వూహలు గుసగుసలాడె...

జంతువులకు లైంగిక సంతృప్తి ఒక్కటే తెలుసు. మనిషికి శృంగార రసానందమూ తెలుసు. సంపర్కంతో ప్రమేయం లేకుండానే కంటిచూపుతో, చేతి స్పర్శతో స్త్రీకి శిఖరాయమానమైన(జెనిత్) శృంగారానుభవాన్ని ఇవ్వడం పురుషుడికి సాధ్యమే! 'కృష్ణుడు అలాంటి పురుషుడే' అంది మీరాబాయి. ఆ విధమైన శృంగార దృష్టి కలిగిన పురుషుడి సాన్నిధ్యం- స్త్రీలో పట్టరాని ఉత్తేజాన్ని నింపుతుంది. ఆ రహస్యం తెలిస్తే సంగీతంలోనూ, కవిత్వంలోనూ కూడా శృంగార రసానుభూతి దక్కుతుంది. పుట్టింటికి వెళ్ళాలని అనుమతి కోరుతూ, కలికి కామాక్షి 'రచ్చలో కూర్చున్న రాజేంద్రభోగీ' అని భర్తను సంబోధించడంలో శృంగారభావం ఉంది. బావను ఆటపట్టిస్తూ మరదలు పాడే 'బావా బావా పన్నీరు' పాటలో శృంగార భావం ఉంది. పొలాల్లో పనిచేసుకునే పల్లెపడుచుల కూనిరాగాల్లో శృంగార భావం ఉంది. అంతెందుకు! ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై... అన్న పోతన పద్యం సంగతి ఏమిటి? శ్రీదేవి తలను తడిమిన చేయి, శరీరాన్ని నిమిరిన చేయి, కొంగును సవరించిన చేయి- చటుక్కున పాదాలను పరామర్శించిందంటే... ఆ మధ్యలో ఏం జరిగిందో పాఠకుడు వూహించుకోగలగాలి. అప్పుడు మనసులో మెదిలే అపురూప సుకుమార భావన పేరే శృంగార రసానుభూతి! ఈ తరహా శృంగారమయ మానసిక స్థితి శారీరక సుఖానికి మెరుగులు దిద్దుతుంది. దాంపత్య జీవితాన్ని రసరమ్యం చేస్తుంది. భాగస్వామిని ఉత్తేజపరుస్తుంది. ఇల్లు చేరాలన్న కోరికను బలపరుస్తుంది. దాంపత్య జీవితంలో శిఖరాలను చుంబించే సుఖానుభూతికి దంపతుల మనసుల్లో దాగిన శృంగార భావన గొప్ప ప్రేరణ, గట్టి పునాది!
తొలి అడుగుల్లోని చిన్ని చిన్ని సరదాలు, చిలిపి చేష్టలు, అల్లిబిల్లి సరాగ పరాగాలు భావి దాంపత్య జీవితాన్ని శోభాయమానం చేస్తాయి. అమృతాన్ని ఒంపుతాయి. కాలం గడిచి క్రమంగా జీవితంలోకి యాంత్రికత చొరబడుతున్నప్పుడు- పాత ముచ్చట్లు, మధుర ఘట్టాలు, శృంగార భోగట్టాలు తలచుకుంటే కొత్త వూపు వస్తుంది. 'ఒకవేళ మీరు వాటిని మరిచిపోతే హిప్నోథెరపీ చక్కని పరిష్కారం, శృంగార జీవితానికి గొప్ప ఉత్తేజకరం' అంటున్నారు శాస్త్రజ్ఞులు. బ్రిటన్‌లోని ఎన్నో జంటలు ఈ దారిలో చక్కని ఫలితాలు పొందారని ప్రముఖ హిప్నో థెరపిస్టు పీటర్ శాలిస్‌బరీ చెబుతున్నారు. ఎంతసేపూ జీవిత భాగస్వామిలో లోపాలనే వెతుకుతూ దెప్పిపొడుస్తూ ఉండే మానసిక స్థితిలో మార్పుతెచ్చి- సానుకూల దృక్పథం అలవరచడం ఆయన చికిత్సలో మొదటి దశ. పాత పరిమళాలను గుర్తుకు తెచ్చి కొత్త మోజుకు అంకురారోపణ చేయడం ముఖ్యమైన రెండోదశ. పాత పరిమళాల జాబితాలో- దంపతులు ఇష్టంగా విన్న పాటలు, ముచ్చటపడి చదివిన కవిత్వాలు, దాచిపెట్టుకున్న ఛాయాచిత్రాలు... గుండె పొరలను అలుముకున్న సుగంధ తైలాలు... వంటివాటిని ఆయన ఉత్ప్రేరకాలుగా ప్రయోగిస్తున్నారు. ఒక్కరోజులోనే గొప్ప ఫలితాలు వస్తున్నాయని, చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్తేజం కలుగుతోందనీ సైన్స్ పత్రికలు పేర్కొన్నాయి. ఆపాత మాధుర్యాలను ప్రేరణగా గ్రహిస్తే 'కొత్త శృంగార లోకం మీకు అవుతుంది సొంతం' అని శాలిస్‌బరీ బల్లగుద్ది చెబుతున్నారు. పాత వూసులు గుండెల్లో చేరి రెక్కలు ధరించిన కొత్త వూహలై గుసగుసలాడితే ఇంకేమి అంటున్నారు అనుభవజ్ఞులు.
(ఈనాడు, సంపాదకీయం, ౨౬:౦౭:౨౦౦౯)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home