే ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగరీత్యా నెల్లూరు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దీర్ఘకాలం తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, చేబ్రోలు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో పనిచేశారు. విధులు నిర్వహిస్తూనే.. సాహిత్యంపై అభిరుచితో కథలు, కవితా సంపుటిలు, నవలలు రాశారు. ఇందులో రంగాజమ్మ, కన్నీటి గాథ, తూర్పు వాకిళ్లు, ఒయాసిస్సు ముఖ్యమైనవి. 'భువన విజయం'కు వ్యంగ్యానుకరణగా ఆయన రాసిన 'కవన విజయం' పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. 300కిపైగా ప్రదర్శనలు నిర్వహంచారు. తెలుగు సాహిత్యంపై 'గురజాడ నుంచి బెజవాడ దాక' అన్న కవితా రూపం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వెలుతురు స్నానం, గుండ్లకమ్మ చెప్పిన కథలు, పద్యరూపకాలనూ రచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. 2001లో తానా అమెరికాలో నిర్వహించిన తెలుగు మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈయనకు రాజాలక్ష్మి ఫౌండేషన్‌, గడియారం వేంకట శేష శాస్త్రి, రామినేని ఫౌండేషన్‌ వారి నుంచి పురస్కాలు పొందారు.
(ఈనాడు, 15:06:2008)
__________________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home