My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 05, 2009

దుఃఖసాగరంలో రాష్ట్రం


కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్‌ రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్‌ ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్‌ మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్‌ జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్‌లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్‌కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్‌ విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! ఆ విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్‌ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15న వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన ఈ పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో ఓ భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్‌కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్‌ కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది- 'వై.ఎస్‌. అమర్‌ రహే' అని!
(ఈనాడు, ౦౪:౦౯:౨౦౦౯)
____________________________

జీవనవేదం


మనం ఎంతగానో ప్రేమించేవారిని ఆ దేవుడు మన దగ్గర్నుంచి తీసుకుపోతే... ఆ మోసానికి విరుగుడేమిటో తెలుసా! 'మనం ప్రేమించేవారు ప్రేమించినవన్నీ మనమూ ప్రేమిస్తూ ఉండటమే' అంటాడు ఆస్కార్‌ వైల్డ్‌. భారతంలో యక్షుడు 'ప్రపంచంలోకెల్లా వింత ఏది?' అనడిగితే 'రేపు పోయేవాడు ఇవాళ పోయేవాడిని గురించి ఏడుస్తూ కూర్చోవడమే!' అంటాడు ధర్మరాజు. నిజం కదా! అసలు 'జీవితం ఒక నాటకం' అని షేక్‌స్పియర్‌లాగా మనమూ అనుకోగలిగితే పుట్టటం, గిట్టటమనేవి దేవుడు చేసే ప్రకటనలు అని ఇట్టే అర్థమైపోతుంది. ఆవేదన సద్దుమణుగుతుంది. విశ్వవిజేతగా మారాలనుకున్న అలెగ్జాండర్‌ చలిజ్వరంతో 'హతీతో క్రతిస్తో' అంటూ ఖాళీ చేతులు చూపించి వెళ్లిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క, ఎలా బతికారన్నది ముఖ్యం. తనకోసం అమృతం తాగిన ఇంద్రుడికి, లోకంకోసం విషాన్ని మింగిన శివుడికున్న విలువుందా? మిన్నాగులాగా కలకాలం బతికేకన్నా మిణుగురులాగా క్షణకాలం మెరిసినా మిన్నే! అసలు మృత్యువనేది ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ దక్కనివ్వదా?! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ జర్మనీ చెరసాలలో ఖైదీలు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇంకొక్క కొత్తబందీ వచ్చి చేరినా అంగుళం స్థలం కూడా లేనంత ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఖైదీల సంఖ్య తగ్గించేందుకు చెరసాల అధికారులు ఓ పథకం పన్నారు. ప్రతి బందీకి ఒక అంకె ఇచ్చారు. రోజూ కొన్ని అంకెలు చీటీలు వేసి తీయడం. ఆ అంకెవాడిని కాల్చిపారేయడం! ఓ రోజు అలాంటి అంకె వచ్చిన ఓ ఖైదీ ఏడుస్తూ కూర్చుని ఉంటే పక్కనే ఉన్న ఇంకో ఖైదీ- 'ఏడవద్దులే... ఇంకా ఇక్కడ బందీగా నీకంతగా బతకాలనుంటే చీటీ నాకు ఇవ్వు' అని తాను ఆనందంగా వెళ్ళి తుపాకీ గుండుకు బలైపోయాడు! అతని ఆనందం- అరువు ప్రాణాలమీద బతికే ఆ ఖైదీకి ఏదీ?

'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటారు గీతాంజలిలో టాగోర్‌. 'జాతస్యః మరణం ధ్రువమ్‌' అంటుంది గీత. కాలప్రవాహానికెదురు ఈదటం ఎవరి తరమూ కాదు. అందుకే మృత్యువును మన పురాణేతిహాసాలు 'కాలధర్మం'గా వర్ణించాయి. భూమ్మీద కలకాలం సుఖంగా బతకాలని ఎవరికుండదు? నిజంగా చిరంజీవిగా ఉండాలంటే తుమ్మి చిరంజీవ అనిపించుకోవడం కాదు. చిరకాలం జనహృదయాల్లో సజీవంగా ఉండే సత్కార్యాలు చేయాలి. మొక్కుబడిగా కీర్తిశేషులనిపించుకోడం కాదు. మొక్కి మరీ 'కీర్తి'ని గుర్తుచేసుకునే ఘనకార్యాలు చేయగలగాలి. మనస్సులకు దగ్గరైనవారు దూరమైనారంటే ఒక పట్టాన ఒప్పుకోలేని పిచ్చి ప్రేమభ్రమలు మనిషి పుట్టిననాటినుంచే వెంట వస్తున్నాయి. రోమన్లు చనిపోయినవాళ్ల వేళ్లు కోసి, రక్తం గడ్డకట్టి ఉంటే తప్ప ఆ వాస్తవాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. గ్రీకులు చనిపోయిన మనిషి తిరిగి వస్తాడేమోనని మూడురోజులపాటు భద్రం చేసేవారు. ఎడ్గార్‌ ఎలాన్‌ పో తన చిన్నకథా సంకలనం 'మెక్బరి'లో శవపేటిక లోపల మీటలు ఉండే విధానాన్ని సూచించాడు. ఖననమైన తరవాత మృతుడికి ప్రాణంవస్తే ఆ మీటనొక్కి బైటవాళ్ళకు చెప్పే ఏర్పాటు అది! హిందూ ధర్మంలో దింపుడు కళ్ళం ఆచారం వెనకున్న రహస్యం ఈ బతుకుమీద ఆశే!

శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇలాంటి ఆ మాటలు వింటే నవ్వు రావచ్చేమోగానీ, నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని నిమిషాలదాకా ఇసిజిని నమోదు చేయవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకొంటోంది. పైలోకార్పైన్‌ అనే మందును మృతుడి కంటిలో వేస్తే మూడుగంటల తరవాత కూడా కంటిపాప సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదంకాదు- అదో క్రమంలో భౌతిక దేహంలో జరిగే ప్రక్రియ అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ). మతాలన్నీ మరణాన్ని మనకంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడంగా అభివర్ణించినాగానీ- విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించటానికి వీలైన ప్రయోగాలు విజయవంతమైనదాకా అది మనిషికి, మనసుకు సంబంధించి ఒక అత్యంత భావోద్వేగ సంబంధమైన విషాదంగానే గుర్తిస్తుంది. మనకు మరింత దగ్గరగా వచ్చిన మనిషి హఠాత్తుగా ఇంకెప్పటికీ తిరిగిరాని లోకాలకు ఎగిరిపోయాడని వింటే మనస్సు విలవిల్లాడకుండా ఎలా ఉంటుంది! అందులోనూ పెద్దమనసున్న పెద్దమనిషి మరణమంటే మామూలు జనానికి పత్రికల్లో నల్లరంగు పూసుకొని వచ్చే పతాక శీర్షికో, టీవీ ప్రసారాల్లో ఆపకుండా చూపించుకుంటూ పోయే రియాల్టీ ప్రదర్శనోకాదు గదా! ఆట ముగిస్తే రాజైనా, బంటైనా ఒకే పెట్టెలోకి పోతారన్న మాట నిజమే కావచ్చేమోగానీ- జనం తరఫున ఆడే ఆట ముగించకుండానే మధ్యలో వదిలేసి ఎవరైనా అలా చిరునవ్వులు చిందించుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోవటం మాత్రం కచ్చితంగా తొండే! బతుకు- బతకనివ్వు అన్నది మానవ పరిణామ క్రమం తరంతరంగా నిరంతరంగా వినిపిస్తున్న పాఠం. గుండె దిటవుతో మృత్యుఘోషను ధిక్కరించి నిబ్బరంగా ముందడుగేస్తేనే నవోదయం!
(ఈనాడు, ౦౬:౦౯:౨౦౦౯)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home