My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 01, 2009

ఐడియా - సరికొత్త ఆక్సిజెన్

కాఫీ తాగుతున్నప్పుడో పేపర్‌ తిరగేస్తున్నప్పుడో షేవింగ్‌ చేసుకుంటున్నప్పుడో షవర్‌ కింద తలంటుకుంటున్నప్పుడోఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఐడియా మీ బుర్రలో తళుక్కుమంటుంది. అదొక్కటి చాలు, మీ జీవితాన్ని మార్చేయడానికి!


నీఖాతాలో డబ్బుందా?
నీ పేరుతో ఫ్లాటుందా?
పార్కింగ్‌లో కారుందా?
ఖరీదైన సెల్‌ఫోన్‌ ఉందా?

ఛీ..ఛీ..!
ఎప్పుడూ ఇవే ప్రశ్నలేనా? కాలంచెల్లిన ఆలోచనలన్నీ కట్టగట్టి చెత్తబుట్టలో పడేయండి. గాలికి పైకెగిరొస్తాయనుకుంటే, పెట్రోలు పోసి తగలేయండి. కల్తీపెట్రోలేవో అన్న అనుమానం ఉంటే, బన్సీలాల్‌పేట విద్యుత్‌ శ్మశానవాటికలో కాల్చిపడేయండి. పీడా విరగడైపోతుంది.

కాస్త విశాలంగా, కాస్త డిఫరెంట్‌గా, కాస్త మెవరిక్‌గా ఆలోచించలేరూ!
ఆలోచించాలి. ఆలోచించితీరాలి.
బీరువాల్లో పెట్టుకునో బ్యాంకు లాకర్లలో దాచుకునో తెగ మురిసిపోయే ఆస్తిపాస్తులకు కాలం చెల్లింది. ఇప్పుడు, భూషణముల్‌ సుభూషణముల్‌...అన్నీ ఐడియాలే!
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు కరెన్సీ.
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు గుర్తింపు కార్డు.
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు ఆక్సిజన్‌.
* * *

ఐజాక్‌ న్యూటన్‌ 'వెధవ యాపిల్‌ నెత్తిమీదే పడాలా...' అని ఆలోచించినప్పుడు భూమ్యాకర్షణ ఐడియా పుట్టింది.

స్నానపుతొట్టెలోని నీళ్లు ఒలికి కిందపడ్డప్పుడు ఆర్క్‌మెడిస్‌ సూత్రం ఐడియా ప్రాణంపోసుకుంది.

బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ గాలిపటం మాంజాకి తాళాల గుత్తి కట్టి తుపానులో ఎగరేసినప్పుడు దిమ్మదిరిగే షాకే కాదు, అద్భుతమైన కరెంటు ఐడియా పుట్టింది.

గిన్నె మీద పెట్టిన మూత ఆవిరికి ఎగిరెగిరిపడుతున్నప్పుడు జేమ్స్‌వాట్‌ ఆలోచనల్లో రైలింజను ఐడియా పట్టాలకెక్కింది.

విజ్ఞాన సర్వస్వాలు తిరగేస్తే, జిజ్ఞాసుల జీవిత చరిత్రలు చదివితే ఐడియా పవరేంటో అర్థమవుతుంది. కాలంకంటే రెండడుగులు ముందేస్తూ ఒకట్రెండు శతాబ్దాలు ముందే ఆలోచించిన ఆ మహానుభావుల తపన ఏపాటిదో అర్థమవుతుంది. ఆ రోజులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఐడియాకు విలువే లేదు. కొత్త ఆలోచనలకెవరూ బ్రహ్మరథం పట్టలేదు. వీరతాళ్లు వేయలేదు. చాలదన్నట్టు, గేలిచేశారు. గోలచేశారు. పాతనమ్మకాలకు పాతరేసినందుకు కొరడాలతో కొట్టారు. ఏనుగులతో తొక్కించారు. దేశ బహిష్కారాలు విధించారు.

గేలిచేసిన అజ్ఞానులు, గోలచేసిన మిడిమిడి జ్ఞానులు, శిక్షలు విధించిన ప్రభువులు, సలహాలిచ్చిన సచివులు... అంతా నాశనమైపోయారు. సర్వనాశనమైపోయారు.

కానీ ఐజాక్‌ న్యూటన్‌ బతికున్నాడు, ఆర్క్‌మెడిస్‌ బతికున్నాడు, బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ బతికున్నాడు, జేమ్స్‌వాట్‌ బతికున్నాడు - ఆవిష్కరణల రూపంలో.

ఐడియా చిరంజీవి!
* * *
ఐడియా ఆధునిక జీవితపు నిత్యావసర వస్తువు. పోటీ ప్రపంచపు ప్రాణవాయువు. డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం మనుగడ పోరాటంలో బలవంతులే బతికి బట్టకట్టినట్టు... ఆధునిక ప్రపంచంలో ఐడియా ఉన్నవాళ్లే మనగలుగుతారు. మూసలో మునిగితేలేవాళ్లంతా మూకుమ్మడిగా కొట్టుకుపోతారు. ఒక్కసారి ఆలోచించండి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో... అచ్చంగా ఐడియాలే పెట్టుబడిగా పుట్టుకొచ్చిన కంపెనీలే అద్భుతాలు సాధిస్తున్నాయి.

మహాత్ముని అహింసామార్గం ఓ ఐడియా. టిమ్‌బర్నర్స్‌లీ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఓ ఐడియా. రతన్‌టాటా లక్షరూపాయలకే కారు ఓ ఐడియా. ఏ ఉద్యమమైనా ఏ వ్యాపారమైనా ఏ ఆవిష్కరణైనా... ముందు ఐడియాగానే వెుదలవుతుంది.

ఎలా? ఎలా?
కొంతమందికే అద్భుతమైన ఐడియాలొస్తాయి ఎందుకు? కొంతమంది ఎంత బుర్రపాడుచేసుకున్నా ఒక్కటంటే ఒక్క ఐడియా కూడా వెలిగి చావదెందుకు? అసలు ఐడియాల్ని ఎలా సృష్టించాలి? ఎలా విస్తరించాలి? ఎలా మార్కెట్‌ చేసుకోవాలి?... ఐడియాకి సంబంధించి ఏ ప్రశ్నకైనా విజేతల జీవితాలే సమాధానాలు.

ఐడియా రావాలంటే ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలి. తమకో రూపం ఇవ్వగల సత్తా మనకుందని ఐడియాలకు నమ్మకం కలగాలి. ఆత్మవిశ్వాసం లేనివాళ్లంటే వాటికి అసహ్యం. ఓరకంగా మనం ఐడియాతో పీకలోతు ప్రేమలో పడాలి. ఎదుటివాళ్లు నవ్వనివ్వండి. ఏడ్వనివ్వండి. వాళ్ల ఖర్మ. మన ఐడియాలే మనకు రంభ, ఊర్వశి, ఐశ్వర్యారాయ్‌, జెన్నిఫర్‌ లోపేజ్‌. 'హాట్‌ మెయిల్‌' సబీర్‌ భాటియా ఉచిత ఇ-మెయిల్‌ ఐడియా గురించి చెప్పినప్పుడు అంతా పగలబడి నవ్వారు. శేఖర్‌ కమ్ముల 'ఆనంద్‌' ప్రాజెక్టు తీసుకెళ్లినప్పుడు నిర్మాతలు వెుహంమీదే తలుపేసుకున్నారు. ఆ ఇద్దరికీ తమ మీదా తమ ఐడియాల మీదా బోలెడంత నమ్మకముంది కాబట్టి సరిపోయింది. లేదంటే, ఆ యువకుల సృజన సమాధి అయిపోయేది.

'పాజిటివ్‌ థింకింగ్‌' మరో అర్హత. పాజిటివ్‌ థింకింగ్‌లోంచి పాజిటివ్‌ ఐడియాలొస్తాయి. నెగెటివ్‌ థింకింగ్‌లోంచి నెగెటివ్‌ ఐడియాలొస్తాయి. ధీరూబాయ్‌ అంబానీనే తీసుకోండి. ఆయన కూడా మిగతా వ్యాపారవేత్తల లాగానే లాభాలు గడించాలనుకున్నారు.
కానీ తానొక్కడే అంతా పోగేసుకోవాలనుకోలేదు. నలుగురితో పంచుకోవాలనుకునే తత్వం. కాబట్టే 'పోస్టుకార్డు ధరకే సెల్‌ఫోన్‌ సేవలు అందించాలి' అన్న వందశాతం పాజిటివ్‌ ఐడియా వచ్చింది. ఇంకేదైనా ప్రాజెక్టు చేపట్టివుంటే రతన్‌టాటా ఇంకొన్ని వందల కోట్లు సంపాదించేవారేవో. కానీ 'లక్ష రూపాయలకే కారు' అన్న ఐడియానే ఎందుకొచ్చింది? దాని మూలాలూ పాజిటివ్‌ థింకింగ్‌లోనే ఉన్నాయి.

లెక్కలు మార్చేసి, వ్యాపారాన్ని కొండంతలు చూపించాలన్న 'సత్యం' రామలింగరాజు ఆలోచన పక్కా నెగెటివ్‌ ఐడియా. పోటీ తట్టుకోలేనేవో అన్న నెగెటివ్‌ ధోరణిలోంచి అది పుట్టుకొచ్చింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఇంకొన్ని నెగెటివ్‌ ఐడియాల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఫలితం మనం చూస్తున్నాం.

'హౌ టు గెట్‌ ఐడియాస్‌' పుస్తక రచయిత జాక్‌ఫోస్టర్‌ ఓ రహస్యం చెబుతారు. 'చాలామంది బాగా ఆలోచిస్తేనే ఐడియాలు వస్తాయనుకుంటారు. ఒట్టి అబద్ధం. ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడే అవి ఎగదన్నుకొస్తాయి. బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడో షేవింగ్‌ చేసుకుంటున్నప్పుడో మంచిమంచి ఐడియాలు రావడానికి కారణం అదే' అంటారు. ఆ సమయంలో మనసు ఒత్తిళ్లకు దూరంగా ఉంటుంది కాబట్టి, బుర్ర చురుగ్గా పనిచేస్తుంది కాబోలు. నందన్‌ నీలేకని 'ఇమాజినింగ్‌ ఇండియా- ఐడియాస్‌ ఫర్‌ న్యూసెంచరీ' పుస్తకం రాసుకోడానికి వారాంతాల్లో కూనూరు వేసవి విడిది కేంద్రానికి వెళ్లేవారట. ఓ పారిశ్రామికవేత్త కొత్త ఆలోచనల కోసం తనింట్లో ప్రత్యేకంగా 'ఐడియా రూమ్‌' ఏర్పాటు చేసుకున్నారట. అయినా, ఐడియాకి సంబంధించి 'సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి...' అన్నంత కచ్చితమైన సిద్ధాంతమేం లేదు. ఒకటిమాత్రం నిజం... ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఐడియా వస్తుందో కచ్చితంగా చెప్పలేం. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన పని!

మంచి ఐడియాలకు కొన్ని లక్షణాలుంటాయి. వాటిలో స్పష్టత ఉంటుంది. ఎక్కడా గందరగోళం కనిపించదు. మామూలు మనిషికి కూడా సులభంగా అర్థమైపోతాయి. 'ఇంటర్నెట్‌ద్వారా వీడియోలు పంపుకునే అవకాశం ఉంటే?' అన్నది చాలా చిన్న ఐడియా. అందులోంచే యూట్యూబు పుట్టింది. గొప్ప సక్సెస్‌. 'నిమిషం పల్స్‌రేట్‌ స్థానంలో... సెకెను పల్స్‌రేటు పెడితే?'... డొకోవో ఆలోచన చిన్నదే. మార్కెట్‌ మీద మాత్రం పెద్ద ప్రభావం చూపింది.

ఆ క్షణానికి మన బుర్రలో మెరిసే ఐడియా అంతిమ ఉత్పత్తి కానేకాదు. అదింకా ముడిసరుకే. సానబెట్టుకోవాలి. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించుకోవాలి. నిధులు సమకూర్చుకోవాలి. టెక్నాలజీ, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌... అన్ని దశలూ దాటాలి. అప్పటికి కానీ దానికో రూపం రాదు. 'విజయానికి మూడు కోణాలు... ఐడియా, నైపుణ్యం, శ్రమ' అంటారు 'కౌంట్‌ యువర్‌ చికెన్స్‌ బిఫోర్‌ దె హ్యాచ్‌' రచయిత అరిందమ్‌. మిగతా రెండూ తోడైతేనే అద్భుతమైన ఐడియాకి సార్థకత. లేదంటే, ఐడియా ఐడియాగానే మిగిలిపోతుంది. మనం నిలబడ్డ దగ్గరే ఉండిపోతాం. అసలు మనమూ మన ఐడియాలూ వేరువేరు కానేకాదు. ఐడియాలు మన ఆలోచనలకు నీడల్లాంటివి. అందుకే వివేకానందుడు 'నీ ఆలోచనలెప్పుడూ ఉన్నతంగా ఉండాలి' అంటాడు. 'యద్భావ-తద్భవతి' అని మన పెద్దలెప్పుడో చెప్పారు.

సందేహమే లేదు, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. కానీ, ముందు మనం ఐడియాకి జీవితాన్నివ్వాలి.

ఆఫీసులో ఐడియా...
కావలెను

మా ఐడియా ఫ్యాక్టరీలో పనిచేయడానికి పాతికమంది 'బుద్ధి'మంతులు కావలెను.

అర్హతలు:

కత్తిలాంటి ఐడియాలు ఇవ్వాలి. కొత్తగా ఆలోచించాలి. మెత్తగా దూసుకుపోవాలి.

అనర్హులు:

గానుగెద్దులు, మూసరాయుళ్లు.

...ఈమధ్య ఓ కార్పొరేట్‌ కంపెనీ 'వాంటెడ్‌ కాలమ్‌'లో ఇచ్చిన ప్రకటన అటూఇటుగా ఇలానే ఉంది. తమకెలాంటి ఉద్యోగులు కావాలో చమత్కారంగానే అయినా సూటిగా చెప్పారు. నిజంగానే 'ఐడియా' జాబ్‌మార్కెట్‌ను ఏలేస్తోంది. కార్పొరేట్‌ జగత్తు కొత్త ఐడియాలకు వెుహంవాచిపోయింది. 'ఐడియాకో వీరతాడు', 'ఐడియా చెప్పండి... ప్రవోషన్‌ కొట్టండి', 'ఐడియా మీది... ఆచరణ మాది' తరహా పథకాలతో పదును బుర్రలకు పతకాలు వేస్తోంది. కొటక్‌ మహీంద్రా బ్యాంకులో 'యురేకా!-ఇన్నొవేషన్‌ ఎట్‌ కొటక్‌' పేరుతో ఓ స్కీము ప్రారంభించారు. కస్టమర్లను మరింత సంతృప్తిపరచడం ఎలా, దుబారా తగ్గించడం ఎలా, వ్యాపారం పెంచుకోవడం ఎలా... వగైరావగైరా విషయాల మీద ఉద్యోగులు ఐడియాలివ్వాలి. 'అవైవా'లోనూ ఇలాంటి స్కీమే ఉంది. పేరు 'ఐడియాస్‌ ఫర్‌ అవైవా'. అయితే ఒక నిబంధన. చెత్త ఆలోచనలతో ఐడియా బాక్సు నింపకూడదు. కొత్తగా ఉండాలి. సంస్థ మీదా వ్యాపారం మీదా ప్రజల మీదా సానుకూల ప్రభావం చూపాలి. ఆచరణకు వీలుగా ఉండాలి. కొన్ని సంస్థలైతే ఏడాదికోసారి 'ఇన్నొవేషన్‌ డే' జరుపుకుంటున్నాయి. ఐడియా జీవులంతా ఆరోజు తమ ఆలోచనల్ని యాజమాన్యం ముందు పెట్టాలి. నచ్చితే మెచ్చుకోళ్లూ నజరానాలూ! కొన్ని సంస్థలైతే ఇంకాస్త ముందుకెళ్లి బహుమతి పొందిన ఐడియాల్ని అమలు చేయడానికి నిపుణుల కమిటీలు నియమిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీలకు ఉద్యోగుల ఆలోచనల విలువ మరింత తెలిసొచ్చింది. సిబ్బంది ఐడియాల కోసం ఇన్ఫోసిస్‌ ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ ప్రారంభించింది. కరెంటు ఖర్చులు తగ్గించుకోవడం వెుదలు కొత్త క్త్లెంట్లను ఆకట్టుకోవడం దాకా... అనేకానేక సమస్యల పరిష్కారానికి అమూల్యమైన ఐడియాలు ఇవ్వండంటూ ఇ-విన్నపాలు పంపుతోంది.

అలా అని, ఐడియా వెలిగిపోతోందని మురిసిపోడానికీ వీల్లేదు. ఇంకా చాలా లోపాలున్నాయి. 'ఐఐటీ విద్యార్థి అశోక్‌ వైర్‌లెస్‌ లోకల్‌లూప్‌ టెక్నాలజీని రూపొందించాడు. కానీ అది ఎక్కడో మడగాస్కర్‌లో అంగోలాలో ముందుగా విడుదలైంది. చౌకరకం వెుబైల్‌ పీసీని మనవాడు... వినయ్‌ దేశ్‌పాండే తయారుచేశాడు. సరిగ్గా అలాంటి పీసీ బ్రెజిల్‌లో ముందుగా మార్కెట్‌లోకి వస్తోంది. మన భారతీయ కంపెనీ సోరియాసిస్‌కు మందు కనిపెడితే, అది ఇంకెక్కడో పేటెంట్‌ సాధించింది. ఇదంతా మన ఐడియాల లోపం కాదు. వ్యవస్థలో లోపమే' అని ఆవేదన వ్యక్తంచేస్తారు కాలమిస్టు, గ్లోబల్‌ రిసెర్చ్‌ అలయెున్స్‌ అధ్యక్షుడు మషేల్కర్‌ ఓ వ్యాసంలో.

క్యాంపస్‌లోనూ...
ఐడియా తాజాగా ఉండాలి. నలుగురికీ పనికొస్తుందనిపించాలి. పర్యావరణాన్ని కాపాడాలి. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేదైతే ఇంకా సంతోషం. నిధులిప్పించి ఆదుకోడానికీ మార్గదర్శకుల్ని పరిచయం చేసి పుణ్యంకట్టుకోడానికీ ఐఐఎమ్‌లూ ఐఐటీలూ సిద్ధంగా ఉన్నాయి. ఆ పని చేసిపెట్టడానికి ప్రత్యేకంగా అనుబంధ సంస్థల్ని స్థాపిస్తున్నారు. ఐఐటీ అహ్మదాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్‌, ఇన్‌ిక్యుబేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌... ఐడియా బ్యాంకులా పనిచేస్తోంది. కొత్త ఆలోచనలకు ప్రాణంపోయగల సృజనాత్మకజీవుల కోసం 'అన్వేష' పేరుతో ఐడియాల వేట సాగిస్తోంది. ఐఐఎమ్‌ కోల్‌కతా ఐ2ఐ (ఐడియాస్‌ టు ఇంప్లిమెంటేషన్‌) పేరుతో బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఇంకాస్త ముందుకెళ్లి దమ్మున్న ఐడియాలకు పదిహేను నుంచి యాభై లక్షల దాకా... ఆర్థికసాయం అందిస్తోంది. ఐఐటీ ముంబయి 'యురేకా' బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో గెలిచామా, బూరెల బుట్టలో పడ్డట్టే. దాదాపు అరకోటి రూపాయలు అక్కడికక్కడే ఇచ్చేస్తారు. వెంచర్‌ క్యాపిటలిస్టులు వెతుక్కుంటూ వస్తారు. గత ఏడాది నుంచి విదేశీ విద్యార్థులు కూడా కొత్త ఆలోచనలతో వరుసలు కడుతున్నారు. పోటీలు అంతర్జాతీయం అవుతున్నాయి. 'వీడియోగేమ్‌లో కాస్త వ్యాయామాన్నీ జోడిస్తే ఎలా ఉంటుంది' అన్న ఐడియాకు గత ఏడాది 'యురేకా' పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. ఇప్పటిదాకా వీడియో గేమ్స్‌లో భౌతిక శ్రమకు అవకాశమే లేదు. దీనివల్ల ముఖ్యంగా పిల్లల్లో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. ఐఐటీలూ ఐఐఎమ్‌లే కాదు... దేశంలోని ప్రతి క్యాంపస్‌ ఓ ఆలోచనా నిధిగా రూపొందుతోంది. 'బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో విద్యార్థుల ఆలోచనలు తెలుసుకోడానికి కార్పొరేట్‌ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి' అంటారు ఇండియన్‌ి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ శాఖ అసోసియేట్‌ డీన్‌ చైతన్య.

'సామాన్య' ఐడియాలు
చిన్నదో పెద్దదో, సంక్లిష్టమైందో సరళమైందో, ఇరానీ కేఫ్‌లో కూర్చుని వరుసబెట్టి ఛాయ్‌ కప్పులు ఖాళీచేస్తున్నప్పుడు బలవంతంగా బుర్రలోంచి బయటికొచ్చిందో బాత్‌రూమ్‌లో 'బహారోఁ పూల్‌బర్సావో...' పాడుకుంటూ స్నానం చేస్తుంటే 'మేరా మెహబూబ్‌ ఆయాహై...' అన్నట్టు హఠాత్తుగా మెరిసిందో... ఎలాంటిదైతేనేం, ఓ ఐడియా జీవితాల్నే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా అని వాళ్లేం ఐన్‌స్టీన్‌లూ మేడమ్‌ క్యూరీలూ కాదు. ఇంజినీరింగ్‌ చదువుకోలేదు. జీవితమే విశ్వవిద్యాలయం. అనుభవాలే పాఠాలు. కర్ణాటకకు చెందిన రాఘవగౌడ విద్యావంతుడేం కాదు. కానీ సాంకేతిక విషయాలంటే ఆసక్తి. పాడీపంటా పుష్కలంగా ఉన్నాయి. సమస్యంతా పాలుపితకడం దగ్గర వచ్చేది. పనిచేయడానికి కూలీల సమస్య. మెషీన్‌తో పితుకుదామంటే, పశువులు సహకరించవు. అందుకే పాడి ఆవుకు అచ్చంగా దూడ కుడుస్తున్నట్టే అనిపించే యంత్రమేదైనా ఉంటే బావుండు అనిపించింది. వెంటనే రంగంలో దిగాడు. ఐడియాకు రూపం ఇచ్చాడు. అదే రాష్ట్రానికి చెందిన అన్నా సాహెబ్‌ శిల్పి. బౌద్ధశిల్పాలకు మరమ్మతులు చేయడానికి జపాన్‌ వెళ్లాడు. అక్కడ, చుట్టూ గుండ్రంగా తిరుగుతూ నీళ్లు చిమ్మే ఓ పరికరాన్ని చూశాడు. 'ఇలాంటి యంత్రమే నా దగ్గరుంటే, చెరుకు పంటకు బోలెడంత ఉపయోగం!' అనుకున్నాడు. అంతే, సొంతూరికి రాగానే... అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశాడు. గుజరాత్‌ రైతు గణేష్‌భాయ్‌ని కూడా కూలీల సమస్యే వేధించేది. చివరికి చిడపీడలొచ్చినా పిచికారీ చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. అప్పుడే... వోటార్‌ సైకిల్‌ విడుదల చేసే శక్తితో పనిచేసే పిచికారీ యంత్రాన్ని డిజైన్‌ చేశాడు. నాన్‌జీ భాయ్‌ అయితే ఏకంగా చౌకరకం ట్రాక్టరునే తయారుచేశాడు. ఇలాంటి సామాన్య శాస్త్రవేత్తలు దేశమంతా ఉన్నారు. వాళ్లకు ఇంజినీరింగ్‌ తెలియదు. టెక్నాలజీ తెలియదు. డిజైనింగ్‌ తెలియదు. తెలిసిందల్లా ఒకటే... ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా బుర్రలో మెరిసిన ఐడియాకు ఓ రూపం ఇవ్వడం.

ఇంకా ఇంకా...
మన దగ్గర ఐడియాలకు కొదవలేదు. వాటికి ప్రాణంపోయాలని తపిస్తున్న యువతీయువకులకూ కొదవలేదు. ఒక్క 'బిజినెస్‌ టైమ్స్‌ - పవర్‌ ఆఫ్‌ ఐడియాస్‌' పోటీలకే దాదాపు పన్నెండువేల దరఖాస్తులొచ్చాయి. 'టాటా స్టార్టప్‌' పోటీలకెళ్లిన సృజనాత్మక వ్యాపారవేత్తల సంఖ్యా వేలలోనే ఉంది. దేశంలోని క్యాంపస్‌లన్నీ లెక్కలోకి తీసుకుంటే... బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు, ప్రాజెక్టు రిపోర్టులు... ఏదో ఒక రూపంలో ఏటా కనీసం ఆరు లక్షల కొత్త ఐడియాలు పుట్టుకొస్తున్నాయని అంచనా. ఇంకాస్త ప్రోత్సహిస్తే, ఇంకొన్ని నిధులు సమకూరిస్తే, ఆ ఐడియాలన్నీ ప్రాణంపోసుకుంటే, ఆ లక్ష్యాలన్నీ నెరవేరితే...
ఐడియా...
భారతదేశాన్నే మార్చేస్తుంది!
భలే ఐడియా
మీ ఐడియాలో దమ్ముందా, మార్కెట్‌ను ఊపేసే సరుకుందా? అయితే, మీలాంటి వారి కోసమే కార్పొరేట్‌ దిగ్గజాలు ఎదురుచూస్తున్నాయి. భారత ప్రభుత్వ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. వెళ్లండి. మాట్లాడండి. ఒప్పించండి. పెట్టుబడి పెట్టించండి. విజయాలు సాధించండి.

ఇదిగిదిగో ఇక్రిశాట్‌!

మన తాతలూ ముత్తాతలూ వ్యవసాయాన్ని వ్యవసాయంగానే చూశారు. దాన్లోని వ్యాపార కోణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తరం మారింది. ఆలోచనలు మారుతున్నాయి. 'అగ్రి బిజినెస్‌' గొప్ప వ్యాపార అవకాశమైంది. కొత్త ప్రయోగాలకూ కొత్త ఆలోచనలకూ వేదికైంది. వాణిజ్య వ్యవసాయంలో కొత్త ఐడియాలున్నవారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్రిశాట్‌ హైదరాబాద్‌లో శిబిరాలు నిర్వహిస్తోంది. పదిహేను లక్షల వరకూ నిధులు అందిస్తోంది (ఫోన్‌: 9290837666).

'ఎకనమిక్‌ టైమ్స్‌' బాసట

మీ దగ్గర 'ఐడియా' ఉందా? అయితే, మిమ్మల్నో వ్యాపారవేత్తగా మలిచే బాధ్యత మాది... అని భుజంతట్టి భరోసా ఇస్తోంది ఎకనమిక్‌ టైమ్స్‌. కొత్త ఆలోచనలకు గండపెండేరం తొడగడానికి ఆ పత్రిక ఏటా 'ద పవర్‌ ఆఫ్‌ ఐడియాస్‌' పోటీలు నిర్వహిస్తోంది (వ్వ్వ్.ఇదేస్.ఎచొనొమిచ్తిమెస్.చొం). మేలుమేలు దిగ్గజాలంతా మీ ముందు కూర్చుంటారు. మీ ఐడియాలు వింటారు. లాభసాటిగా ఉంటే లక్షణంగా నిధులు సమకూరుస్తారు. మీరు గృహిణి కావచ్చు. విద్యార్థి కావచ్చు. ఉద్యోగి కావచ్చు. ఎవరైతేనేం. ఐడియా ఉందా, లేదా?

మీకోసమే... నాబార్డ్‌

అసలైన భారతదేశం పల్లెల్లోనే ఉంది. అసలైన సమస్యలన్నీ పల్లెల్లోనే ఉన్నాయి. వాటిని పరిష్కరించండి. పల్లెలకు అండగా నిలబడండి. అదెలా అన్నదీ మీరే నిర్ణయించుకోండి. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం... వందల కొద్దీ సమస్యల్లో ఒక్కటి పరిష్కరించడానికి సరిపడా 'ఐడియా' ఉన్నా చాలు. వ్యవసాయం, వ్యవసాయేతర రంగం, సూక్ష్మ రుణాలు... మార్గం ఏదైనా కావచ్చు. వెంటనే, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతినిధుల్ని సంప్రదించండి. ముప్ఫై లక్షలదాకా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు (ఫోన్‌: 9490746068).

టాటాల భరోసా

'టాటా నెన్‌ హాటెస్ట్‌ స్టార్టప్స్‌' నినాదమే... 'డేర్‌ టు ట్రై'. కొత్తగా ఆలోచించడం ఒక ఎత్తు. దానికో రూపం ఇవ్వడం ఇంకో ఎత్తు. అదో సవాలు. ప్రయత్నించాలంటే దమ్ముండాలి, దన్నుండాలి. ఈ దశలోనే టాటాలు అండగా నిలబడతారు. మీ వ్యాపార ఆలోచనల్ని నిపుణులతో బేరీజు వేయిస్తారు. అవసరమైన సూచనలిస్తారు. వేలమంది ఔత్సాహికులు పాల్గొనే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బోలెడంత ప్రచారం. సీడ్‌ఫండ్‌ డాట్‌కామ్‌ లాంటి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు నిధులు సమకూరుస్తాయి. కానీ పోటీలో పాల్గొనాలంటే ఒక షరతు. 'ఐడియా' మాత్రమే ఉంటే సరిపోదు. దానికో రూపం ఇచ్చే ప్రయత్నం వెుదలుపెట్టి ఉండాలి. ఆ ఆలోచనతో ఇప్పటికే ఓ కంపెనీని రిజిస్టరు చేసి ఉండాలి (వివరాలకువ్వ్వ్.హొత్తెస్త్స్తర్తుప్.ఇన్).

సామాన్య శాస్త్రం

ఓ రంగయ్య తాతముత్తాతల కాలం నుంచి వాడుతున్న నాగలికి ఏవో మార్పులు చేసి, ఎద్దులకు బరువులేకుండా చేస్తాడు. ఓ రామయ్య ఊరవతల చెరువులో చేపల్ని పట్టడానికి కొత్త వల తయారు చేస్తాడు. ఓ సీతమ్మ పోషకవిలువలకు నెలవైన ఓ కమ్మని వంట వండుతుంది. ఆ ఐడియా వాళ్లకెలా వచ్చిందో ఎవరు అడుగుతారు? ఎవరు గుర్తిస్తారు? ఎవరు ప్రశంసిస్తారు? ఎవరు పేటెంటు ఇప్పిస్తారు? నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ ఆ బాధ్యత తీసుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉంది (ఫోన్‌: 079-26732095).

బుల్లి ఐడియా!
గొప్ప ఐడియాలంటే కొరుకుడుపడనంత గందరగోళంగా ఉండాలనేం లేదు. సరళంగా ఉండవచ్చు. తేలిగ్గా ఉండవచ్చు. అలా ఉండాలి కూడా.అమెరికా రష్యాలు పోటీపడి అంతరిక్ష యాత్రలు చేయాలనుకుంటున్న రోజుల్లో ఓ సమస్య వచ్చిపడింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు రాసుకోడానికి ఓ కలమంటూ ఉండాలిగా! కానీ... భూమ్యాకర్షణ శక్తి అసలేమాత్రం లేనిచోట మామూలు పెన్నులు పనిచేయవు. దీంతో అంతరిక్ష కలాలు తయారుచేయడానికి అమెరికా లక్షల డాలర్లు ఖర్చుపెట్టింది. రష్యా అంతరిక్ష యాత్రికులు మాత్రం అదో సమస్యే కాదన్నట్టు వ్యవహరించారు. ఎందుకంటే వాళ్లు పెన్సిల్‌ వాడారు.బుల్లి ఐడియా... భలే ఐడియా!
- కె.జనార్దనరావు
(ఈనాడు, ౦౧:౦౯:౨౦౦౯, ఆదివారం)
____________________________

Labels: ,

1 Comments:

Blogger gabhasthi said...

good idea to analyse idea.descriptive,inspiring

3:45 pm

 

Post a Comment

<< Home